Saturday, December 17, 2011

సివిల్స్ 2012 నోటిఫికేషన్ లో జాప్యం ఎందుకు? సిలబస్ మారబోతోందా..!?

(ఈనాడు - చదువు సౌజన్యం తో ......)

రీక్షా విధానంలో 'మార్పు' అనే మాట వినగానే అభ్యర్థుల్లో ఆందోళన మొదలవుతుంది.

తాజాగా 'మెయిన్స్‌లో మార్పులు రాబోతున్నాయి' అంటూ వెలువడుతున్న వార్తలు సివిల్స్‌ పరీక్షను లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థుల్లో తికమకను పెంచుతున్నాయి.

అయితే యూపీఎస్‌సీ పరీక్షల్లో ఏ మార్పులైనా ఆకస్మికంగా ప్రవేశపెట్టరని గుర్తుంచుకోవాలి. సూక్ష్మంగా పరిశీలించి, విభిన్న అభిప్రాయాలను గమనించిగానీ మార్పులకు పచ్చజెండా ఊపరు.

కాకపోతే ఏ మార్పులకు ఆస్కారముందో తెలుసుకోవటం అభ్యర్థులకు మంచిదే!

నవంబరు, డిసెంబరు అంటే... సివిల్‌ సర్వీసుల అభ్యర్థులు శ్రద్ధగా గమనించాల్సిన నెలలుగా గుర్తింపు పొందాయి. కొన్నేళ్ళక్రితమైతే ఈ సమయంలో సివిల్స్‌ నోటిఫికేషన్‌ వచ్చేది. ఇప్పుడు పరీక్షా విధానం 'మార్పుల'కు సంబంధించిన సమాచారం వెలువడుతోంది. అంతే తేడా!

డిసెంబరు మొదటివారంలో యూపీఎస్‌సీ చైర్మన్‌ సివిల్స్‌ మెయిన్స్‌లో మార్పులను సూచించటానికి ప్యానెల్‌ని నియమించామని చెప్పారు. హ్యుమానిటీస్‌ విద్యార్థులతో పోలిస్తే సైన్స్‌ సబ్జెక్టుల వారు మార్కుల పరంగా అనుచిత ప్రయోజనం పొందకుండా మార్పులను సూచించటం ప్యానెల్‌ కర్తవ్యమని వార్తాకథనాల సారాంశం. నిర్వహణ, పాలనా నైపుణ్యాలను పరీక్షించేలా పేపర్లను రూపొందించటం కూడా మరో విధి.

అలఘ్‌ కమిటీ (1991), పాలనాసంస్కరణల రెండో కమిషన్‌ (2008) సిఫార్సుల ఆధారంగానే ప్యానెల్‌ సూచనలుంటాయని భావిస్తున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఎన్నో ప్రశ్నలూ సందేహాలూ... వాటిని పరిశీలిద్దాం!


వయః పరిమితి, ప్రయత్నాల సంఖ్య మొదలైనవి ఇప్పటి కమిటీ పరిధిలో లేవని గమనించాలి.

** ప్రిలిమినరీ పరీక్షా విధానం మళ్ళీ మారుతుందా?
* లేదు. ప్రిలిమ్స్‌ యథాతథంగానే ఉంటుంది. ప్రశ్నల సంఖ్యా, వెయిటేజి మారవచ్చు. అంతేగానీ మార్కుల, పేపర్ల సంఖ్యలో ఎలాంటి మార్పులూ ఉండవు.

** మెయిన్స్‌ మార్కులకు ప్రిలిమినరీ మార్కులు కలుస్తాయా?
* అలఘ్‌ కమిటీ ఇలా సిఫార్సు చేసింది కానీ, అది ఆమోదం పొందలేదు. అందుకని ప్రిలిమ్స్‌ మార్కులు మెయిన్స్‌లో కలిపే అవకాశం లేదు.

** మెయిన్స్‌లో అవకాశమున్న సబ్జెక్టులేమిటి?
* కమిటీ పరిధిని దృష్టిలో పెట్టుకుని కింది అంచనాలకు రావొచ్చు.

1) కంపల్సరీ లాంగ్వేజ్‌ పేపర్లు- ఇంగ్లిష్‌, మోడర్న్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌ కొనసాగుతాయి. ఈ పేపర్ల స్థాయి పెరుగుతుంది. ఇప్పుడవి అర్హతా పేపర్లే. ర్యాంకును నిర్థారించే స్కోరులో వీటి మార్కులను కూడా కలిపే అవకాశముంది.

2) అలఘ్‌ కమిటీ, ఏఆర్‌సీలు ఎస్సే విషయంలో ఏకాభిప్రాయంతో లేవు. కాబట్టి వ్యాసం యథాతథంగానే ఉంటుంది.

3) ఇప్పుడున్న జనరల్‌స్టడీస్‌ పేపర్లను మార్చాలని అలఘ్‌ కమిటీ సిఫార్సు చేయగా, ఏఆర్‌సీ దాన్ని బలపరిచింది. కాబట్టి ఇప్పుడున్నట్టుగా జనరల్‌స్టడీస్‌ పేపర్లుండకపోవచ్చు. ప్రిలిమ్స్‌లో పరీక్షించిన స్టాటిస్టిక్స్‌ లాంటివాటికి మెయిన్స్‌లో చోటు దొరక్కపోవచ్చు.

** కంపల్సరీ పేపర్లు ఏవి ఉండే అవకాశముంది?
* ఇప్పటి మెయిన్స్‌లో ఆప్షనల్స్‌ అంటే- అభ్యర్థులు విశ్వవిద్యాలయ స్థాయిలో చదివిన సబ్జెక్టులపై దృష్టి పెట్టటం. కానీ విజయవంతమైన సివిల్‌ సర్వెంట్‌గా మారాలంటే... నేర్చుకోదల్చిన అంశాలపై అభ్యర్థి దృష్టిపెట్టేలా ఉండాలి. అందుకే ఆప్షనల్‌ పేపర్ల స్థానంలో అభ్యర్థి విస్తృత పరిజ్ఞానం, నైపుణ్యాలు, స్వభావం, అభిరుచులూ పరీక్షించేలా కంపల్సరీ పేపర్లను రూపొందించాలనే ప్రతిపాదన ఉంది. వివిధ సబ్జెక్టుల కలబోత స్వభావంతో ఉండే ఈ పేపర్లు హయ్యర్‌ సివిల్‌ సర్వీసెస్‌తో నేరుగా సంబంధం కలిగివుంటాయి.

ఏమిటా పేపర్లు?
1.Sustainable development and Social Justice
2. Science and Technology in Society
3. Public Systems, Democratic Governance and Human Rights
4. The constitution of India and Indian Legal System
5. Indian Economy
6. Administrative Theory and Governance in India

బహుళైచ్ఛిక (మల్టిపుల్‌ చాయిస్‌), షార్ట్‌ ఆన్సర్‌, ఎస్సే టైపు ప్రశ్నలు అడుగుతారని భావిస్తున్నారు.

** గ్రూప్‌-1 పరీక్ష తరహాలో ఉంటుందా నూతన పరీక్షా విధానం?
* అలా ఉండే అవకాశం లేదు.
** సివిల్స్‌-2012 పరీక్షా విధానం మారబోతోందనీ, అందుకే నోటిఫికేషన్‌ విడుదలలో జాప్యం జరుగుతోందనీ వదంతులు వినిపిస్తున్నాయి....

* 2012లో ఎలాంటి మార్పులూ ఉండవు. ఈ డిసెంబరు 1న రాజ్యసభలో అవినాష్‌పాండే అడిగిన ప్రశ్నకు సంబంధిత మంత్రి వి.నారాయణస్వామి జవాబిస్తూ ఈ విషయాన్నే ఇలా స్పష్టం చేశారు. 'There is no proposal to introduce changes in the Main examination of the Civil Services Examination, at present.' 

కాబట్టి అభ్యర్థులు అనవసర గందరగోళానికి గురవ్వకుండా ఇప్పుడున్న పద్ధతిలోనే పరీక్షకు సిద్ధం కావటం శ్రేయస్కరం!

- గోపాలకృష్ణ 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...