Friday, December 30, 2011

జనరల్ స్టడీస్ : పుస్తకాలు

జనరల్‌ స్టడీస్‌..ఈ పేరు, పేపర్‌ పలు విద్యాఉద్యోగ పరీక్షల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. సివిల్స్‌, గ్రూప్స్‌, జూనియర్‌ లెక్చరర్స్‌, ఎస్సై, కానిస్టేబుల్స్‌...ఇలా అనేక పరీక్షల్లో అభ్యర్థులు రాయాల్సిన కామన్‌ పేపర్‌ జనరల్‌ స్టడీస్‌. ఇందులో ఏ..ఏ..అంశాలు వస్తాయి. దీని పరిధి ఏంటి ! సివిల్స్‌కు, కానిస్టేబుల్స్‌కు ఒకే విధంగా ప్రిపేరవ్వాలా ! వంటి సందేహాలను తీర్చడానికి
ఇక్కడ అనేక విషయాలు ఇస్తున్నాం...
ఏ పోటీ పరీక్ష పరీక్షకైనా విద్యార్థి సిద్ధమవ్వాలంటే...మూడంచెలను పాటించాలి. 
1.సిలబస్‌ను చదివి, సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. 
2.పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి, అడిగిన తీరును అవగాహన చేసుకోవాలి. 3.సిలబస్‌లోని అన్ని జనరల్‌ ఏరియాస్‌ చదవటంతోపాటు పరీక్షలో రావటానికి అవకాశమున్న ధోరణులపై (పూర్వ ప్రశ్నల ఆధారంతో) దృష్టి పెట్టాలి.
------------------------------- @@@@@ ---------------------------

సివిల్స్‌కైనా, కానిస్టేబుల్‌ పరీక్షకైనా ఇదే విధానం వర్తిస్తుంది. కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. ముందుగా జనరల్‌ స్టడీస్‌లో ఏ విషయాలు వస్తాయి. వాటని ఎలా అధ్యయనం చేయాలన్నది తెలుసుందాం.
ఇందులో వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జ్‌, భారతదేశ చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ-పాలన, జనరల్‌ సైన్స్‌, సాంఘిక ఆర్థికాభివృద్ధి, భారత, ప్రపంచ భౌగోళిక పరిస్థితులు...వీటన్నింటినీ చదివి, అర్థం చేసుకొని, ప్రతీదాంట్లో ప్రావీణ్యం సాధించటం ఎవరికైనా అసాధ్యం. మరేం చేయాలి ! తార్కికంగా చూసినా ఉన్న మార్గం - ట్రెండ్స్‌కు గుర్తించి, అనుసరించటమే. అయితే అసలైన సమస్య ఇక్కడే ఉంది. ఇతర పోటీ పరీక్షల మాదిరి సివిల్స్‌, గ్రూప్స్‌లో జనరల్‌ స్టడీస్‌ ప్రశ్నలను ఊహించటం కష్టమే. అంటే గతానుభవాల ఆధారంగా భవిష్యత్తులో ప్రశ్నలను ఊహించలేం.
ముఖ్యంగా మన జ్ఞాపకశక్తిని పరీక్షించే విధంగా కొన్ని ప్రశ్నల్ని సెట్‌ చేస్తారు. రీజనింగ్‌ విభాగమూ ఉంటుంది. అంటే వీటిని ముందుగా అర్థం చేసుకోవటం కష్టం. పేపర్‌ సెట్‌ చేసిన వారి ఉద్దేశం...సమాధానాన్ని కనిపెట్టడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోవాలనే ఎత్తుగడ. ముఖ్యంగా ఈ తరహా సివిల్స్‌, గ్రూప్స్‌లో కనిపిస్తుంది. ఇక కానిస్టేబుల్స్‌, విఆర్‌ఓ, విఆర్‌ఎ, గ్రూప్‌-డి స్థాయి ఉద్యోగాల్లో జనరల్‌ స్టడీస్‌ పదో తరగతి స్థాయిలోనే ఉంటుంది.
భారత జాతీయోద్యమం, భారత రాజ్యాంగ వ్యవస్థ, సాంఘికార్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టితో ప్రాథమిక ఆర్థిక అవగాహన, భూగోళవ్యవస్థ....మొదలైనవి అందరూ చదవాల్సిన అంశాలు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులు ఈ విషయాల్లో చాలా లోతుగా అధ్యయనం చేయాలి. ఇక ట్రెండ్స్‌ విషయానికొస్తే...వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జ్‌, వీటికి తగిన నిర్వచనం ఇవ్వలేం. సిలబస్‌ అంటూ పేర్కొనలేం. గత సంవత్సరకాలంగా జరిగిన వర్తమాన వ్యవహారాలు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రకటించిన పథకాలు, పేరొందిన పథకాలు, వివిధ నివేదికలు, వాటి ప్రస్తావనలు, కమిషన్లు, దేశంలోని జరిగిన ముఖ్య సంఘటనలు...ఇలాంటివెన్నో. దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన విషయాల్ని నోట్‌ చేసుకుంటే సరిపోతుంది. ఈ విభాగంలో మనం ఎంత సాధిస్తే అంత మంచిది. మంచి స్కోరింగ్‌కు అవకాశముంది. మోడల్‌ పేపర్లు సాధన చేస్తే అవగాహన వస్తుంది. గ్రిప్‌ దొరుకుతుంది.

------------------------------ @@@@@@@@ --------------------------

సివిల్స్‌, గ్రూప్స్‌కు సిద్ధమయ్యేవాళ్లు, తెలుగు మీడియం విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయి.
అవి...
  • ఎన్‌సిఈఆర్‌టి ప్రాథమిక పుస్తకాలు, 
  • తెలుగు అకాడమీ ప్రచురణలు, 
  • హ్యుమానిటీస్‌ (ఇండియన్‌ పాలిటీ, సోషియాలజీ)లలో అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఎ. పుస్తకాలు, 
  • తెలుగు, ఆంగ్ల వార్తపత్రికలు, 
  • పబ్లికేషన్స్‌ డివిజన్‌ 'ఇండియా ఇయర్‌బుక్‌', 
  • తెలుగు, ఇంగ్లీష్‌లలో ప్రచురితమయ్యే 'యోజన'.
తెలుగు మీడియం నేపథ్యమున్నవారు మరీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్‌ అంశాలతో తేలిగ్గా పరిచయం పెంచుకోవచ్చు. ముఖ్యంగా సివిల్స్‌ పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2లో కొన్ని విషయాలపై ప్రశ్నలుంటున్నాయి. అవి... 
  • కాంప్రహెన్షన్‌, 
  • ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌, 
  • కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, 
  • లాజికల్‌ రీజనింగ్‌, 
  • అనలిటికల్‌ ఎబిలిటి, 
  • డెసిషన్‌ మేకింగ్‌, 
  • ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, 
  • జనరల్‌ మెంటల్‌ ఎబిలిటి, 
  • బేసిక్‌ న్యూమరసీ (పదో తరగతి స్థాయి), 
  • ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌ ( పదో తరగతి స్థాయి).
గత ఏడాది కాంప్రహెన్షన్‌ విభాగం నుంచి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఇది కొనసాగుతుంది. క్లిష్టత స్థాయి కూడా యధావిధిగా ఉంటుంది. గణితంలో ప్రశ్నల సంఖ్య అలాగే ఉండొచ్చు. కానీ క్లిష్టత స్థాయి పెరగవచ్చు. డెసిషన్‌ మేకింగ్‌లో ప్రశ్నలు కూడా పెరిగే అవకాశముంది. పూర్తిగా పరిణామశీల అంశాలతో కూడి వుంటుంది. అంటే ఇప్పటి పరిస్థితులతో అప్లై చేసి అడుగుతారు. ఈ పేపర్లో మంచి స్కోరింగ్‌ చేయాలంటే...కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇందులో అడిగే అంశాలన్నింటిలో పట్టు సాధించటం సాధ్యం కాదు. అందుకని గరిష్ట మార్కులు సాధ్యమయ్యే అంశాలను ఎంచుకోవటం మేలు. ప్రస్తుత తరుణంలో సాంప్రదాయకంగా స్కోరింగ్‌గా ఉన్న అంశాలను పరిష్టపరుచుకోవడం మంచింది. ఈ సూత్రం అన్ని రకాల పరీక్షలు రాసే అభ్యర్థులకు వర్తిస్తుంది. దీనివల్ల మన ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. మన సమయాన్ని, శక్తిని వృధా చేసే వాటి నుంచి తప్పుకోవటం తెలివైన పని. లక్ష్యసాధనకు సులువైన పని.
క్వాంటిటేటివ్‌ విభాగంలో సంఖ్యలను అర్థం చేసుకోవటం జాతీయ స్థాయి పరీక్షల్లో కొంచెం కష్టమే. వీటి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అభ్యర్థులు సాధనతో ఈ కష్టమైన అంశాన్ని సలభతరం చేసుకోవచ్చు. ఈ విభాగాన్ని సెట్‌ చేయడం వెనుకున్న ఉద్దేశం...అభ్యర్థి సమయాన్ని హరించటమే. సరైన సాధన ఉంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. వీలైనంత ఎక్కువ స్కోరింగ్‌ చేస్తే విజయానికి దగ్గరవుతాం. ఇంగ్లీష్‌పై పట్టులేనివారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి పదో తరగతి లోపే ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందొద్దు. అలాగే సిలబస్‌లో లేని అంశాలపై లోతైన అధ్యయనం చేయటం వృధా. మన ప్రిపరేషన్‌ క్లిష్టంగా మారుతుంది.
అభ్యర్థులకు ఉపయోగపడే పుస్తకాలు : 
  • ఆర్థమెటిక్‌లో ప్రాథమిక పుస్తకాలు. 
  • మౌలిక విషయాలు తెలిపే ఇంగ్లీష్‌ బుక్స్‌, 
  • ఇగ్నో ప్రచురించిన ఫంక్షనల్‌ ఇంగ్లీష్‌ పుస్తకాలు, 
  • బ్యాంకింగ్‌ పరీక్షల పాత మోడల్‌ పేపర్లు, 
  • ఇంగ్లీష-తెలుగు నిఘంటువు.
ఏ ఉద్యోగ పరీక్ష అయినా అడిగే విధానం ఒకేవిధంగా ఉంటుంది. కానీ ప్రశ్నల స్థాయి వేరు వేరుగా ఉంటుంది. సమయ నిర్వహణపై సాధన లేకుండా ప్రశ్నలను ఎదుర్కొనలేం. కాబట్టి మోడల్‌ పేపర్లు సాధన చేయాలి. తద్వారా సబ్జెక్‌పై, ప్రశ్నలపై అవగాహన ఏర్పడుతుంది. మనం ఇంకా ఎలా సిద్ధమవ్వాలి అన్నది తెలుస్తుంది.
 
ALL THE BEST

Sunday, December 25, 2011

క్విట్ ఇండియా ఉద్యమం.

జనరల్ స్టడీస్
ఉద్యమ సమీక్ష: ఉద్యమ పరమోద్దేశ్యమైన పూర్ణ స్వరాజ్‌ను ఉద్యమం సాధించలేకపోయింది.
1.
ఉద్యమ గమనం కొన్ని ప్రతికూల ఫలితాలకు దారితీసింది. ఉద్యమ వైఫల్యం ముఖ్యంగా కార్మిక కర్షక వర్గాలను గొప్పగా నిరాశపరిచింది. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన ఈ వర్గాలు ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం ప్రయత్నించాయి. ఫలితంగానే రైతాంగం కేవలం తనదైన అఖిల భారత కిసాన్ మహాసభను ఏర్పరుచుకోగలిగింది.
2.
కార్మిక వర్గాలలోను కాంగ్రెస్ పట్ల నిరాసక్తత ఉద్యమ వైఫల్యంవల్ల చోటు చేసుకుంది. కార్మిక సంస్థలు ముఖ్యంగా ట్రేడ్ యూనియన్లపై కాంగ్రెస్ తన పట్టును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఉద్యమ వైఫల్యం వల్ల ఎఐటియుసిలో కాంగ్రెస్ స్థానంలో కమ్యూనిస్టులు బలపడ్డారు.
సహాయ నిరాకరణోద్యమం వైఫల్యం ఏవిధంగానైతే స్వరాజ్ పార్టీ ఆవిర్భావానికి దారి తీసిందో శాసనోల్లంఘటన ఉద్యమ వైఫల్యం కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఆవిర్భావానికి కారణమైంది. ఉద్యమ వైఫల్యంతో అసంతృప్తి చెందిన కాంగ్రెస్ వాదులు ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్ నారాయణ్, అచ్యుత పట్వర్ధన్ మరియు అరుణా అసఫలీలు 1934 బాంబే సమావేశంలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని స్థాపించారు.
ఉద్యమం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయినప్పటికీ ప్రతికూల ఫలితాలనిచ్చినప్పటికీ కొంతమేరకు చెప్పుకోదగ్గ విజయాలను సాధించింది.
ఉద్యమంతో కాంగ్రెస్ పార్టీ ఒక పరిపూర్ణ ప్రజా విప్లవ సంస్థగా అవతరించింది. ఉద్యమంతో కాంగ్రెస్ పార్టీ పంథాలోనే స్పష్టమైన మార్పు చోటుచేసుకుంది. స్వయం పరిపాలన, స్వదేశీ స్థానంలో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యానికి పిలుపునిచ్చింది.
ఉద్యమంలో సహాయ నిరాకరణకు బదులు శాసనోల్లంఘనచోటుచేసుకోవడంతో కాంగ్రెస్ పోరాట పంథాలోనే స్పష్టమైన మార్పు చోటుచేసుకుంది.
స్వదేశీ వనరులు, స్థానికులకు ఉపకరించాలనే వాదాన్ని ఉద్యమం సమర్ధవంతంగా తమ ఉప్పు సత్యాగ్రహాలలో చాటి చెప్పగలిగింది. స్వాతంత్రోద్యమంలో మొట్టమొదటిసారిగా స్ర్తిలు చైతన్యవంతమైన పాత్రను పోషించడానికి మరియు ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి ఉద్యమం తోడ్పడింది. స్వాతంత్రోద్యమ భావాలు సరిహద్దు ప్రాంతాలైన ఆఫ్గనిస్తాన్‌లోకి ప్రవేశించడానికి కూడా ఉద్యమమే కారణమైంది.
ఉద్యమం తన తక్షణాశయాలను సాధించడంలో విఫలమైనప్పటికీ ఒక దశానుక్రమంగా మరియు క్రమానుగతంగా కాంగ్రెస్ బలపడడానికి తోడ్పడిందని చెప్పవచ్చు.
క్విట్ ఇండియా ఉద్యమం
స్వాతంత్రోద్యమంలో చిట్టచివరి ఉద్యముమ. గొప్ప విశిష్టతను సంతరించుకున్నది. పోరాటంలో నాయకత్వం లేని ఉద్యమంగా ఇది ప్రారంభమైంది. అహింసా వాదియైన గాంధీ ఒక అరాచక వాదిగా మారడానికి ఉద్యమం కారణమైంది.
ఉద్యమానికి దారి తీసిన కారణాలు: ఉద్యమానికి దారి తీసిన పరిస్థితులు 2 ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ముడిపడి ఉన్నాయి. 1939లో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాలతో సంప్రదించకుండానే గవర్నర్ జనరల్ లిన్ లిత్‌గో భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వామురాలిగా చేస్తూ ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యాయి. రాజకీయాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. యుద్ధ నేపథ్యంలో ప్రభుత్వానికి సహకరించినందుకుగాను ఏమి ప్రతిఫలంగా ఇవ్వబోతున్నారో చెప్పకుండానే భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వాములు చేయడం,పైగా అత్యంత కీలక రక్షణ శాఖను భారతీయులకు ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర అభ్యంతరకరమైంది.
1940
ఆగస్టు ప్రతిపాదనల్లో గవర్నర్ జనరల్ లిన్‌లిత్‌గో రక్షణ శాఖ తప్పించి మిగిలిన శాఖలను ఇవ్వడానికి అంగీకరించడం, యుద్ధానంతరం అధినివేశ ప్రతిపత్తి కల్పించడానికి మరియు రాజ్యాంగ నిర్మాణ సమితి ఏర్పాటు చేస్తామని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీని నిరాశపరచడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనలను తిరస్కరించింది. భారత రాజకీయాలలో నెలకొని ఉన్న పరిస్థితి గాంధీకి ఒక నైతిక సమస్యగా పరిణమించింది. తనను తాను రక్షించుకోలేని ఇంగ్లండ్ కనీసం భారతదేశాన్ని రక్షించుకునే బాధ్యతను భారతీయులకు ఇవ్వకపోవడం గాంధీని కలవరపరిచింది. ఈ స్థితిలో గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సామ్రాజ్య వాదము గణనీయంగా విస్తరించింది. ఆసియాలో ఇంగ్లండ్ వలసలైన ఇండోనేషియా, మలయా ద్వీపములు మరియు సింగపూర్‌ను జపాన్ ఆక్రమించింది. భారతదేశం కూడా బ్రిటిష్ వారి వలస కనుక దాడి తప్పదని హెచ్చరించింది. పైగా విశాఖపట్నం రేవు పట్టణాలపై దాడికి పాల్పడింది. జపాన్ దురాక్రమణ జరిగితే భారతదేశ పరిస్థితి ఏమవుతుందో అనేది కాంగ్రెస్‌కు సమస్యగా పరిణమించింది.
1942
మార్చి 24న వచ్చిన క్రిప్స్ రాయబారము భారతీయ నాయకత్వాన్ని నిరాశపరిచింది. 1940 ఆగస్టు ప్రతిపాదనల్ని పునరుద్ఘాటించిన క్రిప్స్ సమస్యలను మరింత క్లిష్టతరం చేస్తూ మైనారిటీ ముస్లింలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికార ముందని ప్రకటించాడు. పరోక్షంగా పాకిస్తాన్ అన్న ఆలోచనకు మద్దతు పలికాడు. తీవ్ర నిరాశకు గురైన గాంధీ ప్రతిపాదనలను దివాళా తీసిన బ్యాంకు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్స్‌గా విమర్శించాడు. పరిష్కార మార్గంగా ఉద్యమానికి సిద్ధమైనాడు.
ఉద్యమానికి ఇతర కారణాలు కూడా తోడ్పడ్డాయి.
1.
ప్రపంచ యుద్ధం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. కార్మిక వర్గాల్లో అశాంతి నెలకొన్నది
2.
యుద్ధ సమయంలో అధికార రహస్యాల చట్టాన్ని ప్రయోగించి మానవ హక్కులు హరించివేయబడ్డాయి.



 

సివిల్స్ సందేహాలు - సమాధానాలు

దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేసినవాళ్లు సివిల్స్ రాయడానికి అర్హులేనా?

దూరవిద్యలో చదివినవాళ్లు కూడా సివిల్స్ పరీక్షలు రాసుకోవచ్చు. దూర విద్యలో డిగ్రీతో సివిల్స్ రాసి విజయం సాధించిన వాళ్లూ ఉన్నారు.

ప్రస్తుతం ఫైనల్ ఇయర్ బీఏ చదువుతున్నాను. సివిల్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చా?
ఏ కోర్సు చదువుతున్నప్పటికీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ పరీక్ష ఫలితాలు ఆగస్ట్ 2011లోగా వస్తే సరిపోతుంది. 

ఇంతకుముందు సివిల్స్‌కు దరఖాస్తు చేసుకున్నాను. ఒక అటెంప్ట్ పోయినట్లేనా?
సివిల్స్‌కి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రిలిమినరీ పరీక్ష రాయకపోతే మీ అటెంప్ట్ వృథా కాదు. అయితే, ప్రిలిమినరీ రెండు పేపర్లలో ఒక పరీక్షకు హాజరైనా మీరు ఒక ప్రయత్నం కోల్పోయినట్లే.

దరఖాస్తు నింపేటప్పుడు తీసుకోవాల్సినజాగ్రత్తలు?
పుట్టిన తేదీ సరిగా రాయాలి. ఎందుకంటే.. ఒకసారి మీ పుట్టిన తేదీని యూపీఎస్‌సీ దరఖాస్తులో పే ర్కొంటే అది ఎప్పటికీ మారదు. మీరు యూపీఎస్‌సీ నిర్వహించే ఏ పరీక్ష రాసినప్పటికీ మొదటిసారి మీరిచ్చిన పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకుంటుంది. 


ప్రిలిమినరీ దరఖాస్తులో రాసిన మెయిన్స్ ఆప్షనల్స్ మార్చుకునే అవకాశం ఉందా?
ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్త్తు చేసుకున్నప్పుడు మెయిన్స్ ఆప్షనల్ గురించి దరఖాస్తులో అడుగుతారు. వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వాళ్లు ప్రత్యేకంగా మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీ ఆప్షనల్ సబ్జెక్టులు ఎంచుకోవాలి. ప్రస్తుతం మీరు ఆప్షనల్‌గా ఏవి ఎంచుకున్నప్పటికీ మార్చుకోవచ్చు. 

డిగ్రీ పూర్తిచేశాను. సివిల్స్ రాయాలని ఉంది. పరిమిత అటెంప్ట్‌ల దృష్ట్యా నేనెప్పటి నుంచి సివిల్స్‌కు సిద్ధం కావాలి?
డిగ్రీ పూర్తికాగానే స్పష్టమైన నిర్ణయానికి రావడం సంతోషకరం. ఇప్పటి వరకు మీరు సివిల్స్‌కోసం ప్రిపేర్ కానట్టైతే ఈ ప్రయత్నాన్ని వదులుకొని వచ్చే సంవత్సరం నుంచి విరామం లేకుండా సివిల్స్ రాయడం శ్రేయస్కరం. వచ్చే సంవత్సరం జూన్‌లో ప్రిలిమ్స్ పరీక్ష రాస్తారనుకుంటే మధ్యలో 15 నెలల వ్యవధి ఉంటుంది. ఇందులో మొదటి ఆరు నెలలు ప్రిలిమ్స్, జనరల్ స్టడీస్‌పై పూర్తి దృష్టి సారించాలి. ప్రాథమికాంశాలపై పట్టుసాధించాలి. విషయ, సమాచార పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. దీనికోసం 6 నుంచి పదో తరగతి వరకు సీబీఎస్‌ఈ మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్ పుస్తకాలు క్షుణ్నంగా చదువుకోవాలి. ఆ తర్వాత సీబీఎస్‌ఈ 11, 12 తరగతుల జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ పుస్తకాలు తిరగేస్తే ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌లో జనరల్ స్టడీస్ సిలబస్ మొత్తం పూర్తిచేసినట్లే. 

వీటితోపాటు ఇండియా ఇయర్ బుక్ పబ్లికేషన్స్ డివిజన్ పుస్తకం, హిందూ పత్రికతోపాటు, ఫ్రంట్‌లైన్, యోజన, కురుక్షేత్ర లాంటి మ్యాగజీన్లు చదవడం, రాత్రి 9:15 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లిష్ వార్తలు, ఆ తర్వాత ప్రసారమయ్యే స్పాట్‌లైట్ కార్యక్రమం వినడం చేయాలి. తర్వాత ఆరు నెలల్లో అభిరుచి ఉన్న రెండు సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకొని వాటికోసం పూర్తిగా చదవాలి. ఆఖరు మూడు నెలలు మళ్లీ ప్రిలిమ్స్ కోసం ప్రిపరేషన్, రివిజన్ ప్లాన్ చేసుకుంటే మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించొచ్చు. పరీక్ష విధానం, ప్రశ్నల సరళిపై అవగాహన కోసం పాత ప్రశ్నపత్రాలు (గత ఐదేళ్లవి) బాగా పరిశీలించాలి. అర్హత ఉందికదా అని ప్రిపరేషన్ లేకుండా పరీక్ష రాయడం వృథా. పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఏడాది ప్రిపరేషన్‌తో విరామం లేకుండా సివిల్స్ రాయడమే శ్రేయస్కరం.

ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్నాను. నా లక్ష్యం ఐఏఎస్ కావడం. నేను ఎలాంటి ప్రణాళిక రూపొందిచుకోవాలి?
సివిల్స్ సాధించాలనుకునే అభ్యర్థికి విస్తృత పరిజ్ఞానం అవసరం. ఏదో ఒక అంశం లేదా సబ్జెక్టులో ప్రావీణ్యం ఉంటే సరిపోదు. అన్ని సబ్జెక్టులు/విషయాల్లో ప్రాథమిక సమాచారం తెలుసుకోవాలి. విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. తర్కం, హేతుబద్ధత, విశ్లేషణ మెరుగు పరుచుకోవాలి. ఎందుకు? ఎలా? అని ఆలోచిస్తే తర్కం అలవడుతుంది. సమాచారం సేకరించడం, విసృ్తతంగా చదవడం, ఏదైనా ఒక అంశంలో భిన్న వాదనలు వినడం/చదవడం ద్వారా హేతుబద్ధత, విశ్లేషణ, భావాల్లో పరిణతి అలవడుతాయి. మీ కాలేజీలో నిర్వహించే వక్తృత్వం, వ్యాసరచన.. లాంటి పోటీల్లో పాల్గొనండి. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్, సెమినార్లు...లాంటివాటిలో పాల్గొనడం ద్వారా ఎక్స్‌పోజర్ వస్తుంది. మీ ఇంజనీరింగ్ బ్రాంచ్‌నే ఒక ఆప్షనల్‌గా భావించి బాగా చదవండి. ఇలాచేస్తే మీరు అకడమిక్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండడమే కాకుండా సివిల్స్ రాసేసమయానికి ఒక ఆప్షనల్‌కు పూర్తిస్థాయిలో సిద్ధమైనట్లవుతుంది. సీబీఎస్‌ఈ హైస్కూలు పుస్తకాలు చదవడం, ఇంగ్లిష్ పేపర్ ప్రతిరోజూ చదవడం..ఇలా చేస్తే సివిల్స్ కోసం 50 శాతం ప్రిపరేషన్ పూరె్తైనట్లే. 

నేను బీసీ విద్యార్థిని. సివిల్స్ ఎన్నిసార్లు రాయొచ్చు? వయోపరిమితి?  
తల్లిదండ్రుల వార్షికాదాయం తక్కువగా ఉన్న బీసీలంతా ఓబీసీ కేటగిరీలోకి వస్తారు. కాబట్టి మీరు ఏడు సార్లు సివిల్స్ రాసుకోవచ్చు. పరీక్ష రాసే సంవత్సరం ఆగస్ట్ 1 నాటికి వయోపరిమితి 21-30 మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితికి లోబడి ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లైనా, ఓసీ అభ్యర్థులు నాలుగు సార్లు సివిల్స్ రాసే అవకాశం ఉంది. 

తెలుగులో రాయాలంటే అనుకూలతలు, ప్రతికూలతలు, ఏ విధంగా సిద్ధం కావాలి?
సివిల్స్ తెలుగులోనూ రాయొచ్చు. ఇలా రాసి విజయం సాధించినవాళ్లు కూడా ఉన్నారు. కాకపోతే అన్ని ఆప్షనల్ సబ్జెక్టులకూ తెలుగులో విసృ్తత స్థాయిలో మెటీరియల్ ఇంతకుముందు అందుబాటులో లేదు ప్రస్తుతం దొరుకుతున్నాయి. తెలుగులో రాయాలనుకున్నవాళ్లంతా ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా తెలుగు సాహిత్యం ఎంపికచేసుకోవాలి. 

రెండో ఆప్షనల్ విషయంలో హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్, సోషియాలజీ లాంటివి ఎంచుకుంటే మంచిది. ఏదైనా సబ్జెక్టులో మంచి పరిజ్ఞానం ఉందనుకుంటే ఇంగ్లిష్‌లో ఉన్న సమాచారాన్ని తెలుగులో నోట్సుగా సిద్ధం చేసుకునే సమర్థత ఉంటే దాన్ని కూడా ఆప్షనల్‌గా తీసుకోవచ్చు. 

మీ భావాలు ఏ భాషలో బాగా వ్యక్తీకరించగలరో ఆ భాషనే మాధ్యమంగా ఎంచుకోవాలి. ఇంగ్లిష్‌లో అన్ని ఆప్షనల్స్‌కూ విసృ్లత సమాచారం ఉంది. కానీ ఆ భాషపై ప్రాథమిక పట్టు లేకపోతే మెయిన్స్‌లో కష్టమే.

పాత ప్రశ్నపత్రాలు ఎక్కడ లభిస్తాయి?
చాలా వెబ్‌సైట్లలో పాత ప్రశ్నపత్రాలు లభిస్తాయి. గూగుల్‌లో సెర్చ్ చేస్తే కావాల్సినంత సమాచారం దొరుకుతుంది. http://upscportal.com, www.civilserviceindia.com

కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి? ఎంత ఖర్చుఅవుతుంది?
డబ్బు సమస్య కాకుంటే ఢిల్లీలో కోచింగ్ తీసుకోవచ్చు. వాజీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్, రావూస్...ఢిల్లీలో పేరున్న కోచింగ్ సెంటర్లు. ఢిల్లీ తర్వాత దేశంలో సివిల్స్ కోచింగ్‌లో హైదరాబాద్ రెండోస్థానంగా చెప్పుకోవచ్చు. ఆర్‌సీరెడ్డి, బ్రెయిన్ ట్రీ కోచింగ్ సెంటర్ల నుంచి ఏటా పదుల సంఖ్యలో అభ్యర్థులు ఎంపికవుతున్నారు. హైదరాబాద్‌లో ఐతే ప్రిలిమ్స్, మెయిన్స్ జనరల్ స్టడీస్; ఆప్షనల్ కోచింగ్, రిఫరెన్స్ పుస్తకాలు మొత్తం కలిపి ఎనభై వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. హాస్టల్ కోసం నెలకు రూ. 3 వేలు తప్పనిసరి. గది అద్దెకు తీసుకొని చదువుకోవాలంటే రూ. 5 వేలు ఆపైన ఖర్చవుతుంది. ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటే అదనంగా మరో 30-40 శాతం ఎక్కువ ఖర్చవుతుంది.

Saturday, December 24, 2011

మీడియం తో నిమిత్తం లేకుండా సివిల్స్ 2012 సాధించండిలా .!


సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఈ పేరు వింటేనే కొంతమంది ఓ బ్రహ్మ పదార్థంగా.. మేధావులకే పరిమితమైందిగా భావిస్తారు. మెట్రోపాలిటన్ నగరాలు, ఇంగ్లిష్ మీడియం నేపథ్యంతోనే విజయం సాధ్యం అనే అభిప్రాయం (అపోహ) తో ఉంటారు. అయితే ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు. సివిల్స్ విజయానికి కావల్సింది అకడెమిక్, ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్ కాదు. సాధించాలనే ‘విల్’ పవర్. సివిల్స్-2012 నోటిఫికేషన్ ఫిబ్రవరిలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ పరీక్ష విధి విధానాలు, అభ్యర్థుల అనుమానాలపై విశ్లేషణలతో పరీక్షకు సన్నద్ధం చేసేలా నిపుణుల సలహాలు..

దేశంలోనే అత్యున్నత సర్వీసులుగా పేర్కొనే ఐఏఎస్, ఐపీఎస్, తదితర ఇరవైకి పైగా కేంద్ర సర్వీసుల్లో అధికారులను ఎంపిక చేసే ప్రక్రియే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దీన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపడుతుంది. ప్రపంచంలోనే అత్యంత క్లిష్ట ఎంపిక విధానంగా పేరుపొందిన పరీక్ష ఇది.

సహనం ఎంతో అవసరం:
సివిల్స్ ఔత్సాహికులకు ప్రథమంగా ఉండాల్సిన ప్రధాన లక్షణం సహనం. కారణం.. దీని ఎంపిక ప్రక్రియే ఏడాదిపాటు ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో ఉండే ఈ ఎంపికలో ప్రిలిమ్స్ మే నెలలో జరుగుతుంది. చివరి దశ ఇంటర్వ్యూ పూర్తయి ఫలితాలు వెల్లడయ్యేది ఆ తదుపరి సంవత్సరం మే లోనే. ఇంత సుదీర్ఘ ప్రక్రియతో కూడి ఉండే పరీక్ష సివిల్స్.

కోచింగ్ వర్సెస్ సెల్ఫ్ స్టడీ:
సివిల్స్ వంటి అత్యున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్న అభ్యర్థులకు మొదటగా తలెత్తే సందేహం కోచింగ్ గురించే. కోచిం గ్ తీసుకుంటేనే విజయం సాధ్యమనే అభిప్రాయం బలం గా ఏర్పడింది. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు కోచింగ్ తీసుకోకుండానే, కేవలం ఇంటర్వ్యూ గెడైన్స్ తీసుకుని విజయం సాధించినవారున్నారు. సివిల్స్ 2009లో విజేతగా నిలిచిన దేవిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి సొంత ప్రిపరేషన్‌తోనే విజయం సాధించారు. ఇలా మరెందరో ఉన్నారు. కాబట్టి.. కోచింగ్ అవసరం అని కచ్చితంగా చెప్పలేం.

అయితే కోచింగ్ తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా లాభిస్తుందని చెప్పొచ్చు. అభ్యర్థులు బలంగా ఉన్న సబ్జెక్టులకు సొంతంగా సిద్ధమై, బలహీనంగా ఉన్న సబ్జెక్టులకు కోచింగ్ తీసుకోవచ్చు. ఎక్కువమంది అభ్యర్థులు చేసేది ఇదే. అయితే కోచింగ్ వల్ల మంచి సహచరులు పరిచయమవుతారు. దానివల్ల బృంద చర్చలకు ఆస్కారం ఉంటుంది.

తెలుగు మీడియంతో సాధ్యమేనా:
సివిల్స్ అందుకునేందుకు కావాల్సిన పరిశ్రమ, సహనం ఉన్నవారికి ఏ మీడియమైనా ఒకటే. తెలుగు మీడియంలో సివిల్స్ రాసి విజేతలుగా ఎంపికైనవారెందరో. అంటే.. సివిల్స్‌లో విజయానికి కావాల్సిందల్లా కష్టపడి చదవడమే. ఈ క్రమంలో మొదటిసారే విజయం సాధ్యం కాకపోవచ్చు. కొంతమంది మూడుసార్లు పరాజితులై చివరిదైన నాలుగో అటెంప్ట్‌లో విజయం సాధించారు. ఇలాం టి వారిని ప్రేరణగా తీసుకోవాలి. రెండు, మూడుసార్లు పరాజయాలు పలకరించినా బెదరక రెట్టించిన ఉత్సాహంతో ఎగసే కెరటంలా చెలరేగాలి.

కాకపోతే ఇంగ్లిష్‌లో మెటీరియల్ లభ్యత ఎక్కువ. ఒకప్పుడు తెలుగులో మెటీరియల్ కొన్ని సబ్జెక్టుల్లోనే లభించేది. ఇప్పుడు దాదాపు అన్ని సబ్జెక్టుల్లోనూ మెటీరియల్ విరివిగా దొరుకుతుంది. ఇంగ్లిష్‌లో కొంచెం బలహీనంగా ఉన్న అభ్యర్థులు, ఇంగ్లిష్‌లో మాత్రమే లభించే మెటీరియల్ విషయంలోనూ ఆందోళన చెందక్కర్లేదు. అలాంటి మెటీరియల్‌లోని సమాచారాన్ని తెలుగులోకి అనువదించుకుని చదువుకోవడం వల్ల ఆ సమస్య నుంచి గట్టెక్కొచ్చు.

మంచి అకడెమిక్ నేపథ్యం లేకపోయినా:
చాలామంది అకడెమిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించినవారు మాత్రమే సివిల్స్ సాధించగలరని అపోహ పడుతుంటారు. ఇది సరికాదు. గతంలో సివిల్స్‌లో విజేతలుగా నిలిచిన వారిలో చాలామంది అకడెమిక్ పరీక్షలో సాధారణ మార్కులు సాధించినవారే. కాబట్టి ఎక్కడ, ఏం చదివారు అనే దానికంటే సివిల్స్ దృక్కోణంలో ఒక అంశాన్ని ఎలా చదివారు, ఏం గ్రహించారు, చక్కని భావవ్యక్తీకరణ, తప్పులను సరిదిద్దుకోగల నేర్పు ఉన్నవారు తేలికగా విజయం సాధించొచ్చు.

అకడెమిక్స్‌కు అదనంగా:
సివిల్స్ ఔత్సాహికులకు అకడెమిక్స్‌కు అదనంగా కొన్ని సహజ లక్షణాలు అలవర్చుకోవాలి. అవి.. చేసే పనిపట్ల ప్రేమ, పట్టుదల, ప్రణాళిక, పరిశ్రమ, అణకువ, అంకిత భావం, ఆత్మ స్థైర్యం, ఆత్మ విమర్శ, ఏ విషయం చదివినా గ్రహించడంలో స్పష్టత, వ్యక్తీకరించడంలో సరళత, వివరించడంలో సంగ్రహత. ప్రతిరోజూ రేడియో వార్తలు వినడం, వివిధ దినపత్రికలను చదవడం, చదివినదానిపై ఆలోచించి సహచరులతో చర్చించడం, సామాజిక సమస్యల పట్ల సానుభూతితో స్పందించడం. నిజాయితీతో, నిర్భయంగా, నమ్రతతో చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలగడం. వీటిని పెంపొందించుకుంటే భావి విజేతలుగా అవతరించొచ్చు.

అర్హతలివే:
గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: ఆగస్టు 1, 2012 నాటికి 21-30 ఏళ్లు. బీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు.
ఎన్నిసార్లు రాయొచ్చు: ఓసీలు వయోపరిమితికి లోబడి గరిష్టంగా నాలుగుసార్లు, ఓబీసీలు ఏడుసార్లు, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లైనా రాయొచ్చు. అయితే ఈ మూడంచెల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో) ఎందులో విఫలమైనా మొదటి నుంచి ప్రస్థానం మొదలుపెట్టాలి. ఉదాహరణకు ఒక అభ్యర్థి ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలో విఫలమైతే..మళ్లీ ప్రిలిమ్స్ నుంచి రాయాలి. అంతేకాకుండా ప్రిలిమ్స్‌లో ఒక్క పేపర్‌కు హాజరైనా ఒక ప్రయత్నం పోయినట్లే. అత్యుత్తమంగా ప్రిపరేషన్ ఉందనుకుంటేనే రాయడం మంచిది.

ఎవరికైనా సాధ్యమే
గత దశాబ్ద కాలంగా సివిల్స్ ఫలితాలు, విజేతల అనుభవాలు పరిశీలిస్తే సివిల్స్ పరీక్ష అత్యున్నతమైనప్పటికీ.. అందని ద్రాక్ష మాత్రం కాదు అని స్పష్టమవుతోంది. శాస్త్రీయంగా, ప్రణాళికబద్ధంగా సన్నద్ధమైతే ఏ నేపథ్యం ఉన్న అభ్యర్థులైనా ఇందులో విజయం సాధించడం సులభమే. కనీసం ఒక సంవత్సరం పూర్తిస్థాయి ప్రిపరేషన్ మాత్రం తప్పనిసరి.

ఇక.. మొదటిసారే విజయం సాధించిన అభ్యర్థులు కూడా ఎందరో. సివిల్స్ పరీక్షను లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు ప్రతి రోజు రేడియో, దినపత్రికలు, టీవీల్లోని వార్తలు, చర్చలు, వ్యాఖ్యానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తుండాలి. వాటిపై విశ్లేషణలు చేయాలి. సమాజంలో జరిగే సంఘటనలను నిశితంగా గమనించాలి. మనోరమ ఇయర్ బుక్, ఇండియా ఇయర్ బుక్, ఎన్‌సీఈఆర్‌టీ 9 నుంచి 12 తరగతుల పుస్తకాల అధ్యయనంతో ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌కు శ్రీకారం చుట్టాలి.

మెయిన్‌‌సలో ఆప్షనల్స్ ఎంపిక ఇలా:
సివిల్స్ పరీక్ష క్రమంలో అత్యంత కీలక అంశం ఆప్షనల్స్ ఎంపిక. 2010 వరకు ప్రిలిమ్స్‌లో కూడా ఒక పేపర్ ఆప్షనల్‌గా ఉండేది కాబట్టి.. చాలా మంది అభ్యర్థులు ఒక ఆప్షనల్‌ను ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిటికీ కలిసొచ్చేలా ఎంచుకునే వీలుండేది. కానీ 2011 నుంచి ప్రిలిమ్స్‌లో ఆప్షనల్ విధానానికి స్వస్తి పలికారు. ఈ నేపథ్యంలో ఆప్షనల్స్ ఎంపిక విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.అభ్యర్థులు తాము చదివిన గ్రాడ్యుయేషన్ సబ్జెక్టులాధారంగా మెయిన్స్‌లో ఆప్షనల్ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల అకడెమిక్ స్థాయిలో పట్టున్న సబ్జెక్టులను ప్రిపేర్ కావడంలో ఇబ్బంది ఎదురు కాదు.

అయితే మూడేళ్ల డిగ్రీలో చదవని సబ్జెక్టులను సైతం ఆప్షనల్స్‌గా ఎంచుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మెయిన్స్ వ్యాసరూప సమాధానాలు రాయాల్సిన పరీక్ష. కాబట్టి బాగా పట్టున్న, విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా రాయగల సబ్జెక్టులను ఎంచుకోవడం మంచిది. అంతేకాకుండా ఆ సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్ లభ్యత, కోచింగ్ సదుపాయాలు మొదలైనవాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అవసరమైతే అంతకు ముందు సివిల్స్ విజేతలను సంప్రదించి వారి గెడైన్స్‌ను కూడా తీసుకోవడం ఉత్తమం.

ఎంపిక విధానం

ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు అంచెల్లో వివిధ సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిలిమ్స్:
ఈ ఏడాది (2011) నుంచి ప్రిలిమినరీ పరీక్ష తీరుతెన్నులు మారాయి. ఇంతకు ముందు వరకు జనరల్ స్టడీస్‌కు 150 మార్కులు, అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షనల్ సబ్జెక్టుకు 300 మార్కులు ఉండేవి. 2011 నుంచి పేపర్-2 ఆప్షనల్ స్థానంలో ఆప్టిట్యూట్ టెస్ట్ ప్రారంభిం చారు. దీంతో పేపర్-1 జనరల్ స్టడీస్, పేపర్-2 ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు జరుగుతున్నాయి.

మెయిన్స్:
మొత్తం ఖాళీలను పరిగణించి.. 1:12 లేదా 1:12.5 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్‌‌సకు ఎంపిక చేస్తారు. మెయిన్‌‌సలో మొత్తం 9 పేపర్లు ఉంటాయి. పేపర్-1 (రీజనల్ లాంగ్వేజ్), పేపర్-2 (ఇంగ్లిష్) కేవలం అర్హత పేపర్లే. వీటిలో సాధించిన మార్కులను ఇంటర్‌వ్యూకి ఎంపిక చేసేందుకు పరిగణించరు. పేపర్-3 జనరల్ ఎస్సే, పేపర్-4,5 జనరల్ స్టడీస్ ఉంటాయి. మిగతా నాలుగు పేపర్లు అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షనల్స్ పేపర్లు. ఒక్కో ఆప్షనల్‌కు రెండు పేపర్లు ఉంటాయి. మెయిన్‌‌స పేపర్లన్నీ డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉంటాయి.

ఇంటర్వ్యూ:
మెయిన్‌‌సలో పొందిన మార్కుల ఆధారంగా ఒక్కో ఖాళీకి 1:2 లేదా 1:2.5 నిష్పత్తిలో ఇంటర్‌వ్యూకి ఎంపిక చేస్తారు. ఇది మూడొందల మార్కులకు జరుగుతుంది.
చివరకు మెయిన్‌‌స, ఇంటర్‌వ్యూలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ ప్రకారం ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.


రిఫరెన్‌‌స బుక్స్ (జీఎస్ ప్రిలిమ్స్, మెయిన్స్)
* ప్రాథమికంగా అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి ఆరు నుంచి 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ను అధ్యయనం చేయాలి.
ఇతర రిఫరెన్‌‌స బుక్స్:
* ఇండియా ఇయర్ బుక్
* యోజన ఎకనామిక్ సర్వే
* ది హిందూ దినపత్రిక
* ఇండియన్ పాలిటీ- లక్ష్మీకాంత్
* ఇండియన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్- ఆర్.కె. అరోరా
* కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా - పి.ఎం. భక్షి
* ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ - ఆర్.ఎస్. శర్మ
* మిడీవల్ ఇండియన్ హిస్టరీ - సతీష్ చంద్ర
* మోడ్రన్ ఇండియన్ హిస్టరీ - బిపిన్ చంద్ర
* మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్ రీజనింగ్ - ఆర్. ఎస్. అగర్వాల్
* అనలిటికల్ రీజనింగ్ - పాండే
* క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - ఆర్.ఎస్. అగర్వాల్
సిలబస్, పాత ప్రశ్న పత్రాలు

సివిల్స్ పరీక్ష విధానం
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్:
సబ్జెక్ట్ పేపర్ మార్కులు
జీఎస్ 1 200
ఆప్టిట్యూడ్ టెస్ట్ 1 200
మొత్తం 400

మెయిన్స్ ఎగ్జామినేషన్:
సబ్జెక్ట్ పేపర్లు మార్కులు
జీఎస్ 2 600
ఎస్సే 1 200
ఆప్షనల్ (1) 2 600
ఆప్షనల్ (2) 2 600
మొత్తం మార్కులు 2000
ఇంటర్వ్యూ: 300

ప్రిలిమ్స్ పేపర్లకు రెండు గంటల సమయం, మెయిన్‌‌స లోని ప్రతి పేపర్‌కు మూడు గంటల సమయం లభిస్తుంది.
..................

సివిల్స్-2012 సమాచారం
* ప్రిలిమ్స్ నోటిఫికేషన్: ఫిబ్రవరి 4, 2012
* దరఖాస్తు గడువు తేదీ: మార్చి 5, 2012
* పరీక్ష తేదీ: మే 20, 2012
* మెయిన్‌‌స పరీక్ష: అక్టోబర్ 5, 2012 (21 రోజులు)
* వెబ్‌సైట్: www.upsc.gov.in

గురజాల శ్రీనివాసరావు
సబ్జెక్ట్ ఎక్స్‌పర్‌‌ట- జాగ్రఫీ, హైదరాబాద్

Friday, December 23, 2011

మీరు కూడా పంపించొచ్చు.

ఈ బ్లాగును మంచి ఉద్దేశ్యం తో నిర్వహిస్తున్నాము. తెలుగు పట్ల మక్కువతో సివిల్స్ తెలుగులో రాయాలనే అభ్యర్థుల సహాయం కోసం ఈ బ్లాగులోని అంశాలు దోహదపడుతాయని భావిస్తున్నాను. 
మీరు కూడా అభ్యర్థులకు సరైన సూచనలు , సలహాలు అందించాలనుకుంటే మీ ఫోటో , వివరాలతో పాటు మీరు అందించాలనుకునే సమాచారం జతచేసి winod@live.in కి మెయిల్ చేయండి.
ఇప్పటికే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా సమాచారం అందించవచ్చు. మీ వివరాలు మీరు సూచించే సలహాలు , ఇతరత్రా విషయాలు తప్పకుండా ఈ బ్లాగులో ప్రచురించబడుతుంది.

మీకు అంత తీరిక లేకుంటే కామెంట్ లో రాసినా కూడా ప్రచురిస్తాను.

Saturday, December 17, 2011

సివిల్స్ 2012 నోటిఫికేషన్ లో జాప్యం ఎందుకు? సిలబస్ మారబోతోందా..!?

(ఈనాడు - చదువు సౌజన్యం తో ......)

రీక్షా విధానంలో 'మార్పు' అనే మాట వినగానే అభ్యర్థుల్లో ఆందోళన మొదలవుతుంది.

తాజాగా 'మెయిన్స్‌లో మార్పులు రాబోతున్నాయి' అంటూ వెలువడుతున్న వార్తలు సివిల్స్‌ పరీక్షను లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థుల్లో తికమకను పెంచుతున్నాయి.

అయితే యూపీఎస్‌సీ పరీక్షల్లో ఏ మార్పులైనా ఆకస్మికంగా ప్రవేశపెట్టరని గుర్తుంచుకోవాలి. సూక్ష్మంగా పరిశీలించి, విభిన్న అభిప్రాయాలను గమనించిగానీ మార్పులకు పచ్చజెండా ఊపరు.

కాకపోతే ఏ మార్పులకు ఆస్కారముందో తెలుసుకోవటం అభ్యర్థులకు మంచిదే!

నవంబరు, డిసెంబరు అంటే... సివిల్‌ సర్వీసుల అభ్యర్థులు శ్రద్ధగా గమనించాల్సిన నెలలుగా గుర్తింపు పొందాయి. కొన్నేళ్ళక్రితమైతే ఈ సమయంలో సివిల్స్‌ నోటిఫికేషన్‌ వచ్చేది. ఇప్పుడు పరీక్షా విధానం 'మార్పుల'కు సంబంధించిన సమాచారం వెలువడుతోంది. అంతే తేడా!

డిసెంబరు మొదటివారంలో యూపీఎస్‌సీ చైర్మన్‌ సివిల్స్‌ మెయిన్స్‌లో మార్పులను సూచించటానికి ప్యానెల్‌ని నియమించామని చెప్పారు. హ్యుమానిటీస్‌ విద్యార్థులతో పోలిస్తే సైన్స్‌ సబ్జెక్టుల వారు మార్కుల పరంగా అనుచిత ప్రయోజనం పొందకుండా మార్పులను సూచించటం ప్యానెల్‌ కర్తవ్యమని వార్తాకథనాల సారాంశం. నిర్వహణ, పాలనా నైపుణ్యాలను పరీక్షించేలా పేపర్లను రూపొందించటం కూడా మరో విధి.

అలఘ్‌ కమిటీ (1991), పాలనాసంస్కరణల రెండో కమిషన్‌ (2008) సిఫార్సుల ఆధారంగానే ప్యానెల్‌ సూచనలుంటాయని భావిస్తున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఎన్నో ప్రశ్నలూ సందేహాలూ... వాటిని పరిశీలిద్దాం!


వయః పరిమితి, ప్రయత్నాల సంఖ్య మొదలైనవి ఇప్పటి కమిటీ పరిధిలో లేవని గమనించాలి.

** ప్రిలిమినరీ పరీక్షా విధానం మళ్ళీ మారుతుందా?
* లేదు. ప్రిలిమ్స్‌ యథాతథంగానే ఉంటుంది. ప్రశ్నల సంఖ్యా, వెయిటేజి మారవచ్చు. అంతేగానీ మార్కుల, పేపర్ల సంఖ్యలో ఎలాంటి మార్పులూ ఉండవు.

** మెయిన్స్‌ మార్కులకు ప్రిలిమినరీ మార్కులు కలుస్తాయా?
* అలఘ్‌ కమిటీ ఇలా సిఫార్సు చేసింది కానీ, అది ఆమోదం పొందలేదు. అందుకని ప్రిలిమ్స్‌ మార్కులు మెయిన్స్‌లో కలిపే అవకాశం లేదు.

** మెయిన్స్‌లో అవకాశమున్న సబ్జెక్టులేమిటి?
* కమిటీ పరిధిని దృష్టిలో పెట్టుకుని కింది అంచనాలకు రావొచ్చు.

1) కంపల్సరీ లాంగ్వేజ్‌ పేపర్లు- ఇంగ్లిష్‌, మోడర్న్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌ కొనసాగుతాయి. ఈ పేపర్ల స్థాయి పెరుగుతుంది. ఇప్పుడవి అర్హతా పేపర్లే. ర్యాంకును నిర్థారించే స్కోరులో వీటి మార్కులను కూడా కలిపే అవకాశముంది.

2) అలఘ్‌ కమిటీ, ఏఆర్‌సీలు ఎస్సే విషయంలో ఏకాభిప్రాయంతో లేవు. కాబట్టి వ్యాసం యథాతథంగానే ఉంటుంది.

3) ఇప్పుడున్న జనరల్‌స్టడీస్‌ పేపర్లను మార్చాలని అలఘ్‌ కమిటీ సిఫార్సు చేయగా, ఏఆర్‌సీ దాన్ని బలపరిచింది. కాబట్టి ఇప్పుడున్నట్టుగా జనరల్‌స్టడీస్‌ పేపర్లుండకపోవచ్చు. ప్రిలిమ్స్‌లో పరీక్షించిన స్టాటిస్టిక్స్‌ లాంటివాటికి మెయిన్స్‌లో చోటు దొరక్కపోవచ్చు.

** కంపల్సరీ పేపర్లు ఏవి ఉండే అవకాశముంది?
* ఇప్పటి మెయిన్స్‌లో ఆప్షనల్స్‌ అంటే- అభ్యర్థులు విశ్వవిద్యాలయ స్థాయిలో చదివిన సబ్జెక్టులపై దృష్టి పెట్టటం. కానీ విజయవంతమైన సివిల్‌ సర్వెంట్‌గా మారాలంటే... నేర్చుకోదల్చిన అంశాలపై అభ్యర్థి దృష్టిపెట్టేలా ఉండాలి. అందుకే ఆప్షనల్‌ పేపర్ల స్థానంలో అభ్యర్థి విస్తృత పరిజ్ఞానం, నైపుణ్యాలు, స్వభావం, అభిరుచులూ పరీక్షించేలా కంపల్సరీ పేపర్లను రూపొందించాలనే ప్రతిపాదన ఉంది. వివిధ సబ్జెక్టుల కలబోత స్వభావంతో ఉండే ఈ పేపర్లు హయ్యర్‌ సివిల్‌ సర్వీసెస్‌తో నేరుగా సంబంధం కలిగివుంటాయి.

ఏమిటా పేపర్లు?
1.Sustainable development and Social Justice
2. Science and Technology in Society
3. Public Systems, Democratic Governance and Human Rights
4. The constitution of India and Indian Legal System
5. Indian Economy
6. Administrative Theory and Governance in India

బహుళైచ్ఛిక (మల్టిపుల్‌ చాయిస్‌), షార్ట్‌ ఆన్సర్‌, ఎస్సే టైపు ప్రశ్నలు అడుగుతారని భావిస్తున్నారు.

** గ్రూప్‌-1 పరీక్ష తరహాలో ఉంటుందా నూతన పరీక్షా విధానం?
* అలా ఉండే అవకాశం లేదు.
** సివిల్స్‌-2012 పరీక్షా విధానం మారబోతోందనీ, అందుకే నోటిఫికేషన్‌ విడుదలలో జాప్యం జరుగుతోందనీ వదంతులు వినిపిస్తున్నాయి....

* 2012లో ఎలాంటి మార్పులూ ఉండవు. ఈ డిసెంబరు 1న రాజ్యసభలో అవినాష్‌పాండే అడిగిన ప్రశ్నకు సంబంధిత మంత్రి వి.నారాయణస్వామి జవాబిస్తూ ఈ విషయాన్నే ఇలా స్పష్టం చేశారు. 'There is no proposal to introduce changes in the Main examination of the Civil Services Examination, at present.' 

కాబట్టి అభ్యర్థులు అనవసర గందరగోళానికి గురవ్వకుండా ఇప్పుడున్న పద్ధతిలోనే పరీక్షకు సిద్ధం కావటం శ్రేయస్కరం!

- గోపాలకృష్ణ 

Sunday, December 4, 2011

సివిల్స్ కి తెలుగు మీడియం వారు చదవాల్సిన పుస్తకాలు .

సివిల్స్‌ అభ్యర్థులందరూ ప్రిలిమినరీలో రెండు కామన్‌ పేపర్లు రాయాలి.

1) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1:
2) పేపర్‌-2:

పేపర్‌-1: జనరల్‌ స్టడీస్‌
వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జ్‌, భారతదేశ చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ- పాలన, జనరల్‌ సైన్స్‌, సాంఘిక ఆర్థికాభివృద్ధి, భారత, ప్రపంచ భౌగోళిక పరిస్థితులు.

ఇన్ని అంశాలనూ కవర్‌ చేసి, ప్రతిదానిలోనూ ప్రావీణ్యం సాధించటం ఎవరికైనా అసాధ్యం. మరేం చేయాలి? తార్కికంగా చూసినా ఉన్న ఒకే మార్గం- trendsను గుర్తించి, అనుసరించటమే! అయితే అసలైన సమస్య ఇక్కడే ఉంది. ఇతర పోటీ పరీక్షల మాదిరిగా జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ను ముందస్తుగా ఊహించటం కష్టం.

ఇది 'నల్లహంస' దృగ్విషయం లాంటిది. 
 (నల్లహంసల జాతి ఒకటుందని పదిహేడో శతాబ్దిలో కనిపెట్టేదాకా హంసలన్నీ తెల్లగా ఉంటాయనే నమ్మకం కొనసాగింది. లెబనీస్‌ రచయిత టాలెబ్‌ దీన్ని Black swan phenomenon గాcoinచేశారు. అంటే గతానుభవాల ఆధారంగా భవిష్యత్తును ఊహించటానికి సాధ్యం కాని స్థితి!...

పరీక్షల సందర్భానికొస్తే పాత ప్రశ్నపత్రాల సాయంతో రాబోయే ప్రశ్నలను వూహించలేకపోవటం.)

ప్రిలిమినరీలో పేపర్‌-1 జనరల్‌స్టడీస్‌ నిశ్చయంగా Black Swan. ఎవరూ వూహించటానికి వీల్లేకుండా యూపీఎస్‌సీ దీన్ని రూపొందిస్తుంది. మరి కర్తవ్యం?

మొదట మీ విశ్లేషణ కచ్చితంగా ఉండాలి. ఇది జ్ఞాపకశక్తిని పరీక్షించే factual paper అని చాలామంది అభ్యర్థులు భావిస్తుంటారు. ఈ కారణంతోనే చాలామంది మంచి అభ్యర్థులకు ఇది మొదటినుంచీ సమస్యగా ఉంటూ వచ్చింది. ఈ పేపర్‌తో సంబంధమున్న రీజనింగ్‌ భాగాన్ని చాలామంది అర్థం చేసుకోరు. 2011 నుంచి UPSCఅధికారికంగా 'ఆప్టిట్యూడ్‌' పరీక్షను ప్రవేశపెట్టింది కానీ, గత 4-5 ఏళ్ళ నుంచీ జనరల్‌స్టడీస్‌ ఆప్టిట్యూడ్‌ పరోక్షంగా కరిక్యులమ్‌లో భాగంగానే ఉంది.

ప్రాథమిక factualసమాచారంతో పాటు బలమైన రీజనింగ్‌ నైపుణ్యాలు అవసరమయ్యేలా UPSCప్రశ్నలను రూపొందిస్తోంది. కాబట్టి సారాంశంలో ఇది జనరల్‌స్టడీసూ కాదు; జనరల్‌ నాలెడ్జీ కాదు! ఇది జనరల్‌ స్టడీస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (GSAT).

స్థిర, పరిణామశీల అంశాలు
* స్థిర (static)అంశాలు- భారత జాతీయోద్యమం, భారత రాజ్యాంగ వ్యవస్థ, సాంఘికార్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టితో ప్రాథమిక ఆర్థిక అవగాహన, భూగోళవ్యవస్థ

* పరిణామశీల అంశాలు - వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జి. వీటికి తగిన నిర్వచనం, సిలబస్‌ అంటూ లేవు.

స్థిర అంశాల్లో సాధారణంగా స్కోరింగ్‌కు ఆస్కారం ఉంటుంది. వీటిలో ఎంత ఎక్కువ సాధించగలిగితే అనిర్దిష్ట అంశాలైన వర్తమాన వ్యవహారాలూ, జి.కె.లపై ఆధారపడటం అంత తగ్గుతుంది. వీటిని మౌలిక అంశాల నుంచి నేర్చుకుని, నోట్సు ద్వారా పకడ్బందీగా పునశ్చరణ చేసుకోవాలి. భావనలు (concepts) పటిష్ఠపరచుకోవాలి. నమూనా టెస్టులు రాస్తే పరిజ్ఞానం విస్తృతమై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

నిర్దిష్టత ఉండని వర్తమాన, జి.కె.లలో ప్రాథమిక వివరాలతో పాటు సూత్రాలూ, అమలూ కూడా అవగాహన చేసుకోవాలి. చాలినంత సమయం ఉంది కాబట్టి అభ్యర్థులు థియరిటికల్‌ అంశాల జాబితా తయారుచేసి, రోజువారీగా తాజా పరిణామాలను జోడించుకుంటూ ఉండాలి. ఈ తరహా ప్రశ్నలకు రీజనింగ్‌, factual data అవసరం కాబట్టి పైన చెప్పిన విధానం పాటిస్తే వాటిని పెంపొందించుకోవచ్చు.

తెలుగుమీడియం విద్యార్థులకు ఉపయోగపడేవి
1) ఎన్‌సీఈఆర్‌టీ ప్రాథమిక పుస్తకాలు
2) తెలుగు అకాడమీ ప్రచురణలు
3) హ్యుమానిటీస్‌ (ఇండియన్‌ పాలిటీ, సోషియాలజీ) లలో అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఎ. పుస్తకాలు
4) తెలుగు, ఆంగ్ల వార్తాపత్రికలు
5) పబ్లికేషన్స్‌ డివిజన్‌ 'ఇండియా ఇయర్‌బుక్‌'
6) తెలుగు, ఇంగ్లిష్‌ల్లో ప్రచురితమయ్యే 'యోజన'
తెలుగు మీడియం నేపథ్యమున్నవారు ఈ పేపర్‌ గురించి మరీ ఇబ్బందిపడనక్కర్లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్టు అంశాలతో తేలిగ్గానే పరిచయం పెంచుకోవచ్చు.

పేపర్‌-2
కాంప్రహెన్షన్‌, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌- కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, లాజికల్‌ రీజనింగ్‌- అనలిటికల్‌ ఎబిలిటీ, డెసిషన్‌ మేకింగ్‌- ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ (పదో తరగతి స్థాయి), డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ (పదో తరగతి స్థాయి), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌ (పదో తరగతి స్థాయి)

గత ఏడాది కాంప్రహెన్షన్‌ విభాగం నుంచి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఇది కొనసాగుతుంది. క్లిష్టత స్థాయి కూడా యథావిధిగా ఉంటుంది. గణితంలో ప్రశ్నల సంఖ్య అలాగే ఉండొచ్చు కానీ క్లిష్టత స్థాయి పెరగవచ్చు. డెసిషన్‌ మేకింగ్‌లో ప్రశ్నలు కూడా పెరిగే అవకాశముంది. పూర్తిగా పరిణామశీల అంశాలతో కూడివుంటుంది కాబట్టి ఈ పేపర్‌ కూడా మరో Black swanఅవ్వగలదు.

ఈ పేపర్లో ఉన్న అంశాలన్నిటిలోనూ పట్టు సాధించటం ఎక్కువమంది అభ్యర్థులకు సాధ్యం కాదు. అందుకని గరిష్ఠ మార్కులు సాధ్యమయ్యే అంశాలను ఎంచుకోవటం మేలు. ప్రస్తుత తరుణంలో సాంప్రదాయికంగా స్కోరింగ్‌గా ఉన్న అంశాలను పటిష్ఠపరుచుకోవటం కోసం మంచి వర్క్‌బుక్‌తో సాధన చేయాలి. ఒక నిర్దిష్టమైన తర్కంపై పట్టు లభిస్తే అది ఆత్మవిశ్వాసం పెంచి, ఇతర ప్రశ్నలను చేయటానికి కూడా ఉపకరిస్తుంది. అందుకే ఈ పేపర్‌ కోసం మంచి ప్రశ్నలను solve చేయటం చాలా ముఖ్యం.

పేపర్‌-1 static section లో ప్రశ్నల సంఖ్యది ప్రధాన పాత్ర. కానీ పేపర్‌-2లో నాణ్యమైన ప్రశ్నలు (సంఖ్యలో తక్కువైనప్పటికీ) చేయటం అవసరం. అప్పుడే దానిమీద అవగాహన పెరుగుతుంది. ఈ విధంగా ఈ విభాగంలో స్కోర్‌ చేయాలంటే smart work ప్రధానాంశం.

క్వాంటిటేటివ్‌ విభాగంలో సంఖ్యలను అర్థం చేసుకోవటం చాలా ప్రధానం. మొత్తం మార్కుల్లో వీటి భాగం ఎక్కువ. అభ్యర్థులు కష్టపడితే దీన్ని సులభంగా మల్చుకోవచ్చు. ఈ విభాగానికి సమయం కబళించటంలో చాలా పేరుంది కాబట్టి ప్రశ్నలను సత్వరం చేసేలా సమయపాలన పద్ధతులను మెరుగుపరుచుకోవాల్సిందే. లేకుంటే అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను రాయగలిగే అవకాశం లేకుండాపోతుంది.

ఇంగ్లిష్‌ మాధ్యమ నేపథ్యం లేనివారూ, ఈ భాషపై అంతగా పట్టు లేనివారూ ఆందోళన పడకూడదు. ఇప్పటివరకూ అనుసరించిన ప్రిపరేషన్‌ పద్ధతినే, తీరునే కొనసాగించాలి. యూపీఎస్‌సీ పేర్కొన్నట్టు- 'టెన్త్‌ క్లాస్‌ స్థాయి' నైపుణ్యాలను మాత్రమే పరీక్షిస్తారు కాబట్టి ఆందోళన పడనవసరంలేదు. సిలబస్‌లో లేని లోతైన అంశాలను చదువుతూ ప్రిపరేషన్‌ను సంక్లిష్టం చేసుకోకూడదు.

తెలుగుమీడియం విద్యార్థులకు ఉపయోగపడేవి
1) అరిథ్‌మెటిక్‌ ప్రాథమిక పుస్తకాలు
2) ఇంగ్లిష్‌ మౌలిక విషయాలుండే పుస్తకాలు
3) 'ఇగ్నో' ప్రచురించిన ఫంక్షనల్‌ ఇంగ్లిష్‌ పుస్తకాలు
4) బ్యాంకింగ్‌ పరీక్షల పాత ప్రశ్నపత్రాలు
5) పేపర్‌-2కు సంబంధించిన మంచి manual
6) మంచి ఇంగ్లిష్‌ నిఘంటువు / ఇంగ్లిష్‌- తెలుగు నిఘంటువు

మొత్తమ్మీద రెండు పేపర్లకూ section వారీగా సంసిద్ధం కావాలి. మిగతా అంశాలను పకడ్బందీగా చదివివుంటే కొన్ని ఉప అంశాలను వదిలివేసినా ఇబ్బంది ఎదురవ్వదు. ప్రతి మార్కూ పెద్ద తేడాను సృష్టించే ఇలాంటి పోటీపరీక్షల్లో సమయ నిర్వహణ చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తుంది.


కాబట్టి వచ్చే రోజుల్లో అభ్యర్థులు తమ సాధనను సమయ నిర్వహణతో అనుసంధానించుకోవటం శ్రేయస్కరం.
 - ఈనాడు చదువు సౌజన్యంతో......
Related Posts Plugin for WordPress, Blogger...