Monday, October 31, 2011

HOW TO CRACK CIVIL SERVICES EXAMINATION | సివిల్స్ గురించి సమగ్ర అవగాహనను అందించే ఈ పుస్తకం ఒకసారి తిరగేయండి..

సివిల్స్ గురించి సమగ్ర అవగాహన కొరకు ఒక పుస్తకం ప్రచురింపబడినది. కేవలం ఆంగ్లంలో మాత్రమె ఈ పుస్తకం ప్రచురించబడినది. పుస్తకం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. http://www.championsquest.com/assets/ClickHere_button_RedWhite_4.gif
ఒక మిత్రుడు ( Venkata krishna janam ) నాకు ఈ పుస్తకం గురించి ఈ మెయిల్ చేసాడు.

Wednesday, October 19, 2011

సివిల్స్ లో తెలుగు సాహిత్యం లో గమనించదగినవి. | Preparing Telugu Literature for ( CIVILS ) Mains

Akella Raghavendra
Cవిల్ సర్వీసెస్ పరీక్షలో ఎక్కువ మార్కులు తెచ్చిపెడుతున్న ఆప్షనల్స్‌లో తెలుగు సాహిత్యం ఒకటి. పాతప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే తెలుగు ఆప్షనల్స్ నుంచి తికమక ప్రశ్నలు అంతగా రావడం లేదని అర్థమవుతుంది. అంటే అభ్యర్థి కాస్తంత ప్రణాళికతో, పరీక్షా దృక్పథంతో శ్రమిస్తే అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు పొందడం సులువే. సివిల్స్ మెయిన్స్ తెలుగు లిటరేచర్‌కు ఇంకా రెండు వారాల వ్యవధే ఉంది. తెలుగు లిటరేచర్‌లో తప్పనిసరిగా చదవాల్సిన అధ్యాయాలు, ప్రశ్నల కోణాలు, సమాధానాలు రాయాల్సిన తీరు, అనుసరించాల్సిన వ్యూహాలు, నైపుణ్యాలు....తెలుసుకుందాం

చదవాల్సినవి ఇవీ...


ఇంటర్, డిగ్రీలాంటి అకడమిక్ పరీక్షల స్వరూపం వేరు. పోటీ పరీక్షల లక్ష్యం వేరు. అకడమిక్స్‌లో ఏవో కొన్ని అధ్యాయాలు చదివి మిగిలిన వాటిని విడిచిపెట్టినా గట్టెక్కొచ్చు. కానీ సివిల్స్ లాంటి పోటీ పరీక్షల్లో అలా కాదు. కొన్ని ప్రత్యేక వ్యూహాలను అభ్యర్థి అర్థం చేసుకుంటే - కొన్ని అధ్యాయాలే చదివినప్పటికీ మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. మొదట సిలబస్‌లోని అన్ని అధ్యాయాల మీదా అవసర మైనంత అవగాహన ఉండాలి.


తర్వాత ఏయే అధ్యాయాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో స్పష్టంగా గుర్తించగలగాలి. దీనిద్వారా ఏయే అధ్యాయాలపై ఆధారపడితే ఎక్కువ మార్కులు వస్తాయో తెలుస్తుంది.

పైన వివరించిన వ్యూహం ఆధారంగా తప్పక చదవాల్సినవిగా పేపర్-1, పార్‌‌ట-ఎలో 1, 4, 5, 6, 7 అధ్యాయాలను వ్యాస, లఘు రూప ప్రశ్నల కోసం పూర్తిగా అధ్యయనం చే యాలి. 2, 3, 8 అధ్యాయాలు లఘురూప ప్రశ్న ల కోసం చదివితే చాలు. అదేవిధంగా పార్‌‌ట-బిలో 1, 7, 9, 10, 11, 12 అధ్యాయాల నుంచి వ్యాస, లఘురూప ప్రశ్నలు రెండింటినీ సంపూర్ణంగా చదవాలి. మిగిలిన అధ్యాయాల్లోని లఘురూప ప్రశ్నలపై పూర్తి పట్టు సాధించాలి.


విజయానికి ఐదు వ్యూహాలు...


కొన్ని అధ్యాయాల నుంచి కేవలం లఘురూప ప్రశ్నలు మాత్రమే చదివితే వాటి నుంచి వ్యాసాలు వస్తే ఎలా? అని అభ్యర్థి సందేహించడం సహజం. అలాగే ఒక్కోసారి అభ్యర్థి అసలు చదవని ప్రశ్నలు పరీక్షలో వచ్చినా - ధైర్యంగా, సమగ్రంగా సమాధానం రాసే సత్తా సాధించడం ఎలా? - అని కూడా విద్యార్థులు అడుగుతుంటారు. దీనికి ఆయుధాల్లాంటి ఐదు వ్యూహాలను అభ్యర్థి అనుసరించాలి.


1. సంక్షిప్తీకరణం: అభ్యర్థి ఒక వ్యాసరూప ప్రశ్న చదివాడనుకుందాం. అదే ప్రశ్న పరీక్షలో వ్యాసంగా కాకుండా లఘురూపంగా రావొచ్చు. అలాంటప్పుడు సమర్థంగా సంక్షిప్తీకరించడం ఎలాగో తెలియాలి. దీనికి మూడు వ్యూహాలు ఉన్నాయి. అవి...

ఎ. వ్యాసంలోని ప్రాధాన్య, అప్రాధాన్య అంశాల్ని గుర్తించగలిగి కీలక అంశాలు మాత్రమే రాయాలి.
బి. వివరణలు, విశ్లేషణలు పరిహరించాలి
సి. దృష్టాంతం, ఉదాహరణలు తగ్గించాలి.

2. విస్తరణ: ఒక లఘురూప ప్రశ్నను వ్యాసంగా విస్తరించగల నైపుణ్యాన్ని అభ్యర్థి తప్పక సాధించాలి. ఉదాహరణకు నామ్నీకరణంపై లఘురూప ప్రశ్న మాత్రమే చదివిన ఒక అభ్యర్థికి పరీక్ష గదిలో అదే అంశంపై వ్యాసం రాయాల్సిన పరిస్థితి ఎదురైందనుకుందాం. అలాంటపుడు - నామ్నీకరణం అంటే ఏమిటో కాస్త ఎక్కువగా వివరించి, ఉదాహరణలు పెంచి, అనుకరణం అనే మరో లఘురూప ప్రశ్నలోని అంశాల్ని జోడించి, విస్తరించి రాయగలగాలి. ఎందుకంటే - అనుకరణం కూడా నామ్నీకరణంలో ఒక భాగమే కాబట్టి! అలాగే ‘యక్షగానం’పై లఘుసమాధానం చదివిన అభ్యర్థి - అదే జవాబుకి రఘునాథ నాయకుడు, దక్షిణాంధ్ర కవయిత్రులు రాసిన యక్షగానాల వివరణను, విశ్లేషణను జోడిస్తే - వ్యాసం పూర్తవుతుంది.


3. అంతఃసంబంధం: సిలబస్‌లోని వివిధ అధ్యాయాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం మూడో వ్యూహం. ఉదాహరణకు సిలబస్ ప్రకారం పేపర్-1, పార్‌‌ట-బిలో ‘నన్నయ భారత రచన సామాజిక నేపథ్యం’ చదివితే చాలు. కానీ 2007లో ఇదే అధ్యాయం నుంచి ‘నన్నయ భారతాంధ్రీకరణ విధానం’పై ప్రశ్న వచ్చింది. దీనికి సమాధానం రెండో పేపర్‌లోని నన్నయ శకుంతలోపాఖ్యానం నుంచి స్వీకరించి రాయాలన్న స్పృహ అభ్యర్థికి అవసరం.


అలాగే ఆధునిక యుగంలో ఆవిర్భవించిన ధోరణి ‘స్త్రీ వాదం’. కానీ 2006లో ‘ప్రాచీనాంధ్రంలో స్త్రీవాదం’పై ప్రశ్న వచ్చింది. ఇది స్థూలంగా చూస్తే - అసందర్భ ప్రశ్న. కానీ రాయక తప్పదు. ఇలాంటప్పుడు ఎలా? మొదట స్త్రీవాదంపై రెండు పేరాలు రాయాలి. ఆపై రెండో పేపర్‌లో శకుంతల, ద్రౌపది, గుణనిధి తల్లి, సుగాత్రి, మొల్ల తదితరుల్లో కనిపించే స్త్రీచైతన్య, స్త్రీ వేదన అంశాలను స్త్రీవాదంతో అనుసంధానిస్తూ - ప్రాచీనాంధ్ర దృక్కోణంతో రాయగలగాలి.


4. పారిభాషిక పదాలు: పరీక్షలో సాధారణంగా కనిపించే పరిభాషను అభ్యర్థి అర్థం చేసుకోవాలి. వివరించండి, విశ్లేషించండి, దృష్టాంతీకరించండి, సోదాహరించండి, ఉటంకించండి, విమర్శించండి, విపులీకరించండి, క్రోడీకరించం డి, ప్రత్యక్షీకరించండి, నిరూపించండి, నిర్ణయించండి... ఇలాంటి పదాలు ప్రశ్నల్లో కనిపించినపుడు అన్నింటికీ ఒకే సమాధానం కాదని గుర్తించండి. మార్కులు రావడానికి, ఎక్కువ మా ర్కులు రావడానికి వ్యత్యాసం ఉండేది ఇక్కడే.


5. పదాలు మారవచ్చు: ఒక్కోసారి పరీక్షలో ప్రసిద్ధమైన పదంతో ప్రశ్న అడగకుండా మారుమూల పదంతోనో, అర్థంకాని పదంతోనో ప్రశ్న రావచ్చు. ఉదాహరణకు ‘శ్రీనాథుడు చాటువులు’ అని అడగకుండా 2006లో ‘శ్రీనాథుడు - దేశీయతాముద్ర’ అని అడిగారు. అలాగే ద్రావిడ భాషల్లో ‘తెలుగు స్థానం’ అని నేరుగా అడగకుండా 2004లో ‘మూల ద్రావిడ వర్ణాలు తెలుగులో పొందిన మార్పులు’ అని మార్చి అడిగారు. ఇలాంటివి సిలబస్‌లో ఎన్ని ఉన్నాయో అన్నింటిపైనా అభ్యర్థికి అవగాహన ఉండాలి. అలాగే ప్రసిద్ధ కవుల, విమర్శకుల వ్యాఖ్యల్ని ప్రశ్నలుగా అడుగుతున్నారు. ఉదాహరణకు విశ్వనాథ సత్యనారాయణ ‘తిక్కన శి ల్పంపు తెనుగుతోట’ అని పలికారు. ఇదే 2000 లో ప్రశ్నగా వచ్చింది. నన్నయ మొదలుకొని తొమ్మిది మంది ప్రాచీన కవులపై విశ్వనాథవారి వ్యాఖ్యలను అభ్యర్థి తప్పక తెలుసుకోవాలి.


చివరగా...


పరీక్షకు ఇక పదిహేను రోజుల వ్యవధే ఉంది. ఇంతవరకు ఎంత చదివామన్నది కాదు ఇప్పుడు ఎలా చదివామన్నది కీలకం. పరీక్ష దగ్గరపడుతున్న కొద్దీ మనసుపై ఒత్తిడి పెరిగితే ప్రమాదం. కింది విధానాలు పాటించండి.


ఉదయాన్నే 15 నిమిషాలపాటు ధ్యానం చేయండి లేదా మౌనంగా... ఒంటరిగా... మీతో మీరు గడపండి.


అనవసర వాదనలు, మాటలు లేకుండా చూసుకోండి.

ప్రతి ప్రశ్ననూ సినాప్సిస్‌తో రాసుకోండి.
ఏ ప్రశ్ననైనా పది-పదిహేను పాయింట్లు చెప్పగలిగేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి.

కొత్త పుస్తకాలు, మెటీరియల్‌ని చదివే ప్రయత్నం చేయకండి.


పాత ప్రశ్నపత్రాలన్నింటినీ తప్పక, క్షుణ్నం గా అధ్యయనం చేయండి. ఏ ఒక్క ప్రశ్నలోని ఏ ఒక్క పదం తెలీకపోయినా - నిపుణులను అడిగి తెలుసుకోండి. ఎందుకంటే పాత ప్రశ్నలు మళ్లీ అడిగే ధోరణి కనిపిస్తోంది.


వ్యాసానికి ఆరు పేజీలు మించకూడదు. 30 నిమిషాల్లోపు రాయగలగాలి. లఘు ప్రశ్న రెండు పేజీలు మించకుండా 12 నిమిషాల్లో రాసేయగలగాలి.


పరీక్షలో - వచ్చినా రాకపోయినా - రాయాల్సిన ఐదు ప్రశ్నల్ని రాయాలి.

పరీక్షలో కొట్టివేతలు రాకుండా జాగ్రత్తపడండి. ఒకవేళ వస్తే ఆదుర్దాపడకండి.
ఎన్ని పేజీలు రాశామన్నది కాదు - నాణ్యత ముఖ్యం అని గుర్తించండి.

చివరగా - ఓడేవాడికీ గెలిచేవాడికీ తేడా ఏమిటో గుర్తించండి. ఓడేవాడు పూర్తిగా ఆడకుండానే ఆటను ఆపేస్తాడు. గెలిచేవాడు - అం తుచూసేంతవరకు ఆడుతాడు. ఆడేవాడికి ఓడే మాట తెలీదని గుర్తించండి. విజయం మీ జన్మహక్కు అని గుర్తించి ఈ పదిరోజలు కష్టపడి గెలుపుని మీ గుప్పెట్లో బంధించండి.


రెండో పేపర్ ఇలా..


చాలా మంది అభ్యర్థులు ఆందోళన చెందేది రెండో పేపరు గురించే. వ్యాఖ్యానాలు, పద్యాలు, గాఢమైన విశ్లేషణలు ఉండే ఈ పేపర్‌ని ఐదు కోణాల దృష్టితో చదివితే సులువుగా ఆకళింపు చేసుకోవచ్చు.


1.వ్యాసరూప ప్రశ్నకు - వ్యాఖ్యానికి గల అంతఃసంబంధం తెలుసుకోగలగాలి.


2.వ్యాఖ్యానాలు రాయడానికి సులభ పద్ధతులు గుర్తించగలగాలి. ఉదాహరణకు ‘సామాజిక-చారిత్రక’ దృక్కోణంతో ఒక పద్యాన్ని వ్యాఖ్యానించినపుడు అదే అంశాన్ని కాస్త విస్తరిస్తే తాత్త్విక దృక్పథం అవుతుందని గుర్తించాలి.


3.రెండో పేపర్‌లో ప్రాచీన సాహిత్యంలోని ప్రతి అంశాన్నీ ‘సామాజిక ప్రయోజన’ కోణంతో తప్పక చదవాలి. అంటే నన్నయ శకుంతలోపాఖ్యానం క్రీ.శ.11వ శతాబ్దిలో రచించారు. ఆనాటి సమాజం ఏమిటి, ఆ కథలో అది ఎలా ప్రతిబింబించింది, 21వ శతాబ్దిలో ఉన్న నేటి సమాజానికి ఏదైనా ఆ కథ ఉపయోగపడుతుందా... ఇలా విశ్లేషించగల నేర్పరితనం అభ్యర్థికి తప్పనిసరి.


4.అభ్యర్థి చదివే ప్రతి పాత్రలోనూ మానవ మనస్తత్వం ఏమిటో అనువర్తించగలగాలి. శకుంతల, దుష్యంతుడు, పాండవులు, ద్రౌపది, కృష్ణుడు, గుణనిధి, సోమిదేవమ్మ, సుగాత్రి... ఇలా సిలబస్‌లో ఉన్న పాత్రలన్నీ వాస్తవానికి పురాణ, ఇతిహాస, కావ్య, ప్రబంధ పాత్రలు’ వారు మానవమాత్రులు కారు. సాధారణ మా నవుడిలో కనిపించే భావోద్వేగాలు వీరిలో ఉండకపోవచ్చు. ఈ పాత్రలను అన్ని కోణాల్లోనూ అభ్యర్థి విశ్లేషించగలగాలి.


5.ఒక కవికి ఉన్న ప్రత్యేక లక్షణాన్ని మరొక కవికి ఆపాదించి ప్రశ్న అడగడం యూపీఎస్‌సీ ధోరణిగా అభ్యర్థి గుర్తించాలి. ఉదాహరణకు ‘శ్రమైక జీవన సౌందర్యం’ అనే శ్రీశ్రీ వ్యాఖ్యను పింగళి సూరన సుగాత్రి శాలీనుల కథకు జోడించి 2003లో ప్రశ్న అడిగారు.


ఈ అంశాల ఆధారంగా అభ్యర్థి ఈ ఏడాది కొన్ని ముఖ్యమైన ధోరణులతో కొన్ని ప్రశ్నల్ని విశ్లేషించే అభ్యాసం చేయాలి.

ఉదాహరణకు సహదేవుడి పాత్రచిత్రణ, ద్రౌపది మాటకారితనం, రాయబార ఘట్టం - ఈనాటి పరిస్థితులు, గుణనిధికథ - నేటి తల్లిదండ్రుల పెంపకం, సుగాత్రి - ఆనాటి ఈనాటి స్త్రీ జాతికి ఇచ్చిన సందేశం, కర్పూర వసంతరాయలు - జాతివార్తా చమత్కారాలు, గురజాడ కథానికల్లోని స్త్రీ పాత్రలు... మొదలైన ప్రశ్నల తీరుతెన్నుల్ని అభ్యర్థి ముందే ఊహించుకుని విశ్లేషించుకోవాలి.
 
 
 
గమనిక: ఇది సాక్షి పత్రికలో ప్రచురించిన వ్యాసం  
Related Posts Plugin for WordPress, Blogger...