Saturday, December 8, 2018

తెలుగు తేజం రోణంకి గోపాలకృష్ణ విజయగాధ!!


కార్పొరేట్‌ స్కూల్‌ కాదు ప్రభుత్వ పాఠశాలలోనే ప్రాథమిక విద్యాభ్యాసం.. పాఠశాలకు బస్సులో కాదు నాలుగు కిలోమీటర్లు కాలినడకనే రోజూ రాకపోక... అమ్మానాన్న ఆర్థికంగా స్థితిమంతులు కాదు ఓ సాధారణ వ్యవసాయ కూలీలు... గ్రామంలో సామాజికంగా అనేక ఇబ్బందులు, అడుగడుగునా అడ్డంకులు... ఇవేవీ ఆయన లక్ష్యం ముందు దూదిపింజల్లా ఎగిరిపోయాయి! ప్రజలకు సేవ చేయడానికి ఉన్నతాధికారి కావాలనే దృఢ సంకల్పం ముందు అవన్నీ మంచుముక్కల్లా కరిగిపోయాయి! దేశంలోనే అత్యున్నతమైన సివిల్స్‌ సర్వీసు ఐఏఎస్‌ను రెండో ప్రయత్నంలోనే మూడో ర్యాంకుతో సాధించి సిక్కోలు సత్తా చాటాడు! అతనే పలాసకాశీబుగ్గ పట్టణానికి సమీపంలోని పారసంబ గ్రామానికి చెందిన రోణంకి గోపాలకృష్ణ. అంతేకాదు ఇప్పుడు అందరూ చిన్నచూపు చూస్తున్న మాతృభాష తెలుగుకు వన్నెలద్దాడు. తెలుగు మాధ్యమంలోనే చదివి... తెలుగు సాహిత్యాన్నే ఒక సబ్జెక్టుగా తీసుకొని సివిల్స్‌లో మేటి ర్యాంకరుగా నిలిచాడు. మాతృభూమికి, మాతృభాషకు, తల్లిదండ్రులకు గర్వంగా నిలిచిన ఆయన జీవిత విశేషాలు ఒక్కసారి చూస్తే...
తెలుగు మీడియం లో సివిల్స్ రాసి ఆలిండియా 3 వ రాంక్ సాధించిన రోణంకి గోపాలకృష్ణ

పలాసకాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పారసాంబ గోపాలకృష్ణ సొంత గ్రామం. రోణంకి అప్పారావు, రుక్మిణమ్మ దంపతుల రెండో సంతానం గోపాలకృష్ణ. వారి పెద్ద కుమారుడు కోదండరావు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎస్‌బీఐ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె ఊర్వశి డిగ్రీ చదివింది. గోపాలకృష్ణ స్వగ్రామంలోని ఎంపీపీ పాఠశాలలోనే ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బ్రాహ్మణతర్లా జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో చదువు పూర్తి చేసాడు. ఇంటర్మీడియెట్‌ పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పూర్తి చేశారు. 2006 సంవత్సరంలో టీటీసీ ర్యాంకు సాధించి పశ్చిమ గోదావరి జిల్లా దూబచర్ల డైట్‌లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు.
 వెంటనే డీఎస్సీ2007లో ప్రతిభ చూపించి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. తొలుత శిలగాం పాఠశాలలో పనిచేశారు. ప్రస్తుతం పలాస మండలం రేగులపాడు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. మరోవైపు విజయనగరంలోని మహారాజా కళాశాల నుంచి బీఎస్సీ (ఎంపీసీ) దూరవిద్య విధానంలో పూర్తి చేశారు.

కుటుంబం అండగా....
గోపాలకృష్ణ కుటుంబం పాతికేళ్లుగా గ్రామంలో సామాజికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వాటన్నింటినీ అధిగమిస్తూనే అప్పారావు దంపతులు తమకున్న అర ఎకరం భూమితో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ముగ్గురు పిల్లలను అనేక కష్టాలకోర్చి చదివించారు. తమ తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలన్నా, సమాజంలో అలాంటివారికి అండగా ఉండాలన్నా గ్రూప్‌1 అధికారి కావాలనేదీ గోపాలకృష్ణ లక్ష్యం. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితుల వల్ల ఆయన దృష్టి సివిల్స్‌పైకి మళ్లింది. అలాంటి దృఢ సంకల్పం ఉండటం వల్లే పదేళ్ల వయస్సులోనే బ్రాహ్మణతర్లా గ్రామంలోని హైస్కూల్‌కు రానుపోను నాలుగు కిలోమీటర్లు కాలినడకనే వెళ్లివచ్చేవారు. ఐదేళ్లు అదే ప్రయాణం. వర్షాకాలంలో గెడ్డలు పొంగింతే తండ్రి భుజాలను పట్టుకొని మరీ పాఠశాలకు వెళ్లేవారు. 19 ఏళ్లకే ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చినా మరో పదేళ్ల పాటు తన కృషిని కొనసాగించి సివిల్స్‌లో 3వ ర్యాంకును గోపాలకృష్ణ సొంతం చేసుకున్నారు. ఆయన విజయంతో పారసాంబ గ్రామంలో సందడి నెలకొంది. కుటుంబం, బంధువులు, స్నేహితుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


విద్యాభ్యాసం...
ప్రాథమిక విద్య: ఎంపీపీ పాఠశాల, పారసాంబ, పలాస మండలం

ఉన్నత విద్య: జడ్పీ హైస్కూల్, బ్రాహ్మణతర్ల, పలాస మండలం

ఇంటర్మీడియెట్‌ : గవర్నమెంట్‌ జూనియర్‌ కళాశాల, పలాస

డిగ్రీ (బీఎస్సీ): మహరాజా కళాశాల, విజయనగరం (దూరవిద్య)


విజయాల పరంపర...

టీటీసీ(2006): డైట్, దూబచర్ల, పశ్చిమ గోదావరి జిల్లా

డీఎస్సీ (2007): ఉపాధ్యాయుడిగా ఎంపిక. రేగులపాడు ఎంపీపీ స్కూల్‌లో ఉద్యోగం

గ్రూప్‌1 (2011): మెయిన్స్‌లో ఉత్తీర్ణులై ఇంటర్వూ్య వరకూ వెళ్లారు. రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన ఇబ్బందుల వల్ల ఆ ఫలితాలు ఆగిపోయాయి.

సివిల్స్‌ (2014): గ్రూప్‌1 వదిలేసి సివిల్స్‌ వైపు దృష్టి. హైదరాబాద్‌లో కోచింగ్‌

సివిల్స్‌ (2015): ప్రిలిమినరీ దశలోనే ఆటంకం. తొలి ప్రయత్నం విఫలం

సివిల్స్‌ (2016): ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వూ్య దిగ్విజయంగా దాటుకొని దేశంలోనే 3వ ర్యాంకుతో విజయం


న్యాయం కోసం పోరాడాలి

‘‘ప్రస్తుత రోజుల్లో అన్యాయాలు, అక్రమాలు అధికంగా జరుగుతున్నాయి. వీటిపైన మా కుమారుడు కలెక్టర్‌ హోదాలో ప్రజలకు న్యాయం చేస్తాడనే నమ్మకం ఉంది. మా గ్రామంలోనే గ్రామ కంఠాలు ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇటువంటివి  అరికట్టాలి. పేద ప్రజలకు నా కొడుకు సేవలందించాలి. అదే మాకు గర్వకారణం.’’

రోణంకి అప్పారావు, రుక్మిణమ్మ దంపతులు


19 comments:

  1. Sir....I want to meet you.i am very poor student.i am preparing for tspsc.i would like to prepare for civilian telugu mediam so I want your guidance sir

    ReplyDelete
  2. Can I get your phone number becaues i am a Telugu medium student but I am in intrested in civils plese give me a chance to talk with you

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...