Showing posts with label తెలుగు లిటరేచర్. Show all posts
Showing posts with label తెలుగు లిటరేచర్. Show all posts

Monday, February 4, 2019

భాష - అలంకారాలు

కావ్య సరస్వతికి శోభను చేకూర్చేవి అలంకారాలు. ‘అలం’ శబ్దానికి ‘కృ’ ధాతువు చేరి ‘అలంకారం’ అనే రూపం సిద్ధించింది. అలంకారమంటే భూషణం అని అర్థం. ఇవి కావ్య సౌందర్యాన్ని పెంపొందించి, శోభను కలిగిస్తాయి. ఆలంకారకులు వీటిని ప్రధానంగా శబ్దాలంకారాలు, అర్థాలంకారాలని రెండు రకాలుగా విభజించారు. భోజుడు ‘సరస్వతీ కంఠాభరణం’లో మూడు విధాలుగా పేర్కొన్నాడు. శబ్ద, అర్థాలంకాలతో పాటు ఉభయాలంకారాలను (శబ్దార్థ మిశ్రమాలు) వివరించాడు. ఆ తర్వాత మమ్మటుడు, రుయ్యకుడు, విశ్వనాథుడు, విద్యానాథుడు లాంటివారు మిశ్రాలంకారాల గురించి ప్రస్తావించారు.

అలంకారాల్లో ప్రధానమైనవి శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు.

శబ్దాలంకారాలు

శబ్ద వైచిత్రీ రామణీయకత వల్ల కావ్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి శబ్దాలంకారాలు. సంగీతానుగుణ్యమైన శ్రవణ ఫేయతతో పాఠకులకు ఆహ్లాదం కలిగించేవి శబ్దాలంకారాలు. ఇవి ఆరు రకాలు.
1. వృత్త్యనుప్రాసం
2. ఛేకానుప్రాసం
3. లాటాను ప్రాసం
4. యమకం
5. ముక్తపదగ్రస్థం
6. అంత్యానుప్రాసం

వృత్త్యనుప్రాసం: ఒకటి లేదా రెండు మూడు వర్ణాలు పునరుక్తాలై ఆహ్లాదం కలిగిస్తే అది వృత్త్యనుప్రాసం. 
ఉదా: ‘హరిహరి సిరియురమున గలహరి’
ఇందులో ‘ర’ కారం పునరుక్తమై ఆహ్లాదం కలిగిస్తోంది. అందువల్ల ఇది వృత్త్యనుప్రాసం.

ఛేకానుప్రాసం: అర్థ భేదం ఉన్న రెండేసి హల్లులు అవ్యవధానంగా పునరుక్తమై ఆహ్లాదాన్ని కలిగిస్తే అది ఛేకానుప్రాసం. ఛేకులంటే పండితులు అని అర్థం. ఛేకులకు ఆహ్లాదం కలిగించే అనుప్రాసం ఛేకానుప్రాసం. 
ఉదా: ‘కందర్పదర్పములగు సందర దరహాస రుచులు’. ఈ లక్ష్యంలో దర్ప-దర అనే రెండేసి హల్లులు అర్థభేదంతో పునరుక్తమయ్యాయి. కాబట్టి ఇది ఛేకానుప్రాసం.

లాటాను ప్రాసం: తాత్పర్య భేదం ఉన్న శబ్దాలు పునరుక్తాలై ఆహ్లాదాన్ని కలిగిస్తే అది లాటానుప్రాసం.
ఉదా: ‘కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ’
‘కరములు’, ‘జిహ్వ’ శబ్దాలు తాత్పర్య భేదంతో పునరుక్తాలైనందువల్ల ఇది లాటానుప్రాసం.

యమకం: సమాన స్వరసహితాలైన వ్యంజనాలు అర్థభేదంతో అవ్యవహితంగా పునరుక్తాలైతే అది యమకం. 
ఉదా: ‘మన సుభద్ర మనసుభద్రమయ్యె’
సుభద్ర అనే అక్షరాలు అర్థభేదంతో అవ్యవహితంగా వచ్చాయి. కాబట్టి ఇది యమకం.

ముక్తపదగ్రస్థం: మొదటి పాదం చివరి పదం రెండో పాదంలో మొదటి పదంగా రావడాన్ని ముక్తపదగ్రస్థం అంటారు. అంటే విడిచిన పదాన్ని గ్రహించడం అని అర్థం.
ఉదా: ‘సుదతీ నూతన మదనా మదనా గతురంగ పూర్ణ మణిమయసదనా’
మొదటి పాదం చివర ఉన్న ‘మదనా’ పదం రెండోపాదం మొదటిపదంగా వచ్చింది. అందువల్ల ఇది ముక్తపదగ్రస్థం.

అంత్యానుప్రాసం: ప్రతి పాదం చివరన ఒకే అక్షరం లేదా పదం రావడాన్ని అంత్యాను ప్రాసం అంటారు. 
ఉదా: కమనీయశుభగాత్రు - కంజాతదళనేత్రు
వసుధాకళత్రు - పావన చరిత్రు
‘త్రు’ అనే అక్షరం పాదాల చివర వచ్చినందువల్ల ఇది అంత్యానుప్రాసం.

అర్థాలంకారాలు

అర్థ సౌందర్యం వల్ల కావ్య శోభను ద్విగుణీకృతం చేసేవి అర్థాలంకారాలు. అర్థం లేని శబ్ద సౌందర్యం ఆహ్లాదకరం కాదు. అర్థ ప్రధానమైన అలంకారాలు అర్థాలం కారాలు. వీటిలో ప్రధానమైనవి..

ఉపమాలంకారం: ఉపమాన, ఉపమేయా లకు మనోహరమైన సాదృశ్యాన్ని చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. ఇందులో ఉపమేయం (ప్రస్తుతం), ఉపమానం (అప్రస్తుతం), సమాన ధర్మం (ఉపమేయ, ఉపమానాల్లో సమానంగా ఉండేది), ఉపమావాచకం (ఉపమేయ, ఉపమానాలకు సమాన ధర్మాన్ని సూచించేది) ఉంటాయి. వలెన్, పోలెన్, ఎంతయున్, కైవడి, భంశి, అట్లు, అనంగ మొదలైనవి ఉపమావాచకాలు. పైన పేర్కొన్న నాలుగు అంశాలుంటే దాన్ని పూర్ణోపమాలంకారం అంటారు. ఏదైనా ఒక అంశం లోపిస్తే దాన్ని లుప్తోపమాలంకారం అంటారు.
భరతుడు ఉపమాలంకారంలో ఐదు భేదాలను చెప్పాడు. మమ్మటుడు లాంటి ఆలంకారకులు 25 భేదాలను పేర్కొన్నారు. దండి 32 భేదాలను చెప్పాడు. చంద్రాలోకకర్త చెప్పిన ఏడు భేదాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
అలంకారాల్లో ప్రసిద్ధమైంది, ప్రాచీన మైంది ఉపమాలంకారం. దీన్ని ప్రయోగించని కవులు లేరు. కాళిదాసు లాంటి సంస్కృత కవులు విరివిగా ఉపయోగించారు. అందుకే ‘ఉపమా కాళిదాసస్య’ అనే నానుడి ప్రసిద్ధమైంది.
లక్ష్యం: 
ఓ కృష్ణా! నీ కీర్తి హంసవలె ఆకాశ గంగయందు మునుగుచున్నది
ఉపమేయం = కీర్తి, ఉపమానం = హంస, ‘ఆకాశగంగయందు మునుగుట’ ఉపమేయ
ఉపమానాలు రెండింటిలో ఉన్నందువల్ల ఇది సమాన ధర్మం. ఉపమావాచకంలా ఇందులో నాలుగు అంశాలున్నందువల్ల ఇది ‘పూర్ణోపమఅలంకారం’.

ఉత్ప్రేక్షాలంకారం: జాతి, గుణ, ధర్మ సామ్యం వల్ల ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే అది ఉత్ప్రేక్షాలంకారం. ఇందులో ఉపమేయ ఉపమానాలతోపాటు ఉత్ప్రేక్షా వాచకం ఉంటుంది. తలంచెదన్, ఎంచెదన్, భావించెదన్, ఊహించెదన్, అనన్ మొదలైనవి ఉత్ప్రేక్షా వాచకాలు. 
లక్ష్యం: ‘‘ఈ చీకటిని చక్రవాక విరహాగ్ని నుండి పుట్టిన ధూమమో అని తలంతును’’
ఇందులో చీకటి ఉపమేయం, ధూమం ఉపమానం. ధూమం నల్లనిది, దృష్టిని ఆపుచేసేది. ఈ గుణసామ్యం వల్ల ఉపమేయమైన చీకటిని ఉపమానమైన ధూమంగా ఊహించారు. కాబట్టి ఇది ఉత్ప్రేక్షాలంకారం.

రూపకాలంకారం: ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం లేదా ఉపమేయ ఉపమానాలకు భేదం లేనట్లుగా వర్ణించడం రూపకాలంకారం. ఇందులో రూపక సమాసం కూడా ఉంటుంది. .
లక్ష్యం: రాజుపై లతాలలనలు కుసుమాక్షతలు చల్లిరి. ఇందులో ఉపమేయమైన లతల్లో ఉపమానమైన లలనల ధర్మం ఆరోపించారు. ఉపమేయమైన కుసుమాల్లో ఉపమానమైన అక్షతల ధర్మాన్ని ఆరోపించారు. కాబట్టి ఇది రూపకాలంకారం.

అనన్వయాలంకారం: ఒక వస్తువు సాటి లేనిది అని చెప్పడానికి అదే వస్తువుతో పోల్చడాన్ని అనన్వయాలంకారం అంటారు. ఇందులో ఉపమేయమే ఉపమానంగా ఉంటుంది. .
లక్ష్యం:
‘మేరునగానికి సాటి మేరునగమే.
సముద్రానికి సాటి సముద్రమే’.
ఇందులో ఉపమేయమైన మేరునగమే ఉపమానంగా ఉంది. ఉపమేయమైన సముద్రమే ఉపమానంగా ఉంది. అందువల్ల ఇది అనన్వయాలంకారం..

స్వభావోక్తి: జాతి, గుణక్రియాదులను సహజ సిద్ధంగా, మనోహరంగా వర్ణించడాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు..
లక్ష్యం: ‘‘ఉద్యానవనంలో జింకలు చెవులు రిక్కించి చంచల నేత్రాలతో సరోవరంలో నీళ్లు త్రాగుచున్నవి’’ ఇందులో జింకల స్థితిని మనోహరంగా, సహజసిద్ధంగా వర్ణించారు. అందువల్ల ఇది స్వభావోక్తి.

అర్థాంతరన్యాసాలంకారం: విశేషాన్ని సామాన్యంతో లేదా సామాన్యాన్ని విశేషంతో సమర్థించి వర్ణిస్తే.. అది అర్థాంతరన్యాసాలంకారం..
లక్ష్యం: 1
‘‘ఆంజనేయుడు సముద్రాన్ని దాటాడు.
మహాత్ములకు అసాధ్యమైంది లేదు కదా!’’.
ఆంజనేయుడు సముద్రాన్ని దాటడం విశేష విషయం. మహాత్ములకు సాధ్యం కానిది లేదు అనే సామాన్య విషయంతో సమర్థించినందువల్ల ఇది అర్థాంతరన్యాస అలంకారం..
లక్ష్యం: 2
పూలతో కూడిన నారకు వాసన కలిగినట్లు సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయాలు కలుగుతాయి..
పూలతో కూడిన నారకు వాసన కలగడం సామాన్య విషయం. సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయాలు కలుగుతాయి అనే విశేష విషయంతో దీన్ని సమర్థించడం వల్ల ఇది అర్థాంతరన్యాస అలంకారం.

అతిశయోక్తి అలంకారం: లోకస్థితిని మించి అతిశయించి వర్ణిస్తే అది అతిశయోక్తి అలంకారం. .
లక్ష్యం: ఆ పట్టణమందలి సౌధాలు చంద్ర మండలాన్ని తాకుచున్నవి. సహజస్థితిని మించి వర్ణించడం వల్ల ఇది అతిశయోక్తి.

శ్లేషాలంకారం: అనేక అర్థాలకు ఆశ్రయ మైంది శ్లేషాలంకారం. చమత్కారమైన పదా ల విరుపులతో అనేక అర్థాల వల్ల అహ్లాదం కలిగించేది శ్లేష..
లక్ష్యం: ‘రాజు కువల యానందకరుడు’.
ఇందులో రాజు శబ్దానికి పాలకుడు, చంద్రుడు అని; ‘కువలయం’ పదానికి భూమి, కలువ అనే అర్థాలున్నాయి. రాజు భూ ప్రజలకు సుపరిపాలనతో ఆనందం కలిగించేవాడని ఒక అర్థం. చంద్రుడు కలువలను వికసింపజేసి ఆనందం కలిగించే వాడని మరో అర్థం ఉన్నందువల్ల ఇది శ్లేషాలంకారం.

సమాసోక్తి అలంకారం: ప్రస్తుత వర్ణన వల్ల అప్రస్తుత విషయం స్ఫురిస్తే అది సమాసోక్తి అలంకారం..
లక్ష్యం: చంద్రుడు రక్తుడై ఐంద్రీముఖమును ముద్దిడుచున్నాడు. ప్రస్తుత వర్ణన వల్ల పరకాంతా చుంబనాభిలాషియైన‌ కాముకుడు స్ఫురిస్తున్నందువల్ల ఇది సమాసోక్తి అలంకారం.

దీపకాలంకారం: ఉపమేయ ఉపమా నాలకు (ప్రకృత, అప్రకృతాలకు) సాధారణ ధర్మంతో ఒకే అన్వయాన్ని కలిగిస్తే అది దీపకాలంకారం. 
లక్ష్యం: ‘‘బ్రహ్మ రాత , విష్ణు చక్రం, ఇంద్రుడి వజ్రాయుధం, పండిత వాక్యం వ్యర్థం కాబోవు’’
పండిత వాక్యం వ్యర్థం కాదు అనే ఉపమేయంతో బ్రహ్మ రాత, విష్ణు చక్రం, ఇంద్రుడి వజ్రాయుధం లాంటి ఉపమే యాలను అన్వయించి చెప్పారు. అందువల్ల ఇది దీపకాలంకారం.

భాష - లక్షణం

భాష - లక్షణం

శాసన భాష

శాసనాల్లో వినియోగించిన భాషనే శాసన భాష అంటారు. ప్రాజ్ఞ్నన్నయ యుగం నాటి ప్రాచీనాంధ్ర భాషా స్వరూపాన్ని గుర్తించడానికి శాసనాలు ముఖ్య ఆధారాలు. క్రీ.పూ 200 నుంచి క్రీ.శ 1000 వరకున్న కాలాన్ని సాహితీ చరిత్ర కారులు ప్రాజ్ఞ్నన్నయ యుగంగా నిర్ధారించారు. నన్నయకు పూర్వం రాజులు, సామంతరాజులు తమ జైత్రయాత్రల్లో కొత్త రాజ్యాలు, భూభాగాలను గెలిచినప్పుడు పండితులు, పురోహితులకు అగ్రహారాలు దానం చేసేవారు. మత ధార్మిక విషయాలను చాటిచెప్పేందుకు శాసనాలు వేయించేవారు. శాసనాలు రెండు రకాలు. ఒకటి శిలా శాసనాలు. రెండు తామ్ర శాసనాలు. 

శాసనాల స్వరూపాన్ని బట్టి భాషావేత్తలు ప్రాజ్ఞ్నన్నయ యుగాన్ని రెండు భాగాలుగా వర్గీకరించారు. క్రీ.పూ 200 నుంచి క్రీ.శ 575 వరకు ఉన్న కాలాన్ని తొలి దశగా, క్రీ.శ 575 నుంచి క్రీ.శ 1000 వరకు ఉన్న కాలాన్ని మలిదశగా పేర్కొన్నారు. తొలిదశలో శాసనాలన్నీ సంస్కృత, ప్రాకృత శాసనాలు. వాటిలో అక్కడక్కడా వ్యక్తి నామాలు, గ్రామ నామాలు, సంఖ్యా వాచకా లు, విశేషణాలు మాత్రం తెలుగులో ఉన్నాయి. క్రీ.శ 575లో కడప జిల్లా కమలాపురంలో ఎరుకల్ ముత్తురాజు వేయించిన ఎర్రగుడి పాడు శాసనాన్ని తొలి గద్య శాసనంగా భాషా వేత్తలు గుర్తించారు. అదే కాలానికి చెందిన ధనుంజయుని కలమళ్ల శాసనాన్ని ఇటీవల కొందరు పరిశీలకులు తొలి గద్య శాసనంగా పేర్కొన్నారు. దీన్ని భాషావేత్తలు నిర్ధారించాల్సి ఉంది. పుణ్యకుమారుడి పొట్లదుర్తి మాలెపాడు శాసనం (క్రీ.శ 610)లో ఎక్కువ తెలుగు పదాలు ఉన్నాయి. జయసింహవల్లభుని విప్పర్ల శాసనం (క్రీ.శ 640)లో తెలుగు, సంస్కృతం కలిసిన పదాలు ఉన్నాయి. 

తెలుగులో తొలి పద్య శాసనం అద్దంకి పండరంగని శాసనం (క్రీ.శ 848). అందులో తరువోజ పద్యాలు ఉన్నాయి. అదే కాలానికి చెందిన గుణగ విజయాదిత్యుని కందుకూరి శాసనం (క్రీ.శ 848)లో సీస పద్యం ఉంది. 

బెజవాడ యుద్ధమల్లుని శాసనంలో (క్రీ.శ 885) మధ్యాక్కర పద్యాలు ఉన్నాయి. గూడూరు విరియాల కామసాని శాసనంలో (క్రీ.శ 1000) చంపక, ఉత్పలమాలలు ఉన్నాయి. ధర్మవరం శాసనంలో ఆటవెలది పద్యాలు ఉన్నాయి. కె.వి.సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రచురించిన దక్షిణ హిందూ దేశ శాసనాల సప్తమ సంపుటి లో 27 తెలుగు శాసనాలు ఉన్నాయి. డా. బూదరాజు రాధాకృష్ణ ప్రాజ్ఞ్నన్నయ యుగంలోని 269 తామ్ర శాసనాలను నిశితంగా పరిశోధించి ప్రచురించారు. జయంతి రామయ్య పంతులు సంపాదకత్వంలో దక్షిణ హిందూ దేశ శాసనాల పదో సంపుటిలో 781 తెలుగు శాసనాలను ప్రచురించారు. 14వ శతాబ్దం నాటికి దాదాపు రెండువేల శాసనాలు ప్రచురితమైనట్లు భాషావేత్తలు నిర్ధారించారు. తొలిదశ శాసనాల్లో కొన్నింటిలో బ్రాహ్మీలిపి, ఇంకొన్నింటిలో కొంత భాగం దేవనాగరిలిపి, మరికొంత భాగం తెలుగు-కన్నడ లిపి ఉన్నాయి. కొన్ని శాసనాలు వేంగీచాళుక్యుల లిపిలో ఉన్నాయి. అప్పట్లో భాష ద్రవరూపంలో ఉన్నందున స్పష్టత, నిబద్ధత శాసన భాషలో కనిపించదు. శాసన భాషలో 23 హల్లులు, 10 అచ్చులు గల దేశ్య వర్ణమాల ఉండేది. వీటిలో లేఖన దోషాలు విరివిగా కనిపి స్తాయి. రేఫ బదులు వలపలి గిలక ఉపయోగిం చేవారు. 

శాసన భాషలో కనిపించే ‘ఱ’ వర్ణం క్రమేపి తెలుగులో డ కారంగా, రేఫగా మారింది. 
శాసనభాషలో అనుస్వరానికి బదులు వర్గ పంచమాక్షరాన్ని సంయుక్తంగా రాసేవాళ్లు.
ఉదాహరణ: పణ్డూ (పండు)

శాసనభాషలో శకట రేఫ ప్రయోగం విరివిగా ఉంది.

నేటి భాషలో శకట రేఫకు బదులు సాధు రేఫను ఉపయోగిస్తున్నారు. శకట రేఫ అదృ శ్యమైపోయింది.

శాసన భాషలో ఉన్న ‘ణ’, ‘ళ’లు నేటి భాషలో ‘న’, ‘ల’ లుగా మారాయి.
ఉదా: ఆణతి - (ఆనతి), సంవత్సరంబుళు (సంవత్సరంబులు).

సంస్కృత శాసనాల్లో గ్రామ నామాలను సంస్కృతీకరించిన రూపాలున్నాయి. ఉదా: చేబ్రోలు (తామ్రపురీ), కొలను (సారసపురీ)

శాసన భాషలో ఎన్నో భాషా విశేషాలు గమనించవచ్చు.

తొలి తెలుగు మాట ‘నాగబు’ పదం (క్రీ.శ.మొదటి శతాబ్ది) అని వేటూరి ప్రభాకరశాస్త్రి నిర్ధారించారు.

తెలుగు భాష ప్రాచీనతను నిర్ధారించే సం దర్భంలో ఫిబ్రవరి, 2006లో కొత్తూరు శాస నం (క్రీ.పూ 2 వ శతాబ్ది)లోని ‘తమ్బయ’ పదాన్ని తొలి తెలుగు మాటగా భాషా వేత్త లు నిర్ధారించారు.

గాంథిక భాష
ఆదికవి నన్నయ నుంచి చిన్నయసూరి వరకు కావ్య రచనలో ఉపయోగించిన వ్యాకరణ నియమబద్ధమైన భాషనే గ్రాంథిక భాష అంటారు. 19వ శతాబ్ది ఉత్తరార్థం నాటికి గ్రాంథిక భాషే ప్రామాణిక భాషగా ఉండేది. గ్రాంథిక భాషను సమర్థిస్తూ, వ్యావహారిక భాషను నిరసిస్తూ జయంతి రామయ్య పంతులు ఆధ్వర్యంలో కాకినాడలో ఆంధ్ర సాహిత్య పరిషత్తు సంస్థ ఏర్పడింది. వేదం వేంకటరాయశాస్త్రి, కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి, వావిలకొలను సుబ్బారావు త దితరులు దీనిలో సభ్యులు. గ్రాంథిక భాషను సమర్థిస్తూ, గిడుగు రామ్మూర్తి, గురజాడ అప్పా రావుల వ్యావహారిక భాషోద్యమాన్ని అవహేళన చేస్తూ పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘గ్రామ్య వాదుల భాషాపవాదం’ అనే గ్రంథాన్ని రచిం చారు. 

మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1912, డిసెంబరు 11, 12 తేదీల్లో వావిలకొలను సుబ్బారావు అధ్యక్ష తన జరిగిన సదస్సులో తెలుగు భాష ఔన్నత్యాన్ని గొప్పగా ప్రశంసించారు. అక్షరసంఖ్యను బట్టి చూసినా తెలుగు.. ఇంగ్లిష్ భాష కంటే అభివృద్ధి చెందిందని అన్నారు. గ్రాంథిక భాష ఉత్కృష్టతను వివరిస్తూ. ఆ భాషలో అన్యదేశ్యాలు కొద్దిగా ఉన్నా మాండలి కాలు లేవన్నారు. వ్యావహారిక భాషకు వ్యాకర ణం, నిఘంటువు లేనందున వ్యావహారికంలో రచనలు చేయడం తగదని అధిక్షేపించారు.

జయంతి రామయ్య పంతులు.. గిడుగు వారి ‘ఎ మెమోరాండమ్ ఆఫ్ మోడరన్ తెలుగు’ వ్యాసాన్ని ఖండిస్తూ ‘ఎ డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు’ అనే వ్యాసాన్ని ప్రచురించారు. 

గ్రాంథిక భాష మహాకవుల ప్రయోగాల నుంచి సిద్ధించినందున అది గొప్పదని, దాన్ని అనుసరించడం మంచిదని వాదించేవారు. వ్యావహారిక భాష శిష్టేతరుల వ్యవహారికం నుంచి సిద్ధించినందున దానికి ప్రామాణికత, సంస్కారం లేవని వారి ఆరోపణ. గ్రాంథిక భాష నన్నయ నుంచి ఆధునిక యుగం వరకు మారకుండా స్థిరంగా ఉన్నందున ప్రామాణిక వ్యవహారానికి అది అనుకూలమని వారి అభిప్రాయం. కందుకూరి వీరేశలింగం గారి ప్రత్యర్థి కొక్కొండ వెంకటరత్నం పంతులు నిత్య వ్యవహారంలో గ్రాంథిక భాషనే మాట్లాడేవారు. 

సరళ గ్రాంథిక భాష
గాంథికభాషలో మారుమూల తెలుగు పదాలు, కన్నడ పదాలతో అర్థం కాని సంస్కృత పదాలు, కఠోరమైన వ్యాకరణ నియమాలు, అన్యదేశ్యాలున్నందున గ్రాంథిక భాషావాదులు పనికట్టుకొని వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. పెద్ద సంక్లిష్ట వాక్య నిర్మాణాలతో గ్రాంథిక భాష చదివేందుకు, రాసేందుకు కఠినంగా ఉన్నందున ఈ లోపాలను సవరించాలన్న నిర్ణయంతో సరళగ్రాంథిక వాదులు చిన్నచిన్న సమాసాలు, సరళమైన సామాన్య వాక్యాలు, ప్రసిద్ధమైన తెలుగు, సంస్కృత పదాలతో రచనలు చేయాలని నిర్ణయించారు. అందమైన తెలుగు నుడికారాలు, జాతీయాలు, సామెతలతో, ఆకర్షణీయమైన శైలిలో తిరుపతి వేంకటకవులు, విశ్వనాథ సత్యనారాయణ, పుట్టపర్తి నారాయణాచార్యులు, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, దివాకర్ల వేంకటావధాని, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, వేలూరి శివరామ శాస్త్రి మొదలైనవారు సరళ గ్రాంథిక శైలిలో రచనలు చేసి పాఠకులను కొంతమేర ఆకర్షించ గలిగారు. 20వ శతాబ్ది పూర్వార్థంలో నవలలు, కథానికలు, పత్రికా ర చనలు, ఆధునిక విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు, వ్యాసాలు సరళ గ్రాంథిక శైలిలో వచ్చాయి. 

గ్రాంథిక భాషా సమర్థనతో వచ్చిన రచనలు

ఎ డిఫెన్స్ ఆఫ్ మోడరన్ లిటరరీ తెలుగు - జయంతి రామయ్య పంతులు

గ్రామ్యవాదుల భాషాపవాదం - పానుగంటి లక్ష్మీనరసింహారావు

ఆధునికాంధ్ర వాజ్ఞ్మయ వికాస వైఖరి - జయంతి రామయ్య పంతులు

పదం, ప్రాతిపదిక , ప్రత్యయం , అవ్యయం....

పదం, ప్రాతిపదిక , ప్రత్యయం , అవ్యయం....

1. పదం2. ప్రాతిపదిక3. ప్రత్యయం4. అవ్యయం5. పదం- అర్థాలు6. నానార్థాలు7. పర్యాయపదాలు8. వ్యుత్పత్యర్థాలు

1. పదం: వాక్ వ్యవహారంలో అర్థభేదక సామర్థ్యం ఉన్న కనిష్టాంశాన్ని వర్ణం అంటారు. అర్థభేదక వర్ణాల సమూహమే పదం. ఉదా: పలక, అరక.

2. ప్రాతిపదిక: చిన్నయసూరి నామంబనగా ‘ప్రాతిపదిక’ అని నిర్వచించాడు. నామమే ప్రాతిపదిక అన్నాడు. దీనికి ప్రకృతి అనే పర్యాయపదం ఉంది. నామవిభక్తి ప్రత్యయాలు, తద్ధిత ప్రత్యయాలు చేరడానికి తగిన ప్రకృతినే ప్రాతిపదికగా నిర్వచించవచ్చు.

ఉదా: రవిని. ఈ పదంలో ‘రవి’ అనేది ప్రాతిపదిక. ని అనేది ద్వితీయవిభక్తి. ప్రత్యయం చేరి కర్మార్థంలో రవిని అయింది.

3. ప్రత్యయం: అర్థ విశేషాన్ని సూచించేందుకు శబ్దానికి చేరే అక్షరాన్ని, అక్షరాలను ప్రత్యయం అనొచ్చు. ప్రథమాది విభక్తులు ప్రత్యయాలు. విభక్తులు శబ్దాలకు చివర చేరతాయి. విభక్తులనే కారకాలంటారు. క్రియతో అన్వయాన్ని కలిగించేవి కారకాలు. చిన్నయసూరి కారకాలను ఆరు విధాలుగా వర్గీకరించారు.

• కర్మకారకం-ప్రథమ, ద్వితీయా విభక్తులు
• కరణ కారకం - తృతీయా విభక్తి 
• సంప్రదాన కారకం - చతుర్థీ విభక్తి (త్యాగోద్దేశం సంప్రదానం) 
• అపాదాన కారకం- పంచమీ విభక్తి - (అపాయ జుగుప్స, భయ, పరాజయాలకు సంబంధించింది) 
• అధికరణ కారకం - సప్తమీ విభక్తి (అధికరణమంటే ఆధారమని అర్థం) 
• షష్ఠీ విభక్తికి కారకం లేదు.

4. అవ్యయాలు: లింగ విభక్తి వచన శూన్యం అవ్యయమని, లింగ విభక్తి వచన రహితాలు అవ్యయాలు అని అర్థం. అవ్యయాలు రెండు విధాలు. I. ప్రతిపదోక్తాలు II. లాక్షణికాలు

I. ప్రతిపదోక్తాలు: సహజసిద్ధంగా పద రూపంలో ఉండి అవ్యయాన్ని సూచించేవి ప్రతిపదోక్తాలు. ఇవి అనేక విధాలు. అవి.. సముచ్ఛయార్థకాలు, వికల్పార్థకాలు, హేత్వర్థకాలు, ఆశ్చర్యార్థకాలు, ప్రశంసార్థకాలు, సంతాపార్థకాలు, తిరస్కారార్థకాలు, ప్రశ్నార్థకాలు, సాదృశ్యార్థకాలు, స్థలార్థకాలు, కాలార్థకాలు, తూష్ణీమర్థకాలు, నిశ్చయార్థకాలు, కిలార్థకాలు, ప్రకారార్థకాలు. ఇవి కాకుండా సంస్కృతం నుంచి సదా, సర్వత్రా, వృథా, బహుధా క్వాచిత్కం, బహుశః, ప్రాయశః వంటి అవ్యయాలు తెలుగులో ప్రవేశించాయి.

1. సముచ్ఛయార్థకాలు: యు, ను అనేవి సముచ్ఛయార్థకాలు. ఉదా: రాముడును, లక్ష్మణుడును, మరియును సీత.

2. వికల్పార్థకాలు: ఏని, కాన, ఐన, అయ్యున్ మొదలైనవి వికల్పార్థకాలు. ఉదా: వచ్చినేని, అతడైన, ప్రసన్నుడయ్యున్.

3. హేత్వర్థకాలు: కనుకన్, కాబట్టి మొదలైనవి.

4. ఆశ్చర్యార్థకాలు: అయ్యారే!, బాపురే!, ఆహా!, ఔరా!, అమ్మకచెల్లా!

5. ప్రశంసార్థకాలు: ఓహో, ఆహా, వహ్వా, భళీ, సెబాసు.

6. సంతాపార్థకాలు: సానుభూతి సూచకాలు. అయ్యో!, అక్కటా, కటకటా.

7. తిరస్కారార్థకాలు: తిరస్కార సూచకాలు, ఛీ, ఫో! మొదలైనవి.

8. సాదృశ్యార్థకాలు: వలెన్, పోలెన్, బలెన్, మాడ్కి, అట్లు మొదలైనవి ఉపమావాచకాలు.

9. స్థలకాలార్థకాలు: స్థలకాలానుగుణాలను సూచించేవి. ఇక్కడ, నేడు, రేపు.

10. తూష్ణీమర్థకాలు: ఊరక, మిన్నక.

11. నిశ్చయార్థకాలు: కదా! కాదె! సుమా! సుమ్మీ.

12. కిలార్థకాలు: అట, అంట వంటి పదాలు.

13. ప్రకారార్థకాలు: అట్లు, ఇట్లు.

II. లాక్షణిక అవ్యయాలు: వ్యాకరణ లక్షణాల వల్ల సిద్ధించిన అవ్యయాలన్నీ లాక్షణిక అవ్యయాలు. అసమాపక క్రియలన్నీ లాక్షణిక అవ్యయాలు.

1. క్త్వార్థకాలు: భూతకాలిక అసమాపక క్రియలు క్త్వార్థకాలు. ఉదా: చూసి, చేసి, తిని, వెళ్లి, వచ్చి.

2. వ్యతిరేక క్త్వార్థకాలు: క్రియకు వ్యతిరేకా ర్థాన్ని సూచించే ‘అక’ చేరుతుంది. ఉదా: చూడక, చేయక, తినక, రాక.

3. శత్రర్థకాలు: వర్తమాన కాల అసమాపక క్రియలు. క్రియకు ‘చున్’ అనే ప్రత్యయం చేరుతుంది. ఉదా: చేయుచున్, తినుచున్, చూచుచున్.

4. తుమున్నర్థకాలు: ‘కొరకు’ అనే అర్థాన్నిచ్చే అసమాపక క్రియలు. ‘అన్’ ప్రత్యయం క్రియకు చేరుతుంది. ఉదా: చేయన్, చేయగన్, వచ్చినన్, చూచినన్, చేసినన్.

5. అనంతర్యార్థకాలు: తర్వాత అనే అర్థాన్నిచ్చే అసమాప క్రియలు. క్రియకు ‘డున్’ అనే ప్రత్యయం చేరుతుంది. ఉదా: చేయుడున్, వ్రాయుడున్, వచ్చుడున్.

6. చేదర్థకాలు: ‘అయితే’ అనే అర్థాన్నిచ్చే అసమాపక క్రియలు. క్రియకు ‘ఇనన్’ ప్రత్యయం చేరుతుంది. ఉదా: తినినన్, చేసినన్, వ్రాసినన్.

7. భావార్థకాలు: క్రియకు ‘ట’ ప్రత్యయం చేరుతుంది. ఉదా: వచ్చుట, చూచుట.

8. ఆశీర్వాద్యర్థకాలు: ఆశీర్వదించే అర్థాలు, శపించే అర్థాలు. క్రియకు ఎడున్, తన్ మొదలైన ప్రత్యయాలు చేరతాయి. ఉదా: ప్రసన్నులయ్యెడున్, కావుతన్

5. పదం- అర్థం: అర్థవంతమైన వర్ణాల సము దాయం పదం. ప్రతి పదానికి అర్థం ఉంటుంది. ఒక పదానికి అనేక అర్థాలుంటే వాటిని నానార్థాలు అంటారు. ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలను పర్యాయపదాలు అంటా రు. పదానికి సంబంధించిన పుట్టుక, దాని అర్థాన్ని సవివరంగా తెలియజేసేవి వ్యుత్పత్తి అర్థాలు.

పదం

నానార్థాలు

అంకిలి:

ఆపద, క్షోభ.

అంగుష్ఠం:

బొటనవ్రేలు, అంగుళం.

అండజయు:

పాము, చేప, పక్షి,తొండ, కస్తూరి.

అంతర్యామి:

పరమాత్మ, జీవాత్మ.

ఆశరుడు:

రాక్షసుడు, అగ్ని.

ఆర్యుడు:

మంచివాడు, పూజ్యుడు.

ఆళి:

పంక్తి, తేలు, చెలికత్తె

ఇష్టి:

కోరిక, యజ్ఞం, కత్తి

ఈశుడు:

రాజు, శివుడు, మన్మథుడు, సంపన్నుడు.

ఉక్తి:

సరస్వతి, మాట.

ఉదాత్తుడు:

గొప్పవాడు, ఇచ్చువాడు.

ఉమ:

పార్వతి, కాంతి, పసుపు.

అక్షరం:

వర్ణం, రూపం, నాశనం లేనిది, పరబ్రహ్మం.

అశని:

వజ్రాయుధం, పిడుగు, మెరుపు.

సౌరభం:

సువాసన, కుంకుమపువ్వు, ఎద్దు.

ధనం:

విత్తం, ధనిష్ఠానక్షత్రం, ధనియాలు.

కేసరి:

సింహం, గుర్రం, ఆంజనేయుని తండ్రి.

గురువు:

ఉపాధ్యాయుడు, తండ్రి బృహస్పతి.

తీర్థం:

పుణ్యక్షేత్రం, జలం, యజ్ఞం

శ్రీ:

సంపద, లక్ష్మి, విషం, సాలెపురుగు.

పుండరీకం:

పెద్దపులి, తెల్ల తామర, తెల్ల గొడుగు.

కరము:

చేయి, తొండం, కిరణం.

ఉద్యోగం:

పని, అధికారం,యత్నం.

వ్యవసాయం:

కృషి, పరిశ్రమ, ప్రయత్నం

సుధ:

సున్నం,పాలు, అమృతం.

ఉచితం:

ఊరక, తగినది, మితం.

తాత:

బ్రహ్మ, తండ్రికి తండ్రి, తల్లికి తండ్రి.

గగనం:

ఆకాశం, శూన్యం,దుర్లభం

శిఖ:

సిగ, కొన, కొమ్ము.

భవం:

పుట్టుక, బ్రతుకు, ప్రపంచం.

పర్యాయపదాలు

తావి:

సుగంధం, పరిమళం, సౌరభం.

హలం:

నాగలి, సీరం, లాంగలం.

సామెత:

సమత, లోకోక్తి, నానుడి, పురాణోక్తి.

హిరణ్యము:

కనకం, బంగారం, కాంచనం, పసిడి.

కార్ముకం:

విల్లు, ధనస్సు, సింగణి, శరాసనం.

కపి:

మర్కటం, కోతి,వానరం.

క్ష్మా:

భూమి, ధరణి, ధాత్రి, మహి, పృథ్వి.

కేతనం:

జెండా, ధ్వజం, పతాకం.

ఘనసారం:

కర్పూరం, ఘనరసం, కప్పురం.

గంగ:

భాగీరథి, జాహ్నవి.

ఇంద్రధనస్సు:

హరివిల్లు, ఇంద్రచాపం, వాల్మీకం.

కిరీటం:

మౌళి, మకుటం, ఉష్ణీషం, కోటీరం.

రైతు:

కర్షకుడు, సేద్యగాడు, క్షేత్రజీవుడు.

కళత్రం:

భార్య, ఇల్లాలు, పత్ని సతి.

తనువు:

శరీరం, దేహం, కాయం.

ఎండ్రి:

పీత, కుళీరం,ఎండ్రకాయ

పులుంగు:

పక్షి, విహంగం, ఖగం.

తనయుడు:

పుత్రుడు, కొడుకు, సుతుడు.

తరువు:

చెట్టు, వృక్షం, మహీరుహం

కదనం:

యుద్ధం, రణం, సమరం.

పుండరీకం:

వ్యాఘ్రం, శార్దూలం,పులి.

క్షత్రియుడు:

రాజు, విభుడు, నృపుడు.

నీహారం:

మంచు, హిమం, తుహినం.

సముద్రం:

వారధి, కడలి, అబ్ది, సాగరం.

వ్యుత్పత్యర్థాలు

ఒక పదానికి సంబంధించిన పుట్టుక, నేపథ్యం దాని అర్థం మొదలైన వాటిని తెలియజేసేవి వ్యుత్పత్యర్థాలు.

• భూజం - భూమియందు పుట్టింది (వృక్షం) 
• ఇల్లాలు-ఇంటి యందలి స్త్రీ (గృహిణి) 
• ఆఖండలుడు - కొండల రెక్కలను ఖండించినవాడు (ఇంద్రుడు) 
• ఇతిహాసం - ఇది ఈ విధంగా జరిగిందనే పూర్వ రాజుల చరిత్ర (రామాయణం, భారతం) 
• ఇందిర - గొప్ప ఐశ్వర్యం గలది (లక్ష్మీదేవి) 
• ఇంద్రాణి - ఇంద్రుడి భార్య (శచీ దేవి) 
• ఉదధి - ఉదకమును ధరించునది (సముద్రం) 
• ఉపేంద్రుడు - ఇంద్రుని తమ్ముడు (విష్ణువు) 
• ఉర్వి - పర్వతాలతో కప్పి ఉన్నది (భూమి) 
• ఉతాకం - నయన కాంతితో కాకులను దహించునది (గుడ్లగూబ) 
• ఔరసుడు - తనకు ధర్మపత్ని యందు పుట్టినవాడు (వారసుడైన పుత్రుడు) 
• లాంగలం - దున్నేటప్పుడు భూమిలో చొచ్చునది (నాగలి) 
• వాగ్మి - చతురంగా మాట్లాడే నేర్పు గలది/గలవాడు (చిలుక, బృహస్పతి) 
• సీరపాణి- నాగలి హస్తమునందు గలవాడు (బలరాముడు) 
• అలివేణి - తుమ్మెద వంటి నల్లని కురులు గలది (స్త్రీ) 
• పన్నగము- పాదములతో నడవనిది (పాము) 
• రత్నగర్భ- రత్నములు గర్భం నందు కలది (భూమి) 
• అపర్ణ - ఆకులను సైతం తినక కఠోర తపస్సు చేసింది (పార్వతి)
• మర్త్యుడు- మృతి నొందువాడు (మానవుడు) 
• సరసిజనాభుడు - పద్మం నాభి యందు గలవాడు విష్ణువు 
• కమలిగర్భుడు - కమలం గర్భముగా గలవాడు (బ్రహ్మ) 
• హుతభుక్కు - హుతమును (హోమాగ్ని) భుజించువాడు (అగ్ని) 
• పుత్రుడు - పున్నామ నరకం నుంచి రక్షించేవాడు (కుమారుడు)
• జీమూతం - దీని యందు నీరు బంధించి ఉంటుంది (మేఘం) 
• ఛాత్రుడు - గురువు దోషాలను ఛత్రం వలె కప్పిపుచ్చు శీలం గలవాడు (శిష్యుడు)
Related Posts Plugin for WordPress, Blogger...