- సివిల్స్-2012
- ప్రిలిమ్స్ నోటిఫికేషన్ : ఫిబ్రవరి 4, 2012
- దరఖాస్తు గడువు తేదీ : మార్చి 5, 2012
- పరీక్ష తేదీ : మే 20, 2012
- మెయిన్స్ పరీక్ష : అక్టోబర్ 5, 2012 (21 రోజులు)
- వెబ్‌సైట్ : www.upsc.gov.in
జాతీయ స్థాయిలో జరిగే సివిల్స్ సర్వీసెస్‌కున్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. దేశాభివృద్ధిలో సమర్థులైన అధికారుల్ని అందించటం సివిల్స్ లక్ష్యం. తొలినాళ్లలో ఈ పరీక్షపై సరైన అవగాహన, మెటీరియల్ లభించిక మన రాష్ట్ర అభ్యర్థులు అవకాశాల్ని కోల్పోయారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కానీ విపరీతమైన పోటీ ఉంది. అంతకంటే మించి కఠినమైన పరీక్షగా అభ్యర్థిని పరీక్షిస్తోంది. అంతేగాక మంచి అకడమిక్ రికార్డ్ కలిగి ఉన్న అభ్యర్థులు సైతం కొన్ని అపోహల్లో మునిగిపోయారు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు మాత్రమే విజయం సాధిస్తారన్నది కూడా అలాంటిదే. ఇది మాత్రం వాస్తవం కాదు. సివిల్స్ సాధించడానికి అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్‌తోపాటు, సాధించాలనే తపన ఉండాలి. సివిల్స్-2012 నోటిఫికేషన్ ఫిబ్రవరిలో విడుదల కానుంది. అలాగే మన ఎపిపిఎస్‌సి కూడా గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు పరీక్షలను లక్ష్యం చేసుకొని సాధన చేస్తే బాగుంటుంది. ఈ నేపథ్యంలో సివిల్స్ విధి విధానాలు, అభ్యర్థుల సందేహాల గురించి ఇక్కడ అందిస్తున్నాం...
ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్...తదితర 20కి పైగా కేంద్ర సర్వీసుల్లో అధికారుల్ని ఎంపిక చేసే ప్రక్రియే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దీన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపడుతుంది. ప్రపంచంలోనే అత్యంత క్లిష్ట ఎంపిక విధానంగా ఈ పరీక్షకు పేరుంది. ఇందులో నెగ్గుకు రావాలంటే ముందుండాల్సింది...సహనం, నేర్పు.
సివిల్స్ ఔత్సాహికులకు ప్రథమంగా ఉండాల్సిన ప్రధాన లక్షణం సహనం. కారణం..దీని ఎంపిక ప్రక్రియే ఏడాదిపాటు ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో ఉండే ఈ ఎంపికలో ప్రిలిమ్స్ మే నెలలో జరుగుతుంది. చివరిదశ ఇంటర్వ్యూ పూర్తయి ఫలితాలు వెల్లడయ్యేది ఆ తదుపరి సంవత్సరం మే లోనే. ఇంత సుదీర్ఘ ప్రక్రియలో కూడి ఉండే పరీక్ష సివిల్స్.
శిక్షణ ఒక్కటే సరిపోదు...
సివిల్స్ వంటి అత్యున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్న అభ్యర్థులకు మొదటగా తలెత్తే సందేహం కోచింగ్ గురించే. కోచింగ్ తీసుకుంటేనే విజయం సాధ్యమనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు కోచింగ్ తీసుకోకుండానే, కేవలం ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుని విజయం సాధించనవారున్నారు. సివిల్స్ 2009లో విజేతగా నిలిచిన దేవిరెడ్ది ప్రశాంత్‌రెడ్డి సొంత ప్రిపరేషన్‌తోనే సాధించారు.
ఇలా మరెందరో ఉన్నారు. కాబట్టి... కోచింగ్ అవసరం అని కచ్చితంగా చెప్పలేం. అయితే కోచింగ్ తీసుకోవడం మాత్రం కచ్చితంగా లాభిస్తుందని చెప్పొచ్చు. అభ్యర్థులు బలంగా ఉన్న సబ్జెక్టులకు సొంతంగా సిద్ధమై, బలహీనంగా ఉన్న సబ్జెక్టులకు కోచింగ్ తీసుకోవచ్చు. ఎక్కువమంది అభ్యర్థులు చేసేది ఇదే. అయితే కోచింగ్ వల్ల మంచి సహచరులు పరిచయమవుతారు. దానివల్ల బృంద చర్చలకు ఆస్కారం ఉంటుంది.
తెలుగు మీడియం సమస్య అవుతుందా !
సివిల్స్ అందుకునేందుకు కావాల్సిన పరిశ్రమ, సహనం ఉన్నవారికి ఏ మీడియమైనా ఒకటే. తెలుగు మీడియంలో సివిల్స్ రాసి విజేతలుగా ఎంపికైనవారెందరో ఉన్నారు. కష్టపడి చదవటమే సివిల్స్‌కు కావాల్సిన అర్హత. ఈ క్రమంలో మొదటిసారే విజయం సాధ్యం కాకపోవచ్చు. కొంతమంది మూడుసార్లు పరాజితులై చివరిదైన నాలుగో అటెంప్ట్‌లో విజయం సాధించారు. ఇలాంటి వారిని ప్రేరణగా తీసుకోవాలి. రెండు, మూడుసార్లు పరాజయాలు పలకరించినా బెదరక రెట్టించిన ఉత్సాహంతో ఎగసే కెరటంలా చెలరేగాలి. కాకపోతే ఇంగ్లీష్‌లో మెటీరియల్ లభ్యత ఎక్కువ. ఒకప్పుడు తెలుగులో మెటీరియల్ కొన్ని సబ్జెక్టుల్లోనే లభించేది. ఇప్పుడు దాదాపు అన్ని సబ్జెక్టుల్లోనూ మెటీరియల్ విరివిగా దొరుకుతుంది. ఇంగ్లీష్‌లో కొంచెం బలహీనంగా ఉన్న అభ్యర్థులు, ఇంగ్లీష్ మెటీరియల్‌తో సాధన చేయవచ్చు. తెలుగులోకి అనువదించుకుని మెటీరియల్ రూపొందించుకున్నా ఫరవాలేదు.
అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా ! లేకున్నా !
చాలామంది అకడమిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించనవారు మాత్రమే పోటీ పరీక్షలని నెగ్గగలరని భావిస్తారు. ఇది అపోహ మాత్రమే. ఇలాంటి భావనలను మనుసునుంచి తుడిచివేయాలి.గతంలో సివిల్స్ సాధించనవారిలో చాలామంది అకడమిక్ పరీక్షలో సాధారణ మార్కులు పొందినవారే. కాబట్టి ఎక్కడ, ఏం చదివారు అనేదానికంటే సివిల్స్ దృక్కోణంలో ఒక అంశాన్ని ఎలా చదివారు, ఏం గ్రహించారు, చక్కని భావవ్యక్తీకరణ ఉందా ! సరిదిద్దుకోగల నేర్పు ఉందా ! అన్నది చూస్తారు. వీటిని సమాధానాల నుండి గ్రహిస్తారు.
అదనంగా ఇంకేంటంటే...
సివిల్స్ ఔత్సాహికులకు అకడమిక్స్‌కు అదనంగా కొన్ని సహజ లక్షణాలు ఉండాలి. అవి...చేసే పనిపట్ల ఇష్టం, పట్టుదల, ప్రణాళిక, పరిశ్రమ, అణుకువ, అంకితభావం, ఆత్మస్థైర్యం, ఆత్మ విమర్శ, ఏ విషయం చదివినా గ్రహించడంలో స్పష్టత, వ్యక్తీకరించడంలో సరళత, వివరించడంలో సంగ్రహత. ప్రతిరోజూ రేడియో వార్తలు వినడం, వివిధ దినపత్రికలను చదవడం, చదివినదానిపై ఆలోచించి సహచరులతో చర్చించడం, సామాజిక సమస్యల పట్ల సానుభూతితో స్పందించడం. నిజాయితీతో, నిర్భయంగా, నమ్రతతో చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలగడం. వీటిని పెంపొందించుకుంటే భావి విజేతలుగా అవతరించొచ్చు.
ఇక అర్హతలేంటంటే... ( తెలిసిందే మళ్ళీ ఇంకోసారి కొత్తవారికోసం )
గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వయో పరిమితి..ఆగస్టు 1, 2012 నాటికి 21-30 ఏళ్లు. బిసిలకు మూడేళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు.
ఓపెన్ కేటగిరి అభ్యర్థులు వయోపరిమితికి లోబడి గరిష్టంగా నాలుగుసార్లు, ఓబిసిలు ఏడుసార్లు, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లైనా రాయొచ్చు. అయితే ఈ మూడంచెల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో) ఎందులో విఫలమైనా మొదటి నుంచి ప్రస్థానం మొదలుపెట్టాలి. ఉదాహరణకు ఒక అభ్యర్థి ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్యూలో విఫలమైతే...మళ్లీ ప్రిలిమ్స్ నుంచి రాయాలి. అంతేగాకుండా ప్రిలిమ్స్‌లో ఒక్క పేపర్‌కు హాజరైనా ఒక ప్రయత్నం చేసినట్టే. అత్యుత్తమ ప్రిపరేషన్ ఉందనుకుంటే రాయడం మంచిది.
గత దశాబ్ద కాలంగా సివిల్స్ ఫలితాలు, విజేతల అనుభవాలు పరిశీలిస్తే సివిల్స్ పరీక్ష అత్యున్నతమైనప్పటికీ...అందని ద్రాక్ష మాత్రం కాదు అని స్పష్టమవుతోంది. శాస్త్రీయంగా, ప్రణాళికబద్ధంగా సన్నద్ధమైతే ఏ నేపథ్యం ఉన్న అభ్యర్థులైనా ఇందులో విజయం సాధించడం సులభమే. కనీసం ఒక సంవత్సరం పూర్తిస్థాయి ప్రిపరేషన్ మాత్రం తప్పనిసరి. ఇక మొదటిసారే విజయం సాధించిన అభ్యర్థులు కూడా ఎందరో ఉన్నారు. సివిల్స్ పరీక్షను లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు ప్రతి రోజూ రేడియో, దినపత్రికలు, టీవీల్లోని వార్తలు, చర్చలు, వాఖ్యానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తుండాలి. వాటిపై విశ్లేషణలు చేయాలి. సమాజంలో జరిగే సంఘటనలను నిశితంగా గమనించాలి. మనోరమ ఇయర్‌బుక్, ఇండియా ఇయర్ బుక్, ఎన్‌సిఈఆర్‌టి 9-12 తరగతుల పుస్తకాల అధ్యయనంతో ప్రిలిమ్స్ ప్రిపరేషన్ శ్రీకారం చుట్టాలి.
ఆప్షనల్ ఎంపిక...
సివిల్స్ పరీక్ష క్రమంలో అత్యంత కీలక అంశం ఆప్షనల్స్ ఎంపిక. 2010 వరకు ప్రిలిమ్స్‌లో కూడా ఒక పేపర్ ఆప్షనల్‌గా ఉండేది కాబట్టి...చాలామంది అభ్యర్థులు ఒక ఆప్షనల్‌ను ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికీ కలిసొచ్చేలా ఎంచుకునే వీలుంది. కానీ 2011 నుంచి ప్రిలిమ్స్‌లో ఆప్షనల్ విధానానికి స్వస్తి పలికారు. ఈ నేపథ్యంలో ఆప్షనల్స్ ఎంపిక విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అభ్యర్థులు తాము చదివిన గ్రాడ్యుయేషన్ సబ్జెక్టులాధారంగా మెయిన్స్‌లో ఆప్షనల్ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల అకడమిక్ స్థాయిలో పట్టున్న సబ్జెక్టులను ప్రిపేర్‌కావడంలో ఇబ్బంది ఎదురుకాదు. అయితే మూడేళ్ల డిగ్రీలో చదవని సబ్జెక్టులును సైతం ఆప్షనల్స్‌గా ఎంచుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే...మెయిన్స్ వ్యాసరూప సమాధానాలు రాయాల్సిన పరీక్ష. కాబట్టి బాగా పట్టున్న, విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా రాయగల సబ్జెక్టులను ఎంచుకోవడం మంచిది. అంతేకాకుండా ఆ సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్ లభ్యత, కోచింగ్ సదుపాయాలు మొదలైనవాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అవసరమైతే అంతకు ముందు సివిల్స్ విజేతలను సంప్రదించి వారి గైడెన్స్‌ను కూడా తీసుకోవడం ఉత్తమం.
సెలక్షన్ విధానం : సివిల్స్‌లో ఎంపిక విధానం మూడంచెలుగా ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడింట్లో అభ్యర్థులను పరీక్షిస్తారు.
ప్రిలిమ్స్ : ఈఏడాది నుంచి ప్రిలిమినరీ పరీక్ష తీరుతెన్నులు మారాయి. ఇంతకు ముందు వరకు జనరల్ స్టడీస్‌కు 150 మార్కులు, అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షనల్ సబ్జెక్టుకు 300 మార్కులు ఉండేవి. 2011 నుంచి పేపర్-2 ఆప్షనల్ స్థానంలో ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రారంభించారు. దీంతో పేపర్-1 జనరల్ స్టడీస్, పేపర్-2 ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు జరుగుతున్నాయి.
మెయిన్స్ : మొత్తం ఖాళీలను పరిగణించి...1:12 లేదా 1:12.5 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మొయిన్స్‌లో మొత్తం 9 పేపర్లుంటాయి. పేపర్-1 రీజనల్ లాంగ్వేజ్, పేపర్-2 ఇంగ్లీష్ కేవలం అర్హత కొరకే. వీటిల్లో సాధించిన మార్కులను ఇంటర్వ్యూ ఎంపికకు పరిగణలోకి తీసుకోరు. పేపర్-3 జనరల్ ఎస్సే, పేపర్-4, 5 జనరల్ స్టడీస్ ఉంటాయి. మిగతా నాలుగు పేపర్లు అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షనల్స్ పేపర్లు. ఒక్కో ఆప్షనల్‌కు రెండు పేపర్లు ఉంటాయి. మెయిన్స్ పేపర్లన్నీ డిస్క్రిప్టీవ్ విధానంలోనే ఉంటాయి.
ఇంటర్వ్యూ : మెయిన్స్‌లో పొందిన మార్కుల ఆధారంగా ఒక్కో ఖాళీకి 1:2 లేదా 1:2.5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇది మూడొందల మార్కులకు జరుగుతుంది. చివరికు మోయిన్స్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ ప్రకారం ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
చదవాల్సిన పుస్తకాలు...
- ఇండియా ఇయర్ బుక్,
- యోజన,
- ఎకనామిక్ సర్వే,
- ది హిందూ దినపత్రిక,
- ఇండియా పాలిటీ-లక్ష్మీకాంత్,
- ఇండియన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-ఆర్.కె.అరోరా,
- కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా-పిఎం.భక్షీ,
- ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ-ఆర్.ఎస్.శర్మ,
- మిడీవల్ ఇండియన్ హిస్టరీ-సతీష్ చంద్ర,
- మోడ్రన్ ఇండియన్ హిస్టరీ-బిపిన్ చంద్ర,
- మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్ రీజనింగ్-ఆర్.ఎస్.అగర్వాల్,
- అనలిటికల్ రీజనింగ్- పాండే,
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-ఆర్.ఎస్.అగర్వాల్.
This is a very helpful site.. I personally believe in this cutting edge technology advancement a student must enroll for some online course like IAS Preliminary General Studies and CSAT Online Video Coaching to get an advantage.
ReplyDelete