Thursday, September 22, 2011

బ్యాచిలర్ డిగ్రీ ఓపెన్ యునివర్సిటీ లోక్ చేసిన వారు " సివిల్స్" రాయవచ్చా.? | Can open degree students write UPSC civil Services.?

ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన వారు సివిల్స్ రాయడానికి అర్హులు. రెగ్యులర్ డిగ్రీ చేసిన వారితో సమానంగా వీరికి కూడా సివిల్స్ రాయడానికి అర్హత ఉంది.


Tuesday, September 6, 2011

తెలుగు మీడియం వారి కోసం ప్రత్యేకం . తెలుగు మీడియం వారు సివిల్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి.

తెలుగు మీడియం విద్యార్థులు ఎలా ప్రిపేర్‌ కావాలి? వీరు సివిల్స్‌ రాయడానికి సరిపోరా?




మనలో అనేక మంది విద్యార్థులుగానో, ఉద్యోగార్థులుగానో దినపత్రికలు తిరగేస్తున్నప్పుడు నిత్యం ఒక అధికారి మనకు తారసిల్లుతుంటాడు. ఆ జిల్లా అధికారిని అనేకమంది ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు...ఇలా అనేక మంది ఎప్పుడూ కలుస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గుర్తుకు వచ్చిందా? అతనే జిల్లా కలెక్టర్‌. అతని చుట్టూ ఉండే హంగామా, ఆధికారదర్పం దగ్గరగా చూసిన ఏ విద్యార్థి అయినా క్షణకాలం పాటు తానూ కలెక్టర్‌ అయితే ఎంత బాగుండు!! అని అనుకుంటాడు. కొంత మంది దానిని గురించి కలలు కంటారు. కానీ అంతలోనే చుట్టూ ఉన్న పరిస్థితులు, స్నేహితుల వెక్కిరింతలు, నిరుత్సాహపూరిత మాటలను గమనించి వెంటనే జావగారి పోతారు. అందుకనే వెంటనే ఆ ప్రయత్నం నుంచి విరమించుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగానికి పరీక్ష అంటే పోటీ విపరీతంగా ఉంటుంది. ఇక జాతీయస్థాయి పరీక్షలంటే చెప్పక్కర్లేదు. చదువుతుపాటు వీటికి ఉండాల్సిన ఒకే ఒక అర్హత...తపన, తపస్సు.





చాలామంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల జీవితాల్లో ఈ సంఘటన చోటు చేసుకుంటుంది. ఇదంతా ఎందువల్ల జరుగుతుందంటే కేవలం అవగాహన లోపం మాత్రమే. ఎవరికి అవగాహన లేదు? అంటే తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, చుట్టూ ఉన్న వారు, టీచర్లు, లెక్చరర్‌లు...ఇలా వీరు...వారు...అనే కాకుండా అధికులకు ఈ పరీక్షల గురించి, మార్గం గురించి అవగాహన ఉండకపోవడం వల్లనే ఇది జరుగుతుంది. అవగాహన ఉన్న వారయితే ఆ కోరికను వెలిబుచ్చిన పిల్లలను ఆ దిశగా మరల్చుతారు.చాలా మందికి ఐఎఎస్‌, ఐపిఎస్‌ పాసై జిల్లా కలెక్టరు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ కావాలంటే దారి ఏమిటి? ఏ పరీక్షలు రాయాలి? దాని కోసం ఎవరిని కలవాలి? ఎలా ముందుకు సాగాలి? అనే విషయాలు తెలియవు. ఒక వేళ తెలిసినా అది చాలా కష్టతరమైన పరీక్ష అనీ, ముఖ్యంగా సామాన్య పేద విద్యార్థులు రాయలేరనీ...అందుకని వాటి గురించి కలలు కనడం కూడా 'సాహసమే' అని భయపడుతూంటారు. ఇదంతా అనవసరపు అపోహ మాత్రమే. నిజానికి సివిల్‌ సర్వీస్‌ పరీక్ష కూడా అన్ని పరీక్షల్లాగే సామన్య పరీక్షలేనని, ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తే వాటిలో అగ్రభాగాన నిలబడడం సాధ్యమే. అందుకని కలెక్టర్‌ కావాలనుకోవడం సాధారణమే తప్ప 'సాహసం' కానేకాదని ఏ మాత్రం భావించకండి.





ఇక్కడ మరో విషయం చెప్పుకోవడం అవసరం. డిగ్రీలు, పోస్టు గ్రాడ్యుయేషన్‌లు చేస్తున్నప్పటికీ తరువాత ఏం చదవాలో? ఏ సబ్జెక్టులు ఎంచుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి చాలామందిలో ఉన్నది. ముఖ్యంగా ఈ తికమక పరిస్థితి సివిల్‌ సర్వీసు పరీక్షలకు సంబంధించి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. దీనికి విద్యార్థులను ఏ మాత్రం తప్పుబట్టకూడదు. ఎందుకంటే వారికి అవగాహన కలిగించే ప్రయత్నం ఇంట్లోనూ, కాలేజీల్లోనూ, బయటా ఎవరూ చేయకపోవడమే కారణం. తప్ప ఇంత చదువుకున్నా కూడా ఈ మాత్రం తెలియదా? అని వారిని చిన్న చూపు చూడటం తగని పని.మీరు విదేశాలలో మన దేశపు రాయబారిగా ఆ దేశపు ప్రధానితోనో, అధ్యక్షునితోనో మాట్లాడుతున్నట్టు ఊహించుకోండి. అలాగే ఒక కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాదిని మీరు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచేందుకు విచారిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన కేసులో ఉన్నతాధికారులనో లేదో సినిమా నటులను ఇంటి మీదనో దాడి చేస్తున్నారు. లేదా దేశంలోనికి అక్రమంగా రవాణా అవుతున్న సరకులను పట్టుకోగలిగారు. మరో సన్నివేశంలో మరో పెద్ద రాజకీయ నాయకుడు డబ్బు, బంగారం అక్రమంగా తీసుకు వెళుతున్నపుడు దానికి లెక్క, జమ లేదని ఆయనను మీరు అరెస్ట్‌ చేయగలిగారు. మన దేశ వాణిజ్య, వ్యాపార భవిష్యత్తును నిర్ణయించే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు. టి. ఓ.) చర్చలతో మీరు స్వయంగా పాల్గొనగలిగారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక ఉదాహరణలు.




అలాంటి అన్ని సందర్భాల్లో పనిచేసే అవకాశం రావడం గొప్ప పరిస్థితి. సదరు అధికారి పత్రికల పతాక శీర్షికలకెక్కాతాడు. అలాంటి వ్యక్తిని దేశమంతా గౌరవిస్తూ ఉంటుంది. ఆ విధంగా పైన పేర్కొన్న విధులను నిర్వహించే అవకాశం ఒక సివిల్‌ సర్వీసులతోనే దక్కుతుంది. ఈ పరీక్షల ద్వారా ఐఎఎస్‌, ఐపిఎస్‌లే గాకుండా పైన చెప్పుకున్నటు వంటి విశేష, విచక్షణాధికారాలు గల దేశంలోనే ఉన్నతమైన సుమారు 25 సర్వీసులలో చేరే అవకాశముంది.

ఈ ఉద్యోగాల్లో చేరడం వల్ల ప్రభుత్వ విధాన రూపకల్పనల్లోనూ, వాటిని అమలు చేయడంలోనూ కీలక పాత్ర పోషించే అరుదైన అవకాశం కలుగుతుంది. వృత్తిలో భాగంగా వేలు, లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. హోదాతోపాటు ఈ విధంగా తృప్తిని కలిగించే ఉద్యోగాలు ఇవేనంటే కూడా అతిశయోక్తి కాదు. ఇటీవల అధికాదాయాన్నిస్తున్న ఉద్యోగాలుగా భావిస్తున్న కంప్యూటర్‌ (సాఫ్ట్‌వేర్‌) రంగంలోని ఉద్యోగాలతో పోలిస్తే ఇక్కడ పొందే గౌరవం, సామాజిక హోదా, సంతృప్తి అనిర్వచనీయమైనది. అధికారాల గురించైతే ఇక చెప్పనే అవసరం లేదు. ఎన్నో కంపెనీల సీఈవోలకు లభించని అధికారం, ప్రజలకు సేవ చేసే అవకాశం ఈ సర్వీసులతో మాత్రమే లభిస్తుంది. సివిల్‌ సర్వీసులోని గొప్పదనమంతా ఇదే.





ఇంత చక్కటి కెరీర్‌ అయిన సివిల్‌ సర్వీసెస్‌లను ఎంచుకునే వారి సంఖ్య ఇటీవల తగ్గిపోతున్నట్లు ఒక సర్వే తెలిపింది. దీనికి కారణాలను కూడా అదే సర్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ విషయాన్నే తీసుకుంటే...ప్రతి తల్లిదండ్రి, తమ బిడ్డ ఐఐటి చేయాలనో లేదా ఇంజనీరింగ్‌ లేదా మెడిసిన్‌ చేయాలని కోరుకుంటున్నారు. అదీ తప్పితే కంప్యూటర్‌ రంగంలో ప్రవేశించి వేల కొద్దీ జీతం ఆర్జించాలని చూస్తున్నారు కాబట్టే ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు తెలిసింది. డబ్బు మీద 'యావ' పెరగడం ఒక సామాజిక కోణమైతే, ఈ ఉద్యోగాల గురించిన అవగాహన లేకపోవడం మరో కారణం కాగా ఫలితాలపై తల్లిదండ్రులకుండే అసందిగ్దత కూడా తోడైనందువల్లనే పిల్లలను ఈ వైపుగా మళ్ళించడం లేదని సర్వేలో తేలింది.
ఇంజనీరింగ్‌ చదివితే ఏదో ఒక ఉద్యోగం చేసుకుని బతకవచ్చని అదే ఐఎఎస్‌ పరీక్షలకు ప్రిపేరై...చివరకు అది రాకపోతే ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాల శ్రమ వృథా? కదా? అనే సందేహం వస్తుంది. అయితే ఇది అపోహగానే తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే...ఒక సారి సివిల్‌ సర్వీసు పరీక్షలకు ప్రిపేరయిన విద్యార్థికి ఏ'కెరీర్‌'కైనా కావలసిన స్కిల్స్‌ కంటే ఎక్కువ 'ప్రతిభ' అలవడుతుంది. కాబట్టి ఐఎఎస్‌ రాకపోతే...గ్రూప్‌-1, 2 వంటి సర్వీసులున్నాయి. బ్యాంకింగ్‌ ఉద్యోగాలున్నాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, రైల్వే...ఇలా ఏ రంగంలో అయినా కీలకమైన పోస్టులనే పొందగలుగుతారు. పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలు...ప్రయివేటు సంస్థల్లోని ఉద్యోగాలను చిటికెలో చేజిక్కించుకోగలరు. సివిల్‌ సర్వీసు పరీక్షలకు సిద్ధమైన వారికి కొన్ని కంపెనీలు ఇటీవల కాలంలో ప్రాధాన్యతనిస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉంది? వీరికి ఎలాంటి లక్షణాలు సిద్ధిస్తున్నాయి? వీరికెంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. కెరీర్‌కే కాదు జీవితానికి కావలసిన సమయ పాలన, పట్టుదల, సహనం, నిర్వహణా సామర్థ్యం, సామాజిక ప్రవర్తన వంటివన్నీ ఈ ప్రిపరేషన్‌ వల్ల విద్యార్థులకు అబ్బుతాయి. దానితో వారు సునాయాసంగా ఉద్యోగం దొరకబుచ్చుకోవడమే కాకుండా చేపట్టిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలిగి మంచి పేరు, గుర్తింపులను తెచ్చుకోగలుగుతారు. కాబట్టి మీకున్న సందేహాలను పక్కన బెట్టి మంచి కెరీర్‌, ఉన్నతమైన భవిష్యత్తు కావాలనుకునే వారు తప్పని సరిగా ఎన్నుకోవలసిన కెరీర్‌ సివిల్‌ సర్వీసెస్‌.
ఎంచుకున్నాక ఏం చేయాలి?





సరే...! అన్నీ బేరీజు వేసుకుని సివిల్‌ సర్వీసెస్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వారు ముందుకు సాగడం కోసం ఎక్కడ నుంచీ ప్రారంభించాలి? ఎలా ప్రారంభించాలి? అనే ప్రశ్న ఎదురవుతుంది. అందుకని ప్రిపరేషన్‌ గురించిన వివరాలు తెలుసుకుందాం.చిన్ననాటి నుంచే ఈ పరీక్షలను ఎంచుకునే వారయితే పాఠశాల స్థాయి నుంచే ప్రారంభించడం మంచిది. అలా కాకున్నా ఇంటర్మీడియెట్‌, డిగ్రీలు చదువుతున్న వారయినా సరే ఇప్పటి నుంచే ప్రారంభించవచ్చు. అయితే దేనికి తగ్గ ప్రణాళికను దానికి వేసుకోవాలి. అంటే ఉన్న సమయాన్ని సరయిన రీతిలో సద్వినియోగం చేసుకుంటే లక్ష్యం సాధించవచ్చు.ప్రిపరేషన్‌ అనగానే లావాటి ఉద్గ్రంథాలను ముందేసుకుని కుస్తీ పట్టడమని భావిస్తారు చాలామంది. కానీ అది కాదు. అసలంతటి పుస్తకాలను చదవాల్సిన అవసరమే లేదు. మున్ముందుగా దినపత్రికను చదవడం అలవాటు చేసుకోవాలి. కొద్ది కాలం ఇది అలవాటయ్యాక మనకు కావలసిన వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టి చదవాలి. ఫక్తు రాజకీయాలు, టైంపాస్‌ వార్తలు, సినీ వార్తలు వంటివి కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలు, విధానాల గురించిన వార్తలు చదవాలి. ఆర్థిక, సామాజిక రంగాలకు సంబంధించిన విశ్లేషణలను చదువుతూ ఉండాలి. ప్రభుత్వాల గమనాలను, సరళులను గమనిస్తూ ఉండాలి. మొదట్లో కొద్దిగా బోర్‌ అనిపించినా నెమ్మదిగా దిన పత్రికల ఎడిటోరియల్‌ (ఒపీనియన్‌) పేజీలోని వ్యాసాలను చదవాలి. దీనితో సమస్య పూర్వాపరాల గురించిన వివరాలు తెలవడమే కాకుండా విశ్లేషణలు కూడా బోధపడతాయి. ఒక సమస్యను అర్థం చేసుకోవడంలో ఎలా? అనే విషయం అర్థమవుతుంది.




ఇవే కాదు క్రీడా వార్తలు కూడా చదవాలి? అయితే క్రీడలు అనగానే మేజర్‌గా ఒక క్రికెట్టే అనుకుంటారు. కానీ పోటీ పరీక్షల్లో క్రికెట్టేతర పోటీలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని గుర్తుంచుకోండి. క్రీడా పోటీల విజేతలను, అవి ఎక్కడవెక్కడ జరుగుతున్నాయి? వంటి విషయాలను అవగాహన చేసుకుంటూ చదవాలి? అలాగే అవార్డుల గురించీ చదవాలి? ముఖ్యమైన పదవులలో నియామకాల గురించి, పరిణామాల గురించి, ఆవిష్కరణలు-వాటి ప్రభావాల గురించి చదువుకుంటూ అవగాహన పెంచుకుంటూ ఉండాలి.

ఈ విషయాలను పత్రికల్లోనూ కాకుండా రేడియోల్లో మరింత ఎక్కువగా వస్తాయి. టీవీల్లోనయితే వార్తల్లోని కొన్ని విషయాలు పనికి వస్తాయి. మనకవసరమైన సివిల్స్‌ కోణంలో నుంచి చూస్తే టీవీకన్నా రేడియోనే మేలు. మనకు కావలసిన ఇలాంటి వివరాలు ఎక్కువగా రేడియోనే రిపోర్టు చేయాలి. రేడియో వల్ల విషయాలు తెలవడమే కాదు వినగలిగే సామర్థ్యం పెరిగి, విషయం పట్ల అటెన్షన్‌ పెరుగుతుంది. ఈ సామర్థ్యం మనకు మౌఖిక పరీక్షలో ప్రశ్నలను సరిగ్గా వినేందుకు సహాయపడుతుంది.ఇక్కడ మరో విషయం ముఖ్యంగా గమనించాలి. ఏ రంగం ఎంచుకున్నప్పటికీ సమయపాలన చాలా అవసరం. సృష్టిలో దేనినైౖనా తిరిగి సాధించగలం గానీ, గతించిన సమయాన్ని తిరిగి సంపాదించలేమన్నది అనుభవపూర్వకంగా మనకు తెలిసిన విషయమే. అందులోనూ సివిల్స్‌కు ఇది మరీ ముఖ్యం. దీనిని సివిల్స్‌ ప్రిపరేషన్‌కు సంబంధించిన వాటిలో ప్రాథమికాంశంగా పరిగణించాలి. కాబట్టి పేపర్‌ చదవడంతో పాటు సమయ పాలనను మొదటి నుంచీ అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా ముందుకు సాగితే సివిల్స్‌ 'సాధన' బాటలో మీరు సరయిన రీతిలో సాగుతున్నట్లేనని భావించాలి.

భాషా సమస్య
ఇదంతా అలవాటు చేసుకోవచ్చు. కానీ పరీక్ష ఇంగ్లిషులో ఉంటుంది కదా! మరి తెలుగు మీడియం విద్యార్థులు ఎలా ప్రిపేర్‌ కావాలి? వీరు సివిల్స్‌ రాయడానికి సరిపోరా? అనే సందేహం కలుగుతుంది చాలామందికి. 'వేల మైళ్ళ దూరమైనా ఒక్క అడుగుతో మొదలు పెడదాం' అని మావో చెప్పినట్లు మొదటి నుంచీ ఈ విషయంపై కూడా శ్రద్ధ పెడితే సరిపోతుంది.అయితే చాలామంది అనుకుంటున్నట్లు సివిల్‌ సర్వీసు పరీక్షలు రాసే వారికి ఇంగ్లిషు అనేది ఒక సమస్య కానే కాదు. ఎందుకంటే అభ్యర్థుల విజయాన్ని నిర్ణయించే దశలైన మెయిన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల్లో మాతృభాష(తెలుగు)తోనూ పాల్గొనవచ్చు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులకు తెలుగు రాకుంటే వారే 'ట్రాన్స్‌లేటర్‌'ను కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ప్రిలిమినరీ పరీక్షలో మాత్రం ప్రశ్నలను ఇంగ్లిషులోనే ఇస్తారు. ఇది ఆబ్జెక్టివ్‌ రూపంలో ఉంటుంది. కాబట్టి జవాబులను ఎ, బి, సి, డి,గా గుర్తించడమే ఉంటుంది. అందుకని ప్రశ్నను అర్థం చేసుకునే కనీస ఇంగ్లిషు పరిజ్ఞానముంటే సరిపోతుంది. ప్రస్తుతం తెలుగు మీడియం చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ పరిజ్ఞానం ఉంటుంది. అది కూడా లేని వారు కొద్ది కాలం పాటు ప్రాక్టీసు చేస్తే సరిపోతుంది.
మన రాష్ట్ర విద్యార్థులు తెలుగుతోనే విజయాలు సాధించారు, సాధిస్తూన్నారు. జాతీయ స్థాయి 'టాప్‌టెన్‌'లో ఒకరిగా స్థానం పొందిన భానుప్రతాప్‌, మొదటిస్థానంలో నిలిచిన ముత్యాలరాజు, కార్తిక్‌...మొదలైవారు పూర్తిగా తెలుగు మీడియంతోనే విజయం సాధించారు. పైగా తెలుగు మీడియంతో రాస్తున్న విద్యార్థుల్లో సక్సెస్‌ శాతం కూడా ఎక్కువేననే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే నమ్మకం కుదురుతుంది. కాబట్టి మీడియం గురించి ఏ మాత్రం కంగారు పడవద్దు. రోజుకు కొన్ని పదాలకు అర్థాలు చదువుకుంటే కావలసిన పరిజ్ఞానం వస్తుంది.

గ్రామీణ ప్రాంత విద్యార్థుల మనసులను తొలిచే మరో ముఖ్యమైన అంశం 'డబ్బు'. పుస్తకాలు కొనడానికీ, కోచింగ్‌ తీసుకోవడానికీ లక్షలు వెచ్చించాల్సి వస్తుంది కదా!' అనేది. సరయిన రీతిలో కష్టపడే వారు ఏ మాత్రం డబ్బు ఖర్చు పెట్టకుండా సివిల్స్‌కు ప్రిపేరయ్యే మార్గాలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ సర్కిళ్ళున్నాయి. ప్రభుత్వం నిర్వహించే వీటిలో ఈ కేటగిరీలకు చెందిన విద్యార్థులకు వీటి ద్వారా హాస్టలు వసతితో పాటు, ఉచిత కోచింగ్‌ కూడా లభిస్తుంది. ఈ కేటగిరీకి చెందని విద్యార్థులు కాలేజీ, యూనివర్సిటీ లైబ్రరీలను ఉపయోగించుకుంటే పుస్తకాలను కొనే బాధ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లు కూడా పెరిగాయి. అందుకని కోచింగ్‌ కూడా తక్కువ డబ్బుతోనే పొందే అవకాశాలున్నాయి. అభ్యర్థుల సామర్థ్యాన్ని బట్టి కొన్ని కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లు ఉచితంగానూ శిక్షణనిస్తున్నాయి. ఇలాంటి సౌకర్యాలుపయోగించుకునే ఎంతో మంది సివిల్స్‌లో విజయం సాధిస్తున్నారు. ప్రస్తుతం మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్న బుర్రా వెంకటేశం వీటి సహాయంగా చదువుకుని విజయం సాధించిన వారే కావడం గమనార్హం.




'మనసుంటే మార్గముంటుంది' అన్నట్లు సివిల్స్‌ సాధించాలనే కోరిక...కాదు...తపన ఉంటే మీడియం, పేదరికం వంటివేవీ అడ్డుకాదు. విద్యార్థులే కాదు తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గుర్తించి పిల్లలను ఈ వైపుగా ప్రోత్సహించాలి.
తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న వారి ప్రోత్సాహముంటే విద్యార్థులు సివిల్స్‌లో విజయం సాధించడం గొప్ప విషయమేమీ కాదు.ఇక్కడ చర్చించిన దానితో మీకున్న సందేహాలన్నీ తీరి ఉంటాయని భావిస్తున్నాను. కాబట్టి సివిల్స్‌ సాధించాలనే 'కిల్లర్‌ ఇన్‌స్టింక్ట్‌'ను పెంచుకోండి.
ఆల్‌ ది బెస్ట్‌ !!






PREPARING FOR CIVILS IN TELUGU


ఇంజనీరో, డాక్టరో కావాలంటే ఈ రోజుల్లో ఇంటర్‌ స్థాయినుంచే వేలల్లో, లక్షల్లో ఖర్చు అవుతోంది. అదీగాక ఎక్కువ సమయం చదువు కోసమే కేటాయించాల్సి ఉంటుంది. మరి లక్షలకొద్దీ ఫీజులు కట్టలేని పేద మధ్య తరగతి యువత పరిస్థితి ఏమిటి? ఎస్టీడి బూత్‌లోనో, బుక్‌స్టాల్‌లోనో పార్టుటైమ్‌ పనిచేస్తూ చదువుకునే విద్యార్థులు అత్యధిక సమయం స్టడీ రూమ్‌లోనే గడిపే పరిస్థితి ఎక్కడుంది? అన్నప్పుడు చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది సివిల్‌. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్నవారు కూడా పార్టుటైమ్‌ ఉద్యోగాలు చేస్తూ సివిల్స్‌ దాకా ఎదిగినవారున్నారు. ఇలాంటి అవకాశం ఉంది కాబట్టే దీనివైపు ఎక్కువ శాతం యువత మొగ్గు చూపుతోంది. ఆసక్తి, పట్టుదల ఉంటే చాలు అవకాశాన్ని ఎవ్వరైనా సొంతం చేసుకునే వీలు ఒక్క సివిల్స్‌కే సాధ్యం.
ఎంబిఎ, ఎంసిఎ, ఎంబిబిఎస్‌, ఇంజనీరింగ్‌ లాంటి ఉన్నత చదువులకయ్యే ఖర్చుకంటే సివిల్స్‌కయ్యేది చాలా తక్కువ. అదీగాక ఆర్థిక పరిస్థితి బాగోలేని వారు పార్టుటైమ్‌ ఉద్యోగాలు చేస్తూ కూడా చదువుకునే వీలుంది. కాబట్టి ఎక్కువశాతం యువతీ యువకులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. సివిల్‌ సర్వీసెస్‌ అంటేనే చాలామంది ఐఎఎస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష అని అనుకుంటుంటారు. కానీ ఇందులో 22 రకాల కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. ఐఎఎస్‌కంటే కూడా ఉన్నతమైన ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసెస్‌ పరీక్ష ఉంది. ఐఎఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ రెండింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఐఎఎస్‌కే ఎక్కువ డిమాండ్‌ ఉంది. తక్కువ కాలంలో ఉన్నత హోదాకు ఎదిగే అవకాశం, సామాజిక గౌరవం, అధికారం, అవకాశం, ఉద్యోగ భద్రత అన్నీ ఉండటమేగా సేవాదృక్పథం కలిగిన వారికి ప్రజాసేవ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మధ్య తరగతి యువత ఎక్కువగా సివిల్స్‌పై ఆసక్తి చూపుతోంది.
హోదాతోపాటు
ప్రధానమంత్రి తర్వాత అత్యున్నత హోదాగల కేబినెట్‌ కార్యదర్శి పదవికి చేరుకునే అవకాశం ఒక్క సివిల్స్‌ సర్వీసెస్‌ ద్వారా మాత్రమే సాధ్యం. అంతేకాదు రాజ్యాంగ పరమైన అనేక పదవులు పొందే అవకాశం ఇందులో ఉంటుంది.
పాలనా వ్యవస్థకు పట్టుగొమ్మలు
ఒక ప్రజా ప్రతినిధి పదవీ కాలం ఐదేళ్లు మాత్రమే. ఒక న్యాయమూర్తి కొన్ని పరిధులకు లోబబడి మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి పదవి కూడా ప్రజాస్వామ్య దేశంలో స్వల్పకాలికమైనదే. కానీ అదే ఒక సివిల్‌ సర్వీసెస్‌ అధికారి పదవి... దాదాపు 30 సంవత్సరాలు. అంటే పాలనా వ్యవస్థలో, పాలనా వ్యవహారాల్లో, ప్రణాళికల రూపకల్పనలో సివిల్‌ సర్వీసెస్‌లదే కీలకపాత్ర ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండే ఒక ఐఎఎస్‌ అభ్యర్థి సలహాలనే పాటిస్తుంటారంటే దానికుండే గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు.
డిగ్రీ ఉంటే చాలు...
కచ్చితంగా ఇన్ని మార్కులుంటేనే సివిల్స్‌కు అర్హులనే నిబంధనలేమీ లేవు. 21 సంవత్సరాల వయసు ఉండి, డిగ్రీ చదువుతున్న వారు, ఫైనల్‌ ఇయర్లో ఉన్నవారు కూడా ఐఎఎస్‌ ప్రవేశ పరీక్ష రాయవచ్చు.
ప్రిలిమినరీ
ప్రతి ఏడాదీ ప్రిలిమినరీ పరీక్షకోసం నోటిఫికేషన్‌ వెలువడుతూ ఉంటుంది. ఈ పరీక్ష అంతా ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటుందన్న విషయం తెలిసిందే. 2011 కొత్త పాటర్న్ అమలులోకి వచ్చింది.
కొత్త ప్యాటర్న్‌లో ఏముంటుంది
కొత్త ప్యాటర్న్‌ అనగానే కఠినంగా ఉంటుందేమోనని భయపడాల్సిన అవసరం లేదు. చాలా సులభంగానే ఉంటుంది. కేవలం బట్టీపట్టో, పరీక్షకోసం మాత్రమే చదివో గుర్తుపెట్టుకునే జనరల్‌ నాలెడ్జ్‌ పరీక్షవల్ల విద్యార్థుల్లోని ప్రజ్ఞను సరైనరీతిలో అంచనా వేయలేకపోతున్నారు. అందుకే అభ్యర్థుల్లో నైతిక విలువలు, సంక్లిష్ట పరిస్థితుల్లో, సంక్షోభ సమయాల్లో సమయోచితంగా వ్యవహరించగలిగే సామర్థ్యం, పరిష్కార మార్గం తదితర విషయాలపట్ల అవగాహన కల్పించే విధంగా కొత్త ప్యాటర్న్‌ ఉంటుంది. అభ్యర్థుల్లో కూడా వీటిస్థాయినే పరీక్షిస్తారు.
మెయిన్స్‌కు అర్హత
మొత్తం 450 మార్కులు ఉంటాయి. 275 ఆ పైన స్కోర్‌ చేయగలిగితే మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతీ ఏడాది 1.5 లక్షల మంది సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష రాస్తుంటారు. ఖాళీల ప్రాతి పదికను బట్టి సుమారు 9000 మంది దాకా మెయిన్స్‌కు ఎంపికవుతుంటారు. ఇందులో తొమ్మిది పేపర్లను డిస్ట్క్రిప్టివ్‌ పద్ధతిలో రాయాల్సి ఉంటుంది. అక్టోబర్‌ నెలలో ఈ పరీక్ష ఉంటుంది. ప్రతి ఏటా సుమారు 1500 మందికి ఇంటర్వ్యూకు అర్హత లభిస్తుంది.
మెరిట్‌ జాబితా ఇలా...
మెయిన్స్‌ పరీక్షల నోటిఫికేషన్‌ తర్వాత దాదాపు నాలుగు నెలలపాటు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. మెయిన్స్‌లో సాధించిన మార్కులనూ, ఇంటర్వ్యూ మార్కులనూ కలిపి చివరిగా మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు. దీని తర్వాత సుమారు 500 మంది ఎంపిక అవుతారు. ఎంపిక కానివారు మళ్లీ ప్రిలిమినరీ నుంచి చదవాల్సి ఉంటుంది.
సబ్జెక్టు ఏదైనా
కేవలం ఆర్ట్స్‌ చదివిన వారే కాదు డిగ్రీలో సైన్స్‌, మ్యాథ్స్‌ చదివిన వారు కూడా ఆర్ట్సు సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది ఇలాగే తీసుకుంటున్నారు కూడా. ఎందుకంటే ఆర్ట్స్‌ ఒక సామాజిక శాస్త్రమేగాక నిత్యజీవితంతో మిళితమై ఉంటుంది. అదీగాక మెటీరియల్‌ ఎక్కువగా అందుబాటులో ఉంటుంది.
సమయం సద్వినియోగం
డిగ్రీలో చదివిన సబ్జెక్టులనే ఆప్షనల్‌ ఎంచుకోవాలా? వేరే సబ్జెక్టులు తీసుకోవడంవల్ల సమస్యలు తలెత్తుతాయా? అన్న సందేహంతోనే కొంతమంది సమయం వృథా చేస్తుంటారు. కొందరు ఏదోఒక ఆప్షనల్స్‌ ఎంచుకొని కొంతకాలం చదివి వదిలేస్తుంటారు. చివరికీ దేంట్లోనూ రాణించక ఇబ్బంది పడుతుంటారు. దేనికైనా ముందుగా ఆసక్తి, పట్టుదల, లక్ష్యం ఇవన్నీ కావాలి. ఇవి ఏర్పర్చుకొని ఏ ఆప్షనల్‌ ఎంచుకున్నా రాణించగలుగుతారు. కాబట్టి ఆసక్తి ఉన్న ఆప్షనల్‌తోపాటు జనరల్‌ స్టడీపైనా దృష్టిపెట్టాలి. అప్పుడే అనుకున్నది సాధించ గలుగుతారు.
దేనికి ఎన్ని మార్కులు?
ప్రిలిమినరీ (అర్హత పరీక్ష-ఫైనల్స్‌కు ఎంపికకు)
మొత్తం మార్కులు 450
కంపల్సరీ జనరల్‌ స్టడీస్‌ 150
ఆప్షనల్‌ పేపర్‌ 300
మెయిన్స్‌ పరీక్షకు 2000
ఇంటర్వ్యూకు 300
ఎంపిక: మెయిన్స్‌, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఉంటుంది.




సివిల్స్ తెలుగు సాహిత్యం సిలబస్

పేపర్ 1 పార్ట్ - ఏ (భాష) 


1) ద్రావిడ భాషలలో తెలుగు తెలుగు స్థానం - ఆంధ్రం, తెలుగు, తెనుగు పదాల పుట్టుపూర్వోత్తరాలు 
2 ) మూల ద్రావిడ వర్ణాలు, పదాలు, వ్యాకరణ అంశాలు, వాక్యము ప్రాచీన ఆధునిక తెలుగులో పరిణామం పొందిన విధానం
౩) ప్రాచీనాంధ్రభాష నవీన వ్యావహారిక భాషగా పరిణామం చెందిన విధానం 
4 ) తెలుగుపై అన్య భాషా ప్రభావం 
5 ) భాష ఆధునీకరణ - తెలుగు ఆధునీకరణకు భాషాభివృద్ధికి జరిగిన ప్రయత్నాలు 
6 ) మాండలికం 
7 ) వాక్యం - ప్రత్యక్ష - పరోక్షవచానాలు 
8 ) అనువాదం - అనువాదంలో సమస్యలు 







పేపర్ 1 పార్ట్ - బి ( సాహిత్యం ) 

తెలుగు సాహిత్య చరిత్ర, ఒక విహంగ వీక్షణం 
ఆధునిక కవిత్వంలో వచ్చిన ఉద్యమాలు 
సాహిత్య వికాసంలో అంతర్గతి సూత్రం 


1 ) ప్రాజ్ఞ్నన్నయ యుగంలో తెలుగు సాహిత్యం - మార్గ - దేశి - కవిత్వాలు 
2 ) నన్నయ యుగం : చారిత్రక సాహిత్య భూమిక - నన్నయ ' ఆదికవి' - పంపయుగం మీద నన్నయ తిరుగుబాటు - నన్నయ కవితా లక్షణాలు
౩) శివకవుల సాహిత్యం : ద్విపద శతకం, రగడ, ఉదాహరణ - శైవకవి నన్నెచోడుడు - వీరశైవకవి పాల్కురికి సోమనాథుడు
4 ) తిక్కన వ్యక్తిత్వం - తిక్కన నిర్వచనోత్తరరామాయణం - తిక్కన ఆంధ్రమహాభారతం - తిక్కన కవితలో నాటకీయత - నన్నయ తిక్కన కవితలలో కానవచ్చే భేద సాదృశ్యాలు 
5 ) ఎర్రన రచనలు - ఎర్రన ప్రభందపరమేశ్వరుడు - నాచన సోమన ' సంవిధాన చక్రవర్తి ' - నాచన సోముడు - నవీన గుణసనాధుడు - నాచానసోమనాధుని చమత్కార ప్రస్థానం
6 ) శ్రీనాథుని వ్యక్తిత్వం - శ్రీనాథుడు ' రసప్రసిద్ధిధారధుని' - శ్రీనాథుడు ' ఆంద్రభాషా నైషదాబ్జభవుడు' శ్రీనాథుని హరవిలాసం - శ్రీనాథుని భీమఖండం : కాశీఖండం - బమ్మెర పోతన భాగవత రచన 
7 ) భక్తి సాహిత్యం - సంకీర్తన సాహిత్యం : తాళ్ళపాక అన్నమాచార్యులు 
8 ) ప్రబంధయుగం : కొన్ని ప్రసిద్ధ ప్రబంధాలు - ప్రబంధ లక్షణాలు - ప్రబంధ యుగంలో రెండు శిఖరాలు - అల్లసాని పెద్దన, పింగళి సూరన 
9 ) దక్షిణాన్ధ్ర యుగం : వివిధ ప్రక్రియలు - తెలుగు యక్షగానం - త్యాగరాజ కృతులు - యోగి వేమన - పద్యం ప్రక్రియ - మకుటం ముద్ర - శతక సాహిత్యం - తెలుగులో ద్విపద సాహిత్యం - వచన కార్యవికాసం - లఘువ్యాఖ్యలు :
i) జాను తెనుగు
ii) పాల్కురికి సోమనాథుని రచనలు
iii) రగడ
iv) ఉదాహరణలు
v) పదకవితలు
vi) రామదాసు 
vii) రఘునాథ నాయకుడు 
viii) చేమకూర వేంకటకవి
ix)  ప్రాచీనాంధ్ర సాహిత్యయుగాల్లో కవయిత్రులు
x) భక్తి కవులు : తాళ్ళపాకఅన్నమయ్య, రామదాసు, త్యాగయ్య 





10 ) ఆధునిక తెలుగు సాహిత్యం, ప్రక్రియలు - నవల - కథానిక - నాటకం - నాటిక - కవితాప్రక్రియలు 
11 ) సాహిత్యోద్యమాలు - జాతీయోద్యమం - భావకవిత్వోద్యమం - నవ్యసంప్రదాయోద్యమం - అభ్యుదయ కవిత్వోద్యమం - విప్లవ కవిత్వోద్యమం 
12 ) దిగంబర కవులు - స్త్రీవాదం - దళితవాదం 
13 ) జానపద సాహిత్యం - ప్రధాన ప్రక్రియలు - జానపద కళలు 






పేపర్ - 2 







సాధారణ అంశాలు - రసవాడ దృక్పథం - ధ్వనివాద దృక్పథం - వక్రోక్తివాద దృక్పథం - రూపవాదం - నిర్మాణవాదం - భావచిత్రవాదం - ప్రతీకవాదం - సామాజిక విమర్శ - మనోవైజ్ఞానిక విమర్శ - చారిత్రక విమర్శ





పార్ట్ - ఎ 


1 ) నన్నయ - ఆంధ్రమహాభారతం - దుష్యంత చరిత్ర 
2 ) తిక్కన - ఆంధ్రమహాభారతం - శ్రీకృష్ణుని రాయబారం 
౩ ) శ్రీనాథుడు - కాశీఖండం - గుణనిధి కథ 
4 ) పింగళి సూరన - కళాపూర్ణోదయము - సుగాత్రీ శాలీనుల కథ 
5 ) మొల్ల రామాయణము - బాలకాండము 
6 ) కాసుల పురుషోత్తమ కవి - ఆంధ్రనాయక శతకము 




పార్ట్ - బి 



7 ) గురజాడ అప్పారావు - ఆణిపుత్యాలు ( కథానికలు ) 
8 ) విశ్వనాథ సత్యనారాయణ - ఆంధ్ర ప్రశస్తి 
9 ) దేవులపల్లి కృష్ణశాస్త్రి - కృష్ణపక్షం 
10 ) శ్రీ శ్రీ - మహా ప్రస్థానం 
11 ) జాషువా - గబ్బిలం ( మొదటి భాగం ) 
12 ) సి. నారాయణ రెడ్డి - కర్పూర వసంత రాయలు 
13 ) కనుపర్తి వరలక్షుమ్మ - శారద లేఖలు ( ప్రథమ భాగం)
14 ) ఆచార్య ఆత్రేయ - ఎన్.జి. ఓ (నాటకం)
15 ) రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రా.వి. శాస్త్రి ) అల్పజీవి



Related Posts Plugin for WordPress, Blogger...