Monday, February 14, 2011

సివిల్స్‌ పట్ల పెరుగుతున్న ఆసక్తి..!!


 
 
ఇంజనీరో, డాక్టరో కావాలంటే ఈ రోజుల్లో ఇంటర్‌ స్థాయినుంచే వేలల్లో, లక్షల్లో ఖర్చు అవుతోంది. అదీగాక ఎక్కువ సమయం చదువు కోసమే కేటాయించాల్సి ఉంటుంది. మరి లక్షలకొద్దీ ఫీజులు కట్టలేని పేద మధ్య తరగతి యువత పరిస్థితి ఏమిటి? ఎస్టీడి బూత్‌లోనో, బుక్‌స్టాల్‌లోనో పార్టుటైమ్‌ పనిచేస్తూ చదువుకునే విద్యార్థులు అత్యధిక సమయం స్టడీ రూమ్‌లోనే గడిపే పరిస్థితి ఎక్కడుంది? అన్నప్పుడు చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది సివిల్‌. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్నవారు కూడా పార్టుటైమ్‌ ఉద్యోగాలు చేస్తూ సివిల్స్‌ దాకా ఎదిగినవారున్నారు. ఇలాంటి అవకాశం ఉంది కాబట్టే దీనివైపు ఎక్కువ శాతం యువత మొగ్గు చూపుతోంది. ఆసక్తి, పట్టుదల ఉంటే చాలు అవకాశాన్ని ఎవ్వరైనా సొంతం చేసుకునే వీలు ఒక్క సివిల్స్‌కే సాధ్యం.
ఎంబిఎ, ఎంసిఎ, ఎంబిబిఎస్‌, ఇంజనీరింగ్‌ లాంటి ఉన్నత చదువులకయ్యే ఖర్చుకంటే సివిల్స్‌కయ్యేది చాలా తక్కువ. అదీగాక ఆర్థిక పరిస్థితి బాగోలేని వారు పార్టుటైమ్‌ ఉద్యోగాలు చేస్తూ కూడా చదువుకునే వీలుంది. కాబట్టి ఎక్కువశాతం యువతీ యువకులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. సివిల్‌ సర్వీసెస్‌ అంటేనే చాలామంది ఐఎఎస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష అని అనుకుంటుంటారు. కానీ ఇందులో 22 రకాల కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. ఐఎఎస్‌కంటే కూడా ఉన్నతమైన ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసెస్‌ పరీక్ష ఉంది. ఐఎఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ రెండింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఐఎఎస్‌కే ఎక్కువ డిమాండ్‌ ఉంది. తక్కువ కాలంలో ఉన్నత హోదాకు ఎదిగే అవకాశం, సామాజిక గౌరవం, అధికారం, అవకాశం, ఉద్యోగ భద్రత అన్నీ ఉండటమేగా సేవాదృక్పథం కలిగిన వారికి ప్రజాసేవ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మధ్య తరగతి యువత ఎక్కువగా సివిల్స్‌పై ఆసక్తి చూపుతోంది.

హోదాతోపాటు
ప్రధానమంత్రి తర్వాత అత్యున్నత హోదాగల కేబినెట్‌ కార్యదర్శి పదవికి చేరుకునే అవకాశం ఒక్క సివిల్స్‌ సర్వీసెస్‌ ద్వారా మాత్రమే సాధ్యం. అంతేకాదు రాజ్యాంగ పరమైన అనేక పదవులు పొందే అవకాశం ఇందులో ఉంటుంది.
పాలనా వ్యవస్థకు పట్టుగొమ్మలు
ఒక ప్రజా ప్రతినిధి పదవీ కాలం ఐదేళ్లు మాత్రమే. ఒక న్యాయమూర్తి కొన్ని పరిధులకు లోబబడి మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి పదవి కూడా ప్రజాస్వామ్య దేశంలో స్వల్పకాలికమైనదే. కానీ అదే ఒక సివిల్‌ సర్వీసెస్‌ అధికారి పదవి... దాదాపు 30 సంవత్సరాలు. అంటే పాలనా వ్యవస్థలో, పాలనా వ్యవహారాల్లో, ప్రణాళికల రూపకల్పనలో సివిల్‌ సర్వీసెస్‌లదే కీలకపాత్ర ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండే ఒక ఐఎఎస్‌ అభ్యర్థి సలహాలనే పాటిస్తుంటారంటే దానికుండే గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు.
డిగ్రీ ఉంటే చాలు...
కచ్చితంగా ఇన్ని మార్కులుంటేనే సివిల్స్‌కు అర్హులనే నిబంధనలేమీ లేవు. 21 సంవత్సరాల వయసు ఉండి, డిగ్రీ చదువుతున్న వారు, ఫైనల్‌ ఇయర్లో ఉన్నవారు కూడా ఐఎఎస్‌ ప్రవేశ పరీక్ష రాయవచ్చు.
ప్రిలిమినరీ
ప్రతి ఏడాదీ ప్రిలిమినరీ పరీక్షకోసం నోటిఫికేషన్‌ వెలువడుతూ ఉంటుంది. ఈ పరీక్ష అంతా ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఇంతవరకూ 23 ఆప్షనల్స్‌ నుండి ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉండేది. కానీ 2011 నుంచి మాత్రం కొత్త ప్యాటర్న్‌ అమల్లోకి రాబోతోంది.
కొత్త ప్యాటర్న్‌లో ఏముంటుంది
కొత్త ప్యాటర్న్‌ అనగానే కఠినంగా ఉంటుందేమోనని భయపడాల్సిన అవసరం లేదు. చాలా సులభంగానే ఉంటుంది. కేవలం బట్టీపట్టో, పరీక్షకోసం మాత్రమే చదివో గుర్తుపెట్టుకునే జనరల్‌ నాలెడ్జ్‌ పరీక్షవల్ల విద్యార్థుల్లోని ప్రజ్ఞను సరైనరీతిలో అంచనా వేయలేకపోతున్నారు. అందుకే అభ్యర్థుల్లో నైతిక విలువలు, సంక్లిష్ట పరిస్థితుల్లో, సంక్షోభ సమయాల్లో సమయోచితంగా వ్యవహరించగలిగే సామర్థ్యం, పరిష్కార మార్గం తదితర విషయాలపట్ల అవగాహన కల్పించే విధంగా కొత్త ప్యాటర్న్‌ ఉంటుంది. అభ్యర్థుల్లో కూడా వీటిస్థాయినే పరీక్షిస్తారు.
మెయిన్స్‌కు అర్హత
మొత్తం 450 మార్కులు ఉంటాయి. 275 ఆ పైన స్కోర్‌ చేయగలిగితే మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతీ ఏడాది 1.5 లక్షల మంది సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష రాస్తుంటారు. ఖాళీల ప్రాతి పదికను బట్టి సుమారు 9000 మంది దాకా మెయిన్స్‌కు ఎంపికవుతుంటారు. ఇందులో తొమ్మిది పేపర్లను డిస్ట్క్రిప్టివ్‌ పద్ధతిలో రాయాల్సి ఉంటుంది. అక్టోబర్‌ నెలలో ఈ పరీక్ష ఉంటుంది. ప్రతి ఏటా సుమారు 1500 మందికి ఇంటర్వ్యూకు అర్హత లభిస్తుంది.

మెరిట్‌ జాబితా ఇలా...
మెయిన్స్‌ పరీక్షల నోటిఫికేషన్‌ తర్వాత దాదాపు నాలుగు నెలలపాటు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. మెయిన్స్‌లో సాధించిన మార్కులనూ, ఇంటర్వ్యూ మార్కులనూ కలిపి చివరిగా మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు. దీని తర్వాత సుమారు 500 మంది ఎంపిక అవుతారు. ఎంపిక కానివారు మళ్లీ ప్రిలిమినరీ నుంచి చదవాల్సి ఉంటుంది.

సబ్జెక్టు ఏదైనా
కేవలం ఆర్ట్స్‌ చదివిన వారే కాదు డిగ్రీలో సైన్స్‌, మ్యాథ్స్‌ చదివిన వారు కూడా ఆర్ట్సు సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది ఇలాగే తీసుకుంటున్నారు కూడా. ఎందుకంటే ఆర్ట్స్‌ ఒక సామాజిక శాస్త్రమేగాక నిత్యజీవితంతో మిళితమై ఉంటుంది. అదీగాక మెటీరియల్‌ ఎక్కువగా అందుబాటులో ఉంటుంది.
సమయం సద్వినియోగం

డిగ్రీలో చదివిన సబ్జెక్టులనే ఆప్షనల్‌ ఎంచుకోవాలా? వేరే సబ్జెక్టులు తీసుకోవడంవల్ల సమస్యలు తలెత్తుతాయా? అన్న సందేహంతోనే కొంతమంది సమయం వృథా చేస్తుంటారు. కొందరు ఏదోఒక ఆప్షనల్స్‌ ఎంచుకొని కొంతకాలం చదివి వదిలేస్తుంటారు. చివరికీ దేంట్లోనూ రాణించక ఇబ్బంది పడుతుంటారు. దేనికైనా ముందుగా ఆసక్తి, పట్టుదల, లక్ష్యం ఇవన్నీ కావాలి. ఇవి ఏర్పర్చుకొని ఏ ఆప్షనల్‌ ఎంచుకున్నా రాణించగలుగుతారు. కాబట్టి ఆసక్తి ఉన్న ఆప్షనల్‌తోపాటు జనరల్‌ స్టడీపైనా దృష్టిపెట్టాలి. అప్పుడే అనుకున్నది సాధించ గలుగుతారు.

దేనికి ఎన్ని మార్కులు? 
  • ప్రిలిమినరీ (అర్హత పరీక్ష-ఫైనల్స్‌కు ఎంపికకు) మొత్తం మార్కులు 450
  • కంపల్సరీ జనరల్‌ స్టడీస్‌ 150
  • ఆప్షనల్‌ పేపర్‌ 300
  • మెయిన్స్‌ పరీక్షకు 2000
  • ఇంటర్వ్యూకు 300
ఎంపిక:                
మెయిన్స్‌, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఉంటుంది.
ప్రిలిమినరీలో మార్పులు
2011 సివిల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షా విధానంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. జనరల్‌ నాలెడ్జ్ మాత్రమే పరీక్షించే ప్రిలిమినరీలో ఇకముందు అభ్యర్థి ఆప్టిట్యూడ్‌ను కూడా పరీక్షిస్తారు. నైతిక విలువలు, నిజాయితీ, సంక్లిష్ట సమయాల్లో సమయస్ఫూర్తి, వ్యక్తిత్వం, చురుకుదనం, అభిరుచి, సహజత్వం లాంటివన్నీ పరిశీలిస్తారు. కాబట్టి విద్యార్థులు ఇప్పట్నించే తగిన అవగాహన ఏర్పర్చుకుంటే ప్రిలిమినరీలో తప్పక విజయం సాధించగలుగుతారు.
ఛాన్స్‌ ఇదిగో
  • జనరల్‌ కేటగిరీ నాలుగుసార్లు
  • ఎస్సీ, ఎస్టీలు పరిమితి లేదు
  • ఒబిసి ఏడుసార్లు
నోటిఫికేషన్‌ ఎప్పుడు?
ప్రిలిమ్స్‌ నోటిఫికేషన్‌ త్వరలో వెలువడనుంది.

1 comment:

  1. very useful blog... we r expecting more material info from you.

    thank u sooooo much

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...