Sunday, December 25, 2011

సివిల్స్ సందేహాలు - సమాధానాలు

దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేసినవాళ్లు సివిల్స్ రాయడానికి అర్హులేనా?

దూరవిద్యలో చదివినవాళ్లు కూడా సివిల్స్ పరీక్షలు రాసుకోవచ్చు. దూర విద్యలో డిగ్రీతో సివిల్స్ రాసి విజయం సాధించిన వాళ్లూ ఉన్నారు.

ప్రస్తుతం ఫైనల్ ఇయర్ బీఏ చదువుతున్నాను. సివిల్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చా?
ఏ కోర్సు చదువుతున్నప్పటికీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ పరీక్ష ఫలితాలు ఆగస్ట్ 2011లోగా వస్తే సరిపోతుంది. 

ఇంతకుముందు సివిల్స్‌కు దరఖాస్తు చేసుకున్నాను. ఒక అటెంప్ట్ పోయినట్లేనా?
సివిల్స్‌కి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రిలిమినరీ పరీక్ష రాయకపోతే మీ అటెంప్ట్ వృథా కాదు. అయితే, ప్రిలిమినరీ రెండు పేపర్లలో ఒక పరీక్షకు హాజరైనా మీరు ఒక ప్రయత్నం కోల్పోయినట్లే.

దరఖాస్తు నింపేటప్పుడు తీసుకోవాల్సినజాగ్రత్తలు?
పుట్టిన తేదీ సరిగా రాయాలి. ఎందుకంటే.. ఒకసారి మీ పుట్టిన తేదీని యూపీఎస్‌సీ దరఖాస్తులో పే ర్కొంటే అది ఎప్పటికీ మారదు. మీరు యూపీఎస్‌సీ నిర్వహించే ఏ పరీక్ష రాసినప్పటికీ మొదటిసారి మీరిచ్చిన పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకుంటుంది. 


ప్రిలిమినరీ దరఖాస్తులో రాసిన మెయిన్స్ ఆప్షనల్స్ మార్చుకునే అవకాశం ఉందా?
ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్త్తు చేసుకున్నప్పుడు మెయిన్స్ ఆప్షనల్ గురించి దరఖాస్తులో అడుగుతారు. వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వాళ్లు ప్రత్యేకంగా మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీ ఆప్షనల్ సబ్జెక్టులు ఎంచుకోవాలి. ప్రస్తుతం మీరు ఆప్షనల్‌గా ఏవి ఎంచుకున్నప్పటికీ మార్చుకోవచ్చు. 

డిగ్రీ పూర్తిచేశాను. సివిల్స్ రాయాలని ఉంది. పరిమిత అటెంప్ట్‌ల దృష్ట్యా నేనెప్పటి నుంచి సివిల్స్‌కు సిద్ధం కావాలి?
డిగ్రీ పూర్తికాగానే స్పష్టమైన నిర్ణయానికి రావడం సంతోషకరం. ఇప్పటి వరకు మీరు సివిల్స్‌కోసం ప్రిపేర్ కానట్టైతే ఈ ప్రయత్నాన్ని వదులుకొని వచ్చే సంవత్సరం నుంచి విరామం లేకుండా సివిల్స్ రాయడం శ్రేయస్కరం. వచ్చే సంవత్సరం జూన్‌లో ప్రిలిమ్స్ పరీక్ష రాస్తారనుకుంటే మధ్యలో 15 నెలల వ్యవధి ఉంటుంది. ఇందులో మొదటి ఆరు నెలలు ప్రిలిమ్స్, జనరల్ స్టడీస్‌పై పూర్తి దృష్టి సారించాలి. ప్రాథమికాంశాలపై పట్టుసాధించాలి. విషయ, సమాచార పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. దీనికోసం 6 నుంచి పదో తరగతి వరకు సీబీఎస్‌ఈ మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్ పుస్తకాలు క్షుణ్నంగా చదువుకోవాలి. ఆ తర్వాత సీబీఎస్‌ఈ 11, 12 తరగతుల జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ పుస్తకాలు తిరగేస్తే ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌లో జనరల్ స్టడీస్ సిలబస్ మొత్తం పూర్తిచేసినట్లే. 

వీటితోపాటు ఇండియా ఇయర్ బుక్ పబ్లికేషన్స్ డివిజన్ పుస్తకం, హిందూ పత్రికతోపాటు, ఫ్రంట్‌లైన్, యోజన, కురుక్షేత్ర లాంటి మ్యాగజీన్లు చదవడం, రాత్రి 9:15 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లిష్ వార్తలు, ఆ తర్వాత ప్రసారమయ్యే స్పాట్‌లైట్ కార్యక్రమం వినడం చేయాలి. తర్వాత ఆరు నెలల్లో అభిరుచి ఉన్న రెండు సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకొని వాటికోసం పూర్తిగా చదవాలి. ఆఖరు మూడు నెలలు మళ్లీ ప్రిలిమ్స్ కోసం ప్రిపరేషన్, రివిజన్ ప్లాన్ చేసుకుంటే మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించొచ్చు. పరీక్ష విధానం, ప్రశ్నల సరళిపై అవగాహన కోసం పాత ప్రశ్నపత్రాలు (గత ఐదేళ్లవి) బాగా పరిశీలించాలి. అర్హత ఉందికదా అని ప్రిపరేషన్ లేకుండా పరీక్ష రాయడం వృథా. పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఏడాది ప్రిపరేషన్‌తో విరామం లేకుండా సివిల్స్ రాయడమే శ్రేయస్కరం.

ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్నాను. నా లక్ష్యం ఐఏఎస్ కావడం. నేను ఎలాంటి ప్రణాళిక రూపొందిచుకోవాలి?
సివిల్స్ సాధించాలనుకునే అభ్యర్థికి విస్తృత పరిజ్ఞానం అవసరం. ఏదో ఒక అంశం లేదా సబ్జెక్టులో ప్రావీణ్యం ఉంటే సరిపోదు. అన్ని సబ్జెక్టులు/విషయాల్లో ప్రాథమిక సమాచారం తెలుసుకోవాలి. విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. తర్కం, హేతుబద్ధత, విశ్లేషణ మెరుగు పరుచుకోవాలి. ఎందుకు? ఎలా? అని ఆలోచిస్తే తర్కం అలవడుతుంది. సమాచారం సేకరించడం, విసృ్తతంగా చదవడం, ఏదైనా ఒక అంశంలో భిన్న వాదనలు వినడం/చదవడం ద్వారా హేతుబద్ధత, విశ్లేషణ, భావాల్లో పరిణతి అలవడుతాయి. మీ కాలేజీలో నిర్వహించే వక్తృత్వం, వ్యాసరచన.. లాంటి పోటీల్లో పాల్గొనండి. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్, సెమినార్లు...లాంటివాటిలో పాల్గొనడం ద్వారా ఎక్స్‌పోజర్ వస్తుంది. మీ ఇంజనీరింగ్ బ్రాంచ్‌నే ఒక ఆప్షనల్‌గా భావించి బాగా చదవండి. ఇలాచేస్తే మీరు అకడమిక్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండడమే కాకుండా సివిల్స్ రాసేసమయానికి ఒక ఆప్షనల్‌కు పూర్తిస్థాయిలో సిద్ధమైనట్లవుతుంది. సీబీఎస్‌ఈ హైస్కూలు పుస్తకాలు చదవడం, ఇంగ్లిష్ పేపర్ ప్రతిరోజూ చదవడం..ఇలా చేస్తే సివిల్స్ కోసం 50 శాతం ప్రిపరేషన్ పూరె్తైనట్లే. 

నేను బీసీ విద్యార్థిని. సివిల్స్ ఎన్నిసార్లు రాయొచ్చు? వయోపరిమితి?  
తల్లిదండ్రుల వార్షికాదాయం తక్కువగా ఉన్న బీసీలంతా ఓబీసీ కేటగిరీలోకి వస్తారు. కాబట్టి మీరు ఏడు సార్లు సివిల్స్ రాసుకోవచ్చు. పరీక్ష రాసే సంవత్సరం ఆగస్ట్ 1 నాటికి వయోపరిమితి 21-30 మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితికి లోబడి ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లైనా, ఓసీ అభ్యర్థులు నాలుగు సార్లు సివిల్స్ రాసే అవకాశం ఉంది. 

తెలుగులో రాయాలంటే అనుకూలతలు, ప్రతికూలతలు, ఏ విధంగా సిద్ధం కావాలి?
సివిల్స్ తెలుగులోనూ రాయొచ్చు. ఇలా రాసి విజయం సాధించినవాళ్లు కూడా ఉన్నారు. కాకపోతే అన్ని ఆప్షనల్ సబ్జెక్టులకూ తెలుగులో విసృ్తత స్థాయిలో మెటీరియల్ ఇంతకుముందు అందుబాటులో లేదు ప్రస్తుతం దొరుకుతున్నాయి. తెలుగులో రాయాలనుకున్నవాళ్లంతా ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా తెలుగు సాహిత్యం ఎంపికచేసుకోవాలి. 

రెండో ఆప్షనల్ విషయంలో హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్, సోషియాలజీ లాంటివి ఎంచుకుంటే మంచిది. ఏదైనా సబ్జెక్టులో మంచి పరిజ్ఞానం ఉందనుకుంటే ఇంగ్లిష్‌లో ఉన్న సమాచారాన్ని తెలుగులో నోట్సుగా సిద్ధం చేసుకునే సమర్థత ఉంటే దాన్ని కూడా ఆప్షనల్‌గా తీసుకోవచ్చు. 

మీ భావాలు ఏ భాషలో బాగా వ్యక్తీకరించగలరో ఆ భాషనే మాధ్యమంగా ఎంచుకోవాలి. ఇంగ్లిష్‌లో అన్ని ఆప్షనల్స్‌కూ విసృ్లత సమాచారం ఉంది. కానీ ఆ భాషపై ప్రాథమిక పట్టు లేకపోతే మెయిన్స్‌లో కష్టమే.

పాత ప్రశ్నపత్రాలు ఎక్కడ లభిస్తాయి?
చాలా వెబ్‌సైట్లలో పాత ప్రశ్నపత్రాలు లభిస్తాయి. గూగుల్‌లో సెర్చ్ చేస్తే కావాల్సినంత సమాచారం దొరుకుతుంది. http://upscportal.com, www.civilserviceindia.com

కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి? ఎంత ఖర్చుఅవుతుంది?
డబ్బు సమస్య కాకుంటే ఢిల్లీలో కోచింగ్ తీసుకోవచ్చు. వాజీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్, రావూస్...ఢిల్లీలో పేరున్న కోచింగ్ సెంటర్లు. ఢిల్లీ తర్వాత దేశంలో సివిల్స్ కోచింగ్‌లో హైదరాబాద్ రెండోస్థానంగా చెప్పుకోవచ్చు. ఆర్‌సీరెడ్డి, బ్రెయిన్ ట్రీ కోచింగ్ సెంటర్ల నుంచి ఏటా పదుల సంఖ్యలో అభ్యర్థులు ఎంపికవుతున్నారు. హైదరాబాద్‌లో ఐతే ప్రిలిమ్స్, మెయిన్స్ జనరల్ స్టడీస్; ఆప్షనల్ కోచింగ్, రిఫరెన్స్ పుస్తకాలు మొత్తం కలిపి ఎనభై వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. హాస్టల్ కోసం నెలకు రూ. 3 వేలు తప్పనిసరి. గది అద్దెకు తీసుకొని చదువుకోవాలంటే రూ. 5 వేలు ఆపైన ఖర్చవుతుంది. ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటే అదనంగా మరో 30-40 శాతం ఎక్కువ ఖర్చవుతుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...