Saturday, August 3, 2013

2013 సివిల్స్ ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల ||

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌‌ర్వీస్ క‌మిష‌న్ సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష - 2013 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. సివిల్ స‌ర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేష‌న్‌, ఇండియ‌న్ ఫారెస్టు స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్‌కు ఎంపికైన అభ్యర్థుల వివ‌రాల‌ను ఆగ‌స్టు 2న క‌మిష‌న్‌ వెబ్‌సైట్‌లో పొందుప‌రిచారు. మే 26న నిర్వహించిన ఈ ప‌రీక్షకు దేశ‌వ్యాప్తంగా సుమారు 10 ల‌క్షల మంది అభ్యర్థులు హాజ‌రయ్యారు. వీరిలో 10 వేల మంది డిసెంబ‌రులో జ‌రగనున్న మెయిన్స్ ప‌రీక్షకు అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 15 వేల మంది అభ్యర్థులు హాజ‌ర‌వ్వగా సుమారు 500 మంది మెయిన్స్‌కు అర్హత సాధించిన‌ట్లు అంచ‌నా. గ‌త ఏడాది కంటే ఈ సంఖ్య అధికంగానే ఉంద‌ని విశ్లేష‌కుల అభిప్రాయం. ఈ ఏడాది జ‌న‌ర‌ల్ కేట‌గిరీలో క‌టాఫ్ మార్కులు 218 వ‌ర‌కు ఉండ‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. కేట‌గిరీల‌వారీగా క‌టాఫ్ మార్కులు ఓబీసీ 200, ఎస్సీ 186, ఎస్టీ 185, పీహెచ్1 160, పీహెచ్‌2 164, పీహెచ్‌3 111 గా ఉన్నాయ‌ని అంచ‌నా. ఈసారి ఫ‌లితాలు త్వర‌గా వెలువ‌డ్డాయ‌ని, మెయిన్స్ ప్రిప‌రేష‌న్‌కు కావాల్సినంత‌ స‌మ‌యం ల‌భించింద‌ని నిపుణులు చెబుతున్నారు. సివిల్స్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ద్వారా ఇండియ‌న్ ఫారెస్టు స‌ర్వీస్ మెయిన్ ఎగ్జామినేష‌న్‌కు అభ్యర్థుల‌ను ఎంపిక చేసే విధానాన్ని ఈ ఏడాది కొత్తగా ప్రవేశ‌పెట్టారు. 


ఈనాడు సౌజన్యం తో...
Related Posts Plugin for WordPress, Blogger...