Monday, February 4, 2019

మాండలికాలలో మాట్లాడుకుందాం...

Raghavendra Rao Nutakki
November 24, 2015 ·
మాండలికాలలో మాట్లాడుకుందాం .
పరస్పరం యాసలను గౌరవించుకుందాం.
రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.

.........................................................................................

తెలుగు భాష సజీవంగా ఉండాలంటే.......
వివిధ ప్రాంతీయ మాండలికాలకు, యాసలకు ఊపిరులూది మాండలిక పదసంచయాలను సంరక్షించుకుంటూ కాపాడుకుంటూ ప్రతి ఒక్కరూ ముందుకు సాగవలసిన ఆవశ్యకత వుంది .

ప్రాంతీయ సమైక్యతా లోపానికి బాంధవ్య బంధనల బలహీనతలకు ముఖ్యకారణం మాండలికాలను పరస్పరం హేళన చేసుకోవడమే.

ఎవరి యాస, ఎవరి మాట, ఎవరి వుస్చ్చారణ ,ఎవరి వ్యక్తీకరణా రీతులు వారికి భవ్యమైన తీరులు. వివిధ మాండలిక సౌందర్యాలను ఆపోసన పట్టడం ఏమంత సులువైన ప్రక్రియ కాదు.

శ్రీకాకుళం నుండి తడవరకు ,అటు అనంతపురం వరకు, ఇటు ఖమ్మం నుంచి అదిలా బాద్ వరకు అటు వరంగల్ నుంచి నిజామా బాద్ వరకు ఎన్నెన్నోతెలుగు మాండలికాలు . ఒక్కో జిల్లాలో నే ఎన్నెన్నో వైవిధ్యాలు.

శ్రీకాకుళం మాండలికానికి, విజయనగర ఉచ్చారణకు ,విశాఖ పద భంగిమకు ఏంతో తేడా . ఉభయ గోదావరి జిల్లాల మాండలిక తీరులు పద వైవిధ్యాలు , కృష్ణా జిల్లా వ్యక్తీకరకు భిన్నమయితే , గుంటూరు జిల్లాలో తూర్పు పడమరకు ఏంతో వ్యత్యాసం.

ప్రకాశం పదోచ్చారణకు , నెల్లూరు వ్యక్తీకరణకు దగ్గరతనమున్నా వ్యవహారం లో కొంత తేడా .చిత్తూరు తమిళ యాసను ఎడాప్ట్ చేసుకుంటే ,కడప కర్నూల్ అనంతపురాలు కన్నడిగుల యాసలో ఆచార వ్యవహారాలనూ స్వంతం చేసుకున్న తీరులు.

ప్రతీ మాండలికం లో ఒ ప్రత్యెక రిధం ఆయా మాండలికాలను సజీవంగా నిలిపి వుంచుతున్నాయి. తద్వారా తెలుగు భాషకు వూపిరులూదుతున్నాయి.

ప్రభుత్వాలు అన్ని విద్యాలయాలలోనూ తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వ వలసిన అవసరం వుంది. ప్రాధమిక ప్రభుత్వ విద్యాలయాల్లో ఆర్ధిక నిర్బంధం వల్ల విద్యనభ్యసిస్తున్న గుడిసె వాసులే తెలుగును బ్రతికిస్తున్నారనడం లో అతిశయోక్తి లేదు.

తెలుగులందరూ వారెంత ధనవంతులైనా తమ పిల్లలను తెలుగులో చదివించండి. మాతృభాషలో చదవనూ, వ్రాయనూ, వ్యవహరించగలిగిన వాడు ప్రపంచం లో యే భాషనందైనా ప్రతిభను కనపరచగలడు.

తెలంగాణా ప్రాంత మాండలికానికి వస్తే ఖమ్మం జిల్లాలో మూడు రకాల యాసలు కాక ఆటవికుల సంచార జాతీయుల తెలుగు భాషోచ్చరణలో ఎన్నో వైవిధ్యాలు గమనించవచ్చు.
నల్గొండ జిల్లాలో నాలుగు తీరులు, వరంగల్ ప్రాంత భాషా తీరులకు ,కరీమ్ నగర్ జిల్లా మాండలిక ఉచ్చారణలో మరెన్నో వైవిధ్యాలు,మెదక్ ,నిజామాబాదు, మహబూబ్ నగర్ జిల్లాల్లో భాషోచ్చరణ అత్యంత వైవిధ్యం తో కూడుకున్నది. నగరీకరణ , వుపాధి నేపధ్యం భాషా ,మాండలిక తీరులలో పెను మార్పులకు కారణమైతే , రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లాల్లో ప్రాంతీయ మాండలికం తన స్వరూపం లో పెనుమార్పులకు తావిచ్చింది. ప్రాంతీయ మాండలికం లో తన స్వతః స్వరూపాన్నినిలబెట్టుకున్న జిల్లా గా ఆదిలాబాద్ జిల్లాను పేర్కొనవచ్చు

తెలంగాణా జిల్లాల్లో నే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిద మాండలికాలలో ఒ ప్రత్యేకత ,ఓ మహత్తర సౌందర్యం ఇమిడి వుంది.దాన్ని ఒడిసి పట్టాలంటే నిరంతర పరిశీలన, సాధన అవసరం . వాచికం, ఆంగికం,పదాల విరుపులు , పద అర్ధ విన్యాసాలు నిఘంటువులకు అందనివి.

ప్రపంచీకరణ నేపధ్యం లో ఈ యాసలోని అంతః సౌందర్యం మరుగునపడిపోయే ప్రమాదం వున్న దృష్ట్యా .ఈ మాండలికం పై పట్టు వున్న ప్రముఖ ఆధునిక కవులు , సాహితీ పండితులు, ఇతర ఔత్సాహిక యువ కవులు, మరుగున పడుతున్న ఆయా మాండలిక పదాలు సమీకరించి సమగ్ర పదకోశం నిర్మించే బాధ్యతలు చేపట్టి ఆ యా ఉచ్చ్చారణలను ఆడియో రికార్డింగ్ చేసి శాశ్వతతమ్ చేయాలి.

వివిధ మాండలిక సౌందర్యాన్ని ,సరళత ను సుసంపన్నం చేసుకో వలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది.

ముఖ్యంగా ఒకరి మాండలికాన్ని మరొకరు పరస్పరం గౌరవించుకొనే రీతిన సామాజిక బంధనాలను,బలోపేతం చేయవలసిన ఆవశ్యకతను ప్రభుత్వాలు ,సాంస్కృతిక సంస్థలు గుర్తించి సత్వర చర్యలు చేపడితే తెలుగు భాషకు పూర్వ వైభవం చేకూరుతుందనడం లో అతిశయోక్తి లేదు.

అంతర్జాల మాద్యమం తెలుగు భాషోన్నతికి ఔత్సాహిక యువ శక్తిలో మునుపెన్నడూ లేనంతగా ఎగసి పడుతున్న ఆసక్తిని ప్రోత్సాహాన్నందిస్తూ తనవంతు గా ప్రోత్సహిస్తోంది.

మాండలికాలలో మాట్లాడుకుందాం .ఒకరి మాండలికాన్ని మరొకరం హేళన చేయక పరస్పరం మాండలికాలను యాసను గౌరవిన్చుకుందాం వివిధ మాండలిక సౌందర్యాలను ఆస్వాదిద్దాం. భాషోన్నతికి అందరం పాటు పడదాం..
ప్రాంతాలు వేరైనా భాషను సుసంపన్నం చేసుకొని భావసమైక్యత సాధిద్దాం .

15 comments:

Related Posts Plugin for WordPress, Blogger...