Monday, February 14, 2011

ఎకానమి జాతీయాదాయం....!!

గ్రూప్స్‌, సివిల్స్‌, జూనియర్‌ లెక్చరర్‌, డిగ్రీ లెక్చరర్‌ పరీక్ష రాయగోరే అభ్యర్థులకు జాతీయాదాయానికి సంబంధించిన చాప్టర్‌ అత్యంత కీలకమైంది. ఈ చాప్టర్‌ వివిధ బేసిక్‌ భావనలతో కూడి ఉంటుంది. చాప్టర్‌ పరిధిలో అధ్యయనం చేస్తే మార్కులు ఖచ్చితంగా పొందవచ్చు. ఊహించి సమాధానాలు రాయడం కాకుండా ఖచ్చితంగా తెలిస్తేనే అటెంప్ట్‌ చేసే విధంగా ఉంటుంది. గత పరీక్షల్లో కూడా బేసిక్‌ అంశాలపైనే ఎక్కువ ప్రశ్నలు అడిగారు.
సమీకరణాలు, గణాంక వివరాలతో కూడుకొని ఉండటం వలన సైన్స్‌ విద్యార్థులకు సులభంగానూ, ఆర్ట్స్‌ విద్యార్థులకు కష్టంగానూ అన్పించవచ్చు. కానీ సాధారణంగా అందరూ తెలుసుకొనే విషయాలుంటాయి. ఉపయుక్తమైనవి ఉంటాయి. బేసిక్‌ విషయాలతోపాటు ప్రస్తుత సర్వే వివరాల వరకూ ప్రాధాన్యత ఉంటుంది. మొదట బేసిక్‌ విషయాలు, తర్వాత కరెంట్‌ అంశాలు, మూడవ భాగంలో మాదిరి ప్రశ్నలు అందివ్వడం జరిగింది. కావున అభ్యర్థులు అన్ని భాగాలూ చదవాలి.
1.ఆర్థిక వ్యవస్థలోని ప్రధానరంగాలు, స్థూల దేశీయోత్పత్తి, తలసరి ఆదాయం :
ప్రపంచంలో ఏ దేశ ఆర్థికాభివృద్ధినైనా జాతీయ, తలసరి ఆదాయాలలో కొలిచి చెప్పడం పరిపాటి. జాతీయాదాయం పెరుగుదులతో ఆర్థికాభివృద్ధిని కొలిచి చెపుతుంటారు. సాధారణంగా ఒక దేశంలోని వ్యక్తుల, సంస్థల ఆదాయ మొత్తాన్ని జాతీయాదాయంగా చెపుతారు.
జాతీయాదాయం అర్థం : ఒక దేశంలో నిర్ణీతకాలంలో ఉత్పత్తి చేసిన వస్తు సేవల మొత్తం మార్కెట్‌ విలువ. చక్రరూప ఆదాయ ప్రవాహం ద్వారా జాతీయాదాయం అర్థం వివరించుట సర్వసాధారణం. ఎందుకనగా ఇది ఒక స్థూల భావన కాబట్టి.
కుటుంబరంగమైన ఉత్పత్తి కారకాలు తమ సేవల వ్యాపార రంగానికి అమ్ముట ద్వారా లభించిన ఆదాయం, వ్యాపార రంగానికి చెందిన వస్తుసేవల కొనుగోలుపై వెచ్చించడం ద్వారా వ్యాపార రంగానికి ఆదాయం లాభాల రూపంలో ప్రవహించును. దీని వలన వ్యాపార రంగాల శ్రమదోపిడి పెరిగి ఆర్థిక అసమానతలకు దారి తీస్తుందని, జాతీయాదాయం పంపిణిలో అసమతుల్యత ఏర్పడుతుందని, శ్రామికుల వాటా తక్కువ కావున అత్యధిక ప్రజల సంక్షేమం దెబ్బతింటుందని కారల్‌ మార్క్స్‌ పేర్కొన్నారు. జాతీయాదాయం పంపిణి-సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చేదిగా ఉండవలెనని ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ అన్నారు.
నిర్వచనాలు : 1.ఎ.సి.పిగూ : ద్రవ్యంలో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయం, విదేశాల నుండి లభించే నికర ఆదాయాన్ని జాతీయోత్పత్తిగా పేర్కొన్నారు.
2.ఇర్వింగ్‌ ఫిషర్‌ : అంతిమ వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుండి పొందే సేవల సముదాయమే జాతీయాదాయం.
జాతీయాదాయంలో వివిధ భాగాలు : 1.వినియోగ వస్తువలు 2.పెట్టుబడి 3.ప్రభుత్వ వ్యయం 4.నికర ఎగుమతులు
1929 ప్రపంచ ఆర్థిక మాంద్యానికి పూర్వం జాతీయాదాయంలో వినియోగ, పెట్టుబడి వస్తువులు మాత్రమే భాగంగా ఉండేవి. సమిష్టి డిమాండ్‌ ఎదుర్కొనుటకు జె.ఎమ్‌.కీన్స్‌ మహాశయుడు ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ వ్యయం తప్పనిసరి అని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యయం ప్రజా సంక్షేమం పెంచేదిగా అవస్థాపనా సౌకర్యాలు, బదిలీ, చెల్లింపుల రూపంలో ఉండవలెనన్నాడు. సమిష్టి డిమాండ్‌ పెంచుటకు చక్రరూప ఆదాయ ప్రవాహం కొనసాగించుటకు ఖాళీ గోతులు తీయండి, ఖాళీ గోతులు పూడ్చండి అని ఉద్భోదించాడు.
మార్షల్‌ : ఒకదేశంలోని శ్రమ, మూలధనం సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తమే జాతీయాదాయం.
ఆధునిక నిర్వచనాలు కుజ్నెట్స్‌ : ఒకదేశ ఉత్పాదక వ్యవస్థ నుండి అంతిమ వినియోగదారులకు ఒక సంవత్సరకాలంలో ప్రవహించే నికర ఉత్పత్తి జాతీయాదాయం.
జాతీయాదాయ అంచనాల సంఘం నిర్ణీత కాలంలో ఉత్పత్తిచేసి ఒకసారి మాత్రమే లెక్కలోనికి తీసుకున్న వస్తుసేవల సముదాయమే జాతీయాదాయం.
సాముల్సన్‌ : ఒకదేశంలో ఒక సంవత్సరకాలంలో ప్రవహించే వస్తుసేవల ద్రవ్య విలువనే జాతీయాదాయం.
నిర్ణయించే అంశాలు : 1.సహజ వనరులు 2.ఉత్పత్తి కారకాల లభ్యత, మూలధనం 3.సమర్థవంతమైన వ్యవస్థాపన 4.ఇతరములు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...