Thursday, February 17, 2011

సివిల్స్, గ్రూప్-1 , 2 రిక్రూట్‌మెంట్‌కు సాంఘిక అధ్యయనాలు- బోధన లక్ష్యాలు

సాంఘిక అధ్యయనాలు- బోధన లక్ష్యాలు

 
చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌర శాస్త్రం, అర్థశాస్త్రం, సమాజ శాస్త్రాలు ప్రముఖమైన సామాజిక శాస్త్రాలు. సమాజ ప్రగతికి, శ్రేయస్సుకు సామాజిక అధ్యయనం ఎంతగానో తోడ్పడుతుంది. చరిత్ర, భూగోళ శాస్త్రం, అర్థశాస్త్రం, పౌరశాస్త్రం, సమాజ శాస్త్రాల సమూహ రూపమే సాంఘిక అధ్యయనాలు. సాంఘిక అధ్యయన బోధనా లక్ష్యాల్లో కొన్ని ముఖ్యమైనవి.


* జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించుట. అంతర్జాతీయ అవగాహన కల్గించుట. సాంఘిక దురాచారాల నిర్మూలనకు తోడ్పడటం. లౌకిక వాదాన్ని పెంపొందించుట. కులం, మతం, వర్గ బేధం లేకుండా చూడటం. ఆదర్శ పౌరుడిగా తయారుచేయడం మొదలైనవి.
విద్యాలక్ష్యాల ప్రాతిపదికగా బోధనా లక్ష్యాలు ఉంటాయి. నావ గమ్యం చేరడానికి దిక్సూచి ఎంత అవసరమో పాఠం బోధించటానికి లక్ష్యం అంతే ముఖ్యం. పాఠ్య బోధనకు ముందే లక్ష్యం నిర్ధారించుకోవాలి. సాంఘిక అధ్యయనం లక్ష్యాలు సామాజిక, మనోవైజ్ఞానిక, ఆర్థిక, సాంకేతిక మార్పులపై విద్యార్థి అవసరాలు, సమస్యలు, ప్రభుత్వ ఆశయాలు, అవసరాలపై ఆధారపడతాయి.
లక్ష్యాలు- లక్షణాలు:
- విద్యా మనోవిజ్ఞానశాస్త్రం సిద్ధాంతాలతో ఆధారితమై నిర్మించబడుతుంది. విద్యార్థి ప్రవర్తనా మార్పునకు కారణమవుతాయి. ఆచరణయోగ్యంగా ఉంటుంది. బోధనకు మార్గదర్శకత్వం వహిస్తాయి.
* విద్యార్థుల్లో మనం ప్రతిపాదించే అభ్యసన అనుభవాలద్వారా వారిలో ఆశించిన మార్పులు తెస్తాం. అటువంటి మార్పులను ప్రవర్తనా మార్పులంటారు. మూల్యాంకనంవల్ల వీటిని పరిశీలించవచ్చు. ఇలా విద్యార్థి మంచి అభ్యసనకోసం మనం ఆశించే స్పందనలు, మార్పులు ప్రణాళికలో స్పష్టంగా పేర్కొనడాన్ని స్పష్టీకరణలు అంటారు.
స్పష్టీకరణాలు- లక్షణాలు:
- అభ్యసన ఫలితాలలో ఇవి కనిపిస్తాయి. విద్యార్థి వికాసానికి ప్రతీకలుగా నిలుస్తాయి. విద్యార్థి ప్రవర్తనా మార్పునకు దోహదపడతాయి. విద్యార్జనకు చెందిన ఆయా స్థాయిల్లో ఇవి పనిచేస్తాయి. మనో విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాల ప్రాతిపదికగా అభ్యసనకు తోడ్పడతాయి. బోధన - అభ్యసనకు లక్ష్యాలు స్పష్టీకరణలు ప్రాణం వంటివి. బోధన-అభ్యసన లక్ష్యాలను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
జ్ఞాన లక్ష్యాలు: సాధారణ, విషయ, వివేచనా జ్ఞానాలు జ్ఞాన లక్ష్యాలకు మూలం.
భావావేశ లక్ష్యాలు: ఆసక్తి, అభిమతం, అభినందన వంటి భావాలు భావావేశ లక్ష్యాలకు మూలం.
మనోచలనాత్మక లక్ష్యాలు: జ్ఞాన లక్ష్యాలను, భావావేశ లక్ష్యాలను ఆచరణలోకి తేవడమే మనోచలనాత్మక లక్ష్యానికి మూలం.
పై లక్ష్యాల మూల భావ ప్రాతిపదికగా తిరిగి ఏడు రకాలుగా వర్గీకరించవచ్చు.
అవి: జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం, అభిరుచి, వైఖరి, ప్రశంస.
జ్ఞానం: విద్యార్థి సాంఘిక అధ్యయనాలకు సంబంధించిన నూతన పదాలు, వాస్తవాలు, సూత్రాలు, సాధారణీకరణాలు, ధోరణులు, భావనలకు సంబంధించిన జ్ఞానాన్ని ఆర్జిస్తాడు.
స్పష్టీకరణలు: విద్యార్థి.....
* జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించటం.
అవగాహన (లక్ష్యం): విద్యార్థి సాంఘిక అధ్యయన బోధన వల్ల వాటికి సంబంధించిన పూర్వాపరాలను గ్రహించి, అవగాహన పొందుతాడు. ఇక్కడ అవగాహనకు ‘జ్ఞానం’ సోపానం.
వినియోగం (లక్ష్యం): విద్యార్థి తాను పొందిన జ్ఞానాన్ని నిత్య జీవితంలో తన అవసరాన్నిబట్టి వినియోగించుకుంటాడు.
* సమస్యను విశే్లషించి దాని కీలకమైన అంశాలను గుర్తిస్తాడు. సమస్య పరిష్కారానికి తగిన జ్ఞానాన్ని ఎన్నుకుంటాడు. తనకు తెలిసిన దానితో సమస్య పరిష్కారానికి సంబంధం స్థాపిస్తాడు. ఫలితాలను ఊహిస్తాడు, జరగబోయే ఫలితాలను చెబుతాడు. నూతన పరికల్పనను రూపొందిస్తాడు. నూతన పరికల్పనను పరిశీలిస్తాడు. సేకరించిన సమాచారం సమస్య పరిష్కారానికి సరిపోతుందా? లేదా అనే వివేచన చేస్తాడు.
నైపుణ్యం (లక్ష్యం): సాంఘిక అధ్యయన విషయానికి సంబంధించిన ముద్రిత, ఆముద్రిత సమాచార సేకరణలో నైపుణ్యం పొందడం. పటాలు, చార్టులు, కాలపట్టికలు మొదలైనవి చదవగలుగుతాడు. కోటలు, పిరమిడ్లు, పనిముట్లు, నమూనాలు చక్కగా తయారుచేయగలుగుతాడు. పటాలు, చార్టులు, డయాగ్రామ్‌లు, గ్రాఫ్‌లు కచ్చితంగా గీయగలుగుతాడు. వర్షమాపని, ఉష్ణమాపని వంటి పరికరాలను నైపుణ్యంతో వినియోగించగలుగుతాడు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...