Sunday, June 26, 2011

బాలల అధ్యయన పద్ధతులు . సైకాలజీ సివిల్స్, గ్రూప్-1 , 2 రిక్రూట్‌మెంట్‌..!!

పిల్లల నిజ ప్రవర్తనను సామాన్య పరిస్థితులలో గమనించడానికి బాల అధ్యయన విధానాలను కూడా ఉపయోగించడం జరుగుతుంది. అవి:
* ఉపఖ్యానక పద్ధతి: పిల్లల జీవితంలో కొన్ని సంఘటనలను పరిశీలించి కొన్ని ఉద్దేశాలను ప్రకటించడం జరుగుతుంది. ఈ సన్నివేశాల సంపుటిని ‘ఉపఖ్యానక రికార్డ్’ (Ancedotal record) అంటారు.
* ప్రశ్నావళి పద్ధతి: ఈ పద్ధతిలో సేకరించవలసిన విషయాలను ముందుగా నిర్థారించుకుని, అందుకు అనుగుణంగా ప్రశ్నలను రూపొందించుకోవాలి. వీటికి సాధారణంగాఅవును లేదా కాదు, నిజం లేదా అబద్ధం లాంటి రూపంలో సమాధానాలను ప్రశ్నావళిలో గుర్తించవలసి ఉంటుంది.
* ఇంటర్వ్యూ పద్ధతి: ముఖాముఖిగా వ్యక్తితో ముచ్చటించడాన్ని ఇంటర్వ్యూ లేదా పరిపృచ్ఛ అంటారు. ఇది ఒక రకంగా వౌఖిక ప్రశ్నావళి వంటంది. ఇంటర్వ్యూ రెండు రకాలు.
* సంరచిత ఇంటర్వ్యూ (Structured Interview):
ఇందులో ముందుగానే ప్రశ్నలు రూపొందించుకుని జవాబులు రాబట్టి నమోదు చేయడం జరుగుతుంది.
* అసంరచిత ఇంటర్వ్యూ (Unstructured Interview):
ఇందులో సమయానుకూలంగా ప్రశ్నలు వేసి సమగ్రంగా విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఈ పద్ధతినే ‘అనిర్దేశిక ఇంటర్వ్యూ’ అని కూడా అంటారు. అనిర్దేశిక ఇంటర్వ్యూ పద్ధతి గురించి చెప్పిన శాస్తవ్రేత్త కార్ల్ రోజర్స్.
* ప్రక్షేపక విధానాలు: వ్యక్తి అచేతనంలో దాగివున్న స్వగత అనుభవాలు గాని, అణచబడిన కోరికలుగాని, అవ్యక్త ప్రవర్తనగాని, అంతర్గత భావాలుగాని ఊహాకల్పిత ప్రతిస్పందనలు గాని ప్రక్షేపక విధానాలలో బహిర్గతమవుతాయి.
* సాంఘికమితి సాధనాలు: ఇతరుల పట్ల వ్యక్తుల వైఖరి తెలుసుకునే సాధనాలలో సాంఘికమితి సాధనం ఒకటి. దీనిని రూపొందించిన శాస్తవ్రేత్త జె.ఎల్.మొరినో. ఒక సమూహంలో గల సభ్యులకు ఒక్కొక్కరికి ఆ సమూహంలో గల స్థానం తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. దీని ద్వారా అందరూ ఇష్టపడే వ్యక్తిని ‘స్టార్’గా ఎవరూ ఇష్టపడని వ్యక్తిని ‘ఏకాకి’గా గుర్తించవచ్చు.
విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంవల్ల ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనాలు
ఉత్తమ ఉపాధ్యాయుడు మంచి మనస్తత్వ శాస్తవ్రేత్త అయి ఉండాలి. విద్యార్థి గురించిన అవగాహన బోధనాపద్ధతులు, క్రమశిక్షణ, కాల నిర్ణయ పట్టిక, వైయక్తిక భేదాలు, పాఠశాల నిర్వహణ మొదలైన విషయాలపైన విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉపాధ్యాయునికి జ్ఞానాన్ని అందజేస్తుంది.
* విద్యార్థి గురించిన అవగాహన: విద్యార్థి ప్రజ్ఞాపాటవాలను, మూర్తిమత్వాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, అభిరుచులను తెలుసుకోవడానికి తద్వారా తగిన పాఠ్యాంశాలను బోధించడంలో విద్యా మనో విజ్ఞాన శాస్త్రం ఉపయోగపడుతుంది.
* పాఠ్య పుస్తకాలు: వయస్సు, వికాసం, మూర్తిమత్వ లక్షణాలు, ప్రజ్ఞాస్థాయిలను ఆధారం చేసుకుని పాఠ్యాంశాలను తయారుచేయడానికి, విద్యార్థుల మానసిక స్థాయికి అనుగుణంగా ఆకర్షణీయమైన చిత్రాలతో పాఠ్య పుస్తకాలు రూపుదిద్దడానికి విద్యా మనోవిజ్ఞానశాస్త్రం ఉపయోగపడుతోంది.
* బోధనా పద్ధతులు: పాఠ్యాంశానికిఅనుకూలమైన బోధన పద్ధతిని ఎంచుకోడానికి, బోధనా పద్ధతిలో ఏవేవి సమస్యలు ఉంటే గుర్తించి తగిన బోధనా పద్ధతులు రూపొందించుటకు విద్యా మనోవిజ్ఞానశాస్త్రం ఉపయోగపడుతుంది.
* క్రమశిక్షణ: తరగతి గదిలో విద్యార్థులు క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినప్పుడు వారిని శారీరకంగా శిక్షించకుండా, విద్యార్థికి దానివలన కలిగే నష్టాలను విపులంగా తెలియజేస్తూ వారిలో పరివర్తన తీసుకుని వచ్చి మంచి ప్రవర్తన అలవరచుకునే విధంగా చేయడంలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉపయోగపడుతోంది.
* కాల నిర్ణయ పట్టిక: పాఠ్యాంశాల కాఠిన్యం, ప్రాధాన్యం, అలసట మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు అనువైన కాల నిర్ణయ పట్టిక రూపొందించడంలో విద్యా మనో విజ్ఞానశాస్త్రం ఉపయోగపడుతుంది.
* పాఠశాల నిర్వహణ: క్లాసులు సక్రమంగా జరపడానికి, విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి, ఉపాధ్యాయుల మధ్య మంచి సంబంధాలను పెంపొందించడానికి పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి, రికార్డుల సక్రమ నిర్వహణకు విద్య మనోవిజ్ఞానశాస్త్రం తోడ్పడుతుంది.
* మాపనం, మూల్యాంకనం: బోధనాభ్యసన ప్రక్రియ కారణంగా విద్యార్థుల ప్రజ్ఞ, సాధన, మూర్తిమత్వం, సర్దుబాటు సామర్థ్యం లాంటి అంశాలు ఏ దశలో లేదా ఏ స్థాయిలో అభివృద్ధి చెందాయో వివిధ పరీక్షల ద్వారా మూల్యాంకనం చేసి అనువైన బోధనాభ్యసన విధానాన్ని ఎంచుకోవడంలో విద్యామనోవిజ్ఞానశాస్త్రం ఉపయోగపడుతుంది.
* మానసిక ఆరోగ్యం: విద్యార్థులలో వయసు కారణంగా కొన్ని సమయాలలో ఉద్రిక్తతలు, సంఘర్షణలు విషమయోజనం లాంటి అంశాలు తలెత్తవచ్చు. ఇలాంటి విషయాలను ఉపాధ్యాయుడు తగిన విధంగా పరిష్కరించడానికి మనో విజ్ఞాన శాస్త్రం తోడ్పడుతుంది.
* ప్రవర్తనా సమస్యలు: తరగతిలో కొందరు ఎప్పుడూ ఇతర పిల్లలను ఏడిపించడం, పెన్నులు, పెన్సిళ్లను దొంగిలించడం, బడికి రాకుండా రోడ్ల వెంబడి తిరగడం లాంటి ప్రవర్తనా సమస్యలను కలిగి ఉంటారు. ఇది వాటి కారణాలను తెలుసుకొని పరిష్కరించడానికి తోడ్పడుతుంది.
* మార్గదర్శకత్వం- మంత్రణం: విద్యార్థులు భవిష్యత్తులో ఎంచుకోవాల్సిన కోర్సులు, ఉద్యోగావకాశాలు, మార్కెట్ డిమాండ్లను ఏ కోర్సు ఎంపికవలన ఆ విద్యార్థి రాణించగలడనే విషయాల గురించి మార్గదర్శకత్వం వహించడానికి విద్యా మనోవిజ్ఞానశాస్త్రం తోడ్పడుతుంది.
* సామూహిక గతి శీలత: తరగతి గదిలో బోధనాభ్యసనాలలో సామాజిక ప్రవర్తన, సామూహిక గతిశీలత వంటి అంశాలు అభ్యసనంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోవడానికి విద్యామనోవిజ్ఞాన శాస్త్రం ఉపయోగపడుతుంది.
అభ్యసన వాతావరణం: విద్యార్థుల శారీరక, మానసిక స్థాయిలకు, సామూహిక మనస్తత్వానికి తగిన వాతావరణాన్ని కల్పించి విద్యను అందించడానికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తోడ్పడుతుంది.
* సత్సంబంధాలు నెలకొల్పడం: విద్యార్థుల మధ్య మంచి సంబంధాలను నెలకొల్పడానికి, విద్యార్థుల ఉపాధ్యాయుల మధ్య మంచి అవగాహనతో కూడిన సంబంధాలను నెలకొల్పడానికి విద్యా మనోవిజ్ఞానశాస్త్రం తోడ్పడుతుంది.
* సాంఖ్యాక శాస్త్ర పరిజ్ఞానం: విద్యార్థులు తమ మార్కులను తెలుసుకోవడానికి, వారి ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేయడానికి, విద్యా విషయక పరిశోధనలు చేయడానికి మనో విజ్ఞానశాస్త్రం తోడ్పడుతుంది.
Related Posts Plugin for WordPress, Blogger...