సివిల్‌ సర్వీస్‌ గురించి



అభ్యర్థుల కనీస విద్యార్హత డిగ్రీ ఉత్తీర్ణత. మార్కుల శాతం కనీసం ఇంత ఉండాలనేమీ నిబంధన లేదు. డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు ప్రిలిమినరీలో నెగ్గితే వారు తమ గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్‌ను మెయిన్‌కు దరఖాస్తు చేసేటపుడు (ఆగస్టు 2017) సమర్పించాల్సివుంటుంది. 

* వయసు 21 సంవత్సరాలు నిండివుండాలి. 

సివిల్స్‌ ఆశావహులు ముందుగానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కేంద్రంలోనూ పరిమిత సంఖ్యలోనే అభ్యర్థులను కేటాయిస్తారు. మొదట దరఖాస్తు చేసినవారికి మొదటగా పరీక్షకేంద్రం విషయంలో ప్రాధాన్యం ఇస్తారు. అభ్యర్థుల పరిమితి దాటితే వేరే కేంద్రం కేటాయిస్తారు.

అభ్యర్థి ఒకే దరఖాస్తును పంపుకోవాలి. పోస్టులో కాకుండా ఆన్‌లైన్లోనే పంపించాల్సివుంటుంది. ఏదైనా కారణం వల్ల రెండో దరఖాస్తును పంపితే, యూపీఎస్‌సీ చివరిసారి పంపినదాన్నే పరిగణనలోకి తీసుకుంటుంది. 

ప్రిలిమినరీ నిర్వహణకు దేశం మొత్తమ్మీద ఉన్న పరీక్ష కేంద్రాలు 72. మెయిన్‌ పరీక్షకు 24 కేంద్రాలున్నాయి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రిలిమినరీకి 6 కేంద్రాలు (హైదరాబాద్‌, వరంగల్‌, విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, తిరుపతి) ఉన్నాయి. మెయిన్‌ పరీక్షను మాత్రం హైదరాబాద్‌, విజయవాడల్లో నిర్వహిస్తారు. 

రెండు రకాల లక్ష్యాలు
సివిల్‌ సర్వీసెస్‌ నియామక విధానం 2 రకాల లక్ష్యాలతో ఉంది.
1) నిరంతరం పరిజ్ఞానం, నైపుణ్యాలను సంపాదించగల అభ్యర్థులను ఎంపిక చేయటం.
2) తగిన ప్రేరణ ఉన్నవారినీ, తాము విధులు నిర్వహించే సర్వీసుకు భావోద్వేగపరంగా అనుసంధానమైవుండేవారినీ ఎంపిక చేయటం. ఈ లక్ష్యాలను నెరవేర్చటం కోసం సివిల్స్‌ రాతపరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. ప్రాథమిక (ప్రిలిమినరీ) పరీక్ష, ప్రధాన (మెయిన్‌) పరీక్ష.
ప్రాథమిక పరీక్షలో...
మొదటి దశ అయిన ప్రిలిమినరీలో రెండు పేపర్లుంటాయి. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1, జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2. ప్రతి పేపరుకూ 200 మార్కుల చొప్పున ఉంటాయి. పేపర్‌-1లో 100 ప్రశ్నలు. ప్రతి సరైన జవాబుకూ రెండు మార్కులు. పేపర్‌-2లో 80 ప్రశ్నలు. సరైన సమాధానానికి రెండున్నర మార్కులు. రుణాత్మక (నెగిటివ్‌) మార్కు కూడా ఉంది. ప్రతి తప్పు జవాబుకూ 0.33 మార్కును తగ్గిస్తారు.
ప్రిలిమినరీలో కనీసం ఎన్ని మార్కులు తెచ్చుకుంటే మెయిన్స్‌కు అర్హత పొందవచ్చు? అనేది చాలామంది అడిగే ప్రశ్న. అది అభ్యర్థుల పోటీ స్థాయిని బట్టి ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరమూ మారుతుంటుంది. స్థూలంగా అంచనా వేయాలంటే... జనరల్‌ కేటగిరీ వారికి పేపర్‌-1లో 112/200 మార్కులను కనీస అర్హత మార్కుగా భావించవచ్చు.
ప్రిలిమినరీ స్థాయిలో రిజర్వేషన్లు ఉండవని చాలామంది అపోహతో ఉంటారు. కానీ అన్ని సెక్షన్లకూ ప్రాతినిధ్యం ఉండాలనే రాజ్యాంగ విధి ప్రకారం యూపీఎస్‌సీ ప్రిలిమినరీలోనూ రిజర్వేషన్లు అమలు చేస్తుంది.
ప్రిలిమినరీలో విజయం దక్కించుకోవాలంటే పునాది నుంచి ప్రయత్నం చేయాలి. సిలబస్‌ను ఆకళింపు చేసుకోవాలి. తాజా ధోరణులను అవగాహన చేసుకోవాలి.ప్రాథమిక పరీక్ష సిలబస్‌ లోతుగా కాకుండా సాధారణ స్థాయిలో (జనరల్‌) ఉంటుంది. అందుకని ఒక్కో టాపిక్‌ నుంచి పరీక్షల్లో ఏమి వస్తుందో అర్థం చేసుకోవడం కష్టం. అందుకని గత కొద్ది సంవత్సరాల్లో దేని నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో విశ్లేషించుకుంటే ఏం చదవాలో స్పష్టత వస్తుంది. 

ఎలా సిద్ధమవ్వాలి?
1. మొదట ప్రతి సబ్జెక్టులోనూ ప్రాథమికాంశాలపై అవగాహన పెంచుకోవటంపై శ్రద్ధ పెట్టాలి. పదో తరగతి తర్వాత ఎక్కువమంది విద్యార్థులు సైన్స్‌/మ్యాథ్స్‌ గానీ కామర్స్‌ గానీ తీసుకుంటున్నారు. అందుకని తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సిలబస్‌లోని దాదాపు సబ్జెక్టులన్నీ కొత్తగానే ఉంటాయి. అందుకనే మౌలిక/ ప్రాథమిక అంశాల నుంచీ పటిష్ఠమైన పునాదిని నిర్మించుకోవటం అవసరం.
2.ప్రాథమిక అంశాలు పూర్తిచేశాక గత సంవత్సరాల్లో అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. సివిల్స్‌లో ప్రశ్నల శైలిని ఏటా మారుస్తుంటారు కాబట్టి... ఇలాంటి ప్రయత్నం సూచనాత్మకమేననీ గుర్తించాలి.
3. ప్రశ్నల తీరును ఆకళింపు చేసుకున్నాక ప్రతి సబ్జెక్టులోనూ వర్తమాన అంశాలపై శ్రద్ధ పెట్టాలి.
4. చదవటం కోసం ఒక టైమ్‌ టేబుల్‌ను తయారుచేసుకోవాలి. అది అభ్యర్థి స్థాయినీ, తీరునూ బట్టి ఉండాలి. ఇతరులు తయారుచేసి పెట్టినదైతే ఆచరణలో సరిపోకపోవచ్చు. అందుకే సొంతంగా రూపొందించుకోవాలి. మొదట ఒక వారానికి టైమ్‌టేబుల్‌ తయారుచేసుకోవాలి. రెండోది 15 రోజులకు, మూడోది 30 రోజులకు.. చివరిది 80 రోజులకు. వారం రోజుల టైమ్‌టేబుళ్ళు మిగతా వాటితో అనుసంధానమయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి.
5. ప్రణాళిక ప్రకారం చదవటం పక్కాగా జరుగుతున్నపుడు సన్నద్ధత తీరును తరచూ సమీక్షించుకుని మెరుగుపర్చుకోవాలి. అవసరమైన చోట మెరుగుపర్చుకోవటం, మార్పులు చేసుకోవటం చేస్తుండాలి.
6. ప్రతి టాపిక్‌లోనూ నమూనా / కాంప్రహెన్సివ్‌/ గ్రాండ్‌ టెస్టులను రాయటం ప్రారంభించాలి. వాటిలో రుణాత్మక మార్కులను తీసేశాక కనీసం 65 శాతం సాధించటం అవసరం. ‘65 శాతం అంటే చాలా తక్కువ కదా!అని కొత్తగా సివిల్స్‌కు సిద్ధమయ్యేవారికి అనిపించవచ్చు. కానీ నిలకడగా 65 శాతం సాధించటమంటే... నిశ్చయంగా విజయపథంలో సాగుతున్నట్టే!
రెండేళ్ళ అమూల్యమైన కాలం సివిల్స్‌కు వెచ్చిస్తే ఒకవేళ విజయం రాకపోతే నష్టపోవాల్సివస్తుంది కదా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ సివిల్స్‌కు తయారయ్యే సందర్భంగా సంపాదించిన పరిజ్ఞానం ఏ వృత్తిలోనైనా విజయవంతంగా రాణించేలా చేస్తుందని మర్చిపోకూడదు.
కేంద్ర సర్వీసులు దక్కకపోయినా, రాష్ట్రస్థాయి సర్వీసుల్లో తేలిగ్గానే ప్రవేశించవచ్చు. ఇతర పోటీపరీక్షల్లోనూ విజయాలు సాధించవచ్చు.
కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అనవసరమైన అపోహలను వదిలి సివిల్స్‌ సవాలును నిస్సందేహంగా అందుకోవటం సరైన చర్య. ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవటానికి ఇది రాజమార్గం! 



Related Posts Plugin for WordPress, Blogger...