Wednesday, February 22, 2012

చూపు లేకున్నా ఫరువాలేదు కలెక్టర్ కావాలన్న పట్టుదల ఉంటే చాలు. నిదర్శనం ఇదే.

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhmgg4dQbueEWmdqtvFc7QNqC_YPJmVCNb-SUOJp84CXG5LqyBZR-C2d3mH2hZgz2Bh054Dd781Nn65RPZs24962XKtEwNhOGRTw-WSHkW70K93tJLcsV22xRvMDEdALCR4dtNkpGsq0Kw/s1600/IAS-blind-1-791056.jpg

సివిల్స్ సాధించండిలా!

 
దేశంలోనే అత్యుత్తమ సర్వీస్ సివిల్ సర్వీసు. సమాజంలో మమేకమై ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ అపారమైన సేవలందించాలనుకునే అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ వారధిలా నిలుస్తుంది. 
కార్యదీక్ష, కఠోర శ్రమ, సామాజిక, ఆర్థికాంశాలపై విస్తృతమైన అవగాహన, భారత రాజ్యాంగం తీరు తెన్నులు, తార్కిక విశే్లషణ, ఆలోచనా సామర్ధ్యం, నిర్ణాయక శక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్ష వరంలా నిలుస్తుంది. 
దేశంలోని వివిధ సర్వీసుల కింద ఉన్న అత్యుత్తమ ఉద్యోగాలకుగాను ఈ పరీక్షను నిర్వహిస్తారు. గత ఏడాది ఈ సర్వీసు కింద 880 మందిని ఎంపిక చేయగా ఆ సంఖ్య ప్రస్తుతం 1037కు పెరిగింది. సివిల్ సర్వీసెస్ కిందకు వచ్చే విభాగాలు :
* ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు 
* ఇండియన్ ఫారెన్ సర్వీసు 
* ఇండియన్ పోలీస్ సర్వీసు 
* ఇండియన్ పి అండ్ టి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీసు (గ్రూప్-ఏ) 
* ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ (గ్రూప్-ఎ) 
* ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (గ్రూప్-ఎ) 
* ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (ఐటి) (గ్రూప్-ఎ) 
* ఇండియన్ పోస్టల్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ (గ్రూప్-ఎ) 
* ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (గ్రూప్-ఎ) 
* ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఇండియన్ ట్రేడ్ సర్వీస్ (గ్రూప్-ఎ, గ్రేడ్-3) 
* ఇండియన్ కార్పొరేట్ ‘లా’ సర్వీసు (గ్రూప్-ఎ) 
* ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీసు (గ్రూప్-బి) 
* ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, డయుడామన్, దాద్ర అండ్ నగర హవేలీ పోలీస్ సర్వీసు (గ్రూప్-బి) 
* పాండిచ్చేరి సివిల్ సర్వీసు (గ్రూప్-బి) 
* పాండిచ్చేరి పోలీస్ సర్వీసు (గ్రూప్-బి) 
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంనుంచి బ్యాచిలర్స్ డిగ్రీ. డిగ్రీ చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మెయిన్ పరీక్ష దరఖాస్తు సమయం నాటికి అభ్యర్థులు సంబంధిత సర్ట్ఫికెట్ పొంది ఉండాలి. 
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా. వయోపరిమితి: ఈ పరీక్షకు హాజరు కాగోరు అభ్యర్థుల వయసు ఆగస్టు 1, 2012 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబిసి అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. 
దరఖాస్తు చేసే విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫీజు: 50 రూపాయలు. చివరి తేదీ: మార్చి 5, 2012 పరీక్ష తేదీ: మే 20. 
మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ 
పరీక్ష విధానం: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. రెండు పేపర్లలోను ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలుంటాయి. 
పేపర్ 1: జనరల్ స్టడీస్, 200 మార్కులు 
పేపర్2: జనరల్ ఆప్టిట్యూడ్ 200 మార్కులు 
పేపర్-1 (సబ్జెక్టువారీ వెయిటేజి): 
కరెంట్ అఫైర్స్:4 ప్రశ్నలు 
హిస్టరీ:13 ప్రశ్నలు 
జాగ్రఫీ: 8 ప్రశ్నలు 
పాలిటీ: 14 ప్రశ్నలు 
ఎకానమీ: 22 ప్రశ్నలు 
ఎకాలజీ: 18 ప్రశ్నలు 
జనరల్ సైన్స్: 21 ప్రశ్నలు 
పేపర్-2 (సబ్జెక్టువారీ వెయిటేజి) 
కాంప్రహెన్షన్: 27 ప్రశ్నలు 
డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్: 8 ప్రశ్నలు 
జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ: 28 ప్రశ్నలు 
అనలిటికల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్: 8 ప్రశ్నలు 
ఇంగ్లీష్ లాంగ్వేజి కాంప్రహెన్షన్: 9 ప్రశ్నలు 
సిలబస్ 
కరెంట్ అఫైర్స్: చరిత్ర, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్, ఎకాలజీ తదితర అంశాలపై పేపర్-1 ఉంటుంది. 
జనరల్ ఆప్టిట్యూడ్: ఇక పేపర్-2లో కాంప్రహెన్షన్, ఇంటర్ ప్రిటేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, ఇంగ్లీషు లాంగ్వేజి కాంప్రహెన్షన్ స్కిల్స్ తదితర అంశాలను పొందుపరచడం జరిగింది. 
ప్రిపరేషన్ ఇలా: కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి చోటుచేసుకున్న సంఘటనలు తాజా సమాచారంతోపాటు సంబంధిత నేపథ్యంపై పట్టు సాధించాలి. అలాగే జాతీయ ప్రభావం కలిగిన ప్రాంతీయ సంఘటనలపై కూడా దృష్టి సారించాలి. అలాగే సదస్సులు, సమావేశాల్లో విడుదల చేసిన డిక్లరేషన్లు వంటి టైటిళ్లు, ఇతర అన్ని రంగాలలో జరిగిన, జరుగుతున్న మార్పులు, సంఘటనలను ప్రతి అంశాన్నీ విడిచిపెట్టకుండా సాధన చేయాలి. 
రిఫరెన్స్ బుక్స్:
కాంపిటీషన్ విజర్డ్, కరెంట్ అఫైర్స్ పుస్తకాలు, యోజన, ఎకనమిక్ సర్వే, నేషనల్ శాంపుల్ సర్వే. 
చదవాల్సిన పుస్తకాలు:
* ఎన్‌సిఈఆర్‌టి పుస్తకాలు 
* తెలుగు అకాడమీ చరిత్ర పుస్తకాలు 
* మోడ్రన్ ఇండియా-బిపిన్ చంద్ర 
* మిడీవల్ ఇండియా- సతీష్ చంద్ర 
* ఏనె్షంట్ ఇండియా-ఆర్.ఎస్.శర్మ 
* ఇండియన్ ఇయర్ బుక్ 
* ఇండియన్ పాలిటీ-లక్ష్మీకాంత్ 
* ఇండియన్ ఎకానమీ-మిశ్రా 
* ఎకనామిక్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్-ఎంఎల్‌జింగస్ 
* ఇండియన్ ఎకానమీ-దత్ 
* ఇండియన్ ఎకానమీ- కపిల ఉమ 
* ఎ మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్ రీజనింగ్ 
* అనలిటికల్ రీజనింగ్ 
* సైన్స్ రిపోర్టర్, వివిధ జాతీయ దినపత్రికల్లో వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు, విశేషాలు.
 ప్రిపరేషన్ ఇలా:
కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి చాలా పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఏది ముఖ్యమైనదో, ఏది ముఖ్యమైనది కాదో అర్ధం కాక అభ్యర్థులు ఇబ్బంది పడుతూంటారు. అందువల్ల గతంలో ఇచ్చిన సివిల్స్ ప్రశ్నా పత్రాలను సేకరించుకుని అందులో వచ్చిన మాదిరి ప్రశ్నలను అధ్యయనం చేయడం అవసరం. అలాగే జాతీయ ప్రభావం కలిగిన ప్రాంతీయ సంఘటనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఆయా సంఘటనల మూలాన్ని కూడా గమనించాలి. అలాగే కరెంట్ ఎఫైర్స్ కోసం అభ్యర్థులు ఎక్కడి వరకు సంఘటనలను కరెంట్ అఫైర్స్ కోసం చదవాలో తెలియక ఇబ్బంది పడతారు. అయితే పరీక్ష తేదీనుంచి ఒక ఏడాది ముందు కాలం వరకు సంఘటనలను తెలుసుకుంటే సరిపోతుంది. ఇక స్టాండర్డ్ జీకే విషయంలో తేదీలకు ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్దేశిత వరుస క్రమానికి ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కరెంట్ అఫైర్స్ అన్ని రంగాలలో చోటు చేసుకునుంటాయి. అందువల్ల ఆయా రంగాలలోని మూలాలనుంచి అంశాలను అధ్యయనం చేయడంవల్ల ఆ విషయ పరిజ్ఞానం, భవిష్యత్తులో జరగబోయే మెయిన్ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది.
సలహాలు  సూచనలు:
*జీవ శాస్త్రంలో ప్రాధమిక విషయాలపై పట్టు సాధించిన అభ్యర్థులకే ఎకాలజీలో అంశాలు బాగా అర్ధమవుతాయి. ఈ విషయాన్ని గుర్తించి ఎకాలజీలోని అన్ని అంశాలను 8-12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టి పుస్తకాల ద్వారా అభ్యాసంచేయాలి. 
*ఇక ఎకానమీకి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టి పదకొండవ తరగతికి చెందిన 3ఇండియన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌తోపాటు తెలుగు అకాడమీకి చెందిన 3్భరత ఆర్థిక వ్యవస్థకు చెందిన పుస్తకాలు చదువుకోవాలి. వీటితోపాటు సిలబస్‌లో ఉన్న అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అలాగే 3యోజన2, 3కురుక్షేత్ర2 వంటి మ్యాగజైన్లు చదువుకోవడం ఉపయుక్తం కాగలదు. 
*జనరల్ సైన్స్‌కు సంబంధించి అభ్యర్థులు ముఖ్యంగా బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వంటి ప్రాధమిక సబ్జెక్టులతోపాటు టెక్నాలజీకి సంబంధించి అన్ని అంశాలను క్షుణ్ణంగా చదవాలి. సైన్స్ సబ్జెక్టులు చదవని అభ్యర్థులు సైన్సు సబ్జెక్టుని నిర్లక్ష్యం చేస్తారు. సైన్సు పదాలను గుర్తుంచుకోవడానికి ఇబ్బంది పడతారు. అయితే బేసిక్స్‌పై పట్టు సాధించినపుడే పదాలను గుర్తుంచుకోవడం సులభమవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సాధ్యమైనంత వరకు ఏ విభాగాన్నీ వదిలిపెట్టక పోవడం చాలా శ్రేయస్కరం కాగలదు. 
*పాలిటీ విషయంలో రాజ్య వ్యవస్థతోపాటు దానిని ప్రభావితం చేసే పాలనా యంత్రాంగంపై కనీస అవగాహన ఉండాలి. అలాగే ఈ విభాగంలో అడిగే ప్రశ్నలన్నీ సమకాలీన జాతీయ, అంతర్జాతీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇస్తారని గ్రహించి, ఆ మేరకు చదువుకోవడం ఉత్తమం. 
* హిస్టరీకి సంబంధించి ఆధునిక చరిత్రపై ఎక్కువ దృష్టి సారించాలి. ముఖ్యంగా జాతీయోద్యమం, దానికి సంబంధించిన అన్ని మూలాలను గురించి క్షుణ్ణంగా చదువుకోవాలి. అలాగే ఏనె్షంట్, మిడీవియల్ హిస్టరీకి చెందిన కళలు, సాహిత్యం, ఉద్యమాలు, రాజకీయ సామాజిక అంశాలకు సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. 
*జాగ్రఫీలో ప్రాధమిక అంశాలతోపాటు ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, విధానాలు, సమస్యలపై పట్టు సాధిస్తే ఈ విభాగంలో నెగ్గుకు రావడం తేలికేనని గుర్తించాలి. 
*అభ్యర్థుల్లో నిర్ణాయక శక్తిని, సమస్యను గుర్తించే లక్షణాన్ని డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగంలో గమనిస్తారు. అలాగే తార్కికంగా విశే్లషించే సామర్ధ్యాన్ని లాజికల్ రీజనింగ్ విభాగంలో గమనిస్తారు. ఈ రెండు విభాగాలలో రాణించాలంటే గ్రాహణ శక్తి, సమయ స్పూర్తితోపాటు పర్సనల్ స్కిల్స్‌ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. 
*అభ్యర్థులలోని మేథో సామర్ధ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం జనరల్ మెంటల్ ఎబిలిటీ. ఈ విభాగానికి సంబంధించి ఈక్వేషన్స్, రేషియో, ప్రపోర్షన్, వేరియేషన్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, జామెట్రీ అండ్ మెన్సురేషన్, కౌంటింగ్ టెక్నిక్స్, ప్రాబబిలిటీ, నంబర్స్ లెటర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్స్, క్యాలెండర్స్ తదితర అంశాలపై పట్టు సాధించాలి. 
*నిర్దేశిత విషయంపై అభ్యర్థికున్న అవగాహన ఏపాటిదో కాంప్రహెన్షన్ విభాగంలో నిర్ణయిస్తారు. ఈ విభాగంలో రాణించాలంటే క్రిటికల్ థింకింగ్ నాలెడ్జ్, ఇచ్చిన విషయంలో సారాంశాన్ని వెంటనే గుర్తించగలిగే నైపుణ్యం అవసరం. ఇంగ్లీషుపై ప్రాధమిక పరిజ్ఞానంతోపాటు వేగంగా చదివి అర్ధం చేసుకునే లక్షణాలుండాలి. 
*ఆయా అంశాలకు సంబంధించిన ప్రశ్నలు, జవాబులు రాబట్టేందుకు వేగం ఖచ్చితత్వం చాలా అవసరం. సబ్జెక్టుపై పట్టు, వీలైనన్ని మాక్ టెస్టులు చేయడంవల్ల ఆత్మవిశ్వాసం పెరిగి సమాధానాలు రాబట్టే ప్రక్రియలో వేగం పెరుగుతుంది. కనక నిరంతర అభ్యాసంతోనే వేగం, ఖచ్చితత్వం ఏర్పడతాయన్న విషయాన్ని గుర్తించి పరీక్షకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.

Saturday, February 4, 2012

సివిల్స్ నోటిఫికేషన్ 2012 విడుదల | UPSC Civils notification - 2012

ఇవాళ 2012 సివిల్స్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా షుమారు 1037 పోస్టులను భర్తీ చేయనున్నారు.
పూర్తి నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ నొక్కి Download చేసుకోండి.  DOWNLOAD
తెలుగులో సివిల్స్ కు సంభందించిన వివరాలకు పూర్వపు టపాలు (POSTS) లో చూడగలరు. లేదా http://civilsintelugu.blogspot.in/2012/01/2012.html   
పైన తెలిపిన లింకులో చూడగలరు.
ఎలాఆప్ప్లై చేసుకోవాలి ?
http://www.upsconline.nic.in/   ఈ సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

Friday, January 20, 2012

సివిల్స్ నోటిఫికేషన్ 2012.

  • సివిల్స్‌-2012
  • ప్రిలిమ్స్‌ నోటిఫికేషన్‌ : ఫిబ్రవరి 4, 2012
  • దరఖాస్తు గడువు తేదీ : మార్చి 5, 2012
  • పరీక్ష తేదీ : మే 20, 2012
  • మెయిన్స్‌ పరీక్ష : అక్టోబర్‌ 5, 2012 (21 రోజులు)
  • వెబ్‌సైట్‌ : www.upsc.gov.in
జాతీయ స్థాయిలో జరిగే సివిల్స్‌ సర్వీసెస్‌కున్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. దేశాభివృద్ధిలో సమర్థులైన అధికారుల్ని అందించటం సివిల్స్‌ లక్ష్యం. తొలినాళ్లలో ఈ పరీక్షపై సరైన అవగాహన, మెటీరియల్‌ లభించిక మన రాష్ట్ర అభ్యర్థులు అవకాశాల్ని కోల్పోయారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కానీ విపరీతమైన పోటీ ఉంది. అంతకంటే మించి కఠినమైన పరీక్షగా అభ్యర్థిని పరీక్షిస్తోంది. అంతేగాక మంచి అకడమిక్‌ రికార్డ్‌ కలిగి ఉన్న అభ్యర్థులు సైతం కొన్ని అపోహల్లో మునిగిపోయారు. ఇంగ్లీష్‌ మీడియం అభ్యర్థులు మాత్రమే విజయం సాధిస్తారన్నది కూడా అలాంటిదే. ఇది మాత్రం వాస్తవం కాదు. సివిల్స్‌ సాధించడానికి అకడమిక్‌ బ్యాక్‌గ్రౌండ్‌తోపాటు, సాధించాలనే తపన ఉండాలి. సివిల్స్‌-2012 నోటిఫికేషన్‌ ఫిబ్రవరిలో విడుదల కానుంది. అలాగే మన ఎపిపిఎస్‌సి కూడా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రెండు పరీక్షలను లక్ష్యం చేసుకొని సాధన చేస్తే బాగుంటుంది. ఈ నేపథ్యంలో సివిల్స్‌ విధి విధానాలు, అభ్యర్థుల సందేహాల గురించి ఇక్కడ అందిస్తున్నాం...
ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐఎఫ్‌ఎస్‌...తదితర 20కి పైగా కేంద్ర సర్వీసుల్లో అధికారుల్ని ఎంపిక చేసే ప్రక్రియే సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌. దీన్ని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చేపడుతుంది. ప్రపంచంలోనే అత్యంత క్లిష్ట ఎంపిక విధానంగా ఈ పరీక్షకు పేరుంది. ఇందులో నెగ్గుకు రావాలంటే ముందుండాల్సింది...సహనం, నేర్పు.
సివిల్స్‌ ఔత్సాహికులకు ప్రథమంగా ఉండాల్సిన ప్రధాన లక్షణం సహనం. కారణం..దీని ఎంపిక ప్రక్రియే ఏడాదిపాటు ఉంటుంది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో ఉండే ఈ ఎంపికలో ప్రిలిమ్స్‌ మే నెలలో జరుగుతుంది. చివరిదశ ఇంటర్వ్యూ పూర్తయి ఫలితాలు వెల్లడయ్యేది ఆ తదుపరి సంవత్సరం మే లోనే. ఇంత సుదీర్ఘ ప్రక్రియలో కూడి ఉండే పరీక్ష సివిల్స్‌.
శిక్షణ ఒక్కటే సరిపోదు...
సివిల్స్‌ వంటి అత్యున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్న అభ్యర్థులకు మొదటగా తలెత్తే సందేహం కోచింగ్‌ గురించే. కోచింగ్‌ తీసుకుంటేనే విజయం సాధ్యమనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు కోచింగ్‌ తీసుకోకుండానే, కేవలం ఇంటర్వ్యూ గైడెన్స్‌ తీసుకుని విజయం సాధించనవారున్నారు. సివిల్స్‌ 2009లో విజేతగా నిలిచిన దేవిరెడ్ది ప్రశాంత్‌రెడ్డి సొంత ప్రిపరేషన్‌తోనే సాధించారు.
ఇలా మరెందరో ఉన్నారు. కాబట్టి... కోచింగ్‌ అవసరం అని కచ్చితంగా చెప్పలేం. అయితే కోచింగ్‌ తీసుకోవడం మాత్రం కచ్చితంగా లాభిస్తుందని చెప్పొచ్చు. అభ్యర్థులు బలంగా ఉన్న సబ్జెక్టులకు సొంతంగా సిద్ధమై, బలహీనంగా ఉన్న సబ్జెక్టులకు కోచింగ్‌ తీసుకోవచ్చు. ఎక్కువమంది అభ్యర్థులు చేసేది ఇదే. అయితే కోచింగ్‌ వల్ల మంచి సహచరులు పరిచయమవుతారు. దానివల్ల బృంద చర్చలకు ఆస్కారం ఉంటుంది.
తెలుగు మీడియం సమస్య అవుతుందా !
సివిల్స్‌ అందుకునేందుకు కావాల్సిన పరిశ్రమ, సహనం ఉన్నవారికి ఏ మీడియమైనా ఒకటే. తెలుగు మీడియంలో సివిల్స్‌ రాసి విజేతలుగా ఎంపికైనవారెందరో ఉన్నారు. కష్టపడి చదవటమే సివిల్స్‌కు కావాల్సిన అర్హత. ఈ క్రమంలో మొదటిసారే విజయం సాధ్యం కాకపోవచ్చు. కొంతమంది మూడుసార్లు పరాజితులై చివరిదైన నాలుగో అటెంప్ట్‌లో విజయం సాధించారు. ఇలాంటి వారిని ప్రేరణగా తీసుకోవాలి. రెండు, మూడుసార్లు పరాజయాలు పలకరించినా బెదరక రెట్టించిన ఉత్సాహంతో ఎగసే కెరటంలా చెలరేగాలి. కాకపోతే ఇంగ్లీష్‌లో మెటీరియల్‌ లభ్యత ఎక్కువ. ఒకప్పుడు తెలుగులో మెటీరియల్‌ కొన్ని సబ్జెక్టుల్లోనే లభించేది. ఇప్పుడు దాదాపు అన్ని సబ్జెక్టుల్లోనూ మెటీరియల్‌ విరివిగా దొరుకుతుంది. ఇంగ్లీష్‌లో కొంచెం బలహీనంగా ఉన్న అభ్యర్థులు, ఇంగ్లీష్‌ మెటీరియల్‌తో సాధన చేయవచ్చు. తెలుగులోకి అనువదించుకుని మెటీరియల్‌ రూపొందించుకున్నా ఫరవాలేదు.
అకడమిక్‌ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా ! లేకున్నా !
చాలామంది అకడమిక్‌ పరీక్షల్లో మంచి మార్కులు సాధించనవారు మాత్రమే పోటీ పరీక్షలని నెగ్గగలరని భావిస్తారు. ఇది అపోహ మాత్రమే. ఇలాంటి భావనలను మనుసునుంచి తుడిచివేయాలి.గతంలో సివిల్స్‌ సాధించనవారిలో చాలామంది అకడమిక్‌ పరీక్షలో సాధారణ మార్కులు పొందినవారే. కాబట్టి ఎక్కడ, ఏం చదివారు అనేదానికంటే సివిల్స్‌ దృక్కోణంలో ఒక అంశాన్ని ఎలా చదివారు, ఏం గ్రహించారు, చక్కని భావవ్యక్తీకరణ ఉందా ! సరిదిద్దుకోగల నేర్పు ఉందా ! అన్నది చూస్తారు. వీటిని సమాధానాల నుండి గ్రహిస్తారు.
అదనంగా ఇంకేంటంటే...
సివిల్స్‌ ఔత్సాహికులకు అకడమిక్స్‌కు అదనంగా కొన్ని సహజ లక్షణాలు ఉండాలి. అవి...చేసే పనిపట్ల ఇష్టం, పట్టుదల, ప్రణాళిక, పరిశ్రమ, అణుకువ, అంకితభావం, ఆత్మస్థైర్యం, ఆత్మ విమర్శ, ఏ విషయం చదివినా గ్రహించడంలో స్పష్టత, వ్యక్తీకరించడంలో సరళత, వివరించడంలో సంగ్రహత. ప్రతిరోజూ రేడియో వార్తలు వినడం, వివిధ దినపత్రికలను చదవడం, చదివినదానిపై ఆలోచించి సహచరులతో చర్చించడం, సామాజిక సమస్యల పట్ల సానుభూతితో స్పందించడం. నిజాయితీతో, నిర్భయంగా, నమ్రతతో చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలగడం. వీటిని పెంపొందించుకుంటే భావి విజేతలుగా అవతరించొచ్చు.
ఇక అర్హతలేంటంటే... ( తెలిసిందే మళ్ళీ ఇంకోసారి కొత్తవారికోసం )
గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వయో పరిమితి..ఆగస్టు 1, 2012 నాటికి 21-30 ఏళ్లు. బిసిలకు మూడేళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు.
ఓపెన్‌ కేటగిరి అభ్యర్థులు వయోపరిమితికి లోబడి గరిష్టంగా నాలుగుసార్లు, ఓబిసిలు ఏడుసార్లు, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లైనా రాయొచ్చు. అయితే ఈ మూడంచెల్లో (ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూల్లో) ఎందులో విఫలమైనా మొదటి నుంచి ప్రస్థానం మొదలుపెట్టాలి. ఉదాహరణకు ఒక అభ్యర్థి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్యూలో విఫలమైతే...మళ్లీ ప్రిలిమ్స్‌ నుంచి రాయాలి. అంతేగాకుండా ప్రిలిమ్స్‌లో ఒక్క పేపర్‌కు హాజరైనా ఒక ప్రయత్నం చేసినట్టే. అత్యుత్తమ ప్రిపరేషన్‌ ఉందనుకుంటే రాయడం మంచిది.
గత దశాబ్ద కాలంగా సివిల్స్‌ ఫలితాలు, విజేతల అనుభవాలు పరిశీలిస్తే సివిల్స్‌ పరీక్ష అత్యున్నతమైనప్పటికీ...అందని ద్రాక్ష మాత్రం కాదు అని స్పష్టమవుతోంది. శాస్త్రీయంగా, ప్రణాళికబద్ధంగా సన్నద్ధమైతే ఏ నేపథ్యం ఉన్న అభ్యర్థులైనా ఇందులో విజయం సాధించడం సులభమే. కనీసం ఒక సంవత్సరం పూర్తిస్థాయి ప్రిపరేషన్‌ మాత్రం తప్పనిసరి. ఇక మొదటిసారే విజయం సాధించిన అభ్యర్థులు కూడా ఎందరో ఉన్నారు. సివిల్స్‌ పరీక్షను లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు ప్రతి రోజూ రేడియో, దినపత్రికలు, టీవీల్లోని వార్తలు, చర్చలు, వాఖ్యానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తుండాలి. వాటిపై విశ్లేషణలు చేయాలి. సమాజంలో జరిగే సంఘటనలను నిశితంగా గమనించాలి. మనోరమ ఇయర్‌బుక్‌, ఇండియా ఇయర్‌ బుక్‌, ఎన్‌సిఈఆర్‌టి 9-12 తరగతుల పుస్తకాల అధ్యయనంతో ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ శ్రీకారం చుట్టాలి.
ఆప్షనల్‌ ఎంపిక...
సివిల్స్‌ పరీక్ష క్రమంలో అత్యంత కీలక అంశం ఆప్షనల్స్‌ ఎంపిక. 2010 వరకు ప్రిలిమ్స్‌లో కూడా ఒక పేపర్‌ ఆప్షనల్‌గా ఉండేది కాబట్టి...చాలామంది అభ్యర్థులు ఒక ఆప్షనల్‌ను ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండింటికీ కలిసొచ్చేలా ఎంచుకునే వీలుంది. కానీ 2011 నుంచి ప్రిలిమ్స్‌లో ఆప్షనల్‌ విధానానికి స్వస్తి పలికారు. ఈ నేపథ్యంలో ఆప్షనల్స్‌ ఎంపిక విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అభ్యర్థులు తాము చదివిన గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టులాధారంగా మెయిన్స్‌లో ఆప్షనల్‌ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల అకడమిక్‌ స్థాయిలో పట్టున్న సబ్జెక్టులను ప్రిపేర్‌కావడంలో ఇబ్బంది ఎదురుకాదు. అయితే మూడేళ్ల డిగ్రీలో చదవని సబ్జెక్టులును సైతం ఆప్షనల్స్‌గా ఎంచుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే...మెయిన్స్‌ వ్యాసరూప సమాధానాలు రాయాల్సిన పరీక్ష. కాబట్టి బాగా పట్టున్న, విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా రాయగల సబ్జెక్టులను ఎంచుకోవడం మంచిది. అంతేకాకుండా ఆ సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్‌ లభ్యత, కోచింగ్‌ సదుపాయాలు మొదలైనవాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అవసరమైతే అంతకు ముందు సివిల్స్‌ విజేతలను సంప్రదించి వారి గైడెన్స్‌ను కూడా తీసుకోవడం ఉత్తమం.
సెలక్షన్‌ విధానం : సివిల్స్‌లో ఎంపిక విధానం మూడంచెలుగా ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్‌, ఇంటర్వ్యూ అనే మూడింట్లో అభ్యర్థులను పరీక్షిస్తారు.
ప్రిలిమ్స్‌ : ఈఏడాది నుంచి ప్రిలిమినరీ పరీక్ష తీరుతెన్నులు మారాయి. ఇంతకు ముందు వరకు జనరల్‌ స్టడీస్‌కు 150 మార్కులు, అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షనల్‌ సబ్జెక్టుకు 300 మార్కులు ఉండేవి. 2011 నుంచి పేపర్‌-2 ఆప్షనల్‌ స్థానంలో ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ప్రారంభించారు. దీంతో పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌, పేపర్‌-2 ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లు జరుగుతున్నాయి.
మెయిన్స్‌ : మొత్తం ఖాళీలను పరిగణించి...1:12 లేదా 1:12.5 నిష్పత్తిలో ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మొయిన్స్‌లో మొత్తం 9 పేపర్లుంటాయి. పేపర్‌-1 రీజనల్‌ లాంగ్వేజ్‌, పేపర్‌-2 ఇంగ్లీష్‌ కేవలం అర్హత కొరకే. వీటిల్లో సాధించిన మార్కులను ఇంటర్వ్యూ ఎంపికకు పరిగణలోకి తీసుకోరు. పేపర్‌-3 జనరల్‌ ఎస్సే, పేపర్‌-4, 5 జనరల్‌ స్టడీస్‌ ఉంటాయి. మిగతా నాలుగు పేపర్లు అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షనల్స్‌ పేపర్లు. ఒక్కో ఆప్షనల్‌కు రెండు పేపర్లు ఉంటాయి. మెయిన్స్‌ పేపర్లన్నీ డిస్క్రిప్టీవ్‌ విధానంలోనే ఉంటాయి.
ఇంటర్వ్యూ : మెయిన్స్‌లో పొందిన మార్కుల ఆధారంగా ఒక్కో ఖాళీకి 1:2 లేదా 1:2.5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇది మూడొందల మార్కులకు జరుగుతుంది. చివరికు మోయిన్స్‌, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను కలిపి మెరిట్‌ ప్రకారం ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
చదవాల్సిన పుస్తకాలు...
  • ఇండియా ఇయర్‌ బుక్‌, 
  • యోజన, 
  • ఎకనామిక్‌ సర్వే, 
  • ది హిందూ దినపత్రిక, 
  • ఇండియా పాలిటీ-లక్ష్మీకాంత్‌, 
  • ఇండియన్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌-ఆర్‌.కె.అరోరా, 
  • కానిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇండియా-పిఎం.భక్షీ, 
  • ఏన్షియంట్‌ ఇండియన్‌ హిస్టరీ-ఆర్‌.ఎస్‌.శర్మ, 
  • మిడీవల్‌ ఇండియన్‌ హిస్టరీ-సతీష్‌ చంద్ర, 
  • మోడ్రన్‌ ఇండియన్‌ హిస్టరీ-బిపిన్‌ చంద్ర, 
  • మోడ్రన్‌ అప్రోచ్‌ టు వెర్బల్‌ రీజనింగ్‌-ఆర్‌.ఎస్‌.అగర్వాల్‌, 
  • అనలిటికల్‌ రీజనింగ్‌- పాండే, 
  • క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌-ఆర్‌.ఎస్‌.అగర్వాల్‌.

Wednesday, January 18, 2012

ఐ. ఎ. ఎస్. వైపే మ్రోగ్గు.

సమాజంలో ఉన్నతహోదా అంటే ఏ ఐఏఎస్సో. ఐఎఫ్‌ఎస్సో చదవాలన్న భావన నేటితరంలో బలంగా నాటుకుపోయిందన్నది వాస్తవం. ఆ దిశలోనే యువతరం సివిల్‌ సర్వీస్‌ల పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేందుకు రేయింబవళ్ళు పుస్తకాలతో కుస్తీ పడుతూనే ఉండటం గమనిస్తూనే ఉంటాం.
ఇందులో ఉత్తీర్ణులైన టాపర్లు సైతం ఐఎఫ్‌ఎస్‌ కన్నా ఐఎస్‌కే ప్రాధాన్యత ఇస్తుండటంతో దీని క్రేజీ మరీ పెరిగిపోతోందన్నది నిజం. అధికార దర్పంతో పాటు తక్కువ సమయంలోనే ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు, ఇన్నాళ్ళూ.. తానైతే ఇలా చేస్తానంటూ.. కలలు కన్న సమాజసేవ పనులు చేస్తూ మానసికంగా సంతృప్తి పొందటం ఒకటైతే.. అన్నింటికి మించి ఉద్యోగ భద్రత, సాంఘిక హోదా లభించే తీరు కూడా చాలా మేరకు ఐఏఎస్‌ వైపు ఆకర్షిస్తోందనటంలో సందేహం లేదు.
న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులు ఎన్ని తరహా న్యాయాలు చెప్పి ప్రజా హర్షాతిరేకాలు పొందినా.. జనం మధ్యకు రాలేరు. కానీ సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు. నిత్యం జనం మధ్య తిరుగాడుతూ వారి సమస్యల పరిష్కారానికి రాజ్యాంగ పరంగా వందలాది పదవులను అనుభవించే అవకాశాలు బోలెడున్నాయి.
ఉద్యోగంలో చేరిన మరుక్షణం నుండి కనీసం మూడు దశాబ్దాల పాటు దేశ, రాష్ట్రపాలనా వ్యవస్థలలో అంతర్భాగమై దేశ భవిష్యత్‌ని నిర్దేశించే వినూత్న అవకాశం సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగులదే అనటంలో సందేహం లేదెవ్వరికీ. ముఖ్యమంత్రి తరువాత రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుండి ప్రధాని పదవి తరువాత ఉన్నత పదవిగా భావించే కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి పదవి వరకు సివిల్‌ సర్వీసు ఉద్యోగులు ఎదిగే అవకాశాలున్నాయి.

సివిల్స్ అంటే ఎందుకు భయం.?

ప్రపంచంలోనే అతి క్లిష్టతరమైన  పరీక్షలలో ఒకటి "సివిల్స్". దేశంలోనే ప్రధానమంత్రి తర్వాత అత్యున్న స్థానానికి ఎదగడానికి దోహదపడే ఒకేఒక మార్గం ( రాజకీయ పరంగా కాకుండా ) సివిల్స్. 
 http://www.linkingsky.com/images/civil-services.jpg
సంవత్సరాలుగా రాసి రాసి విసుగేత్తక మళ్ళీ తమ పోరాట పటిమను చుపాలనుకునే అలుపెరుగని దీరుల ఆశాదీపిక ఈ సివిల్స్. పట్టా పొందిన కుర్రాడి నుండి చివరి చాన్స్ ఉన్న ఆశావాహుల వరకూ ఎంతో మందికి సివిల్స్ ఒక కలగానే మిగిలిపోతోంది. 
 సరైన మార్గం చూపే వారులేకనో, సమాచార లోపం వల్లనో , ఇంగ్లీషులో చదివే వాళ్ళే రాయొచ్చు అనే అపోహలవల్లనో, పుస్తకాల లభ్యత కొరవడడం వల్లనో, కోచింగ్ కోసం లక్షలు వెచ్చించాల్సి వస్తుందనో ఇంకా ఇతర కారణాల మనలో వల్లనో అనేకమంది ఈ సివిల్స్ పరీక్షను అందని ఆకాశం అని అనుకుంటున్నారు.
నేను కూడా "సాధించగలను" అనే ఒక్క నమ్మకం , ఆత్మ విశ్వాసం ఉంటే చాలు. IAS, IPS, IRS, IFS, ....  మీ వాకిట్లో వాలాల్సిందే.! నిజం.!  ప్రణాళికా బద్ధమైన ప్రిపరేషన్, వాడిపోని విశ్వాసం , కోరవడని కాంక్ష, అణగద్రోక్కినా పదింతలు పైకి లేచే తత్వం లాంటివి చాలా అవసరం. 
ఇక  సివిల్స్ ప్రిలిమ్స్  నోటిఫికేషన్ ఫిబ్రవరి 4 న విడుదల కానుంది. మార్చి 5 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. మే 20 వ తేదీ ఆదివారం ప్రిలిమినరీ పరిక్ష జరుగనుంది. 

అప్లికేషన్ వేశామా, ఎక్షామ్ రాశామా అన్నట్లు కాకుండా కొద్దిగా బుర్ర పెట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ప్రిలిమ్స్ గట్టెక్కడం కష్టమేమీ కాదు. తెలుగు మీడియం రాసే అభ్యర్థులు జాగ్రత్త .! తెలుసు కదా .!  ప్రిలిమ్స్ ఇంగ్లిష్ లో రాయాలని . ఒక మంచి డిక్షనరీ, పెన్సిల్  పెట్టుకోండి. అర్థం తెలియని పదాలు కనిపిస్తే అండర్ లైన్ చేసి అక్కడే పెన్సిల్తో తెలుగు అర్థం రాసేసుకోండి. ఇంకోసారి చదివేటపుడు సులువవుతుంది. తెలుగు తో పాటు ఇంగ్లిష్ పేపర్ కూడా చదవడం ప్రారంబించండి.   

చివరగా  ఒక డైలాగు....
------- మీకంటే తోపు లేడెవ్వడిక్కడ. చదవాలనుకుంటే కసిగా చదివేసేయండి.------ 
     

Monday, January 16, 2012

అసలు "జనరల్ స్టడీస్" లో ఏముంటాయి?

అసలు జనరల్ స్టడీస్ అంటే అంటే ఏమిటి? దానికోసం ఎలాంటి అంశాలు చదువు కోవాలి? అనే అంశాలు తికమక పెడుతూ ఉంటాయి. ఈ నేపద్యంలో సివిల్స్ ప్రిలిమినరీ కోసం జనరల్ స్టడీస్ పూర్వ ప్రశ్నాపత్రాల ఆధారంగా ఎ ఎ అంశాలు ప్రిపేర్ అవ్వాలో వేటిలో పట్టు సాధించాలో కొద్ది సమాచారం మీకోసం.


అంశం
మార్కులు
భారత దేశ చరిత్ర 
5-7
ఇండియన్ నేషనల్ మూమెంట్
7-10
ప్రపంచ మరియు భారత దేశ భూగోళ శాస్త్రం
20-38
పాలిటి మరియు గవర్నెన్స్
12-14
ఎకానమి మరియు సాంఘీకాభివృద్ది
16-32
పర్యావరణ శాస్త్రం
10-15
జనరల్ సైన్స్ ఫిజిక్స్
10-12
జనరల్ సైన్స్ బయో సైన్సెస్
12-20
జనరల్ సైన్స్ కెమిస్ట్రీ
8- 11
జెనరల్ నాలెడ్జ్
2-5
కర్రెంట్ అఫ్ఫైర్స్
5-20

Friday, December 30, 2011

జనరల్ స్టడీస్ : పుస్తకాలు

జనరల్‌ స్టడీస్‌..ఈ పేరు, పేపర్‌ పలు విద్యాఉద్యోగ పరీక్షల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. సివిల్స్‌, గ్రూప్స్‌, జూనియర్‌ లెక్చరర్స్‌, ఎస్సై, కానిస్టేబుల్స్‌...ఇలా అనేక పరీక్షల్లో అభ్యర్థులు రాయాల్సిన కామన్‌ పేపర్‌ జనరల్‌ స్టడీస్‌. ఇందులో ఏ..ఏ..అంశాలు వస్తాయి. దీని పరిధి ఏంటి ! సివిల్స్‌కు, కానిస్టేబుల్స్‌కు ఒకే విధంగా ప్రిపేరవ్వాలా ! వంటి సందేహాలను తీర్చడానికి
ఇక్కడ అనేక విషయాలు ఇస్తున్నాం...
ఏ పోటీ పరీక్ష పరీక్షకైనా విద్యార్థి సిద్ధమవ్వాలంటే...మూడంచెలను పాటించాలి. 
1.సిలబస్‌ను చదివి, సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. 
2.పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి, అడిగిన తీరును అవగాహన చేసుకోవాలి. 3.సిలబస్‌లోని అన్ని జనరల్‌ ఏరియాస్‌ చదవటంతోపాటు పరీక్షలో రావటానికి అవకాశమున్న ధోరణులపై (పూర్వ ప్రశ్నల ఆధారంతో) దృష్టి పెట్టాలి.
------------------------------- @@@@@ ---------------------------

సివిల్స్‌కైనా, కానిస్టేబుల్‌ పరీక్షకైనా ఇదే విధానం వర్తిస్తుంది. కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. ముందుగా జనరల్‌ స్టడీస్‌లో ఏ విషయాలు వస్తాయి. వాటని ఎలా అధ్యయనం చేయాలన్నది తెలుసుందాం.
ఇందులో వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జ్‌, భారతదేశ చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ-పాలన, జనరల్‌ సైన్స్‌, సాంఘిక ఆర్థికాభివృద్ధి, భారత, ప్రపంచ భౌగోళిక పరిస్థితులు...వీటన్నింటినీ చదివి, అర్థం చేసుకొని, ప్రతీదాంట్లో ప్రావీణ్యం సాధించటం ఎవరికైనా అసాధ్యం. మరేం చేయాలి ! తార్కికంగా చూసినా ఉన్న మార్గం - ట్రెండ్స్‌కు గుర్తించి, అనుసరించటమే. అయితే అసలైన సమస్య ఇక్కడే ఉంది. ఇతర పోటీ పరీక్షల మాదిరి సివిల్స్‌, గ్రూప్స్‌లో జనరల్‌ స్టడీస్‌ ప్రశ్నలను ఊహించటం కష్టమే. అంటే గతానుభవాల ఆధారంగా భవిష్యత్తులో ప్రశ్నలను ఊహించలేం.
ముఖ్యంగా మన జ్ఞాపకశక్తిని పరీక్షించే విధంగా కొన్ని ప్రశ్నల్ని సెట్‌ చేస్తారు. రీజనింగ్‌ విభాగమూ ఉంటుంది. అంటే వీటిని ముందుగా అర్థం చేసుకోవటం కష్టం. పేపర్‌ సెట్‌ చేసిన వారి ఉద్దేశం...సమాధానాన్ని కనిపెట్టడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోవాలనే ఎత్తుగడ. ముఖ్యంగా ఈ తరహా సివిల్స్‌, గ్రూప్స్‌లో కనిపిస్తుంది. ఇక కానిస్టేబుల్స్‌, విఆర్‌ఓ, విఆర్‌ఎ, గ్రూప్‌-డి స్థాయి ఉద్యోగాల్లో జనరల్‌ స్టడీస్‌ పదో తరగతి స్థాయిలోనే ఉంటుంది.
భారత జాతీయోద్యమం, భారత రాజ్యాంగ వ్యవస్థ, సాంఘికార్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టితో ప్రాథమిక ఆర్థిక అవగాహన, భూగోళవ్యవస్థ....మొదలైనవి అందరూ చదవాల్సిన అంశాలు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులు ఈ విషయాల్లో చాలా లోతుగా అధ్యయనం చేయాలి. ఇక ట్రెండ్స్‌ విషయానికొస్తే...వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జ్‌, వీటికి తగిన నిర్వచనం ఇవ్వలేం. సిలబస్‌ అంటూ పేర్కొనలేం. గత సంవత్సరకాలంగా జరిగిన వర్తమాన వ్యవహారాలు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రకటించిన పథకాలు, పేరొందిన పథకాలు, వివిధ నివేదికలు, వాటి ప్రస్తావనలు, కమిషన్లు, దేశంలోని జరిగిన ముఖ్య సంఘటనలు...ఇలాంటివెన్నో. దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన విషయాల్ని నోట్‌ చేసుకుంటే సరిపోతుంది. ఈ విభాగంలో మనం ఎంత సాధిస్తే అంత మంచిది. మంచి స్కోరింగ్‌కు అవకాశముంది. మోడల్‌ పేపర్లు సాధన చేస్తే అవగాహన వస్తుంది. గ్రిప్‌ దొరుకుతుంది.

------------------------------ @@@@@@@@ --------------------------

సివిల్స్‌, గ్రూప్స్‌కు సిద్ధమయ్యేవాళ్లు, తెలుగు మీడియం విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయి.
అవి...
  • ఎన్‌సిఈఆర్‌టి ప్రాథమిక పుస్తకాలు, 
  • తెలుగు అకాడమీ ప్రచురణలు, 
  • హ్యుమానిటీస్‌ (ఇండియన్‌ పాలిటీ, సోషియాలజీ)లలో అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఎ. పుస్తకాలు, 
  • తెలుగు, ఆంగ్ల వార్తపత్రికలు, 
  • పబ్లికేషన్స్‌ డివిజన్‌ 'ఇండియా ఇయర్‌బుక్‌', 
  • తెలుగు, ఇంగ్లీష్‌లలో ప్రచురితమయ్యే 'యోజన'.
తెలుగు మీడియం నేపథ్యమున్నవారు మరీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్‌ అంశాలతో తేలిగ్గా పరిచయం పెంచుకోవచ్చు. ముఖ్యంగా సివిల్స్‌ పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2లో కొన్ని విషయాలపై ప్రశ్నలుంటున్నాయి. అవి... 
  • కాంప్రహెన్షన్‌, 
  • ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌, 
  • కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, 
  • లాజికల్‌ రీజనింగ్‌, 
  • అనలిటికల్‌ ఎబిలిటి, 
  • డెసిషన్‌ మేకింగ్‌, 
  • ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, 
  • జనరల్‌ మెంటల్‌ ఎబిలిటి, 
  • బేసిక్‌ న్యూమరసీ (పదో తరగతి స్థాయి), 
  • ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌ ( పదో తరగతి స్థాయి).
గత ఏడాది కాంప్రహెన్షన్‌ విభాగం నుంచి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఇది కొనసాగుతుంది. క్లిష్టత స్థాయి కూడా యధావిధిగా ఉంటుంది. గణితంలో ప్రశ్నల సంఖ్య అలాగే ఉండొచ్చు. కానీ క్లిష్టత స్థాయి పెరగవచ్చు. డెసిషన్‌ మేకింగ్‌లో ప్రశ్నలు కూడా పెరిగే అవకాశముంది. పూర్తిగా పరిణామశీల అంశాలతో కూడి వుంటుంది. అంటే ఇప్పటి పరిస్థితులతో అప్లై చేసి అడుగుతారు. ఈ పేపర్లో మంచి స్కోరింగ్‌ చేయాలంటే...కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇందులో అడిగే అంశాలన్నింటిలో పట్టు సాధించటం సాధ్యం కాదు. అందుకని గరిష్ట మార్కులు సాధ్యమయ్యే అంశాలను ఎంచుకోవటం మేలు. ప్రస్తుత తరుణంలో సాంప్రదాయకంగా స్కోరింగ్‌గా ఉన్న అంశాలను పరిష్టపరుచుకోవడం మంచింది. ఈ సూత్రం అన్ని రకాల పరీక్షలు రాసే అభ్యర్థులకు వర్తిస్తుంది. దీనివల్ల మన ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. మన సమయాన్ని, శక్తిని వృధా చేసే వాటి నుంచి తప్పుకోవటం తెలివైన పని. లక్ష్యసాధనకు సులువైన పని.
క్వాంటిటేటివ్‌ విభాగంలో సంఖ్యలను అర్థం చేసుకోవటం జాతీయ స్థాయి పరీక్షల్లో కొంచెం కష్టమే. వీటి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అభ్యర్థులు సాధనతో ఈ కష్టమైన అంశాన్ని సలభతరం చేసుకోవచ్చు. ఈ విభాగాన్ని సెట్‌ చేయడం వెనుకున్న ఉద్దేశం...అభ్యర్థి సమయాన్ని హరించటమే. సరైన సాధన ఉంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. వీలైనంత ఎక్కువ స్కోరింగ్‌ చేస్తే విజయానికి దగ్గరవుతాం. ఇంగ్లీష్‌పై పట్టులేనివారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి పదో తరగతి లోపే ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందొద్దు. అలాగే సిలబస్‌లో లేని అంశాలపై లోతైన అధ్యయనం చేయటం వృధా. మన ప్రిపరేషన్‌ క్లిష్టంగా మారుతుంది.
అభ్యర్థులకు ఉపయోగపడే పుస్తకాలు : 
  • ఆర్థమెటిక్‌లో ప్రాథమిక పుస్తకాలు. 
  • మౌలిక విషయాలు తెలిపే ఇంగ్లీష్‌ బుక్స్‌, 
  • ఇగ్నో ప్రచురించిన ఫంక్షనల్‌ ఇంగ్లీష్‌ పుస్తకాలు, 
  • బ్యాంకింగ్‌ పరీక్షల పాత మోడల్‌ పేపర్లు, 
  • ఇంగ్లీష-తెలుగు నిఘంటువు.
ఏ ఉద్యోగ పరీక్ష అయినా అడిగే విధానం ఒకేవిధంగా ఉంటుంది. కానీ ప్రశ్నల స్థాయి వేరు వేరుగా ఉంటుంది. సమయ నిర్వహణపై సాధన లేకుండా ప్రశ్నలను ఎదుర్కొనలేం. కాబట్టి మోడల్‌ పేపర్లు సాధన చేయాలి. తద్వారా సబ్జెక్‌పై, ప్రశ్నలపై అవగాహన ఏర్పడుతుంది. మనం ఇంకా ఎలా సిద్ధమవ్వాలి అన్నది తెలుస్తుంది.
 
ALL THE BEST

Sunday, December 25, 2011

క్విట్ ఇండియా ఉద్యమం.

జనరల్ స్టడీస్
ఉద్యమ సమీక్ష: ఉద్యమ పరమోద్దేశ్యమైన పూర్ణ స్వరాజ్‌ను ఉద్యమం సాధించలేకపోయింది.
1.
ఉద్యమ గమనం కొన్ని ప్రతికూల ఫలితాలకు దారితీసింది. ఉద్యమ వైఫల్యం ముఖ్యంగా కార్మిక కర్షక వర్గాలను గొప్పగా నిరాశపరిచింది. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన ఈ వర్గాలు ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం ప్రయత్నించాయి. ఫలితంగానే రైతాంగం కేవలం తనదైన అఖిల భారత కిసాన్ మహాసభను ఏర్పరుచుకోగలిగింది.
2.
కార్మిక వర్గాలలోను కాంగ్రెస్ పట్ల నిరాసక్తత ఉద్యమ వైఫల్యంవల్ల చోటు చేసుకుంది. కార్మిక సంస్థలు ముఖ్యంగా ట్రేడ్ యూనియన్లపై కాంగ్రెస్ తన పట్టును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఉద్యమ వైఫల్యం వల్ల ఎఐటియుసిలో కాంగ్రెస్ స్థానంలో కమ్యూనిస్టులు బలపడ్డారు.
సహాయ నిరాకరణోద్యమం వైఫల్యం ఏవిధంగానైతే స్వరాజ్ పార్టీ ఆవిర్భావానికి దారి తీసిందో శాసనోల్లంఘటన ఉద్యమ వైఫల్యం కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఆవిర్భావానికి కారణమైంది. ఉద్యమ వైఫల్యంతో అసంతృప్తి చెందిన కాంగ్రెస్ వాదులు ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్ నారాయణ్, అచ్యుత పట్వర్ధన్ మరియు అరుణా అసఫలీలు 1934 బాంబే సమావేశంలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని స్థాపించారు.
ఉద్యమం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయినప్పటికీ ప్రతికూల ఫలితాలనిచ్చినప్పటికీ కొంతమేరకు చెప్పుకోదగ్గ విజయాలను సాధించింది.
ఉద్యమంతో కాంగ్రెస్ పార్టీ ఒక పరిపూర్ణ ప్రజా విప్లవ సంస్థగా అవతరించింది. ఉద్యమంతో కాంగ్రెస్ పార్టీ పంథాలోనే స్పష్టమైన మార్పు చోటుచేసుకుంది. స్వయం పరిపాలన, స్వదేశీ స్థానంలో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యానికి పిలుపునిచ్చింది.
ఉద్యమంలో సహాయ నిరాకరణకు బదులు శాసనోల్లంఘనచోటుచేసుకోవడంతో కాంగ్రెస్ పోరాట పంథాలోనే స్పష్టమైన మార్పు చోటుచేసుకుంది.
స్వదేశీ వనరులు, స్థానికులకు ఉపకరించాలనే వాదాన్ని ఉద్యమం సమర్ధవంతంగా తమ ఉప్పు సత్యాగ్రహాలలో చాటి చెప్పగలిగింది. స్వాతంత్రోద్యమంలో మొట్టమొదటిసారిగా స్ర్తిలు చైతన్యవంతమైన పాత్రను పోషించడానికి మరియు ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి ఉద్యమం తోడ్పడింది. స్వాతంత్రోద్యమ భావాలు సరిహద్దు ప్రాంతాలైన ఆఫ్గనిస్తాన్‌లోకి ప్రవేశించడానికి కూడా ఉద్యమమే కారణమైంది.
ఉద్యమం తన తక్షణాశయాలను సాధించడంలో విఫలమైనప్పటికీ ఒక దశానుక్రమంగా మరియు క్రమానుగతంగా కాంగ్రెస్ బలపడడానికి తోడ్పడిందని చెప్పవచ్చు.
క్విట్ ఇండియా ఉద్యమం
స్వాతంత్రోద్యమంలో చిట్టచివరి ఉద్యముమ. గొప్ప విశిష్టతను సంతరించుకున్నది. పోరాటంలో నాయకత్వం లేని ఉద్యమంగా ఇది ప్రారంభమైంది. అహింసా వాదియైన గాంధీ ఒక అరాచక వాదిగా మారడానికి ఉద్యమం కారణమైంది.
ఉద్యమానికి దారి తీసిన కారణాలు: ఉద్యమానికి దారి తీసిన పరిస్థితులు 2 ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ముడిపడి ఉన్నాయి. 1939లో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాలతో సంప్రదించకుండానే గవర్నర్ జనరల్ లిన్ లిత్‌గో భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వామురాలిగా చేస్తూ ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యాయి. రాజకీయాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. యుద్ధ నేపథ్యంలో ప్రభుత్వానికి సహకరించినందుకుగాను ఏమి ప్రతిఫలంగా ఇవ్వబోతున్నారో చెప్పకుండానే భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వాములు చేయడం,పైగా అత్యంత కీలక రక్షణ శాఖను భారతీయులకు ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర అభ్యంతరకరమైంది.
1940
ఆగస్టు ప్రతిపాదనల్లో గవర్నర్ జనరల్ లిన్‌లిత్‌గో రక్షణ శాఖ తప్పించి మిగిలిన శాఖలను ఇవ్వడానికి అంగీకరించడం, యుద్ధానంతరం అధినివేశ ప్రతిపత్తి కల్పించడానికి మరియు రాజ్యాంగ నిర్మాణ సమితి ఏర్పాటు చేస్తామని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీని నిరాశపరచడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనలను తిరస్కరించింది. భారత రాజకీయాలలో నెలకొని ఉన్న పరిస్థితి గాంధీకి ఒక నైతిక సమస్యగా పరిణమించింది. తనను తాను రక్షించుకోలేని ఇంగ్లండ్ కనీసం భారతదేశాన్ని రక్షించుకునే బాధ్యతను భారతీయులకు ఇవ్వకపోవడం గాంధీని కలవరపరిచింది. ఈ స్థితిలో గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సామ్రాజ్య వాదము గణనీయంగా విస్తరించింది. ఆసియాలో ఇంగ్లండ్ వలసలైన ఇండోనేషియా, మలయా ద్వీపములు మరియు సింగపూర్‌ను జపాన్ ఆక్రమించింది. భారతదేశం కూడా బ్రిటిష్ వారి వలస కనుక దాడి తప్పదని హెచ్చరించింది. పైగా విశాఖపట్నం రేవు పట్టణాలపై దాడికి పాల్పడింది. జపాన్ దురాక్రమణ జరిగితే భారతదేశ పరిస్థితి ఏమవుతుందో అనేది కాంగ్రెస్‌కు సమస్యగా పరిణమించింది.
1942
మార్చి 24న వచ్చిన క్రిప్స్ రాయబారము భారతీయ నాయకత్వాన్ని నిరాశపరిచింది. 1940 ఆగస్టు ప్రతిపాదనల్ని పునరుద్ఘాటించిన క్రిప్స్ సమస్యలను మరింత క్లిష్టతరం చేస్తూ మైనారిటీ ముస్లింలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికార ముందని ప్రకటించాడు. పరోక్షంగా పాకిస్తాన్ అన్న ఆలోచనకు మద్దతు పలికాడు. తీవ్ర నిరాశకు గురైన గాంధీ ప్రతిపాదనలను దివాళా తీసిన బ్యాంకు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్స్‌గా విమర్శించాడు. పరిష్కార మార్గంగా ఉద్యమానికి సిద్ధమైనాడు.
ఉద్యమానికి ఇతర కారణాలు కూడా తోడ్పడ్డాయి.
1.
ప్రపంచ యుద్ధం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. కార్మిక వర్గాల్లో అశాంతి నెలకొన్నది
2.
యుద్ధ సమయంలో అధికార రహస్యాల చట్టాన్ని ప్రయోగించి మానవ హక్కులు హరించివేయబడ్డాయి.



 
Related Posts Plugin for WordPress, Blogger...