Wednesday, February 20, 2019

సివిల్స్ ప్రిలిమ్స్-2019కి సన్నద్ధమవ్వండిలా..

ఏం చదవాలి.. ఎలా చదవాలి.. ప్రిలిమ్స్ గట్టెక్కడమెలా?దేశ పాలనకు ఉక్కు చట్రం.. సివిల్ సర్వీసెస్! సేవలో సంతృప్తితోపాటు సమాజంలో విశేష గౌరవం, గుర్తింపు..

Education Newsసివిల్ సర్వీసెస్ ద్వారానే సాధ్యం!! అందుకే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి దేశ అత్యున్నత సర్వీసుల్లో అడుగుపెట్టడం ప్రతి ఒక్క విద్యార్థి స్వప్నం! ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రతిభావంతులైన యువత కలల సౌధం.. సివిల్ సర్వీసెస్! ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. మూడంచెల సివిల్స్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలంటే.. అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి. విస్తృతమైన సిలబస్‌ను ఔపోసన పట్టేందుకు.. పటిష్ట వ్యూహం, ప్రణాళికాబద్ద ప్రిపరేషన్‌తోపాటు ప్రశాంతమైన పట్టుదలతో ముందడుగేయాలి. యూనియన్ పబ్లిక్ సరీస్ కమిషన్(యూపీఎస్సీ)ఫిబ్రవరి 19న సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2019కు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ప్రతిష్టాత్మక సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌తోపాటు మొత్తం 24 కేంద్ర సర్వీసులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సివిల్స్ 2019 నోటిఫికేషన్ సమాచారం, ఎంపిక ప్రక్రియ, తొలిదశ ప్రిలిమ్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం...

సివిల్స్ 2019.. ముఖ్య సమాచారం
నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 19, 2019.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 18, 2019.
పోస్టుల సంఖ్య: 896
అర్హత: ఏదైనా డిగ్రీ
వయసు: జనరల్ అభ్యర్థులు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. 

ఎన్నిసార్లు రాయొచ్చు: జనరల్ అభ్యర్థులు ఆరుసార్లు, ఓబీసీలు 9సార్లు, ఎస్సీ/ఎస్టీలు గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లయినా రాయొచ్చు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
ప్రిలిమ్స్ పరీక్ష తేది: జూన్ 2, 2019.
మెయిన్స్ పరీక్షలు ఎప్పుడు: సెప్టెంబర్ 20వ తేదీ నుంచి జరుగుతాయి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.upsc.gov.in , https://upsconline.nic.in 

896 పోస్టులతో నోటిఫికేషన్:
  • సివిల్స్ ప్రిలిమ్స్-2018.. 782 పోస్టులు.. 8 లక్షల దరఖాస్తులు.. 3 లక్షల మందికి పైగా హాజరైతే.. మొయిన్స్‌కు అర్హత పొందింది కేవలం 10,500 మంది. ఇప్పుడు సివిల్స్ 2019 నోటిఫికేషన్ 896 పోస్టులతో వెలువడింది. అంటే గత నోటిఫికేషన్ కంటే 114 పోస్టులు ఎక్కువన్నమాట! ఈసారి పోస్టుల సంఖ్య పెరగడం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం.
  • కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో ఐఏఎస్, ఐపీఎస్‌ల కొరత.. 2020 నాటికి పదవీ విరమణ చేసే ఐఏఎస్‌ల సంఖ్య ఎక్కువగా ఉండటం.. ఎక్కువ మందిని కేటాయించాల్సిందిగా రాష్ట్రాల డిమాండ్.. ఏటా 180 మందికి తగ్గకుండా ఐఏఎస్‌లను నియమించుకోవాలని బస్వాన్ కమిటీ సిఫార్సు చేయడం వంటివి సివిల్స్ నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య ఆశాజనకంగా ఉండటానికి కారణమంటున్నారు. అంతేకాకుండా యూపీఎస్సీ ప్రతి సంవత్సరం నిర్దిష్ట సమయంలో నోటిఫికేషన్ విడుదల చేస్తూ.. పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తోంది. క్రమం తప్పకుండా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి ప్రతిష్టాత్మక సర్వీసులకు ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. దాంతో సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోని ప్రతిభావంతులకు అత్యంత క్రేజీ ఎగ్జామ్‌గా నిలుస్తోంది.

ఎంపిక ప్రక్రియ : 
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. ఇలా మూడంచెల విధానంలో ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో, మెయిన్స్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. మెయిన్స్‌లో ప్రతిభ చూపిన వారిని పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు. ప్రిలిమ్స్... అర్హత పరీక్ష మాత్రమే(స్క్రీనింగ్ టెస్ట్).

పేపర్ 1.. కీలకం : 
మూడు దశల సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో.. ప్రిలిమ్స్ వడపోత పరీక్ష. ఎందుకంటే.. ప్రిలిమ్స్ మార్కులను తుది జాబితా రూప కల్పనలో పరిగణనలోకి తీసుకోరు. అయితే ప్రిలిమ్స్‌లో కటాఫ్ మార్కులు సాధిస్తేనే.. మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తారు. ప్రిలిమ్స్ పరీక్ష రెండు పేపర్లుగా మొత్తం 400 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు. ప్రతి పేపర్‌కు పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రిలిమ్స్ రెండు పేపర్లలో పేపర్ 1 అత్యంత కీలకం. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగానే మెయిన్స్‌కు అర్హత లభిస్తుంది. పేపర్ 2 (సీశాట్) కేవలం అర్హత పరీక్ష. ఇందులో 33 శాతం మార్కులు పొందితే సరిపోతుంది. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్/హిందీలో ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. 

పరీక్ష స్వరూపం :
పేపర్
మార్కులు
సమయం
పేపర్ 1
200
2 గంటలు
పేపర్ 2
200
2 గంటలు

పేపర్-1 సిలబస్ : పేపర్ 1 సిలబస్‌లో ఏడు ప్రధాన అంశాలుగా పేర్కొన్నారు. అవి..
  1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన తాజా పరిణామాలు.
  2. భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం.
  3. భారత, ప్రపంచ భౌగోళికశాస్త్రం: ప్రపంచ, భారత దేశ భౌతిక, సామాజిక, ఆర్థిక భౌగోళిక శాస్త్రం.
  4. భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన-రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయతీరాజ్, పౌర విధానం, హక్కుల సంబంధిత అంశాలు.
  5. ఆర్థిక, సామాజిక అభివృద్ధి-సమ్మిళిత అభివృద్ధి, పేదరికం, ద్రవ్యోల్బణం, డెమోగ్రాఫిక్స్, సామాజిక రంగ కార్యక్రమాలు..
  6. పర్యావరణం, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు- సాధారణ అంశాలు.
  7. జనరల్ సైన్సు.

పేపర్ 2.. సిలబస్‌లో ఆరు అంశాలుపేపర్-2 సిలబస్‌లో ప్రధానంగా 6 అంశాలను పేర్కొన్నారు. అవి.. కాంప్రెహెన్షన్.. కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు ఇంటర్‌పర్సనల్ నైపుణ్యాలు.. లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ.. డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్.. జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్.. 

ప్రిలిమ్స్ ప్రశ్నలు.. ఊహకందవా..!
  • సివిల్స్ ప్రిలిమ్స్‌లో వచ్చే ప్రశ్నలు.. అభ్యర్థుల ఊహకందవు అనే అభిప్రాయముంది! ప్రశ్నల శైలి, వెయిటేజీల పరంగా ఏటా ప్రశ్నపత్రం వైవిధ్యంగా వస్తుండటంతో అభ్యర్థుల్లో ఇలాంటి అభిప్రాయం నెలకొంది. ప్రిలిమ్స్‌లో ఒక సంవత్సరం హిస్టరీకి ప్రాధాన్యం లభిస్తే..మరో సంవత్సరం పాలిటీ వెయిటేజీ పెరుగుతుంది. ఒక్కోసారి పూర్తిగా కరెంట్ అఫైర్స్ హవానే కొనసాగుతుంది. సబ్జెక్టును విభిన్న కోణాల్లో చదవడం.. వైవిధ్యమైన ప్రశ్నల సాధన.. బేసిక్స్‌పై పట్టు సాధించగలిగితే..పేపర్ ఎలా ఉన్నా ఆందోళన చెందకుండా సమాధానాలు గుర్తించే వీలుంటుంది.
  • సివిల్స్ ప్రిలిమ్స్.. వాస్తవానికి అభ్యర్థికిసబ్జెక్ట్ ప్రాథమిక అంశాలపై ఉన్న అవగాహనతోపాటు అతని అనువర్తిత దృక్పథం, వాస్తవ పరిజ్ఞానం, కరెంట్ అఫైర్స్‌పై పట్టును పరీక్షించేలా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు సిలబస్‌ను స్టాటిక్, డైనమిక్.. అనే రెండు భాగాలుగా విభజించుకోవాలి. ముందుగా స్టాటిక్ పార్ట్ ప్రిపరేషన్‌ను పూర్తిచేసి.. ఆ తర్వాత డైనిమిక్ పార్ట్‌పై అధిక సమయం వెచ్చించాలి. బేసిక్స్‌పై పట్టుతో ప్రిలిమ్స్‌లో 50 ప్రశ్నలకు తేలిగ్గానే సమాధానాలు గుర్తించే అవకాశం ఉంటుంది. మిగిలిన 50లో 5-10 ప్రశ్నలను సాధించగలిగితే మెయిన్స్‌కు (కటాఫ్ 110-115 ఉండే అవకాశం) అర్హత పొందినట్ల్లే!

పాలిటీ.. పరిపాలన : 
పాలిటీ విభాగంలో రాజ్యాంగం మౌలిక స్వరూపం, చారిత్రక నేపథ్యం, ముఖ్య షెడ్యూళ్లు, ఆర్టికల్స్, ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు, సుప్రీంకోర్టు కీలక తీర్పులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్, రాష్ట్రాల్లో శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, కేంద్రం-రాష్ట్రాల బాధ్యతలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, ఫెడరల్ స్ట్రక్చర్, పంచాయతీ రాజ్ వ్యవస్థ, అధికారాల వికేంద్రీకరణ, దేశంలో రాజ్యాంగ సంస్థలు, చట్టబద్ధ పాలన, ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, పౌరసేవలు తదితర అంశాలపై పట్టుసాధిస్తే ఇందులో మంచి స్కోరు చేసే అవకాశం ఉంటుంది. ఆయా శాఖలు-సంస్థల అధికారిక వెబ్‌సైట్లను పరిశీలించడం ద్వారా వాటి నిర్మాణం, చరిత్ర, పనితీరు, కార్యక్రమాలు, లక్ష్యాల గురించి తెలుసుకోవచ్చు. గతంలో కేబినెట్ సెక్రటేరియెట్, కేబినెట్ సెక్రటరీపై కూడా ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి అభ్యర్థులు ప్రతి అంశాన్ని క్షుణ్నంగా, వివిధ కోణాల్లో చదువుతూ అవగాహన చేసుకోవాలి. లక్ష్మీకాంత్ పాలిటీ పుస్తకం చదవడం లాభిస్తుంది. దీంతోపాటు లీగల్‌సర్వీస్ ఇండియా.కామ్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్‌సైట్‌ను అనుసరించొచ్చు. 

చరిత్ర.. కీలక ఘట్టాలు : ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా భారత జాతీయ ఉద్యమంలోని వివిధ కీలక ఘట్టాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది. ప్రాచీన చరిత్రలో సింధు నాగరికత, రుగ్వేదం, బౌద్ధ, జైన మతాల కాలం నాటి శిల్ప సంపద, బుద్ధుడి జీవితంతో ముడిపడిన ప్రదేశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. మధ్యయుగ చరిత్ర నుంచి 1 లేదా 2 ప్రశ్నలకు మించి రావట్లేదు. ఆధునిక భారత చరిత్రలో స్వాతంత్య్రోద్యమం అత్యంత కీలకం. చరిత్ర ప్రిపరేషన్ కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, బిపిన్ చంద్ర, స్పెక్ట్రమ్ పుస్తకం ఉపయోగపడతాయి.

ముఖ్యాంశాలు :
  • బ్రిటీష్ గవర్నర్ జనరల్స్-చట్టాలు, సంస్కరణలు.
  • 1857 సిపాయిల తిరుగుబాటు, గిరిజనుల తిరుగుబాట్లు, ఇతర పౌర తిరుగుబాట్లు.
  • భారత ప్రభుత్వ చట్టాలు (1858, 1909, 1919, 1935 తదితరం).
  • ప్రముఖ వ్యక్తులు-ఆలోచనలు (గాంధీ, అంబేద్కర్, రాజేంద్రప్రసాద్, దాదాబాయి నౌరోజీ).
  • కాంగ్రెస్ మహాసభలు.
  • స్వాతంత్య్ర ఉద్యమ కీలక ఘట్టాలు (సహాయ నిరాకరణ ఉద్యమం, వందేమాతర ఉద్యమం, దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం).
  • సామాజిక-మత ఉద్యమాలు.

సంస్కృతిపై ప్రశ్నలు : 
చరిత్రకు సంబంధించి సంస్కృతి-కళలపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. వీటి ప్రిపరేషన్‌కు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవడం లాభిస్తుంది. సంస్కృతిలో ముఖ్యంగా దేవాలయ శిల్పసంపద, పెయింటింగ్స్, స్మారక స్థూపాలు, యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశాల గురించి చదవాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో పూర్తిపేజీలో ముద్రించిన చిత్రపటాలపై ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఆయా చిత్రపటాల గురించిన సమాచారాన్ని అధ్యయనం చేయాలి. దీంతోపాటు గుప్తులు, మౌర్యులు, దక్షిణ భారతదేశంలోని సంగమ వంశం కాలం నాటి శిల్పకళపై ప్రశ్నలు అడిగే అవకాశముంది. సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ (సీసీఆర్‌టీ) వెబ్‌సైట్లో లభించే సమాచారాన్ని చదవడం ఉపయుక్తం. 

జనరల్ సైన్స్..ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు : 
ఎన్‌సీఈఆర్‌టీ 6-10 తరగతుల పుస్తకాలు, కరెంట్ అఫైర్స్ (మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజీన్‌లు), షార్ట్ నోట్సు ప్రిపరేషన్‌తో.. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి మార్కుల సాధించొచ్చు. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి హైస్కూల్ స్థాయి అంశాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలి. దాంతోపాటు బయోటెక్నాలజీ టాపిక్ నుంచి (2015 మినహా) గత ఐదేళ్లుగా ప్రశ్నలు వస్తున్నాయి. ఇందుకోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 2014-18 కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలపై విడుదల చేసిన ఈ-బుక్ చదవడం లాభిస్తుంది. దీంతోపాటు ఐఓటీ, 3డీ ప్రింటింగ్, ఏఐ, రోబోటిక్స్, ఆటోమేషన్, హెల్త్‌కేర్, ఐఆర్‌ఎస్, రాన్సమ్‌వేర్, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ శాటిలైట్స్, నావిగేషన్ సిస్టమ్, పర్యావరణం, జీవ వైవిధ్యం (బయోడైవర్సిటీ), వాతావరణ మార్పులు తదితరాల అంశాలపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి.

ఎకానమీ.. కరెంట్ అఫైర్స్‌పై ఫోకస్ : ఎకనామిక్స్‌లో స్టాటిక్ పార్టు నుంచి ప్రశ్నలు పెద్దగా రావట్లేదు. అయితే అభ్యర్థుల ఆర్‌బీఐ, రెపోరేటు, రివర్స్ రెపో, సీఆర్‌ఆర్, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, ద్రవ్య విధానం, విత్త విధానం, పారిశ్రామిక ఉత్పత్తి, పేదరికం, జనాభా, ప్రభుత్వాల సంక్షేమ రంగ కార్యక్రమాలు వంటి బేసిక్స్ అంశాల గురించి అధ్యయనం చేయడం తప్పనిసరి. ఎకానమీలో అడిగే ప్రశ్నలు తాజా పరిణామాలు, గణాంకాల ఆధారితంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ విభాగాన్ని పూర్తిగా కరెంట్ అఫైర్స్ కోణంలో ప్రిపేరవ్వాలి. గత రెండేళ్ల బడ్జెట్ ముఖ్యాంశాలు, తాజా ఎకనామిక్ సర్వే, దినపత్రికలు చదవడం.. ప్రిపరేషన్ పరంగా ఉపయోగడుతుంది. 

పథకాలు.. సమగ్ర అవగాహన : 
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రిపేరయ్యేప్పుడు.. సదరు పథకం లక్ష్యం, అమలుచేసే మంత్రిత్వ శాఖలు, నోడల్ ఎజెన్సీలు, ఒనగూరే ప్రయోజనాలు, అర్హులు, పథకం కిందకు రాని వారు..తదితర అంశాల గురించి తెలుసుకోవాలి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, జన్‌ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్, సంసద్ ఆదర్ష్ గ్రామ్ యోజన, డిజిటల్ ఇండియా, ప్రధానమంత్రి ముద్రా యోజన, సాయిల్ హెల్త్‌కార్డ్ సిస్టమ్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్, మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం తదితర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల గురించి తెలుసుకోవాలి. 

జాగ్రఫీ.. అన్ని కోణాల్లో..
ఇండియా, వరల్డ్ జాగ్రఫీపై అవగాహనకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని జాగ్రఫీ అంశాలను అన్ని కోణాల్లో చదవాలి. భూమి, కర్కట రేఖ, మకర రేఖ, టైమ్ జోన్స్, విశ్వం, వాతావరణం, ఖండాలు, సముద్రాలు, రుతువులు, ఎల్‌నినో, లానినో, భూకంపాలు, సునామీలు, తుఫానులు, కరువుకాటకాలు, వరదలు, తీరప్రాంతాలు, నదులు, సరస్సులు, అగ్నిపర్వతాలు, అడవులు, జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, మడ అడవులు, చిత్తడి నేలలు, గడ్డి భూములు, ఎడారులు, పర్వతాలు, దేశాలు, సరిహద్దులు, వివాదాస్పద ప్రాంతాలు, ఖనిజాలు-లభించే ప్రాంతాలు, నేలలు, భూ స్వరూపాలు, దీవులు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. 

కరెంట్ అఫైర్స్.. ముఖ్యమైనవి?
సివిల్స్ ఔత్సాహికులు న్యూస్‌ను న్యూస్‌గా చదవాలి. అలాకాకుండా పేపర్ మొత్తం చదవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా సమయం వృథా అవుతుంది. న్యూస్ పేపర్లలో ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉన్న అంశాలనే చదివి.. నోట్ చేసుకోవాలి. ఇటీవల దేవాలయాల్లో ‘మహిళల ప్రవేశం’ చర్చనీయాంశంగా మారింది. దీన్ని చదివేటప్పుడు.. వివాదానికి మూలం, భాగస్వామ్య పక్షాలు (స్టేక్ హోల్డర్లు); సుప్రీంకోర్టు తీర్పు (ఆర్టికల్ 14 ఆధారంగా), పరిష్కారం అనే కోణాల్లో దినపత్రికల్లో వచ్చే ఎడిటోరియల్ వ్యాసాలు చదవితే ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్, ఇంటర్వ్యూ పరంగానూ ఉపయోగపడుతుంది.

నోట్సు రాయాలా?
‘నోట్సు రాయడం’ అనేది అభ్యర్థి వ్యక్తిగత అంశంగా ఉంటుంది. కొత్త అంశాలను చదువుతున్నప్పుడు ప్రతిదీ కొత్తగానే అనిపిస్తుంది. అలా అని అన్నింటినీ నోట్ చేసుకుంటూ వెళ్లడం కూడా సాధ్యం కాదు. అంత సమయం అందుబాటులో ఉండదు. ఒక పుస్తకం చదువుతూ.. కీలకమైన పాయింట్స్ రాసుకుంటూ పోవాలి. దాన్ని పరీక్షకు ముందు ఒకటికి రెండుసార్లు రివిజన్ చేసుకోవచ్చు. వాస్తవానికి నోట్సులో ముఖ్యమైన, గుర్తుండవని భావించే అంశాలను రాసుకోవాలి. ఈ విషయం కొంత అధ్యయనం తర్వాతే తెలుస్తుంది. ముఖ్యంగా సివిల్స్ పరీక్షకు ప్రిపేరయ్యేవారు అధ్యయనంతోపాటు ప్రాక్టీస్‌ను సమాంతరంగా సాగించాలి.

కరెంట్ అఫైర్స్ ఆధారితం : పరీక్షలో కీలక విభాగాలైన సైన్సు అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్‌లో అడిగే ప్రశ్నలు ఎక్కువగా కరెంట్ అఫైర్స్ ఆధారితంగా ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ పరంగా వార్తా పత్రికలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సివిల్స్‌లో స్టాటిక్ పార్ట్ కంటే తాజా గణాంకాలపై (ఫ్యాక్ట్స్)పై అధికంగా ప్రశ్నలు అడుగుతున్నారు. అభ్యర్థులు దీన్ని గుర్తించాలి. పరీక్షకు మూడు నెలల ముందు నుంచి పూర్తిగా ప్రిలిమ్స్‌పైనే దృష్టిపెట్టాలి. రోజూ 8-13 గంటల సమయాన్ని ప్రిపరేషన్‌కు, రివిజన్‌కు కేటాయించగలిగితే మంచి ఫలితాలు సాధించొచ్చు. ప్రిలిమ్స్ అభ్యర్థులు టెస్టు సిరీస్‌లకు హాజరవడం ద్వారా తమ ప్రిపరేషన్ స్థాయిని మెరుగుపరచుకోవచ్చు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...