Friday, December 23, 2011

మీరు కూడా పంపించొచ్చు.

ఈ బ్లాగును మంచి ఉద్దేశ్యం తో నిర్వహిస్తున్నాము. తెలుగు పట్ల మక్కువతో సివిల్స్ తెలుగులో రాయాలనే అభ్యర్థుల సహాయం కోసం ఈ బ్లాగులోని అంశాలు దోహదపడుతాయని భావిస్తున్నాను. 
మీరు కూడా అభ్యర్థులకు సరైన సూచనలు , సలహాలు అందించాలనుకుంటే మీ ఫోటో , వివరాలతో పాటు మీరు అందించాలనుకునే సమాచారం జతచేసి winod@live.in కి మెయిల్ చేయండి.
ఇప్పటికే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా సమాచారం అందించవచ్చు. మీ వివరాలు మీరు సూచించే సలహాలు , ఇతరత్రా విషయాలు తప్పకుండా ఈ బ్లాగులో ప్రచురించబడుతుంది.

మీకు అంత తీరిక లేకుంటే కామెంట్ లో రాసినా కూడా ప్రచురిస్తాను.

Saturday, December 17, 2011

సివిల్స్ 2012 నోటిఫికేషన్ లో జాప్యం ఎందుకు? సిలబస్ మారబోతోందా..!?

(ఈనాడు - చదువు సౌజన్యం తో ......)

రీక్షా విధానంలో 'మార్పు' అనే మాట వినగానే అభ్యర్థుల్లో ఆందోళన మొదలవుతుంది.

తాజాగా 'మెయిన్స్‌లో మార్పులు రాబోతున్నాయి' అంటూ వెలువడుతున్న వార్తలు సివిల్స్‌ పరీక్షను లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థుల్లో తికమకను పెంచుతున్నాయి.

అయితే యూపీఎస్‌సీ పరీక్షల్లో ఏ మార్పులైనా ఆకస్మికంగా ప్రవేశపెట్టరని గుర్తుంచుకోవాలి. సూక్ష్మంగా పరిశీలించి, విభిన్న అభిప్రాయాలను గమనించిగానీ మార్పులకు పచ్చజెండా ఊపరు.

కాకపోతే ఏ మార్పులకు ఆస్కారముందో తెలుసుకోవటం అభ్యర్థులకు మంచిదే!

నవంబరు, డిసెంబరు అంటే... సివిల్‌ సర్వీసుల అభ్యర్థులు శ్రద్ధగా గమనించాల్సిన నెలలుగా గుర్తింపు పొందాయి. కొన్నేళ్ళక్రితమైతే ఈ సమయంలో సివిల్స్‌ నోటిఫికేషన్‌ వచ్చేది. ఇప్పుడు పరీక్షా విధానం 'మార్పుల'కు సంబంధించిన సమాచారం వెలువడుతోంది. అంతే తేడా!

డిసెంబరు మొదటివారంలో యూపీఎస్‌సీ చైర్మన్‌ సివిల్స్‌ మెయిన్స్‌లో మార్పులను సూచించటానికి ప్యానెల్‌ని నియమించామని చెప్పారు. హ్యుమానిటీస్‌ విద్యార్థులతో పోలిస్తే సైన్స్‌ సబ్జెక్టుల వారు మార్కుల పరంగా అనుచిత ప్రయోజనం పొందకుండా మార్పులను సూచించటం ప్యానెల్‌ కర్తవ్యమని వార్తాకథనాల సారాంశం. నిర్వహణ, పాలనా నైపుణ్యాలను పరీక్షించేలా పేపర్లను రూపొందించటం కూడా మరో విధి.

అలఘ్‌ కమిటీ (1991), పాలనాసంస్కరణల రెండో కమిషన్‌ (2008) సిఫార్సుల ఆధారంగానే ప్యానెల్‌ సూచనలుంటాయని భావిస్తున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఎన్నో ప్రశ్నలూ సందేహాలూ... వాటిని పరిశీలిద్దాం!


వయః పరిమితి, ప్రయత్నాల సంఖ్య మొదలైనవి ఇప్పటి కమిటీ పరిధిలో లేవని గమనించాలి.

** ప్రిలిమినరీ పరీక్షా విధానం మళ్ళీ మారుతుందా?
* లేదు. ప్రిలిమ్స్‌ యథాతథంగానే ఉంటుంది. ప్రశ్నల సంఖ్యా, వెయిటేజి మారవచ్చు. అంతేగానీ మార్కుల, పేపర్ల సంఖ్యలో ఎలాంటి మార్పులూ ఉండవు.

** మెయిన్స్‌ మార్కులకు ప్రిలిమినరీ మార్కులు కలుస్తాయా?
* అలఘ్‌ కమిటీ ఇలా సిఫార్సు చేసింది కానీ, అది ఆమోదం పొందలేదు. అందుకని ప్రిలిమ్స్‌ మార్కులు మెయిన్స్‌లో కలిపే అవకాశం లేదు.

** మెయిన్స్‌లో అవకాశమున్న సబ్జెక్టులేమిటి?
* కమిటీ పరిధిని దృష్టిలో పెట్టుకుని కింది అంచనాలకు రావొచ్చు.

1) కంపల్సరీ లాంగ్వేజ్‌ పేపర్లు- ఇంగ్లిష్‌, మోడర్న్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌ కొనసాగుతాయి. ఈ పేపర్ల స్థాయి పెరుగుతుంది. ఇప్పుడవి అర్హతా పేపర్లే. ర్యాంకును నిర్థారించే స్కోరులో వీటి మార్కులను కూడా కలిపే అవకాశముంది.

2) అలఘ్‌ కమిటీ, ఏఆర్‌సీలు ఎస్సే విషయంలో ఏకాభిప్రాయంతో లేవు. కాబట్టి వ్యాసం యథాతథంగానే ఉంటుంది.

3) ఇప్పుడున్న జనరల్‌స్టడీస్‌ పేపర్లను మార్చాలని అలఘ్‌ కమిటీ సిఫార్సు చేయగా, ఏఆర్‌సీ దాన్ని బలపరిచింది. కాబట్టి ఇప్పుడున్నట్టుగా జనరల్‌స్టడీస్‌ పేపర్లుండకపోవచ్చు. ప్రిలిమ్స్‌లో పరీక్షించిన స్టాటిస్టిక్స్‌ లాంటివాటికి మెయిన్స్‌లో చోటు దొరక్కపోవచ్చు.

** కంపల్సరీ పేపర్లు ఏవి ఉండే అవకాశముంది?
* ఇప్పటి మెయిన్స్‌లో ఆప్షనల్స్‌ అంటే- అభ్యర్థులు విశ్వవిద్యాలయ స్థాయిలో చదివిన సబ్జెక్టులపై దృష్టి పెట్టటం. కానీ విజయవంతమైన సివిల్‌ సర్వెంట్‌గా మారాలంటే... నేర్చుకోదల్చిన అంశాలపై అభ్యర్థి దృష్టిపెట్టేలా ఉండాలి. అందుకే ఆప్షనల్‌ పేపర్ల స్థానంలో అభ్యర్థి విస్తృత పరిజ్ఞానం, నైపుణ్యాలు, స్వభావం, అభిరుచులూ పరీక్షించేలా కంపల్సరీ పేపర్లను రూపొందించాలనే ప్రతిపాదన ఉంది. వివిధ సబ్జెక్టుల కలబోత స్వభావంతో ఉండే ఈ పేపర్లు హయ్యర్‌ సివిల్‌ సర్వీసెస్‌తో నేరుగా సంబంధం కలిగివుంటాయి.

ఏమిటా పేపర్లు?
1.Sustainable development and Social Justice
2. Science and Technology in Society
3. Public Systems, Democratic Governance and Human Rights
4. The constitution of India and Indian Legal System
5. Indian Economy
6. Administrative Theory and Governance in India

బహుళైచ్ఛిక (మల్టిపుల్‌ చాయిస్‌), షార్ట్‌ ఆన్సర్‌, ఎస్సే టైపు ప్రశ్నలు అడుగుతారని భావిస్తున్నారు.

** గ్రూప్‌-1 పరీక్ష తరహాలో ఉంటుందా నూతన పరీక్షా విధానం?
* అలా ఉండే అవకాశం లేదు.
** సివిల్స్‌-2012 పరీక్షా విధానం మారబోతోందనీ, అందుకే నోటిఫికేషన్‌ విడుదలలో జాప్యం జరుగుతోందనీ వదంతులు వినిపిస్తున్నాయి....

* 2012లో ఎలాంటి మార్పులూ ఉండవు. ఈ డిసెంబరు 1న రాజ్యసభలో అవినాష్‌పాండే అడిగిన ప్రశ్నకు సంబంధిత మంత్రి వి.నారాయణస్వామి జవాబిస్తూ ఈ విషయాన్నే ఇలా స్పష్టం చేశారు. 'There is no proposal to introduce changes in the Main examination of the Civil Services Examination, at present.' 

కాబట్టి అభ్యర్థులు అనవసర గందరగోళానికి గురవ్వకుండా ఇప్పుడున్న పద్ధతిలోనే పరీక్షకు సిద్ధం కావటం శ్రేయస్కరం!

- గోపాలకృష్ణ 

Sunday, December 4, 2011

సివిల్స్ కి తెలుగు మీడియం వారు చదవాల్సిన పుస్తకాలు .

సివిల్స్‌ అభ్యర్థులందరూ ప్రిలిమినరీలో రెండు కామన్‌ పేపర్లు రాయాలి.

1) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1:
2) పేపర్‌-2:

పేపర్‌-1: జనరల్‌ స్టడీస్‌
వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జ్‌, భారతదేశ చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ- పాలన, జనరల్‌ సైన్స్‌, సాంఘిక ఆర్థికాభివృద్ధి, భారత, ప్రపంచ భౌగోళిక పరిస్థితులు.

ఇన్ని అంశాలనూ కవర్‌ చేసి, ప్రతిదానిలోనూ ప్రావీణ్యం సాధించటం ఎవరికైనా అసాధ్యం. మరేం చేయాలి? తార్కికంగా చూసినా ఉన్న ఒకే మార్గం- trendsను గుర్తించి, అనుసరించటమే! అయితే అసలైన సమస్య ఇక్కడే ఉంది. ఇతర పోటీ పరీక్షల మాదిరిగా జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ను ముందస్తుగా ఊహించటం కష్టం.

ఇది 'నల్లహంస' దృగ్విషయం లాంటిది. 
 (నల్లహంసల జాతి ఒకటుందని పదిహేడో శతాబ్దిలో కనిపెట్టేదాకా హంసలన్నీ తెల్లగా ఉంటాయనే నమ్మకం కొనసాగింది. లెబనీస్‌ రచయిత టాలెబ్‌ దీన్ని Black swan phenomenon గాcoinచేశారు. అంటే గతానుభవాల ఆధారంగా భవిష్యత్తును ఊహించటానికి సాధ్యం కాని స్థితి!...

పరీక్షల సందర్భానికొస్తే పాత ప్రశ్నపత్రాల సాయంతో రాబోయే ప్రశ్నలను వూహించలేకపోవటం.)

ప్రిలిమినరీలో పేపర్‌-1 జనరల్‌స్టడీస్‌ నిశ్చయంగా Black Swan. ఎవరూ వూహించటానికి వీల్లేకుండా యూపీఎస్‌సీ దీన్ని రూపొందిస్తుంది. మరి కర్తవ్యం?

మొదట మీ విశ్లేషణ కచ్చితంగా ఉండాలి. ఇది జ్ఞాపకశక్తిని పరీక్షించే factual paper అని చాలామంది అభ్యర్థులు భావిస్తుంటారు. ఈ కారణంతోనే చాలామంది మంచి అభ్యర్థులకు ఇది మొదటినుంచీ సమస్యగా ఉంటూ వచ్చింది. ఈ పేపర్‌తో సంబంధమున్న రీజనింగ్‌ భాగాన్ని చాలామంది అర్థం చేసుకోరు. 2011 నుంచి UPSCఅధికారికంగా 'ఆప్టిట్యూడ్‌' పరీక్షను ప్రవేశపెట్టింది కానీ, గత 4-5 ఏళ్ళ నుంచీ జనరల్‌స్టడీస్‌ ఆప్టిట్యూడ్‌ పరోక్షంగా కరిక్యులమ్‌లో భాగంగానే ఉంది.

ప్రాథమిక factualసమాచారంతో పాటు బలమైన రీజనింగ్‌ నైపుణ్యాలు అవసరమయ్యేలా UPSCప్రశ్నలను రూపొందిస్తోంది. కాబట్టి సారాంశంలో ఇది జనరల్‌స్టడీసూ కాదు; జనరల్‌ నాలెడ్జీ కాదు! ఇది జనరల్‌ స్టడీస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (GSAT).

స్థిర, పరిణామశీల అంశాలు
* స్థిర (static)అంశాలు- భారత జాతీయోద్యమం, భారత రాజ్యాంగ వ్యవస్థ, సాంఘికార్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టితో ప్రాథమిక ఆర్థిక అవగాహన, భూగోళవ్యవస్థ

* పరిణామశీల అంశాలు - వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జి. వీటికి తగిన నిర్వచనం, సిలబస్‌ అంటూ లేవు.

స్థిర అంశాల్లో సాధారణంగా స్కోరింగ్‌కు ఆస్కారం ఉంటుంది. వీటిలో ఎంత ఎక్కువ సాధించగలిగితే అనిర్దిష్ట అంశాలైన వర్తమాన వ్యవహారాలూ, జి.కె.లపై ఆధారపడటం అంత తగ్గుతుంది. వీటిని మౌలిక అంశాల నుంచి నేర్చుకుని, నోట్సు ద్వారా పకడ్బందీగా పునశ్చరణ చేసుకోవాలి. భావనలు (concepts) పటిష్ఠపరచుకోవాలి. నమూనా టెస్టులు రాస్తే పరిజ్ఞానం విస్తృతమై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

నిర్దిష్టత ఉండని వర్తమాన, జి.కె.లలో ప్రాథమిక వివరాలతో పాటు సూత్రాలూ, అమలూ కూడా అవగాహన చేసుకోవాలి. చాలినంత సమయం ఉంది కాబట్టి అభ్యర్థులు థియరిటికల్‌ అంశాల జాబితా తయారుచేసి, రోజువారీగా తాజా పరిణామాలను జోడించుకుంటూ ఉండాలి. ఈ తరహా ప్రశ్నలకు రీజనింగ్‌, factual data అవసరం కాబట్టి పైన చెప్పిన విధానం పాటిస్తే వాటిని పెంపొందించుకోవచ్చు.

తెలుగుమీడియం విద్యార్థులకు ఉపయోగపడేవి
1) ఎన్‌సీఈఆర్‌టీ ప్రాథమిక పుస్తకాలు
2) తెలుగు అకాడమీ ప్రచురణలు
3) హ్యుమానిటీస్‌ (ఇండియన్‌ పాలిటీ, సోషియాలజీ) లలో అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఎ. పుస్తకాలు
4) తెలుగు, ఆంగ్ల వార్తాపత్రికలు
5) పబ్లికేషన్స్‌ డివిజన్‌ 'ఇండియా ఇయర్‌బుక్‌'
6) తెలుగు, ఇంగ్లిష్‌ల్లో ప్రచురితమయ్యే 'యోజన'
తెలుగు మీడియం నేపథ్యమున్నవారు ఈ పేపర్‌ గురించి మరీ ఇబ్బందిపడనక్కర్లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్టు అంశాలతో తేలిగ్గానే పరిచయం పెంచుకోవచ్చు.

పేపర్‌-2
కాంప్రహెన్షన్‌, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌- కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, లాజికల్‌ రీజనింగ్‌- అనలిటికల్‌ ఎబిలిటీ, డెసిషన్‌ మేకింగ్‌- ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ (పదో తరగతి స్థాయి), డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ (పదో తరగతి స్థాయి), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌ (పదో తరగతి స్థాయి)

గత ఏడాది కాంప్రహెన్షన్‌ విభాగం నుంచి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఇది కొనసాగుతుంది. క్లిష్టత స్థాయి కూడా యథావిధిగా ఉంటుంది. గణితంలో ప్రశ్నల సంఖ్య అలాగే ఉండొచ్చు కానీ క్లిష్టత స్థాయి పెరగవచ్చు. డెసిషన్‌ మేకింగ్‌లో ప్రశ్నలు కూడా పెరిగే అవకాశముంది. పూర్తిగా పరిణామశీల అంశాలతో కూడివుంటుంది కాబట్టి ఈ పేపర్‌ కూడా మరో Black swanఅవ్వగలదు.

ఈ పేపర్లో ఉన్న అంశాలన్నిటిలోనూ పట్టు సాధించటం ఎక్కువమంది అభ్యర్థులకు సాధ్యం కాదు. అందుకని గరిష్ఠ మార్కులు సాధ్యమయ్యే అంశాలను ఎంచుకోవటం మేలు. ప్రస్తుత తరుణంలో సాంప్రదాయికంగా స్కోరింగ్‌గా ఉన్న అంశాలను పటిష్ఠపరుచుకోవటం కోసం మంచి వర్క్‌బుక్‌తో సాధన చేయాలి. ఒక నిర్దిష్టమైన తర్కంపై పట్టు లభిస్తే అది ఆత్మవిశ్వాసం పెంచి, ఇతర ప్రశ్నలను చేయటానికి కూడా ఉపకరిస్తుంది. అందుకే ఈ పేపర్‌ కోసం మంచి ప్రశ్నలను solve చేయటం చాలా ముఖ్యం.

పేపర్‌-1 static section లో ప్రశ్నల సంఖ్యది ప్రధాన పాత్ర. కానీ పేపర్‌-2లో నాణ్యమైన ప్రశ్నలు (సంఖ్యలో తక్కువైనప్పటికీ) చేయటం అవసరం. అప్పుడే దానిమీద అవగాహన పెరుగుతుంది. ఈ విధంగా ఈ విభాగంలో స్కోర్‌ చేయాలంటే smart work ప్రధానాంశం.

క్వాంటిటేటివ్‌ విభాగంలో సంఖ్యలను అర్థం చేసుకోవటం చాలా ప్రధానం. మొత్తం మార్కుల్లో వీటి భాగం ఎక్కువ. అభ్యర్థులు కష్టపడితే దీన్ని సులభంగా మల్చుకోవచ్చు. ఈ విభాగానికి సమయం కబళించటంలో చాలా పేరుంది కాబట్టి ప్రశ్నలను సత్వరం చేసేలా సమయపాలన పద్ధతులను మెరుగుపరుచుకోవాల్సిందే. లేకుంటే అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను రాయగలిగే అవకాశం లేకుండాపోతుంది.

ఇంగ్లిష్‌ మాధ్యమ నేపథ్యం లేనివారూ, ఈ భాషపై అంతగా పట్టు లేనివారూ ఆందోళన పడకూడదు. ఇప్పటివరకూ అనుసరించిన ప్రిపరేషన్‌ పద్ధతినే, తీరునే కొనసాగించాలి. యూపీఎస్‌సీ పేర్కొన్నట్టు- 'టెన్త్‌ క్లాస్‌ స్థాయి' నైపుణ్యాలను మాత్రమే పరీక్షిస్తారు కాబట్టి ఆందోళన పడనవసరంలేదు. సిలబస్‌లో లేని లోతైన అంశాలను చదువుతూ ప్రిపరేషన్‌ను సంక్లిష్టం చేసుకోకూడదు.

తెలుగుమీడియం విద్యార్థులకు ఉపయోగపడేవి
1) అరిథ్‌మెటిక్‌ ప్రాథమిక పుస్తకాలు
2) ఇంగ్లిష్‌ మౌలిక విషయాలుండే పుస్తకాలు
3) 'ఇగ్నో' ప్రచురించిన ఫంక్షనల్‌ ఇంగ్లిష్‌ పుస్తకాలు
4) బ్యాంకింగ్‌ పరీక్షల పాత ప్రశ్నపత్రాలు
5) పేపర్‌-2కు సంబంధించిన మంచి manual
6) మంచి ఇంగ్లిష్‌ నిఘంటువు / ఇంగ్లిష్‌- తెలుగు నిఘంటువు

మొత్తమ్మీద రెండు పేపర్లకూ section వారీగా సంసిద్ధం కావాలి. మిగతా అంశాలను పకడ్బందీగా చదివివుంటే కొన్ని ఉప అంశాలను వదిలివేసినా ఇబ్బంది ఎదురవ్వదు. ప్రతి మార్కూ పెద్ద తేడాను సృష్టించే ఇలాంటి పోటీపరీక్షల్లో సమయ నిర్వహణ చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తుంది.


కాబట్టి వచ్చే రోజుల్లో అభ్యర్థులు తమ సాధనను సమయ నిర్వహణతో అనుసంధానించుకోవటం శ్రేయస్కరం.
 - ఈనాడు చదువు సౌజన్యంతో......

Saturday, November 5, 2011

సివిల్స్ ఇంటర్వుకి ప్రిపరషన్ ఇలా.....!! | Civils interview

సివిల్స్‌పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు కూడా ఇంటర్వ్యూ గురించి కొంత భయపడుతుంటారు. అయితే ముందుగానే తగిన మెళకువలు పాటిస్తే, అవసరమైన విషయాలపట్ల అవగాహన పెంచుకుంటే ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. ఇంటర్వ్యూ కూడా చాలా కీలకం. 50 నుంచీ 240 మార్కుల వరకూ ఇందుకు కేటాయిస్తున్నారంటే దాని ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కూడా ఇంటర్వ్యూ విషయంలో సీరియస్‌గా వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రయత్నించాక విఫలం కాకుండా ఉండాలంటే ఈ కింది విషయాలు గమనంలో ఉంచుకోవాలి.
ఇంటర్వ్యూ.... ఇంగ్లీష్‌లోనే ఉంటుందా? తెలుగులో కూడానా? అన్నది పలువురి సందేహం. తెలుగు మీడియం పరీక్షలు రాసే అభ్యర్థులు అనువాదకుడి సహాయంతో తమ ఇంటర్వ్యూను వినిపించవచ్చు. ఒక వేళ తెలుగులో భావ వ్యక్తీకరణ సరిగ్గా లేనప్పుడో, అనువాదకునికి సరిగ్గా అనువదించడం రానప్పుడో ఇంగ్లీష్‌ పదాలు ఉపయోగించి ఇంటర్వ్యూచేస్తున్న బోర్డు సభ్యులకు వివరించవచ్చు. ఇంగ్లీష్‌ మీడియం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులైతే అదేభాషలో ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. ఒక అభ్యర్థి వ్యక్తిత్వాన్ని అంచనావేసే మౌఖిక పరీక్ష కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ముందుగానే ఇంటర్వ్యూకు ప్రిపేరవ్వాలి. కొందరు ఇంకా మెయిన్స్‌ పరీక్షలే కాలేదుకదా ఇప్పట్నించే ఇంటర్వ్యూ గురించి ఆలోచించడమెందుకు అనుకుంటుంటారు. అది కరెక్టే అయినా ఇంటర్వ్యూ కూడా ప్రిపరేషన్‌లో ఒక భాగంగానే భావించాలి. పరీక్షలు రాసిన తర్వాత, ఇంటర్వ్యూ సమయం దగ్గరపడుతున్నప్పుడు హడావిడిగా ప్రిపేరైతే ఫలితం ఉండదు. అప్పటికప్పుడే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఒక ప్రణాళికా బద్ధంగా ముందునుంచే సంసిద్ధమైతే మంచిది.
ఇవి చర్చించండి
ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు? అన్నదానికి కచ్చితంగా ఇదే అని చెప్పలేం. అందుకోసం ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉండాలి. సమాజాన్నీ, మార్పులనూ, రాజకీయ, ఆర్థిక, ప్రభావిత అంశాలనూ పరిశీలిస్తుండాలి. రెగ్యులర్‌గా దినపత్రికలు చదువుతుండాలి. సమకాలీన అంశాలపట్ల సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి. ఇలాంటి పరిజ్ఞానంవల్ల తప్పక రాణిస్తారు. సొంత ప్రిపరేషన్‌తోపాటు గ్రూప్‌ చర్చలు లాంటివి కూడా ఎంతో ఉపయోగపడతాయి. సమకాలీన అంశాలను ఇంగ్లీష్‌లోనే ఫ్రెండ్స్‌తో చర్చిస్తూ ఉండాలి. దీనివల్ల అవగాహన, చక్కటి భాష, స్పష్టత ఏర్పడుతుంది. ఇంటర్వ్యూలో ఇదెంతో ఉపయోగపడుతుంది. మీరు మాట్లాడే విధానం బాగున్నప్పుడు ఫ్లూయన్సీకి పెద్ద ప్రాధాన్యత కూడా ఇవ్వరు.
గమనించాల్సిన విషయాలు
ముందునుంచే ఇంటర్వ్యూను దృష్టిలో పెట్టుకోవాలి.
మెయిన్స్‌ పరీక్షలు అయిపోగానే పూర్తిస్థాయిలో ప్రిపరేషన్‌ ప్రారంభించాలి.
*సబ్జెక్టుతోపాటు మిమ్మల్ని మీరు వ్యక్తపర్చుకునే విధంగా ప్రిపరేషన్‌ ఉండాలి.
*మాట తీరు ఎలా ఉంది. ముఖ కవళికలు ఎలా స్పందిస్తున్నాయి. తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. అవసరమైతే అద్దంలో చూస్తూ ప్రాక్టీస్‌ చేయాలి.
*మీకు ఇంటర్వ్యూపట్ల భయం పోవాలంటే ముందుగానే మీరు ఇంటర్వ్యూకు హాజరైనట్లు అందులో నెగ్గినట్లు ఊహించుకుంటూ మిమ్మల్ని మీరు మెరుగు పర్చుకోవాలి.
*నడిచే విధానం, కూర్చునే పద్ధతి, వేసుకున్న దుస్తులు, ముఖంలో ఫీలింగ్స్‌, హావభావాలు, ముఖ కవళికలు, ఆహ్లాదం, ఆనందం, వినయం, ప్రవర్తన ప్రశ్నలు అడిగిన వెంటనే స్పందించే తీరు, మీరు చెప్పే దాంట్లో స్పష్టత, సబ్జెక్టు, చివరగా బయటకు వస్తున్నప్పుడు మీ ఫీలింగ్‌ ఇవన్నీ పరిశీలిస్తారు కాబట్టి ఏ ఒక్కచోటా నిర్లక్ష్యం చేయకుండా అభ్యర్థులు జాగ్రత్త పడాలి.
*మెయిన్స్‌ అప్లికేషన్‌ ఫారం చాలా ముఖ్యమైంది దీనిమీద ఆధారపడే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. కాబట్టి దానిని జాగ్రత్తగా నింపాలి. అవసరమైతే నిపుణుల, సీనియర్ల సలహాలు తీసుకోవాలి.
*ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు తగిన సమాధానంతోపాటు అందులో హేతుబద్ధత కూడా గమనిస్తారు.
ఇవి గుర్తుంచుకోండి
*సివిల్‌ సర్వీసుల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.
*సివిల్‌పట్ల ఆసక్తి ఉందనీ, అందుకు మీరు అర్హులనీ నిరూపించుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. బాడీలాంగ్వేజ్‌ పాజిటివ్‌గా ఉండాలి. బోర్డుమెంబర్లు వెతుకుతున్న అభ్యర్థి మీరేనన్న విషయం వారికి తెలిసేలా ప్రవర్తించగలగాలి.
*చక్కటి భాషను ఉపయోగించాలి. స్పష్టంగా మాట్లాడాలి.
*బోర్డుమెంబర్లను తప్పుదోవపట్టించే వాదనలు చేయకూడదు.
*ఇంటర్వ్యూ సమయంలో మీలో ప్రశాంతత కనిపించాలి. ఆత్మ విశ్వాసం ఉట్టిపడాలి.
*వీలైతే ముందుగానే మాక్‌ ఇంటర్వ్యూలకు హాజరవ్వండి దీనివల్ల నిజమైన ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు తడబడకుండా ఉంటారు.
*యుపిపిఎస్సీ ఇంటర్వ్యూలో ఏం ఆశిస్తుందో తెలియాలంటే వివిధ మ్యాగజైన్లల్లో ఇచ్చే ఒరిజినల్‌ ఇంటర్వ్యూలను చదవాలి.
ఇదీ... ఇంటర్వ్యూ
*ఇంటర్వ్యూ అనేది వ్యక్తిత్వాన్ని అంచనా వేసే మౌఖిక పరీక్ష. బోర్డుమెంబర్లు అభ్యర్థిని వివిధ కోణాల్లో పరిశీలిస్తారు.
*తెలియని ప్రశ్నకు డొంక తిరుగుడు సమాధానం చెప్పేకన్నా తెలియదని చెప్పడానికి సంకోచించ కూడదు. ఈ విషయం కూడా ఆత్మ విశ్వాసంతో చెప్పగలగాలి.
*ఇంటర్వ్యూ అనేది భయపడాల్సినంత ఇబ్బందికరమైంది కాదు. అదొక సహజ సంభాషణ ప్రక్రియగా ఫీలైతే తప్పకుండా నెగ్గుతారు.
అభ్యర్థికి ఉండాల్సిన లక్షణాలు
*ప్రజా సంబంధాల కెరీర్‌కు తగిన వ్యక్తిత్వం
*మానసిక సామర్థ్యం
*మేధోపరమై, సామాజిక పరమైన లక్షణాలు
*సమకాలీన అంశాలపట్ల అవగాహన
*మానసిక సంసిద్ధత
*సంగ్రహ శక్తి
*స్సష్టమైన వైఖరి, తార్కికమైన వ్యక్తీకరణ
*నిర్ణయాల్లో, తీర్పుల్లో సమతుల్యత
*విభిన్న అభిరుచులపై పట్టు కలిగి ఉండటం
*నాయకత్వానికీ, సామాజిక ఐక్యతకు తగిన సామర్థ్యం
*మేధోపరమైన నైతిక పరిపూర్ణత
*అభిప్రాయాల్లో పరిపక్వత
*విభిన్న అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించడం
ఇవి అధ్యయనం చేయాలి
* రాష్ట్రానికి సంబంధించిన అంశాలు
* జాతీయ అంశాలు
* సాధారణ అంశాలు
- చేగూరి కుమార్‌

Thursday, November 3, 2011

సివిల్స్ - సందేహాలు- సమాధానాలు. | CIVILS - Doubts - Clarifications

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgsASAYQ5V10NfP_vuaIzXonegipCbWldBcQKAfk3nASWR7VpyTw-klEs5ON8e3amzA9UUUXrU5hb3FoOlzYvmcvsLcQB4juru6sXRX6dyz_3R1emTV3ouE_J2LraCst2efwqY1Fx7MTSs/s1600/civils+sandehalu.JPG

సివిల్స్ ఏ భాషలో రాసినా ఇంటర్యుకు మాత్రం కోరుకున్న భాషలో హాజరుకావచ్చు....

(ఈ సమాచారం ముందుగానే ప్రచురించాల్సి ఉంది. సమయం కేతాయిన్చాలేకపోవడం వల్ల ఇప్పుడు రాస్తున్నాను. తెలియని అభ్యర్థులకు ఉపయోగకరం.) 
 
సివిల్ సర్వీసు అభ్యర్ధులు  తమ మాతృభాషలోనే మౌఖిక పరీక్షలకు హాజరుకావచ్చు. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ప్రధాన పరీక్షను ఆంగ్లంలో రాసిన అభ్యర్ధులు కూడా మౌఖిక పరీక్షకు అంగ్లం కానీ, హిందీ కానీ లేదా ఇతర భారతీయా భాషల్లో ఏద్యినా ఎంచుకోవచ్చు. కానీ అది రాతపరీక్షలో భాగంగా కచ్చితంగా ఎంచుకోవలసిన భారతీయ భాషే అయ్యుండాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముంబై హైకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో స్పష్టం చేసింది. ప్రధానపరీక్షను ఆంగ్లంలో రాస్తే మౌఖిక పరీక్ష కూడా అదే భాషలో ఉండాలన్న యూపీఎస్ సీ నిబంధనను సవాలు చేస్తూ చిత్తరంజన్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి స్పందనగా యూపీఎస్ సీ ఈ ప్రమాణపత్రాన్ని కోర్టుకు అందచేసింది. ఈ వివాదానికి సంబంధించి నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులనే తాము అందచేసిన ప్రమాణపత్రంలో పేర్కొన్నట్లు యూపీఎస్ సీ తెలిపింది. అయితే ఆ సిఫార్సులను ఆమోదించిన కమిషన్ సలహాలు, సూచనలు అందచేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడమేకాక అవసరమైన మార్పులు చేసి అమలుచేస్తామని కోర్టుకు తెలిపింది.    

Wednesday, November 2, 2011

తెలుగు భాషా చరిత్ర - భద్రిరాజు కృష్ణమూర్తి | Telugu Bhasha Charitra by Bhadriraju Krishnamurti

తెలుగు భాషా చరిత్ర - భద్రిరాజు కృష్ణమూర్తి   |    Telugu Bhasha Charitra by Bhadriraju Krishnamurti


Telugu Bhasha Charitra by Bhadriraju Krishnamurti

Monday, October 31, 2011

HOW TO CRACK CIVIL SERVICES EXAMINATION | సివిల్స్ గురించి సమగ్ర అవగాహనను అందించే ఈ పుస్తకం ఒకసారి తిరగేయండి..

సివిల్స్ గురించి సమగ్ర అవగాహన కొరకు ఒక పుస్తకం ప్రచురింపబడినది. కేవలం ఆంగ్లంలో మాత్రమె ఈ పుస్తకం ప్రచురించబడినది. పుస్తకం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. http://www.championsquest.com/assets/ClickHere_button_RedWhite_4.gif
ఒక మిత్రుడు ( Venkata krishna janam ) నాకు ఈ పుస్తకం గురించి ఈ మెయిల్ చేసాడు.

Wednesday, October 19, 2011

సివిల్స్ లో తెలుగు సాహిత్యం లో గమనించదగినవి. | Preparing Telugu Literature for ( CIVILS ) Mains

Akella Raghavendra
Cవిల్ సర్వీసెస్ పరీక్షలో ఎక్కువ మార్కులు తెచ్చిపెడుతున్న ఆప్షనల్స్‌లో తెలుగు సాహిత్యం ఒకటి. పాతప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే తెలుగు ఆప్షనల్స్ నుంచి తికమక ప్రశ్నలు అంతగా రావడం లేదని అర్థమవుతుంది. అంటే అభ్యర్థి కాస్తంత ప్రణాళికతో, పరీక్షా దృక్పథంతో శ్రమిస్తే అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు పొందడం సులువే. సివిల్స్ మెయిన్స్ తెలుగు లిటరేచర్‌కు ఇంకా రెండు వారాల వ్యవధే ఉంది. తెలుగు లిటరేచర్‌లో తప్పనిసరిగా చదవాల్సిన అధ్యాయాలు, ప్రశ్నల కోణాలు, సమాధానాలు రాయాల్సిన తీరు, అనుసరించాల్సిన వ్యూహాలు, నైపుణ్యాలు....తెలుసుకుందాం

చదవాల్సినవి ఇవీ...


ఇంటర్, డిగ్రీలాంటి అకడమిక్ పరీక్షల స్వరూపం వేరు. పోటీ పరీక్షల లక్ష్యం వేరు. అకడమిక్స్‌లో ఏవో కొన్ని అధ్యాయాలు చదివి మిగిలిన వాటిని విడిచిపెట్టినా గట్టెక్కొచ్చు. కానీ సివిల్స్ లాంటి పోటీ పరీక్షల్లో అలా కాదు. కొన్ని ప్రత్యేక వ్యూహాలను అభ్యర్థి అర్థం చేసుకుంటే - కొన్ని అధ్యాయాలే చదివినప్పటికీ మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. మొదట సిలబస్‌లోని అన్ని అధ్యాయాల మీదా అవసర మైనంత అవగాహన ఉండాలి.


తర్వాత ఏయే అధ్యాయాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో స్పష్టంగా గుర్తించగలగాలి. దీనిద్వారా ఏయే అధ్యాయాలపై ఆధారపడితే ఎక్కువ మార్కులు వస్తాయో తెలుస్తుంది.

పైన వివరించిన వ్యూహం ఆధారంగా తప్పక చదవాల్సినవిగా పేపర్-1, పార్‌‌ట-ఎలో 1, 4, 5, 6, 7 అధ్యాయాలను వ్యాస, లఘు రూప ప్రశ్నల కోసం పూర్తిగా అధ్యయనం చే యాలి. 2, 3, 8 అధ్యాయాలు లఘురూప ప్రశ్న ల కోసం చదివితే చాలు. అదేవిధంగా పార్‌‌ట-బిలో 1, 7, 9, 10, 11, 12 అధ్యాయాల నుంచి వ్యాస, లఘురూప ప్రశ్నలు రెండింటినీ సంపూర్ణంగా చదవాలి. మిగిలిన అధ్యాయాల్లోని లఘురూప ప్రశ్నలపై పూర్తి పట్టు సాధించాలి.


విజయానికి ఐదు వ్యూహాలు...


కొన్ని అధ్యాయాల నుంచి కేవలం లఘురూప ప్రశ్నలు మాత్రమే చదివితే వాటి నుంచి వ్యాసాలు వస్తే ఎలా? అని అభ్యర్థి సందేహించడం సహజం. అలాగే ఒక్కోసారి అభ్యర్థి అసలు చదవని ప్రశ్నలు పరీక్షలో వచ్చినా - ధైర్యంగా, సమగ్రంగా సమాధానం రాసే సత్తా సాధించడం ఎలా? - అని కూడా విద్యార్థులు అడుగుతుంటారు. దీనికి ఆయుధాల్లాంటి ఐదు వ్యూహాలను అభ్యర్థి అనుసరించాలి.


1. సంక్షిప్తీకరణం: అభ్యర్థి ఒక వ్యాసరూప ప్రశ్న చదివాడనుకుందాం. అదే ప్రశ్న పరీక్షలో వ్యాసంగా కాకుండా లఘురూపంగా రావొచ్చు. అలాంటప్పుడు సమర్థంగా సంక్షిప్తీకరించడం ఎలాగో తెలియాలి. దీనికి మూడు వ్యూహాలు ఉన్నాయి. అవి...

ఎ. వ్యాసంలోని ప్రాధాన్య, అప్రాధాన్య అంశాల్ని గుర్తించగలిగి కీలక అంశాలు మాత్రమే రాయాలి.
బి. వివరణలు, విశ్లేషణలు పరిహరించాలి
సి. దృష్టాంతం, ఉదాహరణలు తగ్గించాలి.

2. విస్తరణ: ఒక లఘురూప ప్రశ్నను వ్యాసంగా విస్తరించగల నైపుణ్యాన్ని అభ్యర్థి తప్పక సాధించాలి. ఉదాహరణకు నామ్నీకరణంపై లఘురూప ప్రశ్న మాత్రమే చదివిన ఒక అభ్యర్థికి పరీక్ష గదిలో అదే అంశంపై వ్యాసం రాయాల్సిన పరిస్థితి ఎదురైందనుకుందాం. అలాంటపుడు - నామ్నీకరణం అంటే ఏమిటో కాస్త ఎక్కువగా వివరించి, ఉదాహరణలు పెంచి, అనుకరణం అనే మరో లఘురూప ప్రశ్నలోని అంశాల్ని జోడించి, విస్తరించి రాయగలగాలి. ఎందుకంటే - అనుకరణం కూడా నామ్నీకరణంలో ఒక భాగమే కాబట్టి! అలాగే ‘యక్షగానం’పై లఘుసమాధానం చదివిన అభ్యర్థి - అదే జవాబుకి రఘునాథ నాయకుడు, దక్షిణాంధ్ర కవయిత్రులు రాసిన యక్షగానాల వివరణను, విశ్లేషణను జోడిస్తే - వ్యాసం పూర్తవుతుంది.


3. అంతఃసంబంధం: సిలబస్‌లోని వివిధ అధ్యాయాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం మూడో వ్యూహం. ఉదాహరణకు సిలబస్ ప్రకారం పేపర్-1, పార్‌‌ట-బిలో ‘నన్నయ భారత రచన సామాజిక నేపథ్యం’ చదివితే చాలు. కానీ 2007లో ఇదే అధ్యాయం నుంచి ‘నన్నయ భారతాంధ్రీకరణ విధానం’పై ప్రశ్న వచ్చింది. దీనికి సమాధానం రెండో పేపర్‌లోని నన్నయ శకుంతలోపాఖ్యానం నుంచి స్వీకరించి రాయాలన్న స్పృహ అభ్యర్థికి అవసరం.


అలాగే ఆధునిక యుగంలో ఆవిర్భవించిన ధోరణి ‘స్త్రీ వాదం’. కానీ 2006లో ‘ప్రాచీనాంధ్రంలో స్త్రీవాదం’పై ప్రశ్న వచ్చింది. ఇది స్థూలంగా చూస్తే - అసందర్భ ప్రశ్న. కానీ రాయక తప్పదు. ఇలాంటప్పుడు ఎలా? మొదట స్త్రీవాదంపై రెండు పేరాలు రాయాలి. ఆపై రెండో పేపర్‌లో శకుంతల, ద్రౌపది, గుణనిధి తల్లి, సుగాత్రి, మొల్ల తదితరుల్లో కనిపించే స్త్రీచైతన్య, స్త్రీ వేదన అంశాలను స్త్రీవాదంతో అనుసంధానిస్తూ - ప్రాచీనాంధ్ర దృక్కోణంతో రాయగలగాలి.


4. పారిభాషిక పదాలు: పరీక్షలో సాధారణంగా కనిపించే పరిభాషను అభ్యర్థి అర్థం చేసుకోవాలి. వివరించండి, విశ్లేషించండి, దృష్టాంతీకరించండి, సోదాహరించండి, ఉటంకించండి, విమర్శించండి, విపులీకరించండి, క్రోడీకరించం డి, ప్రత్యక్షీకరించండి, నిరూపించండి, నిర్ణయించండి... ఇలాంటి పదాలు ప్రశ్నల్లో కనిపించినపుడు అన్నింటికీ ఒకే సమాధానం కాదని గుర్తించండి. మార్కులు రావడానికి, ఎక్కువ మా ర్కులు రావడానికి వ్యత్యాసం ఉండేది ఇక్కడే.


5. పదాలు మారవచ్చు: ఒక్కోసారి పరీక్షలో ప్రసిద్ధమైన పదంతో ప్రశ్న అడగకుండా మారుమూల పదంతోనో, అర్థంకాని పదంతోనో ప్రశ్న రావచ్చు. ఉదాహరణకు ‘శ్రీనాథుడు చాటువులు’ అని అడగకుండా 2006లో ‘శ్రీనాథుడు - దేశీయతాముద్ర’ అని అడిగారు. అలాగే ద్రావిడ భాషల్లో ‘తెలుగు స్థానం’ అని నేరుగా అడగకుండా 2004లో ‘మూల ద్రావిడ వర్ణాలు తెలుగులో పొందిన మార్పులు’ అని మార్చి అడిగారు. ఇలాంటివి సిలబస్‌లో ఎన్ని ఉన్నాయో అన్నింటిపైనా అభ్యర్థికి అవగాహన ఉండాలి. అలాగే ప్రసిద్ధ కవుల, విమర్శకుల వ్యాఖ్యల్ని ప్రశ్నలుగా అడుగుతున్నారు. ఉదాహరణకు విశ్వనాథ సత్యనారాయణ ‘తిక్కన శి ల్పంపు తెనుగుతోట’ అని పలికారు. ఇదే 2000 లో ప్రశ్నగా వచ్చింది. నన్నయ మొదలుకొని తొమ్మిది మంది ప్రాచీన కవులపై విశ్వనాథవారి వ్యాఖ్యలను అభ్యర్థి తప్పక తెలుసుకోవాలి.


చివరగా...


పరీక్షకు ఇక పదిహేను రోజుల వ్యవధే ఉంది. ఇంతవరకు ఎంత చదివామన్నది కాదు ఇప్పుడు ఎలా చదివామన్నది కీలకం. పరీక్ష దగ్గరపడుతున్న కొద్దీ మనసుపై ఒత్తిడి పెరిగితే ప్రమాదం. కింది విధానాలు పాటించండి.


ఉదయాన్నే 15 నిమిషాలపాటు ధ్యానం చేయండి లేదా మౌనంగా... ఒంటరిగా... మీతో మీరు గడపండి.


అనవసర వాదనలు, మాటలు లేకుండా చూసుకోండి.

ప్రతి ప్రశ్ననూ సినాప్సిస్‌తో రాసుకోండి.
ఏ ప్రశ్ననైనా పది-పదిహేను పాయింట్లు చెప్పగలిగేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి.

కొత్త పుస్తకాలు, మెటీరియల్‌ని చదివే ప్రయత్నం చేయకండి.


పాత ప్రశ్నపత్రాలన్నింటినీ తప్పక, క్షుణ్నం గా అధ్యయనం చేయండి. ఏ ఒక్క ప్రశ్నలోని ఏ ఒక్క పదం తెలీకపోయినా - నిపుణులను అడిగి తెలుసుకోండి. ఎందుకంటే పాత ప్రశ్నలు మళ్లీ అడిగే ధోరణి కనిపిస్తోంది.


వ్యాసానికి ఆరు పేజీలు మించకూడదు. 30 నిమిషాల్లోపు రాయగలగాలి. లఘు ప్రశ్న రెండు పేజీలు మించకుండా 12 నిమిషాల్లో రాసేయగలగాలి.


పరీక్షలో - వచ్చినా రాకపోయినా - రాయాల్సిన ఐదు ప్రశ్నల్ని రాయాలి.

పరీక్షలో కొట్టివేతలు రాకుండా జాగ్రత్తపడండి. ఒకవేళ వస్తే ఆదుర్దాపడకండి.
ఎన్ని పేజీలు రాశామన్నది కాదు - నాణ్యత ముఖ్యం అని గుర్తించండి.

చివరగా - ఓడేవాడికీ గెలిచేవాడికీ తేడా ఏమిటో గుర్తించండి. ఓడేవాడు పూర్తిగా ఆడకుండానే ఆటను ఆపేస్తాడు. గెలిచేవాడు - అం తుచూసేంతవరకు ఆడుతాడు. ఆడేవాడికి ఓడే మాట తెలీదని గుర్తించండి. విజయం మీ జన్మహక్కు అని గుర్తించి ఈ పదిరోజలు కష్టపడి గెలుపుని మీ గుప్పెట్లో బంధించండి.


రెండో పేపర్ ఇలా..


చాలా మంది అభ్యర్థులు ఆందోళన చెందేది రెండో పేపరు గురించే. వ్యాఖ్యానాలు, పద్యాలు, గాఢమైన విశ్లేషణలు ఉండే ఈ పేపర్‌ని ఐదు కోణాల దృష్టితో చదివితే సులువుగా ఆకళింపు చేసుకోవచ్చు.


1.వ్యాసరూప ప్రశ్నకు - వ్యాఖ్యానికి గల అంతఃసంబంధం తెలుసుకోగలగాలి.


2.వ్యాఖ్యానాలు రాయడానికి సులభ పద్ధతులు గుర్తించగలగాలి. ఉదాహరణకు ‘సామాజిక-చారిత్రక’ దృక్కోణంతో ఒక పద్యాన్ని వ్యాఖ్యానించినపుడు అదే అంశాన్ని కాస్త విస్తరిస్తే తాత్త్విక దృక్పథం అవుతుందని గుర్తించాలి.


3.రెండో పేపర్‌లో ప్రాచీన సాహిత్యంలోని ప్రతి అంశాన్నీ ‘సామాజిక ప్రయోజన’ కోణంతో తప్పక చదవాలి. అంటే నన్నయ శకుంతలోపాఖ్యానం క్రీ.శ.11వ శతాబ్దిలో రచించారు. ఆనాటి సమాజం ఏమిటి, ఆ కథలో అది ఎలా ప్రతిబింబించింది, 21వ శతాబ్దిలో ఉన్న నేటి సమాజానికి ఏదైనా ఆ కథ ఉపయోగపడుతుందా... ఇలా విశ్లేషించగల నేర్పరితనం అభ్యర్థికి తప్పనిసరి.


4.అభ్యర్థి చదివే ప్రతి పాత్రలోనూ మానవ మనస్తత్వం ఏమిటో అనువర్తించగలగాలి. శకుంతల, దుష్యంతుడు, పాండవులు, ద్రౌపది, కృష్ణుడు, గుణనిధి, సోమిదేవమ్మ, సుగాత్రి... ఇలా సిలబస్‌లో ఉన్న పాత్రలన్నీ వాస్తవానికి పురాణ, ఇతిహాస, కావ్య, ప్రబంధ పాత్రలు’ వారు మానవమాత్రులు కారు. సాధారణ మా నవుడిలో కనిపించే భావోద్వేగాలు వీరిలో ఉండకపోవచ్చు. ఈ పాత్రలను అన్ని కోణాల్లోనూ అభ్యర్థి విశ్లేషించగలగాలి.


5.ఒక కవికి ఉన్న ప్రత్యేక లక్షణాన్ని మరొక కవికి ఆపాదించి ప్రశ్న అడగడం యూపీఎస్‌సీ ధోరణిగా అభ్యర్థి గుర్తించాలి. ఉదాహరణకు ‘శ్రమైక జీవన సౌందర్యం’ అనే శ్రీశ్రీ వ్యాఖ్యను పింగళి సూరన సుగాత్రి శాలీనుల కథకు జోడించి 2003లో ప్రశ్న అడిగారు.


ఈ అంశాల ఆధారంగా అభ్యర్థి ఈ ఏడాది కొన్ని ముఖ్యమైన ధోరణులతో కొన్ని ప్రశ్నల్ని విశ్లేషించే అభ్యాసం చేయాలి.

ఉదాహరణకు సహదేవుడి పాత్రచిత్రణ, ద్రౌపది మాటకారితనం, రాయబార ఘట్టం - ఈనాటి పరిస్థితులు, గుణనిధికథ - నేటి తల్లిదండ్రుల పెంపకం, సుగాత్రి - ఆనాటి ఈనాటి స్త్రీ జాతికి ఇచ్చిన సందేశం, కర్పూర వసంతరాయలు - జాతివార్తా చమత్కారాలు, గురజాడ కథానికల్లోని స్త్రీ పాత్రలు... మొదలైన ప్రశ్నల తీరుతెన్నుల్ని అభ్యర్థి ముందే ఊహించుకుని విశ్లేషించుకోవాలి.
 
 
 
గమనిక: ఇది సాక్షి పత్రికలో ప్రచురించిన వ్యాసం  
Related Posts Plugin for WordPress, Blogger...