Saturday, May 21, 2011

తెలుగు లిటరేచర్

telugu literature syllabus for civils , civils telugu literature , telugu sahityam for civils , upsc civils telugu literature



నాలుగు దృక్పథాలు.. నాలుగు సాధనాలు
 
తెలుగు లిటరేచర్.. సివిల్స్ మెయిన్స్ కోణంలో మన రాష్ట్ర అభ్యర్థులకు క్రేజీ ఆప్షనల్. అయితే ఇటీవల కాలంలో ఈ ఆప్షనల్‌కు మార్కులు తక్కువ వస్తున్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే ఇది అపోహ మాత్రమే. మార్కులకు ప్రాతిపదిక పరీక్షలో జవాబుల ప్రజెంటేషన్ అని గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలో తెలుగు పేపర్-2 మార్కుల సాధనలో కీలక విభాగం. వాస్తవ సమాచారానికే (అంటే సాహిత్యానికి) అధిక ప్రాధాన్యం ఉండే పేపర్-1 కంటే పేపర్-2 లోనే దృష్టి సారించాల్సిన విషయాలు అధికం. కాబట్టి పేపర్-2 ప్రిపరేషన్ తీరు తెన్నులు..


పేపర్-2లో అతి కీలకమైనవి, తప్పనిసరైనవి వ్యాఖ్యా నాలు. వీటిని అడిగే తీరు కూడా క్రమంగా మారుతోంది. మొదట్లో ప్రాచీన కవిత్వం నుంచి కేవలం ‘వ్యాఖ్య’ రాయ మని అడిగేవారు. 1983, 84లలో ఆధునిక కవిత్వంలో శ్రీశ్రీ మహా ప్రస్థానం గురించి అడిగారు. 1987లో మొదటి సారి వ్యాఖ్యానాన్ని మూడు విభాగాలుగా, మూడు దృక్ప థాల్లో (భౌతిక చారిత్రక సామాజిక; కథా రచనా శిల్పి; తాత్విక) అడిగారు. అయితే అప్పట్లో ఛాయిస్ విధానం ఉండటం అభ్యర్థులకు వెసులుబాటు కల్పించింది. 1996 లో మొదటిసారి ‘ఏ గ్రూపులను వదలకుండా’ అని పేర్కొ నడం.. దాన్ని కొనసాగిస్తుండటంతో అన్ని దృక్పథాలు చదవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
మారిన సిలబస్.. చేరిన మనస్తత్వ దృక్పథం:

పేపర్-2 విషయంలో కీలక పరిణామం 2000 సం॥సిలబస్ మారడం. అప్పటికే అడుగుతున్న మూడు దృక్ప థాలకు అదనంగా మనస్తత్వ దృక్పథం చేరింది. దీంతో అప్పట్నుంచి ఈ నాలుగు దృక్పథాలతో ప్రాచీన ఆధునిక కవిత్వాలలో వ్యాఖ్యానాలు చదవాల్సిన అవసరం ఏర్పడు తోంది. ఈ క్రమంలో ప్రిపరేషన్, జవాబును బట్టి వ్యాఖ్యా నాల వైఖరి మారుతుందని.. పాత ప్రశ్న పత్రాల వైఖరి మీదనో.. ఇతరుల సలహా మీదనో ఆధారపడటం మంచిది కాదని గుర్తించాలి.

వ్యాఖ్యానాల్లో మరో ముఖ్యమైన అంశం.. విమర్శనా పద్ధతిలో ప్రాచీన(కొన్నిసార్లు ఆధునిక) కవిత్వంలో కవిలో ని ఒక కౌశలానికి, కవిత్వానికి సంబంధించిన పద్యాన్ని మరో దృక్పథంలో అడగటం. ఉదా: ఆంధ్ర మహాభారతం కృష్ణరాయబార ఘట్టంలో ‘వచ్చెడు వాడు’ అనే పద్యాన్ని 2006లో చారిత్రక సామాజిక దృక్పథంలో అడిగారు. సామ్యవాద కవిత్వంగా ప్రసిద్ధి పొందిన ‘మహా ప్రస్థానం’ లో ‘భిక్షువర్షీయసి’ ఖండికలో ‘ఆ అద్వౌ మరణిస్తే’ అనే భాగాన్ని రెండుసార్లు పాత్ర మనస్తత్వ దృక్పథంలో వ్యాఖ్యానం అడిగారు. ఈ నేపథ్యంలో ఆయా దృక్పథాల మౌలిక అవగాహన, ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి చారిత్రక, సామాజిక, మనస్తత్వ అవగాహన ఏర్పరచు కోవాలి.

ప్రాచీన కవిత్వాన్ని చారిత్రక దృక్పథంతో:
ప్రాచీన దృక్పథాన్ని చారిత్రక దృక్పథంతో వ్యాఖ్యానించేట ప్పుడు అభ్యర్థి ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి. రాచరిక వ్యవస్థకు సంబంధించిన ప్రాచీన కవిత్వాన్ని విమ ర్శకులు భౌతిక దృక్పథంతో ఆనాటి కవులను ఆస్థాన/ ఆస్థానేతర అని వర్గీకరించారు. ఆస్థాన కవులు.. పాలకు లను, తమకు ఆశ్రయమిచ్చిన రాజులను అతిశయోక్తితో పొగిడి సామాజిక వర్గాలను విస్మరించారు. ఆనాటి రాజుల లో అణచివేసే తత్వం, అరాచకత్వం ఉన్నా ఆస్థాన కవులు పొగిడేందుకే పెద్దపీట వేశారు. ఉదా: పోతన రాసిన ప్రసిద్ధ చాటువు ‘కాటుక కంటనీరు’ అనే పద్యంలో కూడా నిన్ను కొనిపోయి ‘‘అల్ల’’(ఆ) కర్ణాట కిరీత కీచకులకు అమ్మినమ్మ’’ అని ‘ఆ’ అనే అన్నారు.

ఇలాగే ధూర్జటి, మొల్ల మొదలు.. పలువురు కవులు, కవయిత్రులు రాచరి కం పట్ల సదభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విమర్శకులు మాత్రం రాచరిక వ్యవస్థను ‘దోపడీ వర్గంగా’భావించారు. అయితే అభ్యర్థులు పరీక్షలో వ్యాఖ్యానాలు రాసేటప్పుడు ఇలాంటి వ్యక్తీకరణ చేయడం సరికాదు.

మరింత జాగ్రత్తగా మనస్తత్వ దృక్పథం:
మనస్తత్వ దృక్పథం అంటే ఆయా పద్యాలలో ప్రతిబిం బించే మనస్తత్వ అంశాలను శాస్ర్తీయంగా వివరించడం. కేవలం పాత్రల మానసిక భావ పరంపరను వివరిస్తే సరిపోదు. ఉదాహరణ: 2001లో శ్రీనాథుడి ‘గుణనిధి’ కథలో అంగోద్వర్తన వేళ నీవు అనే పద్యాన్ని మనస్తత్వ దృక్పథంలో అడిగారు. ఇందులోని శాస్ర్తీయాంశం ప్రక్షేప ణం. తనకు అంగీకారం కాని విషయాన్ని ఎదుటి వ్యక్తికి ఆపాదించడమే ప్రక్షేపణం.

అయితే ప్రాచీన కవులకి మన స్తత్వ శాస్త్రం తెలుసా? అనే అనుమానం పలువురి అభ్యర్థు ల్లో కనిపిస్తోంది. ఆ శాస్ర్తీయాంశం తెలిసినా తెలియక పోయినా మనస్తత్వం అవగాహన ఉన్న రచనల్లో ఈ అంశా లు ప్రతిబింబిస్తాయి. ఇక..మనస్తత్వ దృక్పథంలో వ్యాఖ్యా నించటమంటే ఆయా పాత్రల మాటలకు, ప్రవర్తనకు మనో విశ్లేషణ సూత్రాలను వర్తింపజేయడమే.

మనో విశ్లేషణ సూత్రాలంటే మానవమూర్తిమత్వంలో అధి (ఇడ్), అహం (ఇగో), అధ్యహం (సూపర్ ఇగో)ల తీరు తెన్నులను వివరించడమే. ఈ మూడింటి సమన్వ యంతోనే మానవ మూర్తిమత్వం రూపొందుతుంది. అధిలో పుట్టిన కోరిక సాధ్యాసాధ్యాలను అహం నిర్ణయిస్తే సంబంధిత సమాచారాన్ని అధ్యహం అందిస్తుంది. అంటే అధి, అధ్యహాలకు మధ్యవర్తిగా అహం పనిచేస్తుంది.

ఒక్కోసారి అహం, అధ్యహంల సమన్వయం సాధించలేన ప్పుడు అహం వ్యాకులతకు లోనవుతుంది. దాన్నుంచి తప్పించుకోవడానికి ‘అహం’ రక్షణ యంత్రాంగాన్ని ఆశ్రయిస్తుంది. ఇవన్నీ సగటు మానవుడి ప్రవర్తన తీరు లోని మనో విశ్లేషణాంశాలు. ఇప్పటి వరకు ప్రాచీన ఆధునిక కవిత్వంలో ఇచ్చిన పద్యాలన్నీ ‘రక్షణ యంత్రాంగానికి సంబంధించినవే’.

తాత్విక దృక్పథం:
ఇందులో ముఖ్యంగా దైవత్వానికి ఆదర్శానికి (వ్యక్తిత్వాని కి) సంబంధించినవే. 2006, 2007లలో మాత్రం సైద్ధాం తిక దృక్పథం అడిగారు. ఈ దృక్పథంలో పద్యాన్ని రాయా లంటే ఆయా రచనల పౌరాణిక, సామాజిక నేపథ్యాన్ని అన్ని కోణాల్లో పరిశీలించడం అవసరం. సౌందర్య దృక్ప థంలో మాత్రం ఏఏ అంశాలను వివరించాలో సిలబస్ లోనే స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి..ఒక పద్యానికి రసం, ధ్వని, వక్రోక్తి, ఔచిత్యం, రూప నిర్మాణ శిల్పం ఊహాచిత్ర వాదం మొదలైన అన్ని అంశాలను క్రమంగా వర్తింప జేయాలి.

ఇక.. ఇటీవల కాలంలో పద్యాల విమర్శలో నిర్మాణ శిల్పం కొత్తగా కనిపిస్తోన్న పరిశీలన. కవిత్వంలో సామాజి క విలువల కంటే సాహిత్య విలువలకే ప్రాధాన్యం ఇవ్వడం అంతకు పూర్వం రూఢిలో ఉన్న విషయాన్ని వినూత్నంగా చెప్పి పాఠకుడిలో నూతనోత్తేజాన్ని కలిగించడం భాషలో వర్ణాల ఉత్పత్తి, ఉనికి ప్రాధాన్యం ఉండటం ఈ వాదం లోని ముఖ్యాంశాలు. ఈ నేపథ్యంలో పద్య నిర్మాణంలో ఇంద్ర, సూర్య గణాల అమరిక, యతి స్థానం మొదలైన వాటిని ఈ దృక్పథంలో వివరించాలి.

పాఠ్యాంశంలో పాత్రలు- అవగాహన:
ప్రాచీన కవిత్వంలో పాత్రల తత్వాన్ని వివరించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా పాత్రల పరంగా వాడిన విశేషణ పదాల ఆధారంగా వివరించేటప్పుడు ఆ పాత్ర, విశేషణం, ఉపమానం, వ్యక్తుల పాత్రలను దృష్టిలో ఉంచుకోవాలి. దీనికి చక్కటి ఉదాహరణ: దుష్యంత చరిత్రలో ‘ఆ దుష్యంతు డనంత సత్త్యడు’. ఇందులో దుష్యంతుడికి అనంతుడితో పోలిక ఉంది. ‘అనంత’ శబ్దం విష్ణుమూర్తి పాన్పు అయిన అనంతుడిని సూచించేదే. ‘అనంతుడు’ విష్ణుమూర్తికి ‘పాయక శయ్య’ అయి అతడి తత్త్వాన్ని పుణికి పుచ్చుకున్నవాడు. కాబట్టి ఈ పదం రాజులోని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ సామర్థ్యాన్ని, విష్ణ్యంశ సంభూతత్త్వాన్ని తెలుపుతుంది.

పద్యాలు - ప్రసక్తి:
జవాబులిచ్చే సమయంలో పాఠ్యాంశంలోని పద్యాలను ఉటంకించేటప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ప్రశ్నలో ప్రత్యేకంగా ‘సోదాహరణంగా ఉటంకించండి’ అని ఉంటే తప్ప పద్యాలను పేర్కొనకూడదు. అంతేకాక పద్యాలకు ఛందస్సు ప్రాణం. ఛందోభంగం క్షమార్హం కాదు. ‘అర సున్న’, పొల్లు, హల్లు, సంధి భాగాలను రాసేటప్పుడు కొంచెం పొరపాటు జరిగినా ఛందోభంగం అవుతుంది.

కాబట్టి పద్యాలలోని భాగాలనే విసంధిగా జవాబులో మధ్యమధ్యలో ఉటంకించి రాస్తే వ్యాసం ఆద్యంతం గంభీరంగా సాగుతుంది. అంతేకాక పద్యం మొదటి భాగం.. మళ్లీ చివరి భాగం రాయడం సరికాదు. అది కేవలం పద్యం గురించి తెలుసని చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రయోజనం లేదు. పోటీ పరీక్షలో విశ్లేషణాశక్తిని పరీక్షించడమే ప్రధానం తప్ప ధారణా శక్తి కాదు.

మరికొంతమంది ప్రాచీన కవిత్వంలో ఛందస్సు కష్టం కాబట్టి ఆ భాగంలో పద్యాలు రాయకుండా ఆధునిక కవి త్వంలో గేయ ఛందస్సు సులభం కాబట్టి ఉటంకించవచ్చ ని భావిస్తారు. ఇది కూడా సరికాదు. జవాబులలో కూడా మన వ్యక్తిత్వ ముద్ర ఉంటుందనే విషయం విస్మరించ కూడదు.

భాషాడంబరానికి దూరం:
తెలుగు లిటరేచర్ అంటే ఉపమానాలు వాడాలనుకోవడం నిజం కాదు. ప్రామాణిక భాషలో సహజ సుందరంగా ఏకధారగా చెప్పే జవాబులే ఆకట్టుకుంటాయి. పేపర్-2 విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించడం కోసమేనని గుర్తించాలి. అంతగా తెలియని పదాలు విరుద్ధ పదాలు బాగా ఉన్నాయని ప్రయోగిస్తే అభాసుపాలవుతాం.

పరిమితులు వద్దు:
పలువురు అభ్యర్థులు ప్రాచీన కవుల్లో ముగ్గురిని, ఆధునిక కవిత్వంలో నలుగురైదుగురు గురించి చదివితే చాలను కోవడం. అంతేకాకుండా ప్రీవియస్ పేపర్ల ద్వారా గెస్సింగ్ కూడా సరికాదు. తెలుగును ఆప్షనల్‌గా పరిమిత సంఖ్యలో అభ్యర్థులు ఎంచుకున్న రోజుల్లో కొంత వరకు గెస్సింగ్ ఉండేది. అయితే 95 నుంచి పరిస్థితి మారింది. అన్ని పాఠ్యాంశాలను చదివితేనే ఎంతో ప్రయోజనం. ప్రశ్నలు కొన్ని లోతుగా,మరికొన్ని సూటిగా సులభంగా ఉంటాయి. మనకు అనువైన వాటిని ఎన్నుకొని అన్ని భాగాలకు సమ ప్రాధాన్యాన్ని ఇస్తూ ఇచ్చిన కాల పరిమితిలో ఆకర్షణీ యంగా జవాబులు రాయొచ్చు.

జవాబులు- జాగ్రత్తలు

ప్రశ్నలకు జవాబులు రాసే ముందు ప్రశ్నలను అర్థం చేసు కోవడం అతి ముఖ్యం. ప్రశ్నలోని క్రియాపదాన్ని బట్టి జవాబులో వివిధ అంశాలను సరైన విభాగాలు (పేరాగ్రా ఫ్)గా విభజించుకొని రాయాలి. ఒకే విధమైన ప్రశ్నలా కనిపించినా ప్రశ్న తీరుని బట్టి క్రియా పదాన్ని బట్టి, జవా బులోని అంశాల్లో మార్పులు చేర్పులు తప్పవు.

ఉదా: సుగాత్రీశారీనుల కథలో కవి ఉద్దేశించిన మానవ సహజ సౌందర్య ప్రభావాన్ని దాని పరిణామాన్ని వివరించండి (2001) అని

సుగాత్రీశాలీనుల కథలో బాహ్యమైన అలంకారాన్ని మించిన మానవ సహజ సౌందర్య విశిష్టతను పరిశీలించండి (2004) అని అడిగారు.

మొదటి ప్రశ్నలో వివరించండి అని అడిగారు. అంటే ప్రశ్నలో ప్రతిపాదించిన విషయాన్ని వివరంగా రాయ డం. పరిణామం అనే పదాన్ని విస్మరిస్తే సగం జవాబే రాసే ప్రమాదం ఉంది. ఈ ప్రశ్నకు ప్రథమ సంగమ వేళ నగలను అలంకరించుకుని వచ్చినప్పుడు శాలీనుని ఆక ర్షించలేదు. అనే విషయాన్ని సంగ్రహంగా రాసి తోటలోని సహజ సౌందర్యం శాలీనుడి ప్రేమ పొందు పొందడాన్ని వివరంగా రాయాలి.

శకుంతలోపాఖ్యానంపై 2007, 2008లలో.. కృష్ణపక్షం పై 2006, 2008 లలో ఇచ్చిన ప్రశ్నలు ఇలాంటివే.
ప్రశ్నలో కనిపించే క్రియా పదాలు.. వాటి ఆధారంగా జవాబులు ఉండాల్సిన తీరు

విశదీకరించండి: పాఠ్యాంశంలో ఉన్న కొద్దిపాటి అంశాల ఆధారంగా సంబంధితవిషయాలు సవివరంగా రాయాలి
విశ్లేషించండి: పాఠ్యాంశంలోని అంతరార్థాన్ని గ్రహించి రాయాలి
వివరించండి: పాఠ్యాంశంలో ఉన్న విషయాలు వరుసగా రాయాలి

నిరూపించండి: సాధారణంగా పాఠ్యాంశం లేదా కవి ఔన్నత్యాన్ని అడిగే సందర్భంలో ఇస్తారు. అలాంటప్పుడు అన్ని కోణాలను (కవిత్వాంశాలను) వివరించాలి.
చర్చించండి: పాఠ్యాంశంలోని ఏ విషయాన్ని అడిగారో దానికి సంబంధించి సానుకూల/ప్రతికూల విషయాలను చెప్పాలి
వ్యాఖ్యానించండి: ప్రశ్నలో అడిగిన విషయాన్ని వివరించి మన అభిప్రాయాన్ని తార్కికంగా చెప్పాలి.

2 comments:

Related Posts Plugin for WordPress, Blogger...